World Milk Day: ఆవు పాలు ఆరోగ్యానికి ఎందుకు మంచివంటే.. అధ్యయనాలు చెబుతున్న వాస్తవాలు ఇవీ

పాలు తాగుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఆవు పాలను మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలా? వద్దా? అవి ఎంతమేరకు ఆరోగ్యకరమైనవి?

కొన్నేళ్లుగా వివాదానికి కారణమవుతున్న ఈ అంశంపై పోషకాహార నిపుణులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని వేల ఏళ్ల క్రితం ఆవుల పెంపకం మొదలైనప్పటి నుంచి వాటి పాలను, ఉత్పత్తులను మానవులు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు.

10,000 ఏళ్ల క్రితం నుంచి అది కొనసాగుతోందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

పాలు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, జీవితాంతం ఈ పాలు తాగడం వల్ల ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉందన్న వాదనలు పెరిగాయి.

దాంతో, కొన్నేళ్లుగా ఆవు పాల వినియోగం క్రమంగా తగ్గుతోంది. కొన్నిచోట్ల భారీగా తగ్గింది.

అమెరికా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, ఆ దేశంలో 1970 నుంచి ఆవు పాలు వినియోగం 40% తగ్గింది.

ఆవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆవు పాలను అత్యధికంగా వినియోగించే దేశం భారత్. యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం దేశాల కంటే రెట్టింపు పాల వినియోగం ఒక్క భారత్‌లో ఉంది.

సోయా, బాదం పాలు లాంటి ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులోకి రావడం కూడా ఆవు పాల వినియోగం తగ్గుదలకు ఒక కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, ప్రజలు ఆవు పాల వినియోగాన్ని తగ్గించడానికి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కూడా కారణమేనన్నది వాస్తవం.

ఇక, పూర్తిగా శాఖాహార పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించే వీగన్ డైట్‌కు ఆదరణ పెరగడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దానికి తోడు, ప్రపంచ జనాభాలో దాదాపు 65% మందిలో లాక్టోస్‌ను (పాలలో ఉండే ఒక రకమైన చక్కెర పదార్థం) జీర్ణం చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంది. ఆవు పాల వినియోగాన్ని ఈ సమస్య కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

పాలు తాగుతున్న చిన్నారి

ఫొటో సోర్స్, SAM EDWARDS

ఫొటో క్యాప్షన్, పిల్లల పెరుగుదలకు పాలు అత్యంత ముఖ్యమైన ఆహారం

ఎంత ఆరోగ్యకరం?

ఆవు పాలు, జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్‌లు లభిస్తాయని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) చెబుతోంది.

అంతేకాదు, ఆవు పాలలో ఏ, డీలతో సహా, అనేక రకాల విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయని అమెరికాలోని మయో క్లినిక్‌కు చెందిన పోషకాహార నిపుణుడు డోనల్డ్ హెన్స్‌రూడ్ చెప్పారు.

"ఆవు పాలు చక్కని పోషక విలువలు కలిగిన ఆహారం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి" అని హెన్స్‌రూడ్ వివరించారు.

బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ ప్రకారం, సాధారణంగా పెద్దవారు, యువకులు తీసుకునే ఆహారంలో వారికి అవసరమైనంత మోతాదులో ఐరన్, కాల్షియం, విటమిన్లు, జింక్, అయోడిన్ అందవు. వారు ఆవు పాలు తాగితే ఆ పోషకాలన్నీ లభిస్తాయి.

"బాదం, సోయా వంటి ప్రత్యామ్నాయ పాలతో సమస్య ఏమిటంటే... వాటిలో సహజంగా ఆ పోషకాలు ఉండవు. కృత్రిమ పద్ధతిలో చేర్చుతారు. కాబట్టి, ఆశించిన విధంగా మీరు ఆ పోషకాల ప్రభావాలను పొందలేరు" అని పోషకాహార నిపుణుడు షార్లెట్ స్టిర్లింగ్-రీడ్ బీబీసీకి చెప్పారు.

పాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆవు పాలు వ్యాయామం చేసేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

"కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఖచ్చితమైన నిష్పత్తిలో ఉండే సంపూర్ణ ఆహారం ఆవు పాలు. కండరాల పునరుద్ధరణను ఉత్తేజపరిచేందుకు ఈ పాలు చాలా ఉపయోగపడతాయి" అని పోషకాహార నిపుణుడు రెనీ మెక్‌గ్రెగర్ బీబీసీకి చెప్పారు.

పిల్లల కావాల్సిన కాల్షియం ఈ పాల ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. గర్భిణులకు కూడా ఈ పాలను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే, పిండం ఎముకలు ఏర్పడేందుకు, ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడతాయి.

300 మిల్లిలీటర్ల పాలలో 350 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. ఇది ఒకటి నుంచి మూడేళ్ల మధ్య వయస్సు పిల్లలకు సిఫార్సు చేసే రోజువారీ మొత్తం మోతాదులో సగం.

అయితే, ఏడాది లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదని ఎన్‌హెచ్‌ఎస్ సిఫార్సు చేసింది.

ఆవు పాలలో పెద్ద సమస్యలలో ఒకటి దానిలోని కొవ్వు పదార్ధం.

ఫొటో సోర్స్, Getty Images

అధిక కొవ్వు

ఆవు పాలలో పెద్ద సమస్యలలో ఒకటి దానిలోని కొవ్వు పదార్ధం.

ఈ సమస్యకు సంబంధించి ఎన్‌హెచ్ఎస్ మొదటి హెచ్చరిక ఏమిటంటే, టీనేజ్‌లోని వాళ్లు, పెద్దలు కొవ్వు తక్కువగా ఉన్న స్కిమ్డ్ పాలను తీసుకోవడం.

''పెద్దలకు విటమిన్లు, ఐరన్ అందేది పాల ద్వారానే కానీ, దాన్ని తాగడం తప్పకుండా తగ్గించాలి'' అని హెన్స్‌రూడ్ వివరించారు. అలాగే, వెన్న, నెయ్యి, పెరుగు తీసుకోవడంపై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

ఉదాహరణకు, సాధారణ వెన్నలో 20 నుంచి 40 శాతం వరకు కొవ్వు ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

మరోవైపు, అనేక దేశాలలో 100 గ్రాముల ఆహార పదార్థంలో 17.5 గ్రాముల కంటే ఎక్కువ కొవ్వు ఉంటే అధిక కొవ్వు కలిగిన ఆహారంగా దాన్ని వైద్య సంస్థలు గుర్తించాయి.

వెన్న విషయంలో అతి పెద్ద సమస్య సంతృప్త కొవ్వు అధికమొత్తంలో ఉండటం.

"ఈ పదార్థాలు శరీరానికి పెద్ద మొత్తంలో కేలరీలను అందిస్తుంది. పెరిగిన దశలో ఇంత ఎక్కువ మనకు అవసరం లేదు. అందుకే చాలా మందిలో అధిక బరువుకు ఈ వెన్న కారణమవుతోంది'' అని ఓ పోషకాహార నిపుణుడు సూచిస్తున్నారు.

పాలలో కొవ్వు కారణంగా మరొక సమస్య కూడా ఉంది. అదే అసంతృప్త లాక్టోస్. ఇది ప్రపంచంలో మరింతగా పెరుగుతోంది.

ఆవు పాలతో వచ్చే ఆరోగ్య సమస్య ఏమిటంటే, ఇది కొందరిలో అలెర్జీకు కారణమవుతుంది.

ఇంగ్లండ్‌లో ప్రతీ 50 మంది పిల్లల్లో ఒకరికి ఆవు పాలు తాగడం వల్ల అలెర్జీ వస్తుందని ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది.

మరో వాస్తవం ఏమిటంటే, మానవుడు తప్ప ఏ జంతువు పెద్ద పెరిగిన తర్వాత పాలు తాగదు.

ప్రపంచంలో నేడు అధిక భాగం లాక్టోజ్ లేని పాలే ఉత్పత్తి అవుతున్నాయి. పాల వల్ల ఆసియాలో అత్యధిక మంది జీర్ణక్రియ, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కాల్షియం, విటమిన్లు లభించే పౌష్టిక పదార్థంగా పోషకాహార నిపుణులు పాలను సూచించినప్పటికీ దీని వాడకం వివాదాస్పదమవుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)