బ్లూ డైమండ్: రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతీసిన దొంగతనం.. రూ.141 కోట్ల వజ్రాలు, నగలు దోచుకున్న ఆ దొంగ ఏమంటున్నాడు

సింబాలిక్
    • రచయిత, రోలండ్ హూజ్స్, చారియట్ యోంగ్చారోన్చై
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

సౌదీ ప్యాలెస్ నుంచి 1989లో చోరీకి గురైన తర్వాత ఆ అమూల్యమైన ఆభరణాల వల్ల జరిగిన వరుస హత్యలు, దౌత్య సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతోంది.

అది జరిగిన 30 ఏళ్ల తర్వాత ఆ దొంగతనం వెనుక ఉన్న వ్యక్తి మొట్టమొదట తన కథను వివరంగా చెప్పాడు.

సౌదీ యువరాజు, ఆయన భార్య మూడు నెలల సెలవు కోసం విదేశాలకు వెళ్లినప్పుడు దొంగతనం చేయడానికి సరైన సమయంగా భావించారు.

అది చాలా ప్రమాదం అని, సౌదీ అరేబియాలో దొంగతనానికి కాళ్లూ చేతులూ నరికేస్తారని క్రియాంగ్‌క్రాయ్ తెచమాంగ్‌కు తెలుసు. కానీ అతడు మామూలు దొంగ కాదు. తన యజమాని, సౌదీ రాజు ఫహాద్ పెద్ద కొడుకు యువరాజు ఫైజల్ దగ్గరున్న అమూల్యమైన రత్నాలు, ఆభరణాలపై అతడు కన్నేశాడు.

క్రియాంగ్‌క్రాయ్ తెచమాంగ్‌

ఫొటో సోర్స్, PANUMAS SANGUANWONG/BBC THAI

ఫొటో క్యాప్షన్, క్రియాంగ్‌క్రాయ్ తెచమాంగ్‌

ఒక పనివాడుగా క్రియాంగ్‌క్రాయ్‌కు యువరాజు ఫైజల్ ప్యాలెస్‌ ఆమూలాగ్రం తెలుసు. యువరాజు ఆభరణాలు ఉన్న నాలుగు ఇనప్పెట్టెల్లో మూడింటికి సాధారణంగా తాళాలు వేయరనే విషయం కూడా అతడికి తెలిసింది. అది వదులుకోలేనంత మంచి అవకాశం. ఎందుకంటే పనివాళ్లందరూ ఉండే చోట జూదం ఆడిన క్రియాంగ్‌క్రాయ్ అప్పులు అప్పటికే పేరుకుపోయాయి. బతకలేని విధంగా అణచివేత ఉన్న ఆ దేశం నుంచి పారిపోడానికి అది అతడికి బంగారం లాంటి అవకాశం

ఒక రోజు చీకటి పడ్డాక ఏదో సాకు చెప్పి అతడు ప్యాలెస్ లోపలే ఉండిపోయాడు. మిగతా పనివాళ్లు అందరూ వెళ్లిపోయేవరకూ ఆగాడు. తర్వాత మెల్లగా యువరాజు పడకగదిలోకి వెళ్లాడు. అక్కడ కొన్ని ఆభరణాలు తీసుకుని వాటిని టేపుతో శరీరానికి అతికించుకున్నాడు. కొన్ని రత్నాలు శుభ్రం చేసే వాక్యూమ్ బ్యాగ్స్ లాంటి పరికరాల లోపల దాచేశాడు.

చివరికి అతడు దాదాపు 30 కేజీల ఆభరణాలు దొంగిలించాడు. వాటి విలువ 20 మిలియన్ డాలర్లు(141 కోట్ల రూపాయలు). దొంగిలించిన వాటిలో బంగారు వాచీలు, పెద్ద పెద్ద రత్నాలు కూడా ఉన్నాయని తర్వాత సౌదీ అధికారులు చెప్పారు.

ఆ రాత్రి క్రియాంగ్‌క్రాయ్ ఆభరణాలన్నింటినీ ప్యాలెస్‌లోనే ఎవరూ తనిఖీ చేయని తనకు తెలిసిన ప్రాంతాల్లో దాచిపెట్టాడు. ఒక నెలపాటు వాటిని తను కార్గో సరుకుల మధ్యలో పెట్టి థాయ్‌లాండ్‌లోని తన ఇంటికి పంపుతూ వచ్చాడు.

