ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ డైరీ: విజయవాడ సమీపంలో రూ. 1.9 కోట్ల నగదు స్వాధీనం

పోలీసులు పట్టుకున్న రూ. 1.9 కోట్ల డబ్బు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలీసులు పట్టుకున్న రూ. 1.9 కోట్ల డబ్బు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో సిమెంట్ బస్తాల లారీలో తరలిస్తున్న రూ.1.9 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు.

లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ప్రవీణ్ కోయా

ఫొటో సోర్స్, Twitter/Praveen Koya

ఫొటో క్యాప్షన్, ప్రవీణ్ కోయా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిని బదిలీ చేసింది.

ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌‌ను బదిలీ చేస్తూ ఈసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనతో పాటు మంగళగిరి, తాడేపల్లి సీఐలనూ బదిలీ చేసింది.

అధికార పార్టీకి కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మార్చి 25న వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ చర్యలు చేపట్టింది

ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇంటెలిజెన్స్‌ డీజీ, కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

line
ఎన్నికల కమిషన్

ఫొటో సోర్స్, www.eci.nic.in

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) శుక్రవారం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈసీ నియమించింది.

ఏసీ పునేఠాకు ఎన్నికల విధులకు సంబంధించిన పోస్టింగ్ ఇవ్వొద్దని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలో ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసు నిఘా విభాగం సారథి ఏబీ వెంకటేశ్వరరావును, కడప ఎస్‌పీ రాహుల్ దేవ్ శర్మను, శ్రీకాకుళం ఎస్‌పీ వెంకటరత్నాన్ని ఈసీ బదిలీ చేసింది.

వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆయన్ను బదిలీ చేసింది. వెంకటేశ్వరరావు స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార విశ్వజిత్‌ను నియమించింది.

రాహుల్ దేశ్ శర్మ, వెంకటరత్నం స్థానాల్లో ఇతర అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది.

line

'అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా': కల్యాణదుర్గం సభలో రాహుల్ గాంధీ

ఈ నెల 31న అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు కురిపించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ రైతుల రుణాలను రెండు రోజుల్లోనే మాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రుణమాఫీ చేశామని చెప్పారు.

మోదీకి సామాన్యుల కష్టాలు పట్టవని.. మోదీ హయాంలో 15 మంది వ్యక్తుల వద్దే సంపదంతా పోగైందని.. రూ.15లక్షల కోట్లను ఆ 15 మంది అనుచరులకే పంచిపెట్టారని ఆరోపించారు.

రోడ్ షోలో చంద్రబాబు

ఫొటో సోర్స్, Facebook/NaraChandrababuNaidu

నాపై ఒకటి, జగన్‌పై 31: చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లా తునిలో టీడీపీ నేత చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికలలో పారదర్శకత అవసరమని.. ఈసారి కనీసం 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించి ఫలితాలు విడుదల చేయాలని సూచించారు.

జగన్‌పై 31 కేసులు ఉన్నాయని.. తనపై ఒకే ఒక్క కేసు ఉందని, బాబ్లీకి వ్యతిరేకంగా పోరాడితే మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసని చెప్పారు.

త్వరలోనే రూ.10వేల కోట్లతో బీసీ బ్యాంకు ప్రారంభిస్తామని చెప్పారు.

జగన్ సభ

ఫొటో సోర్స్, Facebook/YSRCP

కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తా: జగన్

ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి ఓటువేస్తే సర్వం దోచేస్తారని ఆరోపించారు.

ఎన్టీఆర్ 1994లో మద్యపాన నిషేధం హామీతో టీడీపీని అధికారంలోకి తీసుకువస్తే.. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మద్యపాన నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలను ఎత్తేశారన్నారు.

తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ఆదుకుంటామని తెలిపారు.

మైలవరం సభలో పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Janasena

వాడుకున్నారు కానీ అభివృద్ధి చేయలేదు: పవన్ కల్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటివరకు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయే కానీ అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.

