UCC: ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలనే బీజేపీ డిమాండ్, హిందువులకే చేటు చేస్తుందా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి అనే ఆలోచనకు బీజేపీ మళ్లీ జీవం పోస్తోంది. బీజేపీ పాలనలోని ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు యూనిఫాం సివిల్ కోడ్ గురించి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాయ్.
బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలలో అయోధ్య రామమందిరం, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించడం, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం ముఖ్యమైనవి. బీజేపీ చెప్పినట్లుగానే అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైంది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగించారు. ఇక ఇప్పుడు బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ మీద దృష్టి పెట్టింది.

ఫొటో సోర్స్, AFP
స్వతంత్రం వచ్చిన నాటి నుంచే డిమాండ్
దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒకోలా ఉంటుంది.
కానీ మతం, లింగం వంటి వాటితో సంబంధం లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం అంటే యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావాలనే డిమాండ్ దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది. కానీ చాలా కాలంగా దేశంలో మెజారిటీ అయిన హిందువులు, మైనారిటీ అయిన ముస్లింలు యూనిఫాం సివిల్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు.
ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్‌గా ఉమ్మడి పౌర స్మృతిని హిందుత్వ వాదులు ముందుకు తెస్తున్నారు. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేది వారి వాదన. ఇస్లాం మతంలో భార్యలకు విడాకులు ఇచ్చే ట్రిపుల్ తలాక్‌ను ఇందుకు వారు ఉదాహరణగా చూపిస్తుంటారు. 2019లో ట్రిపుల్ తలాక్‌ను నేరంగా మారుస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చట్టం చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ వచ్చే వరకు లింగ సమానత్వం సాధ్యం కాదంటూ తన మ్యానిఫెస్టోలో బీజేపీ రాసుకుంది.
కానీ యూనిఫాం సివిల్ కోడ్ వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పొలిటికల్ సైంటిస్ట్ అసీం అలీ అంటున్నారు. 'యూనిఫాం సివిల్ కోడ్ వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. బీజేపీ ఎవరికైతే ప్రతినిధులుగా ఉంటామని చెబుతూ ఉంటుందో ఆ హిందువులకు కూడా ఇది నష్టం చేస్తుంది. హిందువులు, ముస్లింల జీవితాలను యూనిఫాం సివిల్ కోడ్ దెబ్బతీస్తుంది.'అని అసీం అలీ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
యూనిఫాం సివిల్ కోడ్ అందరినీ ఏకం చేయగలదా?
భిన్న మతాలు, నమ్మకాలు ఉన్న భారత్ వంటి పెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది చాలా కష్టమైన విషయం. హిందువులు కావొచ్చు, ముస్లింలు కావొచ్చు మళ్లీ వాళ్లలో వాళ్లకు అనేక భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. హిందువుల్లో అనేక శాఖలున్నాయి. భిన్న ఆచారాలు, సంప్రదాయాలు ఆచరించే వారు ఉన్నారు. షరియా చట్టాలను పాటించని ముస్లింలు కూడా ఉన్నారు. బోరా ముస్లింలు ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు.
ఆస్తుల వారసత్వం విషయంలో ఒక్కో రాష్ట్రంలో చట్టాలు ఒక్కోలా ఉన్నాయి. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాలు తమ కంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి. ఈ చట్టాలకు ఆధారం వారి సంప్రదాయాలే కానీ మతం కాదు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ కేథలిక్కులకు, ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలున్నాయి. ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే హిందువులకు నిబంధనలు వేరేలా ఉంటాయి.
ఉమ్మడి జాబితాలో సివిల్ చట్టాలు
భారత్‌లో పౌర స్మృతులు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత పౌర స్మృతులను రూపొందించుకుంటూ వస్తున్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానంగా కూతుళ్లు కూడా వారసత్వ ఆస్తిలో వాటాను పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ దీనికంటే ముందే సుమారు అయిదు రాష్ట్రాలు అమ్మాయిలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. వీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
యూనిఫాం సివిల్ కోడ్... బీజేపీ చేతిలో రాజకీయ అస్త్రమా?
పౌర స్మృతులు ఒక్కో విషయాన్ని ఒక్కోలా చూస్తాయి. దత్తత అనేది హిందూ మతంలో రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి సాధారణంగా పిల్లలను దత్తత తీసుకోవడం కనిపిస్తుంది. రెండోది తాము చనిపోయినప్పుడు తల కొరివి పెట్టడానికి, పిండ ప్రదానం చేయడానికి కొడుకులు కావాలనే కోరికతో దత్తత తీసుకోవడం. ఇక ఇస్లాంలో దత్తతకు గుర్తింపు లేదు. అయితే మతంతో సంబంధం లేకుండా ఎవరినైనా దత్తత తీసుకునే అవకాశాన్ని భారత చట్టాలు కల్పిస్తున్నాయి.
ఉమ్మడి పౌర స్మృతి ద్వారా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు సమానంగా వర్తించేలా దత్తత నిబంధనలు ఎలా మారుస్తారంటూ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీకి చెందిన అలోక్ ప్రసన్న కుమార్ ప్రశ్నిస్తున్నారు. 'పెళ్లికి, విడాకులకు దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు? దత్తత ప్రక్రియ ఎలా ఉంటుంది? విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తుల పంపకాన్ని ఎలా చేపడతారు? వారసత్వంగా వచ్చే ఆస్తిని పొందేందుకు ఎలాంటి నిబంధనలు తీసుకొస్తారు? ఇటువంటి ప్రాథమిక ప్రశ్నలకు యూనిఫాం సివిల్ కోడ్ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.'అని ఆయన అన్నారు.
యూనిఫాం సివిల్ కోడ్‌ను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని అసీం అలీ అన్నారు. 'ఒకవైపు మత మార్పిళ్లను అడ్డుకునే నెపంతో భిన్న మతస్థుల మధ్య వివాహాలను నిషేధించేలా యాంటి కన్వర్షన్ చట్టాలను తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు భిన్న మతాలు, వర్గాలకు చెందిన వారి మధ్య వైవాహిక సంబంధాలను స్వేచ్ఛగా అనుమతించే యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకొస్తామని బీజేపీ ఎలా చెబుతోంది?'అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదు'
ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా 'దేశ సమైక్యత'కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అలాగే యూనిఫాం సివిల్ కోడ్ ఇప్పుడే అవసరం లేదంటూ 2018 లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
తీవ్రమైన పరిణామాలకు దారి తీసే యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించడానికి పౌర స్మృతులకు సవరణలు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంత కాలం బీజేపీ ఎందుకు తీసుకురాలేదు?
తమ హిందుత్వ ఎజెండాను కొనసాగించడంలో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి గురించి బీజేపీ మాట్లాడుతోందని అసీం అలీ అభిప్రాయపడుతున్నారు. అంతేకానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనిఫాం సివిల్ కోడ్ అనేది పాపులర్ అంశం కాదని ఆయన అన్నారు.
'కొన్ని రాష్ట్రాల్లో చాలా కాలంగా బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఇంత వరకు అక్కడ యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురాలేదు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు రానున్న తరుణంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని బీజేపీ భావిస్తోందా? ముందు ఉమ్మడి పౌర స్మృతి నమూనా ఎలా ఉంటుందో చూపించాలి.'అని అలోక్ ప్రసన్న కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









