ఆస్ట్రేలియా ఎన్నికలు: ప్రచారంలో నిధుల వరద.. డబ్బులతో ఓట్లు రాలతాయా?

క్లైవ్ పామర్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, క్లైవ్ పామర్ తిరిగి రాజకీయ ప్రాబల్యం సాధించటం కోసం మిలియన్లు ఖర్చు చేస్తున్నారు

ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికలు మే 18వ తేదీన జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఈసారి ఎన్నడూ లేనంతగా డబ్బులు వరదలా పారుతున్నాయి. దీని ప్రభావం ఎలా ఉంటుందని సిడ్నీలో బీబీసీ ప్రతినిధి ఫిల్ మెర్సర్ విశ్లేషిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో విపరీతంగా ఖర్చవుతున్న డబ్బు వెనుక ఓ వివాదాస్పద మైనింగ్ దిగ్గజం ఉన్నారు. ఆయనకు డైనోసార్లంటే ఎంతో ఇష్టం. టైటానిక్ నౌక ప్రతిరూపాన్ని నిర్మించాలన్న ఆకాంక్ష కూడా ఉంది.

ఆయన పేరు క్లైవ్ పామర్. ఆయన కొత్త రూపాన్నిచ్చిన యునైటెడ్ ఆస్ట్రేలియన్ పార్టీ (యూఏపీ) కోసం పోలింగ్ జరిగే సమయానికల్లా 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారని అంచనా.

మితవాద యూఏపీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం కోసం 60,000 టీవీ ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనల వెల్లువ ఇంకా కొనసాగుతుంది కూడా.

ఫాస్ట్-ఫుడ్ దిగ్గజాలు, భారీ రిటైల్ బ్రాండ్లు తమ ప్రచారం కోసం చేసినట్లుగా భారీ బడ్జెట్‌తో చేస్తున్న ఎన్నికల ప్రచారమిది. ఈ దేశ రాజకీయాల్లో ఇంతటి స్థాయిలో డబ్బులు గుమ్మరించటం ఎన్నడూ లేదు.

2016లో ఆస్ట్రేలియాలోని రెండు ప్రధాన పార్టీలూ కలిసి 30 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు పెట్టాయని అంచనా.

ఐదేళ్ల కిందట ఆస్ట్రేలియా పార్లమెంటులో శక్తిమంతమైన ఎగువ సభ సెనేట్‌లో బలీయమైన శక్తిగా ఓ వెలుగు వెలిగిన పామర్.. యునైటెడ్ పార్టీని పునరుద్ధరించి యూఏపీగా మళ్లీ బలంగా ముందుకు తెస్తున్నారు.

అంతర్గత కుమ్ములాటలు, ఫిరాయింపులతో పాటు.. క్వీన్స్‌ల్యాండ్‌లో క్లైవ్ పామర్‌కు చెందిన నికెల్ రిఫైనరీ మూసివేత పరిణామాలతో నాడు ఆ పార్టీ కుదేలైపోయింది.

ఇప్పుడు పునరుత్తేజమైన ఈ పార్టీ రాబోయే పార్లమెంటులో మళ్లీ గణనీయమైన ప్రాబల్యం సాధించగలదని ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి.

అయితే.. భారీ ఎత్తున గుమ్మరిస్తున్న డబ్బులు ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయవచ్చునన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

''తగినంత ఖర్చు పెట్టి.. టీవీ చానళ్లను, ఓటర్ల ఇన్‌బాక్సులు, వారి మొబైల్ ఫోన్లను నింపేసినట్లయితే.. జనంలో కొంత మందిని మీ వైపుకు తిప్పుకోగలరు. ఇది ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమన్నది నా అభిప్రాయం'' అని గ్రాటన్ ఇన్‌స్టిట్యూట్ అనే ఓ నిష్పాక్షిక థింక్ ట్యాంక్ ప్రతినిధి డానియెల్ వుడ్ పేర్కొన్నారు.

