జ్ఞాన్‌వాపి మసీదు: బాబ్రీ తరువాత మరో మత రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోందా?

వారణాసి విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని జ్ఞానవాపి మసీదు

ఫొటో సోర్స్, ROBERT NICKELSBERG/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వారణాసి విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని జ్ఞానవాపి మసీదు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిలో హిందువులు, ముస్లింలు పక్కపక్కనే ఉన్న గుడి, మసీదులలో ప్రార్థనలు చేస్తుంటారు. అయితే, దాని ముందే భారీ ఎత్తున మోహరించిన భద్రతా బలగాలు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక అపశ్రుతిలాగా కనిపిస్తాయి.

జ్ఞాన్‌వాపి మసీదు 16వ శతాబ్దంలో హిందూ పుణ్యక్షేత్రమైన విశ్వనాథ ఆలయ శిథిలాలపై నిర్మించారు. ఆరవ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669లో ఈ ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. ఇప్పుడీ ప్రాంతం రెండు వర్గాల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది.

విశ్వనాథ్ ఆలయం కాంప్లెక్స్‌లో ఒక స్థలంలో పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ కొందరు వ్యక్తులు స్థానిక కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై స్పందించిన కోర్టు వీడియో రికార్డు చేస్తూ దీనిపై సర్వే చేయాలంటూ ఆదేశించింది.

ఈ సర్వేలో ఒక శివలింగం ఆకారం బయటపడింది. అయితే, ఇది శివలింగం అని అంగీకరించడానికి మసీదు అధికారులు సిద్ధంగా లేరు. అదే సమయంలో ఈ ప్రాంతాన్ని సీజ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వీడియో క్యాప్షన్, కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

దీంతో వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు కాంప్లెక్స్‌ను సంరక్షించాలని, మసీదులో ప్రార్ధనలు కొనసాగించవచ్చని పేర్కొంది.

అయితే, ఈ వివాదం 1992లో అయోధ్యలో హిందూ గ్రూపుల చేతిలో నేలమట్టమైన 16వ శతాబ్ధానికి చెందిన బాబ్రీ మసీదు సమస్యను గుర్తుకు తెస్తుంది. అదే తరహా వివాదం పునరావృతం అవుతుందన్న భయాలను రేకెత్తించింది.

మసీదు కూల్చివేతకు ముందు బీజేపీ దీనిపై ఆరేళ్లపాటు ప్రచారం నిర్వహించింది. అప్పటికి ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లలో దాదాపు 2,000 మంది మరణించారు.

1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును కొందరు కూల్చివేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును కొందరు కూల్చివేశారు

అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని 2019 లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ముస్లింల కోసం మసీదు నిర్మించేందుకు మరో ప్రాంతంలో స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతోంది.

1991లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 15 నాటికి అస్తిత్వంలో ఉన్న ప్రార్థనా స్థలాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయారాదని ఆ చట్టం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారంపై వివాదాన్ని విమర్శిస్తున్నవారు ఈ చట్టం ఉల్లంఘనకు గురవుతోందని వాదిస్తున్నారు.

''అక్కడ మసీదు ఉంది. ఆ మసీదు అలా ఉండాల్సిందే'' అని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఈ మసీదులో శివలింగాన్ని చేర్చారన్న విమర్శలను ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత తోసిపుచ్చారు. ''వాస్తవం బయటికి వచ్చింది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తాం'' అని యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు.

అయితే, ఏ వాస్తవం బయట పడిందన్న దానిపై స్పష్టత లేదు. కాకపోతే, ఒక్కటి మాత్రం నిజం. ఈ ప్రాంతంలో ఆలయం ఉంది.

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది

''ఒక గర్భగుడి, ఎనిమిది మండపాలతో ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయం ఉంది'' అని హార్వర్డ్ యూనివర్సిటీలో 'కంపారిటివ్ రిలీజియన్ అండ్ ఇండియన్ స్టడీస్' లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డయానా ఎల్ ఎక్ అన్నారు.

