మోదీ దత్తత తీసుకున్న 'వారణాసి'లోని గ్రామాల పరిస్థితి ఎలా ఉంది?

వారణాసి గ్రామం
ఫొటో క్యాప్షన్, కచహరియా గ్రామవాసి విమలాదేవి
    • రచయిత, నితిన్ శ్రీవాత్సవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మట్టితో అలికిన గుడిసె నుంచి టీ మరుగుతున్న వాసన. ప్రక్కనే నులక మంచం పైన కూర్చున్న ఇద్దరు యువకులు, "ఈరోజు శనివారం, బ్యాంకు తీసి ఉంటుందా, మూసివుంటుందా" అని చర్చించుకుంటున్నారు.

సన్నగా ఉన్నా సిమెంటుతో వేసిన రోడ్డు పక్కన జునాదేవి టీ దుకాణం ఉంది.

ఆమె "వితంతువులకు ఏమైనా పెన్షన్ దొరుకుతుందా? ఈ వయసులో చాయ్ దుకాణాన్ని నడపడం కష్టంగా ఉంది, సాయం చేసేందుకు కూడా ఎవరూ లేరు" అన్నారు.

వారణాసి గ్రామం
ఫొటో క్యాప్షన్, చాయ్ దుకాణం నడుపుతున్న జునాదేవి

ఇది వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న కచహరియా గ్రామం.

మేం ఇక్కడకు ఎందుకు వచ్చామంటే... దీని పక్కనే జయాపూర్ అనే గ్రామం ఉంది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ "ఎంపీ ఆదర్శ గ్రామం పథకం" కింద దత్తత తీసుకున్నారు.

పార్లమెంట్ సభ్యుడిగా, నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని నాలుగు గ్రామాలు - జయాపూర్, నాగేపూర్, ఖాఖారియా, డొంరిలను దత్తత తీసుకున్నారు. అయితే వాటన్నిటిలో జయపూర్ టాప్‌లో ఉంది.

వారణాసి నుంచి ఒక గంట ప్రయాణిస్తే, జయాపూర్ వస్తుంది. దాన్ని చేరుకోవడానికి ముందు, ముందు రెండు గ్రామాలు ఉన్నాయి, వాటిలో మొదటిది కచహరియా.

కచహరియా గ్రామ స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి మేం వెళుతున్నప్పుడు, ఇద్దరు మహిళలు మమ్మల్ని అడ్డగించి "మీరు మీడియా వాళ్లా?" అని అడిగారు.

జవాబు చెప్పేంతలోనే ఒకామె "గత ఐదేళ్ళలో మీడియావాళ్ళు చాలామంది వచ్చారు. టీవీలో జయాపూర్‌నే చూపిస్తారు. అంతే, రెండు నిమిషాలు మా ఇంటికి వచ్చి చూడండి" అన్నారు.

విమల అనే ఒక మధ్యవయసు మహిళ, మమ్మల్ని ఒక చిన్న కట్టపైనుంచి తన ఇంటికి తీసుకువెళ్ళారు.

ఐదడుగుల ఎత్తున్న పైకప్పు ఉన్న గుడిసెలోకి వెళ్లి చూస్తే, కొన్ని పాత్రలు, ఒక మంచం, రెండు లైట్లు ఉన్నాయి.

వారణాసి గ్రామం
ఫొటో క్యాప్షన్, కచహరియా గ్రామంలో ప్రజలు చేతి పంపు కావాలని డిమాండు చేస్తున్నారు.

"కరెంటు వస్తుందా మీ దగ్గర?" అని అడిగాను.

"ఇంతకుముందు కన్నా చాలా బాగుంది. సంవత్సరం క్రితమే అన్ని ఇళ్లలోనూ మీటర్లు కూడా పెట్టారు. సమస్యేంటంటే, అప్పటి నుంచీ ఆ మీటర్లు పనిచేయడం లేదు. మేం నేరుగా కరెంటు తీగలకే వైర్లు తగిలించి కరెంటు వాడుకుటున్నాం" అని చెప్పారు.

"ఇలా చేయడం చట్టరీత్యా నేరం, ఇది కరెంటు దొంగతనం అవుతుంది కదా" అని అడిగితే, విమల నాపై తిరగబడ్డారు.

"మేం ఎన్నో అడిగాం, ఒక చేతి పంపు వేసినా బాగుండేది. బావి నుంచి నీళ్లు తోడడం కష్టంగా ఉంది. కానీ ఏవీ ఇవ్వలేదు. మరి, కరెంటు లేకుండా, ఈ ఎండలో చావాలా?" అని ప్రశ్నించారు.

కచహరియా గ్రామంలోని దాదాపు 100 కుటుంబాలు తాగునీటి కోసం ఒకే బావిపై ఆధారపడతాయి. గ్రామంలో రక్షిత మంచి నీటి ట్యాంక్ లేదు, నీటి సరఫరా లేదు, ఒక్క చేతి పంపు కూడా లేదు.