పీటర్ డటన్ (ఎడమ), టోనీ అబాట్ (కుడి)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలో పీటర్ డటన్ (ఎడమ), టోనీ అబాట్ (కుడి)లు అత్యంత విభజనకారకులైన నాయకులుగా పేరుపడ్డారు

నిధుల సమీకరణల పాత్ర ఎంత?

ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలోని రెండు ప్రత్యర్థి సంస్థలు.. ఆస్ట్రేలియా గురించి రెండు భిన్నమైన ఆలోచనలను ప్రచారం చేస్తున్నాయి.

శక్తిమంతమైన వామపక్ష లాబీ... గెటప్! గత ఏడాది కాలంలో తన అభ్యర్థులు ఒక్కొక్కరి కోసం దాదాపు 13 మిలియన్ డాలర్లు సమీకరించింది.

ఆస్ట్రేలియాలో అత్యంత విభజనకారులుగా పేరుపడ్డ ఇద్దరు రాజకీయ నాయకులు - హోం వ్యవహారాల మంత్రి పీటర్ డటన్, మాజీ ప్రధానమంత్రి టోనీ అబాట్‌లను పదవుల నుంచి తొలగించటానికి ప్రయత్నిస్తున్న ఉద్యమకారులకు ఈ సంస్థ సాయం చేస్తోంది.

''సాధారణ ప్రజల విలువలు, ఆకాంక్షలే మా సిద్ధాంతాలకు బలం. మా పని.. విలువల ప్రాతిపదికగా నడుస్తుంది, పార్టీ రాజకీయాలు ప్రాతికదికగా కాదు'' అని చెప్తోంది గెటప్.

గెటప్‌కు వ్యతిరేకంగా సంప్రదాయవాద అజెండాతో అడ్వాన్స్ ఆస్ట్రేలియా అనే సంస్థ గత నవంబర్‌లో ప్రారంభమైంది.

''ప్రధాన స్రవంతి ఆస్ట్రేలియన్ల స్వతంత్ర ఉద్యమం'' ఇది అని ఆ సంస్థ చెప్తోంది. ప్రస్తుతం కొన్ని వేల మంది సభ్యులున్న తమ సంస్థలో త్వరలోనే లక్షల మంది చేరతారని ఆశిస్తోంది. సంపన్నమైన వాణిజ్య దిగ్గజాల బృందం ఒకటి దీనికి ఆర్థిక మద్దతు అందిస్తోంది. ఆస్ట్రేలియాలో ఏకైక రాజకీయ ''సూపర్‌హీరో''గా తాను అభివర్ణిస్తున్న నాయకుడికి మాత్రమే ఈ సంస్థ మద్దతిస్తోంది.

గెటప్ విప్లవాత్మక వామపక్ష అజెండాను ఎద్దేవా చేసే లక్ష్యంతో 'కెప్టెన్ గెటప్' అనే వ్యంగ్య పాత్రను కూడా సృష్టించింది.

నిధుల సమీకరణపై నియంత్రణలు ఏమున్నాయి?

ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్నట్లుగానే ఆస్ట్రేలియా రాజకీయాల్లోనూ నరనరానా డబ్బులు నిండిపోయాయి.

ప్రధాన పార్టీలు ప్రకటించిన విరాళాల్లో సగానికి పైగా నిధులు కేవలం ఐదు శాతం మంది దాతల నుంచే వచ్చాయని గ్రాటన్ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషణ వెల్లడించింది.

ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రధానంగా ట్రేడ్ యూనియన్లు - అంటే కార్మిక సంఘాల మీదే ఆధారపడి ఉన్నాయి. అందులోనూ అధికంగా నిర్మాణ రంగం, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలే ఎక్కువ.

ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ సారథ్యంలోని మితవాద అధికార సంకీర్ణానికి మైనింగ్ పరిశ్రమ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఇక సంపన్నమైన ఇతర కార్పొరేట్ సంస్థలు ఇరు పక్షాలకూ విరాళాలు ఇస్తున్నాయి.