''ఈ మందిరం ఔరంగజేబు ఆదేశాలతో ధ్వంసమైంది. ఇందులో సగం మందిరం ధ్వంసం కాగా, దానిపై ప్రస్తుత జ్ఞాన్‌వాపి మసీదు పునాదులను నిర్మించారు'' అని ప్రొఫెసర్ ఎక్ అన్నారు.

''ఇప్పటికీ పాత ఆలయపు గోడ ఒకటి ఉంది. ఇది మసీదుకు హిందూ ఆభరణంలా ఉంటుంది'' అని ఆయన అన్నారు.

మసీదు వెనుక నుంచి చూసినప్పుడు, రెండు సంప్రదాయాల మధ్య తేడా కనిపిస్తుంది. పాత ఆలయానికి సంబంధించిన రాతి గోడ, శిథిలమైన స్థితిలో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న మసీదు తెల్లని గోపురాలు ఆ గోడపై ఉంటాయి.

''శిథిలమైన ఆలయ గోడలోని కొంత భాగాన్ని మసీదు భవనంలో కలపడం మొఘలు అధికారాన్ని వ్యతిరేకించడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలకు సంబంధించిన హెచ్చరిక కావచ్చు'' అని 'ఔరంగజేబ్: ది మ్యాన్ అండ్ ది మిత్' అనే పుస్తక రచయిత ఆడ్రీ ట్రష్కే అభిప్రాయ పడ్డారు.

ప్రస్తుతం వారణాసిలోని విశ్వనాథ ఆలయం సమీపంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు

ఫొటో సోర్స్, ROBERT NICKELSBERG/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం వారణాసిలోని విశ్వనాథ ఆలయం సమీపంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు

ఔరంగజేబు ఈ ఆలయంపై దాడి చేయడానికి ఒక కారణముందని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. మొఘలులకు ప్రముఖ శత్రువు అయిన హిందూ రాజు శివాజీ జైలు నుండి తప్పించుకోవడానికి, ఈ ఆలయ పోషకులు సహాయపడ్డారని చరిత్రకారులు నమ్ముతారు.

''మొదట్లో చక్రవర్తి అధికారానికి లోబడి, తర్వాత శత్రువులుగా మారిన వ్యక్తులు నిర్మించిన ఆలయాలు అప్పటి పాలకులకు లక్ష్యంగా మారాయి'' అని అరిజోనా విశ్వవిద్యాలయంలో దక్షిణాసియా చరిత్రను బోధించే రిచర్డ్ ఎమ్ ఈటన్ అన్నారు.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 49 సంవత్సరాల పాలనలో కనీసం 14 దేవాలయాలు కూల్చివేతకు గురయ్యాయని ప్రొఫెసర్ ఈటన్ అభిప్రాయపడ్డారు. 12వ శతాబ్ధం నుంచి 18వ శతాబ్ధం మధ్య కాలంలో భారతదేశంలోని దేవాలయాలను ధ్వంసం చేసిన 80 ఉదాహరణలను ఈటన్ నమోదు చేశారు.

''భారత చరిత్రలో విధ్వంసానికి లోనైన దేవాలయాల కచ్చితమైన సంఖ్య మనకు ఎప్పటికీ తెలియదు" అని ఈటన్ అన్నారు.

అయితే, ముస్లింల పాలనలో దాదాపు 60,000 దేవాలయాలు కూల్చివేతకు గురయ్యాయని హిందూ మితవాదులు చేస్తున్న వాదన అతిశయోక్తి అని చరిత్రకారులు అంటారు.

దేవాలయాలను ధ్వంసం చేసే విషయంలో మొఘల్ పాలకులు భారతీయ చక్రవర్తులు, రాజులు పూర్వాచారాన్ని అనుసరించారని ప్రొఫెసర్ ఈటన్ అన్నారు.