గత ఐదేళ్లలో, ప్రభుత్వం మరుగుదొడ్లను నిర్మించింది, కానీ నీటి సరఫరా లేదు. తాగేందుకు స్వచ్ఛమైన నీటిని కూడా అందించాలి.

తర్వాత మాట్లాడిన సునీతా దేవి "ఉదయం లేవగానే మాకు నీళ్లదే పెద్ద సమస్య అయిపోతోంది" అన్నారు.

"వర్షాకాలం మొదట్లో నీళ్లు చాలా మురికిగా ఉంటాయి. చుట్టుపక్కల వంద మంది ఉన్నాం. కనీసం నాలుగు నెలల వరకు బావిలో నీళ్లు తాగలేం. ఒకటి, రెండు కిలోమీటర్లు నడిస్తే తప్ప నీళ్లు దొరకవు" అని తెలిపారు.

వారణాసి గ్రామం
ఫొటో క్యాప్షన్, సునీతా దేవి

కచహరియాకు తర్వాత చందాపూర్ వస్తుంది. జయాపూర్‌కు పక్కనే ఉన్న ఈ గ్రామం బయట ఇప్పుడు ఒక మార్కెట్ తయారయ్యింది. ఇక్కడ బ్రెడ్, గుడ్లు నుంచి కూలర్ వరకు అన్నీ అమ్ముతారు.

ఆశ్చర్యమేమంటే, ఈ గ్రామాన్ని ఎంపీ ఆదర్శ గ్రామ యోజన కింద ఎవరూ దత్తత కూడా తీసుకోలేదు. రెండేళ్ల క్రితం ఈ షాపులు కూడా లేవు.

అక్కడ ఒక షాపు నడిపే అహ్మద్ దానికి కారణం చెప్పారు.

"జయాపూర్‌లో ఒక్కసారిగా అభివృద్ధి మొదలైనప్పుడు, అక్కడి ప్రజలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా చాలా షాపులు తెరిచారు. అక్కడ కచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని మేం కూడా అప్పు చేసి మరీ ఇక్కడ దుకాణాలు తెరిచాం" అన్నారు.

గ్రామంలోకి వెళ్లి చూస్తే అభివృద్ధి బాగానే జరిగింది. అంటే, ఉదాహరణకు, దాదాపు ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉన్నాయి. చివరి బస్తీ వరకు, ఇరుకుగా ఉన్నా, చక్కని రోడ్డు కూడా ఉంది.

మేం ఒక మంగలి షాపులో కూర్చున్నాం.

వారణాసి గ్రామం
ఫొటో క్యాప్షన్, బార్బర్ షాప్ నడిపే ముల్క్ రాజ్ శర్మ

ఆ షాపు యజమాని ముల్క్ రాజ్ శర్మ "అభివృద్ధి జరగలేదని కాదు, కానీ తక్కువ. తర్వాత వచ్చే ప్రభుత్వం ఇది ఇంకా మెరుగవుతుంది" అన్నారు.

ఆయన దుకాణం ముందు, గోడలు పాడైన ఒక భవనం కనిపించింది. తర్వాత అది గ్రామ పంచాయతీది అని తెలిసింది.

కాస్త ముందుకు వెళ్ళగానే కచహరియా గ్రామ ముఖచిత్రం మారుతూ కనిపించింది.

ఫైబర్‌తో కట్టిన మరుగుదొడ్లు కొన్ని మూతపడి ఉంటే, కొందరు వాటిలో గడ్డి నింపి గోదాముల్లా వాడుకుంటున్నారు.

ఒక ఇంటిముందు ఇద్దరు మహిళలు బట్టలు ఉతుకుతూ కనిపించారు. గత ఐదేళ్ళలో జరిగిన మార్పేమిటని అడిగితే, "తిరిగి చూడండి, మీకే తెలుస్తుంది. మా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది" అని ఒక మహిళ సమాధానం ఇచ్చారు.

ఇంతలో ఇంటి యజమాని బయటకు వచ్చి, వాళ్ళను వారిస్తూ "అంతా చాలా బాగుంది, చాలా జరిగింది. నేను చెపుతున్నానుగా, మోదీ చాలా బాగా పని చేశారు" అన్నారు.

వారణాసి గ్రామం

కానీ, చందాపూర్, కచహరియా మధ్య మాకు పెద్దగా తేడా ఏం కనిపించలేదు.

మేం అలా ముందుకు వెళ్తూ వ్యాపారం చేసుకునే, అనిల్ గోస్వామి అనే యువకుడిని కలిశాం.

