ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్‌పై మంగళగిరిలో 'తమన్నా' పోటీ

ఫొటో సోర్స్, తమన్నా సింహాద్రి
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఒకటి.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ ఇక్కడి నుంచి బరిలో దిగడంతో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే ఉంది.
ఇక్కడి నుంచి మొత్తంగా 64 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Thamanna
ఎవరీ తమన్నా?
విజయవాడలో పుట్టిపెరిగిన తమన్నా ట్రాన్స్ జెండర్. ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరును సింహాద్రి తమన్నాగా పేర్కొన్నారు.
''ఇప్పుడు రాజకీయాలు వ్యాపారంగా మారాయి. అందుకే కోట్లు పెట్టి పార్టీల టికెట్లు కొని పోటీకి దిగుతున్నారు. గెలిచాక మరింతగా సంపాదిస్తున్నారు తప్పితే ప్రజలకు సేవ చేయడం లేదు. ప్రజల మధ్య ఉన్న మా లాంటి వాళ్లే ప్రజాసేవ చేయగలరు. అందుకే ఎన్నికల్లోకి దిగాను'' అని తమన్నా చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ... వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
''అధికారం వారసత్వం కాకూడదు. తాత ముఖ్యమంత్రి ఆ తరువాత తండ్రి ముఖ్యమంత్రి ఇప్పుడు కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అధికారం ఒకే కుటుంబంలో ఉండాలా? మాలాంటి సామాన్యులు అధికారం చేపట్టకూడదా?" అని ప్రశ్నించారు.
తన ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని తమన్నా తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించి వారికి ఉపాధి లభించేలా చూస్తానని చెప్పారు.

ఫొటో సోర్స్, Thamanna
'జనసేనలో వివక్ష చూపారు'
ట్రాన్స్‌జెండర్ కావడంతో జనసేనలో తనకు టికెట్ రాకుండా వివక్ష చూపారని తమన్నా తెలిపారు.
''నటి శ్రీరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసినప్పుడు పవన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపా. ఆందోళనలు చేశా. జనసేనలో క్రీయాశీలకంగా పని చేశా. కానీ, కనీసం పవన్‌కు కలిసే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. జనసేన టికెట్ రాకుండా వివక్ష చూపారు'' అని తమన్నా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








