ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ‘ప్రత్యేక రాష్ట్రమే రాయలసీమకు శాశ్వత పరిష్కారం’- బీబీసీ తెలుగు రంగస్థలం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రాష్ర్టంలో కీలక సమస్యలపై రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులతో బీబీసీ తెలుగు 'రంగస్థలం' పేరుతో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
తిరుపతిలో రంగస్థలం కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు:
- భాను ప్రకాశ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
- సాకం ప్రభాకర్, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ
- భూమన్, రాయలసీమ అధ్యయనాల సమితి అధ్యక్షులు

సీమవాసులు సీఎం కావడం రాయలసీమ దురదృష్టం: సాకం ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రాయలసీమ వారే కావడం రాయలసీమ దురదృష్టం అని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాకం ప్రభాకర్ అన్నారు.
‘‘ఇక్కడి నేతలు ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోసం కోస్తా ప్రాంతంవారి కోరికలను మాత్రమే తీరుస్తూ వచ్చారు. ఈ ప్రాంతంలో ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమే పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును, మూతపడిన కేసీ కెనాల్ బాగు చేశారు’’ అని చెప్పారు.
‘‘చంద్రబాబు వచ్చి ప్రాజెక్టులకు హారతులు ఇస్తున్నారు. ప్రచారం కోసం, ఫొటోల కోసమే అవి పనికొస్తున్నాయి. కానీ, పంటలకు నీరు ఇవ్వట్లేదు’’ అని విమర్శించారు.
చర్చలో ఇంకా ఏమన్నారంటే..
- కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే, అదొక ప్రైవేటు కంపెనీ. దాని వల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది? అన్నది ప్రశ్న. ప్రభుత్వ సంస్థలు వస్తేనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి.
- రాయలసీమలో ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. అందుకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తే బాగుండేది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.

గత పాలకుల వైఫల్యమే శాపం: భాను ప్రకాశ్
కడప ఉక్కు కర్మాగారాన్ని, రైల్వే జోన్ ను విభజన చట్టంలో పొందుపరచలేదన, కేవలం పరిశీలించాలని మాత్రమే పేర్కొన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ అన్నారు.
‘‘అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఎందుకు చట్టంలో పొందుపర్చలేదు? అందరూ బీజేపీనే ఒక విలన్‌లా చూపిస్తూ మాట్లాడుతున్నారు. హోదా కంటే ఎక్కువ ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామని చెప్పిన చంద్రబాబు, మోదీని, అరుణ్ జైట్లీకి సన్మానం చేయాలన్న ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారు ’’ అని పేర్కొన్నారు.
‘‘గత పాలకుల వైఫల్యాలే రాయలసీమకు శాపంగా మారాయి, సినిమాల్లో రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అన్నట్లుగా చూపిస్తున్నారు, అది సరికాదు. ఇక్కడ ఎంతో కష్టపడే ప్రజలు ఉన్నారు" అని పేర్కొన్నారు.
చర్చలో ఇంకా ఏమన్నారంటే..
- కడప ఉక్కు కర్మాగారం డీపీఆర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. డీపీఆర్ ఇవ్వకుండానే ఫొటోల కోసం చంద్రబాబు దానికి శంకుస్థాపన చేశారు.
- తిరుమల తిరుపతి దేవస్థానంలో 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. 8,000 ఖాళీలున్నా ప్రభుత్వం భర్తీ చేయడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఫొటోల కోసం హడావుడి కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తోంది.

రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలి: భూమన్
రాయలసీమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మెకంజీ అనే పథకాన్ని బ్రిటిష్ వారు ప్రారంభించారు. దాని ద్వారా 39 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉండేదని రాయలసీమ అధ్యయనాల సమితి అధ్యక్షులు భూమన్ చెప్పారు.
‘‘మొదటి ప్రపంచ యుద్ధం పరిణామాల వల్ల మెకంజీ పథకం మూలన పడిపోయింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీరందించేందుకు కృష్ణా, పెన్నా పథకం తెచ్చారు. కానీ, ఆ పథకం పేరుతో నీటిని మద్రాసుకు తీసుకెళ్లే ప్రమాదముందన్న ఆందోళనతో కమ్యూనిస్టులు, కోస్తా ఆంధ్రావారు దాన్ని వ్యతిరేకించారు. అలా, మన కళ్ల ముందే మంచి పథకాలు వెనక్కి వెళ్లిపోయాయి" భూమన్ చెప్పారు.
రాయలసీమకు రావాల్సిన ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రాకు తీసుకెళ్లారని, రాయలసీమకు జరుగుతున్న మోసాల్లో అది ముఖ్యమైన మోసమని అన్నారు.
‘‘మద్రాసు వారిని, ఆంధ్రావారిని నమ్ముకుంటే రాయలసీమకు ప్రయోజనం లేదు. కాబట్టి, ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే బాగుంటుంది" అని అభిప్రాయపడ్డారు.
రాయలసీమ వారు తమ ప్రాంతం గురించి పట్టించుకోకుండా, ఆంధ్రా నాయకుల సేవలోనే తరించిపోయారని, అందుకే ఇక్కడ ఈ సమస్యలు అలాగే ఉండిపోయాయని చెప్పారు.
చర్చలో ఇంకా ఏమన్నారంటే..
- ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ కోస్తాంధ్రలోని 120 నియోజకవర్గాల వైపే చూస్తున్నాయి. రాయలసీమలో ఒక్క సీటు రాకపోయినా ఆంధ్రాలో వస్తే చాలు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. రాయలసీమ గురించి పట్టించుకోవట్లేదు.
- మా పేరిట వస్తున్న ప్రయోజనాలన్నింటినీ కోస్తాకు తరలిస్తున్నారు. మాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సరైన పరిష్కారం.

చర్చా కార్యక్రమం అనంతరం రంగస్థలం కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు, సీమవాసులు... వక్తలను ఉద్దేశిస్తూ రాయలసీమ సమస్యలమపై ప్రశ్నించారు.
రాయలసీమలోని గండికోట లాంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, పాలకులు దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఓట్లు సీట్లు కోసమే తాపత్రయపడుతున్న రాజకీయ పార్టీలు రాయలసీమ భవిష్యత్తును పట్టించుకోవడం లేదని మరో విద్యార్థి అన్నారు.
రాజేశ్ అనే న్యాయవాది మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేదని ఆర్టీఐ చట్టం ద్వారా తెప్పించుకొని తాను పరిశీలించానని చెప్పారు.

పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించకోవడం వల్ల లాభం లేదని అన్నారు. రాయలసీమ వ్యక్తే సీఎంగా ఉన్నారు. ప్రతిపక్షనేత కూడా ఇక్కడి వారే కానీ, ఇక్కడ సామాన్యుడు ఎదగడం లేదు అని చెప్పారు.
విద్యలో సమూల మార్పులు తీసుకరావాలి, ఫీజురియింబర్స్ మెంట్ వల్ల పెద్ద ప్రయోజనం కల్పించడం లేదు. దీనిపై పార్టీలు సమాధానం చెప్పాలి అని మరో విద్యార్థి ప్రశ్నించారు?
ప్రజాప్రతినిధులు కమిషన్‌లు తీసుకోకుండా పనులు చేయించగలరా అని మరో వ్యక్తి ప్రశ్నించారు.

‘రాయలసీమను పార్టీలు నాశనం చేశాయి’
అన్ని పార్టీలూ రాయలసీమను అత్యంత దుర్మార్గంగా నాశనం చేశాయని రాయలసీమ మేధావుల ఫోరం నేత పురుషోత్తం రెడ్డి అన్నారు.
‘‘బీబీసీ ద్వారా రాయలసీమ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్న ఆశతో వచ్చాను. అన్నింటికీ పరిష్కారం ప్రత్యేక హోదా, పోలవరం మాత్రమే అన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ రెండూ దుర్మార్గమైన చర్చలే. రాయలసీమలో పాక్షిక ప్రత్యేక హోదా 2016 నుంచి అమలులో ఉంది. ఈ విషయం అందరికీ తెలియదు. కానీ, ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ఇస్తారో, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు 2016 నుంచి ఆ ప్రయోజనాలు అమలులో ఉన్నాయి. కానీ, ఇక్కడ ఇప్పటివరకూ ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు. రేపు పూర్తిస్థాయి ప్రత్యేక హోదా వస్తే రాయలసీమకు పరిశ్రమలు వస్తాయా?’’ అని ప్రశ్నించారు.
పోలవరం కట్టినా ఈ ప్రాంతానికి నీళ్లు రావని అన్నారు. మౌలిక వసతుల కల్పన జరగకుండా ఏ ప్రాంతమైనా ప్రత్యేక హోదా వచ్చినా అభివృద్ధి చెందదని చెప్పారు.
‘‘మౌలిక వసతుల కల్పన జరిగితే, ప్రత్యేక హోదా లేకున్నా అభివృద్ధి జరుగుతుంది. అందుకు స్పష్టమైన ఉదాహరణ, ఎలాంటి ప్రత్యేక హోదా లేకుండానే శ్రీసిటీ, హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందాయి’’ అని పేర్కొన్నారు.
తుంగభద్ర నీటిని పూర్తిస్థాయిలో రాయలసీమ వాడుకోవాలని, కృష్ణా డెల్టా అవసరాల కోసం రాయలసీమలో ఉన్న నీటిని వాడుకోకుండా కుట్ర జరుగుతోందని అన్నారు.
‘‘ఏ పార్టీ రాయలసీమ సమస్యలను మేనిఫెస్టోలో పెట్టడంలేదు. విభజన చట్టం ప్రకారం, అయిదేళ్లలో కనీసం రూ.10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. మన్నవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. దుగరాజపట్నం పోర్టు కట్టలేదు. దేవున్ని నమ్ముతున్న పార్టీ కనీసం తిరుపతి బాలాజీ డివిజన్ ఎందుకు ఇవ్వలేదు. విశాఖలో ఓట్లు వస్తాయని అక్కడ రైల్వే జోన్ ఇచ్చారు కానీ, బాలాజీ డివిజన్ ఇవ్వలేదు’’ అని చెప్పారు.

