ఆంధ్రప్రదేశ్: మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది? 1952లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఏమంటున్నారు?

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆరు దశాబ్దాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటి? ఆనాటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన గెలిచిన అభ్యర్థులు ఏమంటున్నారు?
స్వాతంత్ర్యం లభించిన తర్వాత దేశంలో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న ప్రాంతంలో అప్పట్లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండేది. ఆ తర్వాత 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
1956లో హైదరాబాద్ రాష్ట్రంతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చింది. 2014లో తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భావం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ప్రస్తుతం రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.

మూడు అసెంబ్లీలలో సభ్యుడు ఆయన
ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీకి 1952లో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి సీపీఐ తరఫున చిట్టూరి ప్రభాకర్ చౌదరి పోటీ చేశారు. ఆయన వయసు ప్రస్తుతం 96 సంవత్సరాలు.
ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీలోనూ, ఆ తర్వాత 1953లో ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ కర్నూలులో ఏర్పాటు చేసిన సమయంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా హైదరాబాద్ అసెంబ్లీలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు.
ఇలా మూడు చోట్ల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఘనత ఆయనకు ఉంది.

సైకిల్ మీదే ప్రచారం
తొలి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి అనుభవాలను చిట్టూరి ప్రభాకర్ చౌదరి బీబీసీతో పంచుకున్నారు. అప్పట్లో ప్రచార సరళి, అభ్యర్థులు, ఓటర్ల తీరు ఎలా ఉండేదో వివరించారు.
"మా ప్రచారం పూర్తిగా సైకిల్ మీదే సాగేది. రాజమండ్రిలో అయితే నడిస్తూ, సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేసేవాళ్లం. కానీ, కడియం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే కొంత దూరం బస్సు మీద వెళ్లి అక్కడి నుంచి చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లే వాళ్లం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాకు కమ్యూనిస్టు పార్టీ అవకాశం ఇచ్చింది. అప్పుడే నేను జైలు నుంచి బయటకు వచ్చాను. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో డిపాజిట్ రూ. 250లు కూడా సమస్య అయ్యింది. అప్పుడు ఎన్నికల ఖర్చు చాలా తక్కువ. ప్రజలు కూడా ఆదరించేవారు" అంటూ చెప్పుకొచ్చారు.

బొగ్గుతో గోడలపై రాతలు
తమ నినాదాలు, విధానాలు అన్నీ బొగ్గుతో గోడలపై రాసేవాళ్లమని తొలి సాధారణ ఎన్నికల్లో ఓటరుగానూ, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుడిగానూ పనిచేసిన రుద్రరాజు సత్యనారాయణ (ఆర్ ఎస్) బీబీసీకి చెప్పారు. అప్పట్లో తమ ప్రచారమంతా బొగ్గు ముక్కతో ఉండేదన్నారు.
"హాస్టళ్లలో సమస్యల గురించి గోడలపై రాసేవాళ్లం. మా డిమాండ్లతో చివరకు వార్డెన్లు దిగివచ్చేవారు. నాకు తొలిసారిగా 1962లో మొదటి సారి పార్టీ టికెట్ ఇచ్చింది. నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశాను. కానీ, 4,500 ఓట్ల తేడాతో పరకాల శేషావతారం (పరకాల ప్రభాకర్ తండ్రి) చేతిలో ఓడిపోయాను. మళ్లీ అదే నియోజకవర్గం నుంచి 1967లో సీపీఎం తరఫున పోటీ చేసి 5 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచాను. నాకు ఎన్నికల ఖర్చు రూ.10,000 అయ్యింది. అప్పట్లో ప్రజలు, నాయకులు కూడా చాలా సాధారణంగా ఉండేవారు. ఇప్పుడు అంతా ఆర్భాటాలు పెరిగాయి. కులం, మతం, ప్రాంతీయ వాదనలు పెరగడం నాకు ఆందోళన కలిగిస్తోంది" అంటూ ఆయన తన అనుభవాలను వివరించారు.

అప్పటికీ, ఇప్పటికీ పోలికే లేదు
తొలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో కొందరిని బీబీసీ పలకరించింది. అందులో శారదా హెచ్.రావు అనే మహిళ ఆనాటి పరిస్థితులను వివరించారు.
"పెద్ద పెద్ద నాయకులు సభలు నిర్వహిస్తున్నారంటే ఎంత దూరమైనా కాలి నడకన వెళ్లేవాళ్లం. పేపర్లు, టీవీలు లేవు కాబట్టి వాళ్లు చెప్పింది వినడమే. నాయకులు ఎడ్ల బండ్లు కట్టుకుని ప్రచారానికి వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు బాగా మారిపోయాయి. 30, 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు పోలికే లేదు. అప్పట్లో నాయకులకు ఓట్లేసి గెలిపించినందుకు జనాలకు సేవ చేసేవారు. ఇప్పుడు అన్నింటా అవినీతి పెరిగిపోయింది" అంటూ ఆమె తన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

సినీ నటుడు జిత్ మోహన్ మిత్రా కూడా తన అనుభవాలను తెలిపారు.
"అప్పట్లో నాయకుల పట్ల జనాలకు బాగా గౌరవం ఉండేది. సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు, జనతా పార్టీల వారికి కూడా ఒకరంటే ఒకరికి గౌరవ భావం ఉండేది. ఎన్నికలు కూడా హూందాగా జరిగేవి. ఓటు విలువ చాలామందికి తెలిసేది కాదు. నిరక్షరాస్యత కారణంగా ఓటింగ్ శాతం కూడా తక్కువ నమోదయ్యేది. కానీ, ఇప్పుడు అది పెరుగుతోంది. ప్రజల్లో ఇప్పుడు త్యాగాలకు విలువ ఉండడం లేదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- స్వాతి గీసిన కార్టూన్‌పై ఎందుకీ మండిపాటు?
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- వీళ్లను తిడతారు, కొడతారు, అసహ్యించుకుంటారు - ఎందుకు?
- 'అంబేడ్కర్'కు పంజరం నుంచి విముక్తి ఎప్పుడు?
- తండ్రిని ఆకలి ఓడించింది, ఆ తండ్రిని కొడుకు గెలిపించాడు.. రాహుల్ 'గోల్డ్' కోస్ట్ స్టోరీ ఇదీ!
- ఆంధ్రప్రదేశ్: భయం భయంగా బడికి!
- ‘అమ్మ కూరగాయలు అమ్మి ఇచ్చిన డబ్బు.. రూ.500లతో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