జిల్లాలో జనసేనను గెలిపించాలని.. జనసేనను గెలిపించుకోకపోతే భవిష్యత్తులో పోరాటం చేసేవాళ్లు ఉండరని ఆయన అన్నారు.

ఇచ్ఛాపురంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే అశోక్, ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఫొటో సోర్స్, RammohanNaiduKinjarapu

ఫొటో క్యాప్షన్, ఇచ్ఛాపురంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే అశోక్, ఎంపీ రామ్మోహన్ నాయుడు

30 మార్చి 2019:

రాష్ట్రానికి ఒక చివర్లో ఉన్న తన నియోజకవర్గం కుప్పం నుంచి ఈ చివరన ఇచ్ఛాపురం వరకు మొత్తం తమదేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీకాకుళం అంటే వలసల జిల్లా అన్న పేరు తొలగిపోయేలా చేసి ఇతర జిల్లాల నుంచి ఇక్కడ ప్రజలు ఉపాధి కోసం వచ్చేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఉద్దానంలో కిడ్నీ రోగులకు డయాలసిస్‌ చేయిస్తున్నామని.. వారికి పింఛను ఇచ్చి ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాంతంలో కిడ్నీ రోగుల కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తిత్లీ తుపాను పరిహారం ఇంకా అందని బాధిత రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మత్స్యకారులకు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేసే బాధ్యత తమదని చెప్పారు. జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి 24 సార్లు వచ్చిన జగన్‌.. కోర్టుకు మాత్రం 248 సార్లు వెళ్లారని విమర్శలు కురిపించారు.

జగన్

ఫొటో సోర్స్, facebook/YSJaganmohanreddy

అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా: జగన్

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చెప్పారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఒకరని.. అదేసమయంలో ఇక్కడి రైతు మాత్రం దేశంలోనే అత్యంత పేదవాడిగానే మిగిలిపోయాడని అన్నారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన జాబు రావాలంటే బాబు పోవాల్సిందేననన్నారు.

డిగ్రీలు పూర్తయిన యువతకు ఉద్యోగం లేక వలస పోతున్నారని, కనీసం వారిలో అందరికీ నిరుద్యోగ భృతి అందడం లేదని విమర్శించారు.

'మీ భవిష్యత్తు నా భరోసా' అంటూ బాబు మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. తన కొడుకు లోకేశ్‌కు మాత్రం ఎమ్మెల్సీ ఉద్యోగమిచ్చి ఆదుకున్నారని.. ఆ తర్వాత మంత్రిగా ప్రమోషన్‌ ఇచ్చారని జగన్‌ విమర్శించారు.

. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం తెరుస్తా. ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీరుగా తీసుకుంటాం. వారికి నెలకు రూ.5 వేలు జీతం ఇస్తాం. ఆ 50 ఇళ్లకు ప్రభుత్వం తరఫున ఏది కావాల్సి వచ్చినా ఆ గ్రామ వలంటీరే తీరుస్తాడు. ప్రతిదీ డోర్‌ డెలివరీ చేస్తాడు. కుల, మత, పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తాం'' అని జగన్‌ హామీలిచ్చారు.

పవన్

ఫొటో సోర్స్, janasena

29 మార్చి 2019:

కర్నూలు జిల్లా నంద్యాలలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పాల్గొన్న బహిరంగ సభలో శుక్రవారం ప్రమాదం జరిగింది..

ఈ ప్రమాదంలో సిరాజ్‌ (30) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సిరాజ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడని స్థానికులు తెలిపారు.