రాజేష్, అడ్వొకేట్
వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి? ఎంత ఖర్చు పెట్టారు? అన్న విషయాలను సమాచార హక్కు చట్టం కింద తెలుసుకున్నాను.
కేంద్ర ప్రభుత్వం రూ.1050 కోట్లు ఇస్తే, అందులో సగం డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు.
సీఎం చంద్రబాబు కేంద్రం డబ్బులు ఇవ్వలేదు ఎప్పుడూ ఆరోపిస్తుంటారు, కానీ ఇచ్చిన నిధులనే ఖర్చుపెట్టరు.

ఏమిటీ రంగస్థలం?
రాయలసీమ సమస్యలు, పరిష్కార మార్గాల గురించి తిరుపతిలో మార్చి 25న మొదటి రంగస్థలం జరుగుతుంది. ఆ తరువాత మార్చి 27న ఉత్తరాంధ్ర రాజకీయాలు, సామాజిక స్థితిగతులపై విశాఖపట్నంలో రెండో రంగస్థలం కార్యక్రమాన్ని బీబీసీ తెలుగు నిర్వహిస్తుంది.
అలాగే, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్ళేమిటి, చంద్రబాబు పాలన ఎలా సాగింది, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఎలాంటి విధానాలను అనుసరించాలనే అంశాల గురించి మార్చి 30న అమరావతిలో బీబీసీ తెలుగు - రంగస్థలం కార్యక్రమం ఏర్పాటవుతుంది.
అమరావతిలోనే అదే రోజున రాష్ట్ర మహిళల సమస్యలు, సవాళ్ళ గురించి ప్రత్యేకంగా మహిళా ప్రముఖులతో రంగస్థలం చర్చా కార్యక్రమం జరుగుతంది.
ఈ రోజు (సోమవారం) తిరుపతిలో మొదటి చర్చా వేదిక కాసేపట్లో ప్రారంభమవుతోంది.
రాయలసీమ కరవు - అభివృద్ధి అంశంపై ఇందులో నిపుణులు, నాయకులు, విశ్లేషకులు చర్చిస్తారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
ఈ చర్చా కార్యక్రమాన్ని బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమాన్ని ఇదే పేజీలో లైవ్ ఫీడ్ ద్వారా చూడవచ్చు.
బీబీసీ న్యూస్ తెలుగు సోషల్ మీడియా వేదికలు అంటే ఫేస్ బుక్ పేజీ, యూట్యూబ్ చానెల్లోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

గతంలో తెలంగాణలోనూ..
డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో బీబీసీ తెలుగు రంగస్థలం చర్చాకార్యక్రమాన్ని నిర్వహించింది.
వివిధ పార్టీల నాయకులు డీజీ నర్సింహారావు(సీపీఎం), బూర నర్సయ్యగౌడ్(టీఆర్‌ఎస్), ఇంద్రసేనారెడ్డి(బీజేపీ), రంగారెడ్డి(కాంగ్రెస్), దుర్గాప్రసాద్(టీడీపీ), విద్యాధర్‌రెడ్డి(టీజేఎస్), సామాజిక విశ్లేషకురాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా పాల్గొన్నారు.
తెలంగాణకు సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలపై చర్చించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