స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

ఫొటో సోర్స్, KHAOSOD

దొంగతనం గురించి తెలుసుకునేటప్పటికే క్రియాంగ్‌క్రాయ్ తన స్వదేశానికి చేరుకున్నాడు. అప్పటికే ఆభరణాలన్నీ ఇంటికి చేరుకున్నాయి. కానీ ఆ దొంగకు ఇంకో సవాలు ఎదురైంది. థాయ్ కస్టమ్స్ నుంచి దొంగిలించిన వాటిని ఎలా తీసుకోవాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులన్నింటినీ దేశంలోకి ప్రవేశించే ముందు తనిఖీ చేస్తారు. కానీ థాయ్ అధికారులు లంచం ఇస్తామంటే వద్దనరని తెలిసిన క్రియాంగ్ క్రాయ్ తన కార్గోలో ఒక ఎన్వలప్ నిండుగా డబ్బు పెట్టి దానిలో ఒక నోట్ కూడా పెట్టాడు. అందులో ఈ కార్గోలో పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఉందని చెప్పాడు. దాన్ని వెతక్కుండా వదిలేస్తారని అనుకున్నాడు.

అతడి ప్లాన్ ఫలించింది. కానీ క్రియాంగ్‌క్రాయ్ అలా చట్టం నుంచి ఎక్కువరోజులు తప్పించుకోలేకపోయాడు. 1990 జనవరిలో సౌదీ అధికారులు అప్రమత్తం చేయడంతో థాయ్‌లాండ్ ఉత్తర లంపాంగ్ ప్రావిన్స్‌లో ఇంట్లో ఉన్న అతడిని థాయ్ పోలీసులు అరెస్టు చేశారు.

తర్వాత కొన్నిరోజుల్లోనే అతడి దగ్గర ఉన్న ఆభరణాలు, రత్నాలతోపాటు అప్పటికే అమ్మేసిన వాటిని కూడా రాబట్టారు. కానీ వాటిని తిరిగి పట్టుకుని, మళ్లీ రియాద్ పంపించేలోపే.. మరో నేరం జరిగింది. సౌదీ అధికారులు ఆ ఆభరణాల్లో దాదాపు 80 శాతం మిస్ అయ్యాయని గుర్తించారు. థాయ్‌లాండ్ నుంచి తిరిగి సౌదీ వెళ్లిన వాటిలో చాలావరకూ నకిలీవే. తర్వాత ఒక థాయ్ సీనియర్ అధికారి భార్య ధరించిన ఒక నెక్లెస్‌లో మిస్సైన ఆభరణాల్లో ఒకదానిలాగే ఉందని చెప్పే ఫొటోలు సర్కులేట్ అవడం మొదలైంది.

అది ముఖ్యంగా కనిపించకుండాపోయిన ఒక విలువైన వస్తువులాగే ఉంది. అదే కోడిగుడ్డు సైజులో ఉండే ఒక 50 క్యారట్ల నీలి వజ్రం(బ్లూ డైమండ్)

పది వేల వజ్రాల్లో ఒకదానికి మాత్రమే ప్రత్యేకమైన రంగు ఉంటుంది. వాటిలో నీలం వజ్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే అవి ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అమూల్యమైన వజ్రాలు. వాటి ప్రత్యేకమైన రంగు వాటి లోపల ఉన్న బొరాన్ అవక్షేపాల వల్ల వస్తుంది. భూమి ఉపరితలానికి 600 కిలోమీటర్ల లోపల వజ్రం ఏర్పడిన సమయంలో దానిలో ఏర్పడే ఒక మూలకమే బొరాన్.

ఇప్పుడు చలామణిలో ఉన్న నీలి వజ్రాల్లో చాలావరకూ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు సమీపంలో ఉన్న కుల్లినాన్ గని నుంచే నుంచి వచ్చాయి. కానీ సౌదీ అరేబియా నీలి వజ్రం ఎక్కడ లభించింది అనేదానిపై స్పష్టత లేదు. అది ఉన్నట్టు చెప్పే ఫొటోలు కూడా లేవు.

యువరాజు ఆభరణాలు చోరీ చేసినందుకు, ముఖ్యంగా నీలి వజ్రం దొంగిలించినందుకు క్రియాంగ్‌క్రాయ్‌ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించడంతో ఈ కేసు ముగిసిపోయుండచ్చు. కానీ, దీని దర్యాప్తు మరింత హింసాత్మక మలుపు తీసుకుంది..