సభకు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారని.. స్పీకర్ల కోసం ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలు జారిపడడంతో అభిమానులు ఒకరిపై ఒకరు పడిపోయారని.. ఈ ప్రమాదంలో సిరాజ్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సిరాజ్‌ను వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

జగన్

ఫొటో సోర్స్, YSRCP

చంద్రబాబుకు నచ్చిన సినిమాయే చూడాలా?: జగన్

చం‍ద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే వారికి నచ్చిన సినిమాలే జనం చూడాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పుత్తూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకు సంబంధించిన మహానాయకుడు సినిమాయే చూడాలంట.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చూడకూడద. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపాలని కోర్టులకు వెళుతున్నారు. మరోసారి బాబు అధికారంలోకి వస్తే వాళ్లకు నచ్చిన సినిమాలనే చూడాలి. ఆయనను వ్యతిరేకించిన వారిని బతకనివ్వరు. చం‍ద్రబాబు వస్తే మన భూములు, ఇళ్లు ఉండవు' అని ఆరోపించారు.

ఏబీ వెంకటేశ్వరరావు

ఫొటో సోర్స్, facebook

హైకోర్టు తీర్పుతో ఏపీ ఇంటిలిజెన్స్ డీజీ బదిలీ

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఐబీ చీఫ్‌తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఈసీ తీరును తప్పుపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధులతో ఐబీ చీఫ్‌కు సంబంధం లేదని చెబుతూ ఆయన బదిలీని నిలుపుదల చేసింది.

ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించింది. కానీ, హైకోర్టు శుక్రవారం.. ఐపీఎస్‌ బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. దీంతో వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది.

జనసేన

ఫొటో సోర్స్, janasena

28 మార్చి 2019

‘‘తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైకిల్ చైన్ తెంపేశారు. ఫ్యాన్ వేద్దాం అంటే ప‌వ‌ర్ జ‌న‌సేన ద‌గ్గ‌ర ఉంది. గాజు గ్లాస్ ఒక్క‌టే దూసుకుపోతుంది’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లిలో నిర్వహించిన బ‌హిరంగ స‌భలో పవన్ మాట్లాడుతూ.. ''రాయ‌ల‌సీమ అంటే రౌడీయిజం, ఫ్యాక్ష‌నిజం చేస్తార‌నే చెడ్డ‌పేరు తెచ్చారు ఇక్క‌డి నాయ‌కులు. రాయ‌ల‌సీమ అంటే చ‌దువుల నేల‌. అన్న‌మ‌య్య‌, వెంగ‌మాంబ తిర‌గాడిన నేల‌. ర‌వీంద్ర‌నాధ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని ర‌చించిన నేల‌. రాయ‌ల‌సీమ నుంచి చాలామంది ముఖ్య‌మంత్రులు వ‌చ్చారు. ఏ ఒక్క‌రు కూడా సీమ‌ అభివృద్ధిని ప‌ట్టించుకోలేదు. ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా రాయ‌ల‌సీమ‌కు అండ‌గా నిల‌బ‌డుతాం. మ‌ద‌న‌ప‌ల్లిలో భూ క‌బ్జాలు ఎక్కువయ్యాయి. దేశానికి సేవ చేసిన సైనికుల భూముల‌ను కూడా ఇక్క‌డి నాయ‌కులు ఆక్ర‌మించుకున్నారు. జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌చ్చిన నెల‌రోజుల్లో భూఆక్ర‌మ‌ణ దారుల చెర నుంచి సైనికుల భూములు విడిపిస్తాం.’’ అని హామీ ఇచ్చారు.

‘‘వైఎస్ఆర్ సీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య టీఆర్ఎస్ సంధి చేసింద‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కొన్ని రోజులు నన్ను తిట్టారు. ప‌వ‌న్ , చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ అంటూ వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టికీ తిడుతూనే ఉన్నారు. నేను వాళ్లంద‌రికి ఒక‌టే చెప్ప‌ద‌లుచుకున్నాను. నేను పొలిటిక‌ల్ పార్టీల‌కు పార్ట‌న‌ర్ కాదు, ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే పార్ట‌న‌ర్ ని. తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన స‌పోర్టు చేస్తుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీకి స‌పోర్టు చేయాలంటే మ‌గాడిలా స‌పోర్టు చేస్తాను. 2014లో స‌పోర్టు చేస్తున్నాన‌ని చెప్పాను, చేశాను. 2019లో టీడీపీతో పొత్తు లేద‌ని చెప్పాను, బీఎస్పీ, వామ‌ప‌క్షాల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తున్నాం’’ అని తెలిపారు.