''ఆర్థిక బలమున్న భారీ వ్యాపార దిగ్గజాలు, కార్మిక సంఘాలు, ఇతర గ్రూపులు.. ఆస్ట్రేలియా విధానాల మీద చాలా ప్రభావం చూపుతున్నాయని మా అధ్యయనంలో వెల్లడైంది'' అని వుడ్ తెలిపారు.

ఆస్ట్రేలియా నగదు

ఫొటో సోర్స్, Getty Images

''అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే.. ఆస్ట్రేలియా ఎన్నికల వ్యవస్థలో ప్రైవేటు డబ్బు చాలా ఉంది. జనం ఎంత విరాళం ఇవ్వవచ్చు అనే దానిమీద ఎటువంటి పరిమితీ లేదు. ఇది చట్టానికి వ్యతిరేకం కాదు. ఇది ప్రధాన సమస్య'' అని ఆమె వ్యాఖ్యానించారు.

అయితే.. ప్రచార నిధులను స్థానిక స్థాయిలో ఎక్కువగా నియంత్రిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియన్ల సంఖ్య అత్యధికంగా ఉండే రాష్ట్రం న్యూ సౌత్ వేల్స్‌లో జూదక్రీడా సంస్థలు, మద్యం, పొగాకు రంగాలు, ప్రాపర్టీ డెవలపర్ల నుంచి రాజకీయ విరాళాలను నిషేధించారు.

అయితే జాతీయ రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి లేదు. కానీ.. బయటి నుంచి జోక్యం ఉంటుందన్న భయంతో విదేశీ విరాళాల మీద ఇప్పుడు పరిమితులు ఉన్నాయి.

''ఇప్పుడు విరాళాలు ఇవ్వాలంటే మీరు ఆస్ట్రేలియా పౌరుడై ఉండాలి. లేదా ఆస్ట్రేలియా నివాసి కానీ, ఆస్ట్రేలియాలో ఉన్న ఒక కంపెనీ కానీ అయి ఉండాలి. కాబట్టి జాతీయ స్థాయిలో విదేశీ విరాళాల మీద ఇప్పుడు పరిమితులు ఉన్నాయి'' అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మారియన్ సావేర్ బీబీసీతో పేర్కొన్నారు. రాజకీయ విరాళాలు ప్రజాస్వామీకరణ జరగాలని ఆమె భావిస్తున్నారు.

అయితే.. డబ్బులు ఓట్లను రాబడతాయా?

ఆస్ట్రేలియా ఎన్నికల ప్రచారంలో మునుపెన్నడూ లేనంతగా డబ్బులు గుమ్మరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం క్లైవ్ పామర్ దగ్గర అపార నిధులు ఉండటమే.

కానీ డబ్బు రాజకీయాలకు పరిమితులున్నాయని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో ఆర్థికవేత్తగా ఉన్న టిమ్ హర్‌కోర్ట్ అంటారు.

''చివరికి చూస్తే డబ్బులు మీకు ఓట్లు కొనివ్వలేవు. ప్రజల మనసులు, హృదయాలను గెలవాల్సి ఉంటుంది. కానీ మీ అవకాశాలు డబ్బుతో కచ్చితంగా మెరుగుపడతాయి'' అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి ముందే 75 శాతం మంది ఒక నిర్ణయానికి వచ్చారని ఒక సర్వే చెప్తోంది. గతంలో ఇది చాలా తక్కువగా ఉండేది. అంటే ఎన్నికల కోసం ఇప్పుడు చేస్తున్న ప్రచార ఖర్చు డబ్బు వృధా అని అర్థం చేసుకోవచ్చు'' అని వ్యాఖ్యానించారు.

''కానీ ఈ ఎన్నికలు పోటాపోటీగా జరగబోతున్నాయి. అలాగే కనిపిస్తున్నాయి కూడా. అలాంటపుడు ఇంకా నిర్ణయం తీసుకోని ఓట్లకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఎన్నికల నిధులు మంచి పెట్టుబడి కావచ్చు'' అని టిమ్ విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)