1980 ఫిబ్రవరి ప్రారంభంలో బ్యాంకాక్‌లోని సౌదీ రాయబార కార్యాలయం వీసా సెక్షన్లో పనిచేసే ఇద్దరు అధికారులు థాయ్ రాజధాని వైపు వస్తున్నప్పుడు, వారి వాహనంపై దాడి దుండగులు దాడి చేశారు. ఇద్దరినీ కాల్చిచంపారు. దాదాపు అదే సమయంలో మరో దుండగుడు ఆ ఇద్దరి సహోద్యోగుల్లో ఒకరి అపార్టుమెంట్‌లోకి చొరబడి అతడిని కూడా చంపాడు.

సయ్యద్ ఖోజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సయ్యద్ ఖోజా

తర్వాత కొన్ని వారాలకు మహమ్మద్ అల్ రువాలి అనే సౌదీ వ్యాపారి బ్యాంకాక్ వచ్చారు. కానీ ఆయన్ను కూడా టార్గెట్ చేశారు. కిడ్నాప్ అయిన ఆయన బాడీ దొరకలేదు. దాంతో ఆయన్ను కూడా హత్య చేశారని భావించారు.

ఈ హత్యల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. బ్యాంకాక్ అమెరికా ఏంబసీలోని అధికారి 2010లో రాసిన ఒక డిప్లమాటిక్ తర్వాత వికీలీక్స్‌ రిలీజ్ చేసింది. అందులో ముగ్గురు దౌత్య అధికారుల హత్య లెబనాన్ షియా ముస్లిం మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా, సౌదీ ఘర్షణల్లో ఒక భాగం అని చెప్పారు.

కానీ ఒక సౌదీ అధికారికి మాత్రం దీనికి కచ్చితంగా ఎవరు కారణమో తెలుసు.

తర్వాత దౌత్యవేత్తగా 35 ఏళ్ల అనుభవం ఉన్న మహమ్మద్ సయ్యద్ ఖోజాను ఈ చోరీ కేసు కోసం బ్యాంకాక్ పంపించారు. మూడు నెలలు ఉంటాడనుకున్నారు. కానీ ఆయన అక్కడ కొన్ని ఏళ్లపాటు ఉండిపోయారు.

ఆయన దౌత్యవేత్తగానే కాదు.. రెండు దేశాల సంబంధాల కోసం పనిచేశారు. ఎందుకంటే సౌదీ ఆభరణాల దొంగతనం, హత్యల తర్వాత సౌదీ అరేబియా, థాయ్‌లాండ్ మధ్య సంబంధాలు కూడా క్షీణించాయి. థాయ్ కార్మికులపై చర్యలు తీసుకోవడంతో సౌదీలో వారి సంఖ్య 2 లక్షలకు పైనే ఉన్న వారి సంఖ్య 15 వేలకు పడిపోయింది. ఏటా అక్కడ ఉన్న వారు ఇళ్లకు పంపే బిలియన్ డాలర్లకు గండి పడడంతో ఈ ప్రభావం థాయ్ ఆర్థికవ్యవస్థపై పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికీ అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఖోజా సౌదీ ఆభరణాలు రికవరీ చేసిన థాయ్ పోలీసులు వాటిని దొంగిలించారని బహిరంగంగా ఆరోపించారు. తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సౌదీ దౌత్యవేత్తలను, వ్యాపారులను హత్య చేశారని ఆరోపించారు. దొంగతనం గురించి సున్నితమైన సమచారాన్ని వారు గుర్తించడం వల్లే వారిని చంపారని చెప్పారు. దౌత్యవేత్తల హత్యలపై దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారిపై మహ్మద్ రువాయిలీ అదృశ్యం ఆరోపణలు కూడా మోపారు. కానీ తర్వాత వాటిని తొలగించారు.

క్రియాంగ్‌క్రాయ్ తెచమాంగ్‌

ఫొటో సోర్స్, PANUMAS SANGUANWONG/BBC THAI

ఫొటో క్యాప్షన్, క్రియాంగ్‌క్రాయ్ తెచమాంగ్‌

సౌదీ అరేబియా ఒత్తిడితో థాయ్‌లాండ్ ఈ కేసుకు పరిష్కారం కోసం వెతికింది. అది క్రియాంగ్‌క్రాయ్ థాయ్‌లాండ్ వచ్చిన తర్వాత ఆభరణాలు, రత్నాలు అప్పగించిన వ్యక్తి ఎవనేది గుర్తించింది. థాయ్ రత్నాల డీలర్‌కు వాటిని అమ్మారని, వాటికి బదులు నకిలీ ఆభరణాలు తయారు చేశారని తెలుసుకుంది. దాంతో క్రియాంగ్‌క్రాయ్ ఈ కేసులో కీలక సాక్షిగా మారాడు.