జగన్ సభ

ఫొటో సోర్స్, fb/ysrcpofficial

అందుకే నామీద 22 కేసులు- జగన్

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినందుకు తనపై చంద్రబాబు 22 కేసులు పెట్టించారని వైసీపీ అధ్యక్షులు జగన్‌ ఆరోపించారు.

రాజధాని భూముల విషయంలో అక్కడి రైతులకు అండగా వెళ్తే 8 కేసులు, హోదా కోసం ధర్నా చేస్తే 4 కేసులు పెట్టించారన్నారు. పవన్ కల్యాణ్ మీద మాత్రం ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శించారు.

పేదలకు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లపై ఉన్న రుణం మొత్తాన్ని మాఫీ చేస్తామని జగన్ ప్రకటించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని తాము అధికారంలోకి రాగానే అందరినీ ఆదుకుంటామన్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చే బాధ్యత తనదేనన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, fb/tdp.ncbn.official

ఈసీకి చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయడంపై ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. బదిలీలకు కారణాలు కూడా వెల్లడించకపోవడం సరికాదన్నారు.

ఎన్నికల విధుల పరిధిలోకి రాని ఇంటెలిజెన్స్ డీజీని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు.

మరోవైపు, ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఈసీ పరిధిలోకి రాదని పేర్కొంది.

ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

నారాలోకేశ్

ఫొటో సోర్స్, fb/naralokesh

కేసీఆర్ ఫోన్‌లో బెదిరిస్తున్నారు

టీడీపీ అభ్యర్థులకు టీఆర్ఎస్ నేత కేటీఆర్‌ ఫోన్ చేసి భయపెడుతున్నారని నారా లోకేష్ అన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజల ఒంటి మీద బంగారం కూడా వదలరని లోకేష్ విమర్శించారు.

జిల్లాలోని దేవరాపల్లిలో మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఆంధ్రాలో తప్ప ఎక్కడా రూ.2,000 పింఛను ఇవ్వడం లేదన్నారు. టీడీపీని గెలిపిస్తే దేశ భావి ప్రధానమంత్రి ఎవరో చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని లోకేష్ చెప్పారు.

విశాఖపట్నం జిల్లాలో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కుటుంబరావు

ఫొటో సోర్స్, Eenadu

ఫొటో క్యాప్షన్, కుటుంబరావు

ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా రూ.15 లక్షలిస్తా

రాష్ట్రంలో భాజపా అభ్యర్థుల్లో ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచినా రూ.15 లక్షలు ఇస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు అన్నారు.

ఆ పార్టీ అభ్యర్థులు ఎంపీగా డిపాజిట్‌ తెచ్చుకుంటే రూ.5 లక్షలు ఇస్తానన్నారు.

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ విసిరిన సవాల్‌కు తాము సిద్ధమని

26-03-2019

నారాలోకేశ్

ఫొటో సోర్స్, TDP

మంగళగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్న నారా లోకేశ్ నామినేషన్‌పై రిటర్నింగ్‌ అధికారి అభ్యంతరం వ్యక్తంచేశారు.

నామినేషన్ సమయంలో సమర్పించిన ఒక నోటరీ చెల్లదని, అది కృష్ణా జిల్లా నోటరీ అని, నోటరీ చట్టంలోని సెక్షన్‌ 9 ప్రకారం పొరుగు జిల్లాలో అది చెల్లుబాటు కాదని.. ఆ కారణంగా నామినేషన్‌ను ఆమోదించలేమని అధికారులు తెలిపారు.