"మేం మా సొంతంగా చేయకుండా, తాలూకా ద్వారా అభివృద్ధి చెందాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆయన పేరుతో బయటి కంపెనీలు ఏవో వచ్చి సోలార్ లైట్లు, నీళ్ల ట్యాంకులు పెడుతున్నారు. అవి మా గ్రామంలో కూడా జరిగితే బాగుండేది, కానీ అలా జరగలేదు" అన్నారు.

ఇక, ఇప్పుడు మేం అర కిలోమీటర్ ముందుకు వెళ్లి జయాపూర్‌లోకి ప్రవేశించాం.

2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే ఎంపీలందరినీ గ్రామాలను దత్తత తీసుకోవాల్సిందిగా కోరిన నరేంద్ర మోదీ, స్వయంగా జయాపూర్‌ను దత్తత తీసుకున్నారు.

వారణాసి గ్రామం
ఫొటో క్యాప్షన్, జయాపూర్ గ్రామం

ఆ తర్వాత, జయాపూర్ దశ మారిపోయింది. సోలార్ ప్లాంట్ ద్వారా రాత్రంతా గ్రామంలో విద్యుత్తు సరఫరా ఉంటుంది. రెండు ఏటీఎంలు ఏర్పాటు చేశారు.

జల మండలి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఓ ఆస్పత్రి నిర్మించడంతో పాటు 24 గంటలూ ఒక అంబులెన్సు అందుబాటులో ఉంచారు.

ఒక కంప్యూటర్ సెంటర్, ఒక కుట్టు శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటయ్యాయి.

మధ్యాహ్నం, వీధి చివర ఉన్న మొబైల్ షాప్ ఓనర్ దినేష్ పటేల్‌తో మాట్లాడాం.

"ఇక్కడ ఇప్పుడు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. రెండు బ్యాంకులు ఉన్నాయి, జల మండలి ఏర్పాటైంది. ఇంటింటికీ నీటి సరఫరా ఉంది, సోలార్ పానెల్ ద్వారా ఇరవై నాలుగు గంటలూ కరెంటు ఉంటోంది, రోడ్ కూడా బాగైంది" అని ఆయన చెప్పారు.

ఇప్పుడు జయాపూర్‌లో దాదాపు 30 శాతం మంది వ్యవసాయం చేస్తుంటే, 20 శాతం మంది వ్యవసాయ కూలీలుగా, 34 శాతం మంది మిగతా వృత్తుల్లో ఉన్నారు.

వారణాసి గ్రామం

దేశ అక్షరాస్యత 73 శాతం ఉంటే, ఉత్తరప్రదేశ్ అక్షరాస్యత 53 శాతంగా ఉంది. కానీ జయాపూర్‌లో అక్షరాస్యత 76 శాతం. గ్రామంలో అక్షరాస్యులైన 100 మంది మగవారితో పోలిస్తే 62 మంది మహిళలకు చదవడం, రాయడం వచ్చు.

అంటే, ఇప్పుడు జయాపూర్ గ్రామం వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలోనే కాకుండా పూర్వాంచల్ ప్రాంతంలో అభివృద్ధి చెందిన గ్రామాల్లోనే ఒకటిగా మారింది.

మోదీ ఆ గ్రామాన్ని దత్తతకు ఎంచుకోవడం తమ అదృష్టంగా ఆ గ్రామ ప్రజలు భావిస్తున్నారు.

కానీ, జయాపూర్ ప్రజల్లో చాలామందికి తమ చుట్టుపక్కల గ్రామాల దశ, దిశ మారలేదనే అసంతృప్తి కూడా ఉంది.

జయాపూర్ కూడలిలో సిగరెట్ దుకాణం నడుపుతున్న వంశరాజ్ గిరి.. మోదీని భారత భవిష్యత్ విధాతగా భావిస్తారు.

మిగతా గ్రామాల వారి గురించి చెబుతూ "అందరూ భారత పౌరులే, అందరూ అభివృద్ధి చెందాలి. మోదీ అదే చెబుతారు. అభివృద్ధి అందరితోనే సాధ్యం అంటారు.. అయితే, అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు అభివృద్ధి కావాలి. వారణాసి మాత్రమే కాదు, భారతదేశం మొత్తం అభివృద్ధి చెందాలి" అంటారు.

కానీ, మోదీ దత్తత తీసుకున్న గ్రామాల ప్రజలు, జరిగిన పనుల నాణ్యతపై అసంతృప్తిగా ఉన్నారు. "ఖర్చుకు తగ్గట్టు పనుల్లో నాణ్యత లేదు. రోడ్లు వేశారు కానీ అవి కొంత కాలానికే పాడైపోయాయి" అని బీబీసీకి చెప్పారు.

మోదీ దత్తత తీసుకున్న తర్వాత గ్రామ ముఖచిత్రం మారిపోయింది. నీటి సమస్య తీరింది. మరుగుదొడ్లు కట్టారు, కానీ డ్రైనేజీ లేకపోవడంతో ఇళ్లు మురికిగా అవుతున్నాయని మహిళలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)