కానీ 1994 జులై లో రత్నాల డీలర్ భార్య, కొడుకు కనిపించకుండాపోయారు. తర్వాత వారి మృతదేహాలు బ్యాంకాక్ బయట ఒక మెర్సిడెస్‌లో దొరికాయి. వారి శరీరాలపై దారుణమైన గాయాలు కనిపించాయి. ఆ కారును భారీ ట్రక్కు ఢీకొనడంతో వారు చనిపోయారని ఫోరెన్సిక్ రిపోర్టులో చెప్పారు. తర్వాత ఖోజా ఫోరెన్సిక్ అధికారిపై విమర్శలు చేశారు. ఇది ప్రమాదం కాదని, వాళ్లు దాన్ని కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు.

ఖోజా చెప్పిందే నిజం. కనిపించని ఆభరణాలు వెతికే పనిలో ఉన్న పోలీసులు వాటిలో కొన్ని అపహరించడంతోపాటు, రత్నాల వ్యాపారిని దోచుకుని అతడి భార్య, కొడుకును హత్య చేశారని గుర్తించారు. ఆ కేసును దర్యాప్తు చేసిన పోలీస్ చీఫ్ ఇంచార్జ్ చాలోర్ కెర్డ్‌థెస్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

క్రియాంగ్‌క్రాయ్ ఉద్వేగంగా ఉన్నాడు. ఇప్పటికీ అతడు జైలు నుంచి విడుదలై 28 ఏళ్లవుతోంది. అతడు ఆ దొంగతనం చేసి 30 ఏళ్లైంది. ఇప్పుడు అతడు తిరిగి థాయ్‌లాండ్‌లో తన స్వగ్రామంలో జీవిస్తున్నాడు. చాలా రోజులుగా బీబీసీ థాయ్ బృందం అతడి గురించి ఒక్కొక్కటిగా వివరాలు సేకరించింది. చివరికి అతడు ఎక్కడ ఉన్నాడనేది గుర్తించగలిగింది.

అతడిని కలవగానే మమ్మల్ని చూసిన క్రియాంగ్‌క్రాయ్ పోలీసులేమో అని భయపడ్డాడు. మాపై నమ్మకం కుదిరిన తర్వాత ఇంటి నుంచి బయటికొచ్చి, మోకాళ్ల వరకూ ఎదిగిన వరి పొలంలో నడుస్తూ మాతో మాట్లాడాడు, "జరిగిందేదో జరిగిపోయింది.. అదంతా ఇప్పుడు నాకొక పీడకల లాంటిది" అన్నాడు.

ఆ దొంగతనం తర్వాత అతడు దాని గురించి మొట్టమొదట వివరంగా చెప్పాడు. అతడు చేసిన చోరీ ముగ్గురి హత్యకు కారణమైంది. మృతులు ఇంకా చాలామందే ఉండచ్చు. ఇంత జరిగినా.. ఆ చోరీ చేసినందుకు తనను చంపేస్తారేమో అని ఇప్పటికీ వణికిపోతున్నాడు. పట్టుబడినప్పటి నుంచి ఆ భయం అతడి మనసులో అలాగే ఉండిపోయింది.

క్రియాంగ్‌క్రాయ్ తెచమాంగ్‌

ఫొటో సోర్స్, PANUMAS SANGUANWONG/BBC THAI

ఫొటో క్యాప్షన్, క్రియాంగ్‌క్రాయ్ తెచమాంగ్‌

నన్ను అరెస్టు చేసిన తర్వాత నాపనైపోయిందని అనిపించింది. నా చుట్టూ ఉన్న వారు నన్ను బతకనివ్వరేమో అనిపించింది. నన్ను మాయం చేయడానికి, లేదా చంపడానికి చాలా మంది ఉన్నారని కూడా నాకు అనిపించింది. ఒక వారం వరకూ నాకు నిద్రకూడా పట్టలేదు

క్రియాంగ్‌క్రాయ్‌కు తను చేసిన నేరం ఇంత ముఖ్యమైనది అవుతుందని అసలు అనుకోలేదు. తను చోరీ చేసిన బంగారం చాలా విలువ ఉంటుందని అతడికి తెలుసు. కానీ జైలు నుంచి విడుదలయ్యే వరకూ వాటి పూర్తి విలువ గురించి అతడికి తెలీదు. పోలీసులు నన్ను చూడగానే.. నేను లొంగిపోవాలని అనుకున్నా. నేను మొత్తం ఆభరణాలు ఇచ్చేసి, అమ్మేసిన వాటిని తిరిగి తీసుకురావడానికి సాయం చేశా. కానీ థాయ్‌లాండ్‌లోని పెద్దపెద్దవాళ్లు దాన్లో జోక్యం చేసుకోకుంటే, ఈ విషయం ఇంత పెద్దది అయ్యుండేది కాదు.