అదనపు పత్రాలు సమర్పించడానికి 24 గంటల సమయం ఇచ్చారు. అయితే తర్వాత స్థానిక చిరునామాతో నోటరీ సమర్పించడంతో లోకేశ్ నామినేషన్‌ను ఆమోదించారు.

మరోవైపు రాయదుర్గం, పోలవరం, తిరుపతి సీట్లలో కూడా టీడీపీ అభ్యర్ధుల నామినేషన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

మంగళగిరిలో వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు.

పయ్యావుల కేశవ్

ఫొటో సోర్స్, facebook/PayyavulaKesav

ఎన్నికల ప్రచారంలో నేతలు ఎండ వేడికి తాళలేకపోతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ మంగళవారం వడదెబ్బకు లోనయ్యారు.

ఉరవకొండలో చేనేత కార్మికులతో సమావేశమైన ఆయన వారితో మాట్లాడుతూ వడదెబ్బకు గురయ్యారు. ఆయన వెంట ఉన్న నాయకులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స అందించారు.

మోహన్ బాబును పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్

ఫొటో సోర్స్, YSRCP

నటుడు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు.

తనకు పదవులపై వ్యామోహం లేదని, 15 ఏళ్ల క్రితమే తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని చెప్పారు.

జగన్‌ ఏపీలో అధికారంలోకి వస్తారని.. ఆయనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు వందేళ్లు సంతోషంగా బతకాలని కోరుకుంటున్నానని, కానీ ఎన్నికల్లో ఓడిపోవాలని ఆశిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.

పాల్

ఫొటో సోర్స్, facebook/DrKAPaul

25 మార్చి 2019

తన నామినేషన్‌ పత్రాలను తీసుకునేందుకు రిటర్నింగ్‌ అధికారి నిరాకరించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లగా, అప్పటికే ఆలస్యమైందని అధికారులు అన్నారని పాల్ వెల్లడించారు.

తన తరఫున ఒక ప్రతినిధి అన్ని పత్రాలతో మధ్యాహ్నం 2.40 గంటలకే ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లారని, తర్వాత కొద్దిసేపటికే తాను అక్కడికి చేరుకున్నప్పటికీ... అప్పటికే సమయం అయిపోయిందని అధికారి చెప్పారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

నర్సాపురం పార్లమెంటు స్థానంలో విజయం సాధించిన ఏడాదిలోనే నర్సాపురాన్ని నార్త్‌ అమెరికాలా మార్చేస్తాన్నారు.

జగన్

ఫొటో సోర్స్, fb/ysrcpofficial

ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతిస్తే మీకేంటి అభ్యంతరం?

కేసీఆర్‌తో వైసీపీ పొత్తు పెట్టుకుందంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ అధ్యక్షులు జగన్ తోసిపుచ్చారు. కేసీఆర్ మద్దతిస్తుంది మాకా? ప్రత్యేక హోదాకా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే.. చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరం? అని జగన్ ప్రశ్నించారు.

టీఆర్ఎస్‌తో పొత్తు కోసం కేటీఆర్‌తో చంద్రబాబు మంతనాలు జరపలేదా? అని జగన్ ప్రశ్నించారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుదని విమర్శించారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారన్నారు.

చంద్రబాబు తన రాజకీయ లాభం కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టి, హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

చిత్తూరులో ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొన్నారు.

నారా లోకేశ్

ఫొటో సోర్స్, fb/naralokesh

ఫొటో క్యాప్షన్, ప్రచారంలో భాగంగా

మంగళగిరిలో లోకేశ్ ఇలా

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకొస్తామన్నారు.

మంగళగిరిలో టెక్స్ టైల్ శిక్షణ కేంద్రం, మార్కెటింగ్ కోసం షాపింగ్ కాంప్లెక్సు ఏర్పాటు చేస్తామన్నారు.