19వ శతాబ్ధంలో జ్ఞానవాపి మసీదు పెయింటింగ్

ఫొటో సోర్స్, DEAGOSTINI/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 19వ శతాబ్ధంలో జ్ఞానవాపి మసీదు పెయింటింగ్

12వ శతాబ్దం చివరి నుండి ముస్లిం రాజులు, కనీసం 7వ శతాబ్దం నుండి హిందూ రాజులు శత్రురాజులు లేదా తిరుగుబాటుదారులు కట్టించిన, పోషించిన దేవాలయాలను దోచుకోవడమో, పునర్నిర్మించడమో, ధ్వంసం చేయడమో చేశారని, ఓడిపోయిన పాలకుల సంస్కృతి, సంప్రదాయాల నుంచి ప్రజలను వేరు చేయడానికి ఇదొక మార్గమని ఈటన్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదేమీ అసాధారణమైన విషయం కాదని చరిత్రకారులు అంటున్నారు. యూరప్ చరిత్రలో మతపరమైన ఘర్షణలు, చర్చిలను ధ్వంసం చేయడం వంటివి ఉన్నాయి.

ఉదాహరణకు 18వ శతాబ్దంలో ఉత్తర ఐరోపా ప్రాంతపు ప్రొటెస్టంట్ తిరుగుబాటు సమయంలో అనేక కాథలిక్ నిర్మాణాలను కూల్చివేయడం, అపవిత్రం చేయడం చరిత్ర చూసింది. 1566లో యూట్రెక్ట్ కేథడ్రల్‌ను, 1559లో స్కాట్‌లాండ్‌లోని సెయింట్ ఆండ్రూస్ కేథడ్రల్‌ను పూర్తిగా కూల్చివేయడం వంటి ఉదాహరణలు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ హత్య: ‘నడిరోడ్డుపై చంపుతుంటే 30 మందిలో ఒక్కరూ అడ్డుకోలేదు’

ప్రస్తుతం జరుగుతున్న వారణాసి మసీదు వివాదం మరో మతపరమైన వివాదంగా నిలుస్తుందని ప్రముఖ వ్యాఖ్యాత ప్రతాప్ భాను మెహతా అన్నారు. ''చరిత్రను చరిత్రగా చూసినప్పుడే లౌకికవాదం బలపడుతుంది. సెక్యులరిజానికి చరిత్రను పునాది చేసుకోవడం తగదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ఇటువంటి ఆందోళనలు అనవసరమని స్వపన్ దాస్‌గుప్తా అన్నారు. ఆయన హిందూ అనుకూలవాద కాలమిస్ట్.

''మసీదును తొలగించాలని, గత స్థితిని పునరుద్ధరించాలాని ఎవరూ డిమాండ్ చేయడం లేదు. అలాగే ఒక మందిరపు ప్రస్తుత స్వభావాన్ని సవరించడానికి చట్టం అనుమతించదు" అని ఆయన రాశారు.

ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో వారణాసి ఒకటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో వారణాసి ఒకటి

''వారణాసిలో ప్రస్తుతం జరుగుతున్న గొడవ భక్తులు మరింత సౌకర్యవంతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సంబంధించినది'' అని స్వపన్‌దాస్ గుప్తా అన్నారు.

అయితే, ఈ హామీలు ఏవీ నమ్మదగినవిగా లేవు. ఎందుకంటే, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని గత ఏడాది కొందరు సుప్రీం కోర్టులో సవాలు చేశారు.

''ప్రస్తుతం వారణాసిలో జరుగుతున్న వివాదం అలాంటి మరెన్నో వివాదాలను లేవనెత్తుతుంది. హిందువులు తమవిగా చెబుతున్న అనేక ప్రార్ధనా స్థలాలు ఉన్నాయి'' అని సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జి మదన్ లోకుర్ అన్నారు.

ఇది జీవిత కాల సమస్యగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, వారణాసి: మందిరం, మసీదు పక్కపక్కనే ఎలా నిర్మించారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)