నేరం అంగీకరించడంతో ఐదేళ్ల జైలు శిక్షను రెండేళ్ల 7 నెలలకు తగ్గించి, అతడిని జైలు నుంచి విడుదల చేశారు. తన కొడుక్కి ముందు ముందు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా క్రియాంగ్‌క్రాయ్ తన ఇంటిపేరు మార్చుకున్నారు

కానీ తను చేసిన పనికి అతడు ఇప్పటికీ బాధపడుతున్నాడు. జైలుకెళ్లి వచ్చిన తర్వాత జీవితం మరింత నరకంగా మారిందన్నాడు. దాంతో 2016 మార్చిలో అతడు బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు.

సన్యాసిగా మారుతున్నసమయంలో మీడియాను ఆహ్వానించిన క్రియాంగ్‌క్రాయ్.. కొన్ని మాటలే చెప్పాడు. సౌదీ వజ్రం శాపాన్ని తొలగించుకోడానికి నేను జీవితాంతం సన్యాసిగా ఉండిపోవాలనుకుంటున్నాను అన్నాడు. నా కర్మ వల్ల చిక్కుకుపోయిన వారికి, నా గత చర్యల వల్ల మరణించిన వారికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నా. నేను చేసిన వాటికి ప్రతి ఒక్కరూ క్షమించాలని కోరుకుతున్నాను అని చెప్పాడు.

క్రియాంగ్‌క్రాయ్ తన కోసం వజ్రంలా బలంగా ఉండే వ్యక్తి అని అర్థం వచ్చేలా ఒక పేరు కూడా వెతుక్కున్నారు.

రత్నాల డీలర్ కుటుంబం హత్యకు కారణమై ఇక ప్రస్తుతం జైల్లో ఉన్న పోలీస్ చీఫ్ చాలోర్ కెర్ద్‌థెస్.. ఇప్పటికీ తను నిర్దోషిననే చెబుతున్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఆయన కూడా బౌద్ధ సన్యాసి కావాలని అనుకుంటున్నారు. కానీ బౌద్ధఆరామంలో అది ఆయనకు అంత సులభం కాకపోవచ్చు.

బ్లూ డైమండ్ కేసు, సౌదీ వ్యాపారి మహమ్మద్ అల్ రువాలీ హత్య కేసులో థాయ్ సుప్రీంకోర్టు మరో ఐదుగురు పోలీస్ అధికారులను నిర్దోషులుగా విడుదల చేసింది.

కెర్ద్‌థెస్

ఫొటో సోర్స్, MATICHON

ఫొటో క్యాప్షన్, కెర్ద్‌థెస్

కెర్ద్‌థెస్ జైలు నుంచి విడుదలయ్యాక సన్యాసి అయినా గతం ఆయన్ను కచ్చితంగా వెంటాడుతుంది. ఆయన ఆ బ్లూ డైమండ్ ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు. ఆయన వాళ్లకు దాని గురించి చెప్పరు. దాంతో వారి ఆయన ఇంట్లో దాచారేమోనని అనుకుంటారు. ఆ బ్లూ డైమండ్ ఎప్పటికీ దొరకదు.

క్రియాంగ్‌క్రాయ్ మూడేళ్లు మాత్రమే బౌద్ధ ఆరామంలో ఉన్నారు. నేను జీవితాంతం సన్యాసిగా ఉండలేకపోయా. నా కుటుంబానికి ఇంకా నా అవసరం ఉంది. అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన వయసు 61 ఏళ్లు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఇప్పుడు తాను చేయగలిగిందంతా చేస్తున్నారు.

"ఇప్పుడు ఒక గ్రామీణుడిలా సాధారణ జీవితం గడుపుతున్నా. నా దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బు లేదు. ఉన్నది నా కుటుంబం కడుపు నింపడానికి సరిపోతుంది. నాకు అసలైన సంతోషం ఇదే అనిపిస్తోంది. అని ఇప్పుడు చెక్క ఇంట్లో ఉంటున్న క్రియాంగ్‌క్రాయ్ చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)