నామినేషన్ల ప్రక్రియ పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో 3 గంటలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. రాష్ట్రంలో 24వ తేదీ వరకు రూ. 55 కోట్ల నగదు, 91 కిలోల బంగారం 230 కిలోల వెండి, 120 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రూ. 12 కోట్ల విలువ చేసే 2.5 లక్షల లీటర్ల మద్యం, రూ. 6 కోట్ల విలువ చేసే వివిధ రకాల వస్తువులను పట్టివేశామన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పార్టీలకు నోటీసులు ఇచ్చామన్నారు.

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 795 నామినేషన్లు

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గడువు ముగిసేనాటికి మొత్తం 795 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

మరోవైపు తెలంగాణలోని 34,667 పోలింగ్ కేంద్రాల్లో 6,394 సమస్యాత్మక కేంద్రాలున్నాయని అన్ని చోట్లా గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నామని అడిషనల్ డీజీ జితేంద్ర వెల్లడించారు.

మొత్తం 48,058 మంది పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు.

ఇప్పటివరకు రూ.7 ,22 ,75,156 నగదు స్వాధీనం చేసుకున్నామని.. 14 వేల లీటర్ల మద్యం సీజ్ చేశామని చెప్పారు.

కేఏ పాల్

ఫొటో సోర్స్, fb/DrKAPaulOfficial

తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోనే ఆంధ్రాను అమెరికాలా తయారు చేస్తానని కేఏ పాల్‌ అన్నారు.

ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టోను ఆదివారం ఆయన విడుదల చేశారు.

రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు, ఆటోవాలాల రుణాలన్నింటీనా మాఫీ చేస్తామని చెప్పారు.

తమ పార్టీ పార్టీ అభ్యర్థి గెలిచిన ప్రతి నియోజకవర్గంలోనూ రూ.100 కోట్లతో ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు.

విజయవాడ నగరాన్ని రెండుమూడేళ్లలోనే హైదరాబాద్‌లా తీర్చిదిద్దుతామన్నారు.

టీడీపీ, వైసీపీలకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని కేఏ పాల్ చెప్పారు.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, fb/janasenaparty

సీఎంగా ప్రమాణం చేసేది నేనే- పవన్‌ కల్యాణ్

ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేది తానేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

విజయవాడలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన... తాము అధికారంలోకి వచ్చాక విజయవాడలో గూండాల తాట తీస్తామన్నారు.

ప్రత్యేక హోదా గురించి ధైర్యంగా మాట్లాడిన ఏకైక పార్టీ తమదేన్నారు.

గట్టుకు ఒకవైపున వైకాపా, తెదేపా, మరోవైపున జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమి ఉందని... ప్రజలు ఏ గట్టున ఉండాలో తేల్చుకోవాలన్నారు.

ఇంకా ఎన్నేళ్లు తాను మీ పల్లకీలు మోయాలని చంద్రబాబును ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, వైసీపీల మధ్య అంతర్గతం అవగాహన ఉండటం వల్లే వైసీపీ తెలంగాణలో పోటీ చేయలేదని పవన్ ఆరోపించారు.

ఒకే సిద్ధాంతానికి కట్టుబడి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్‌ అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. కానీ, రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు, స్నేహాలు వేరన్నారు.

జగన్

ఫొటో సోర్స్, fb/ysrcpofficial

టీడీపీ, జనసేనలది ముసుగు పొత్తు: జగన్

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రసంగించారు.

టీడీపీ, జనసేనల మధ్య రహస్య పొత్తు ఉందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్ యాక్టర్‌ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు సూచనల మేరకే పవన్ టికెట్లు ఇస్తున్నారని, ముసుగు కప్పుకుని టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తన పార్టీకి కూడా డిపాజిట్లు రావని తెలిసి టీడీపీ, జనసేనలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయని జగన్ అన్నారు.

ఐదేళ్లలో అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసి, తాను చేసిన అభివృద్ధి ఎంటో చెప్పకుండా, చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.

డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేసి ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో వారిని మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారన్నారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, fb/TDP.Official

రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా మార్చేస్తా: చంద్రబాబు

రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా మార్చే బాధ్యత తనదేని చంద్రబాబు అన్నారు.

కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రాన్ని జగన్‌ ఉన్మాదం పట్టి పీడిస్తోందన్నారు.

తెరాసతో పొత్తు పెట్టుకొని, పుట్టిన గడ్డకే జగన్‌ నమ్మక ద్రోహం చేస్తున్నారని విమ్శించారు. టీఆర్ఎస్‌తోనే తమకు పోటీ అని, వైసీపీతో కాదన్నారు.

గీత

24.03.2019

నామినేషన్లకు రెండు రోజుల విరామం.. ముఖ్య నేతల సుడిగాలి ప్రచారం

పాలకొల్లులో చంద్రబాబు సభకు హాజరైన యువతి

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, పాలకొల్లులో చంద్రబాబు సభకు హాజరైన యువతి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు తుది గడువు మార్చి 25 కాగా.. అంతకుముందు రెండు రోజులు శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో నామినేషన్ల స్వీకరణకు విరామమేర్పడింది.

దీంతో నామినేషన్ల దాఖలుకు సోమవారం (మార్చి 25) ఒక్క రోజే మిగిలి ఉంది.

మరోవైపు ప్రధాన పార్టీల ముఖ్య నేతలంతా తమ ప్రచార వేగాన్ని పెంచారు. శనివారం వరుస బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు కురిపించారు. తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకొచ్చారు.

కేఎఫ్‌సీ స్థాయిలో అన్న క్యాంటీన్లు: రేపల్లె సభలో చంద్రబాబు

గుంటూరు జిల్లా రేపల్లె, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 48 పేజీలతో జగన్‌ ఎన్నికల అఫిడవిట్‌ దాఖలు చేశారని చెప్పారు. "జగన్ అఫిడవిట్‌లోని 20 పేజీల్లో నేర చరిత్ర, మరో 20 పేజీల్లో ఆర్థిక నేరాలు ఉన్నాయి. 31 కేసులున్న వ్యక్తి జగన్'' అంటూ విపక్ష నేతపై విమర్శలు కురిపించారు.

రూ.24,500 కోట్ల రైతు రుణమాఫీ చేశామని, వ్యవసాయంలో 11శాతం వృద్ధి సాధించామని, డ్రైవర్ల కోసం సాధికార సంస్థ ఏర్పాటు చేశామని, కేఎఫ్‌సీ స్థాయిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు భోజనం అందిస్తున్నామంటూ తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకొచ్చారు.

సభలో జగన్

ఫొటో సోర్స్, YSRCP

నేను విన్నాను.. నేనున్నాను: పిఠాపురం సభలో జగన్

వైసీపీ అధినేత జగన్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, శ్రీకాకుళం జిల్లా పలాస, పలు ఇతర ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే రైతు కమిటీ వేసి.. కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేస్తామనిహామీ ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలను కల్పిస్తామన్నారు.

''రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. ప్రతి రైతన్నకు హామీ ఇస్తున్నా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రైతు కమిటీ వేస్తాం. రైతు ముఖాల్లో చిరునవ్వులు వచ్చేలా కమిటీ సిఫారసు చేసిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాం.

నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావారు అందరికీ నేనున్నాను'' అని చెప్పారు.

వైసీపీని గెలిపిస్తే కేసీఆర్‌ను గెలిపించినట్లే: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నూజివీడు, మైల‌వ‌రం, విజయవాడ తదితర చోట్ల శనివారం ప్రచార సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ''ఏపీలో ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బ తింటుంది'' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

తాను జగన్‌లా కేసీఆర్‌ కనుసన్నల్లో నడిచే రకాన్ని కాదని.. యువత జనసేన వైపే ఉందని పవన్‌ చెప్పారు. తెలంగాణ సీఎం కెసిఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలంటే వచ్చి ఏపీలో పోటీ చేయాలని సూచించారు. వైసీపీ గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

వేలు

ఫొటో సోర్స్, facebook/INCTelangana

ఏపీలోని ఫారం-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవి: ఎలక్షన్ కమిషన్

ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు కోరుతూ ఇటీవల దాఖలైన ఫారం-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓట్లను తొలగించాల్సిందిగా తమకు 9.5 లక్షల దరఖాస్తులు అందగా, వాటిలో కేవలం 1.41 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని స్పష్టం చేసింది. జిల్లాల వారీగా ఆ వివరాలు ప్రకటించింది.

శ్రీకాకుళం: 2,579

విజయనగరం: 5,166

విశాఖపట్నం: 2,407

పశ్చిమ గోదావరి: 8,669

ప్రకాశం: 6,040

నెల్లూరు: 3,850

కడప: 5,292

కర్నూలు: 7,684

అనంతపురం: 6,516

గుంటూరు: 35,063

తూర్పుగోదావరి: 24,190

కృష్ణా: 19,774

చిత్తూరు: 14,052

గీత

మార్చి 22, 2019:

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం మొదలైన తరువాత గురు, శుక్రవారాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు ముందే నిర్ణయించుకున్న ముహూర్తాల ప్రకారం నామినేషన్లు వేశారు.

కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించారు.

భీమవరంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Janasena

ఫొటో క్యాప్షన్, భీమవరంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే ఆయన విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ వేశారు.

తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

కుటుంబసభ్యులతో నారా లోకేశ్

ఫొటో సోర్స్, facebook/NaraLokesh

ఫొటో క్యాప్షన్, నామినేషన్‌కు ముందు తల్లిదండ్రులతో నారా లోకేశ్

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ పడుతున్న నారా లోకేశ్ కూడా శుక్రవారమే తన నామినేషన్ దాఖలు చేశారు.

శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి సిటింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా శివరామరాజు, బీజేపీ అభ్యర్థిగా పైడికొండల మాణిక్యాలరావు శుక్రవారం నామినేషన్లు వేశారు.

కార్యకర్తలు వెంటరాగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న రామ్మోహన్ నాయుడు

ఫొటో సోర్స్, RammohanNaidu

ఫొటో క్యాప్షన్, కార్యకర్తలు వెంటరాగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు, అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్, ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఏలూరు సాంబశివరావు, చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ అభ్యర్థిగా అశోక్ రెడ్డి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించారు.

రాజానగరం టీడీపీ అభ్యర్థిగా పెందుర్తి వెంకటేష్‌, గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా జితేంద్రగౌడ్, చిత్తూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఏఎస్ మనోహర్, తెనాలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఆలపాటి రాజా, కర్నూలు జిల్లాలో ఆదోని టీడీపీ అభ్యర్థిగా కె మీనాక్షి నాయుడు, మంత్రాలయం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పాలకుర్తి తిక్కారెడ్డి, బనగానపల్లె టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్ధన్ రెడ్డి నామినేషన్లు వేశారు.

వీరే కాకుండా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలకు చెందిన పలువురు అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు కూడా శుక్రవారం నామినేషన్లు వేశారు.

గాయపడిన తిక్కారెడ్డి

ఫొటో సోర్స్, facebook/ThikkareddyPalakurthi

ఫొటో క్యాప్షన్, గాయపడిన తిక్కారెడ్డి

అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్

కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ వేశారు. రిటర్నింగ్ అధికారికి ఆయన స్ట్రెచర్‌పైనుంచే నామినేషన్ల పత్రాలను సమర్పించారు.

ఇటీవల ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో ఖగ్గల్లులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగగా.. గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపినప్పుడు పొరపాటున ఓ బుల్లెట్ తిక్కారెడ్డి కాలికే తగిలింది.

దాంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అంబులెన్సులో వచ్చి ఇలా నామినేషన్ వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మార్చి