ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: టికెట్ల కోసం నేతల జంపింగ్‌లు

ఫొటో సోర్స్, fb/KOTLA YOUTH
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. దాంతో, తమకు నచ్చిన చోట టికెట్ దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు.
టికెట్ల కోసం ఆయా పార్టీల అధినాయకత్వం దగ్గర నాయకులు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు.
ఫలానా పార్టీలో ఉంటే ఫలితాలు ప్రతికూలంగా వస్తాయన్న అనుమానం.. లేదంటే ఆశించిన చోట టికెట్ దొరక్కపోవడం.. తమకు గిట్టని వారికి టికెట్ ఇచ్చారన్న అసంతృప్తి వంటి కారణాలతో వెంటనే నేతలు మరో పార్టీలోకి జారుకుంటున్నారు.
గత కొద్ది రోజులుగా పార్టీలు మారుతున్నవారితో పాటు, కొత్తవారి చేరికలు కూడా ఊపందుకున్నాయి. దాంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.
గంటల వ్యవధిలోనే నేతల చేరడాలు, బయటకు వెళ్లిపోవడాలు జరిగిపోతున్నాయి.
దాంతో, క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల చూస్తే ఉదయం ఒక పార్టీ కండువాతో తిరిగిన కార్యకర్తలే... సాయంత్రం మరో పార్టీ జెండాలతో దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, ysjagan/FB
ఇటీవల పార్టీలు మారిన నేతల వివరాలు...
వైసీపీలోకి:

ఫొటో సోర్స్, naralokesh/FB
ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరినవారు:

ఫొటో సోర్స్, YSRCP/ALI
తాజాగా వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఈ నెల 11న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అలీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అయితే, అంతకుముందు కొన్నిరోజుల క్రితమే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లనూ కలిశారు.
దాంతో, లలితా జ్యూవెలరీ వాణిజ్య ప్రకటనను అలీ బాగా ఫాలో అయ్యారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.
ఆ జోకు ఇలా ఉంది.
’’లలితా జ్యూవెలరీ యజమాని చెప్పింది ఎవరైనా ఫాలో అయ్యారో లేదో తెలియదు. కానీ... నటుడు అలీ మాత్రం బాగా ఫాలో అయ్యారు. టీడీపీ, జనసేన, వైసీపీ.. మూడు పార్టీలకు వెళ్లి చూసి ఫొటో తీసుకుని ఎస్టిమేషన్ వేసుకొని వైసీపీలో చేరారు. నటన ఊరికే రాదు!’’
అయితే, తనకు టీడీపీ భరోసా ఇవ్వలేదని, జగన్ మాత్రం తన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటానని హామీ ఇచ్చారని అలీ చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ప్రచారం మాత్రమే చేస్తానని తెలిపారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తన ఆశ అన్నారు.

ఫొటో సోర్స్, Whatsapp
'ఆయా రాం గయా రాం': ఒకేరోజు 3 పార్టీలు
ఎన్నికలు సమీపించే సమయంలో కొన్ని గంటల వ్యవధిలోనే రెండు మూడు పార్టీల కండువాలు మార్చేందుకు కూడా నేతలు వెనకాడరు. ఒకపార్టీలో చేరి అందులో టికెట్ రాకపోతే గంటల వ్యవధిలోనే మరో పార్టీలో చేరడాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.
అలా నాయకులు పదేపదే పార్టీల కండువాలు మారుస్తున్నప్పుడు 'ఆయా రాం గయా రాం'అనే మాట వాడుతుంటారు. 1967లో హరియాణాకు చెందిన గయా లాల్ అనే ఎమ్మెల్యే దీనికి ఆద్యుడిగా చెబుతారు. ఆయన ఒకే రోజులో మూడుసార్లు పార్టీ మారారు.

ఫొటో సోర్స్, FACEBOOK/mynampallyh
36 గంటల్లో 3 పార్టీలు
2014 ఎన్నికల సమయంలో మైనంపల్లి హన్మంతరావు 36 గంటల వ్యవధిలోనే మూడు పార్టీల కండువాలు కప్పుకున్నారు.
అప్పుడు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన ఆశించారు. కానీ టీడీపీ- బీజేపీ పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి కేటాయించారు.
దాంతో, 2014 ఏప్రిల్ 6న టీడీపీలో ఉన్న ఆయన, ఆ మరుసటి రోజు ఉదయం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. అదేరోజు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హన్మంతరావు పేరు కనిపించలేదు. దాంతో, మరుసటి రోజు టీఆర్‌ఎస్‌లో చేరి అదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు టికెట్ సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, BJP4Telangana/fb
ఉదయం బీజేపీలో.. సాయంత్రం కాంగ్రెస్‌లో
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక అనూహ్య పరిణామం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి అక్టోబర్ 11న ఉదయం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమె చేరికపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగానే.. అదేరోజు సాయంత్రం మళ్లీ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పద్మినీరెడ్డి బీజేపీని వీడి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
ఇవన్నీ డబ్బు రాజకీయాలు
ప్రస్తుతం పార్టీలన్నీ బయటకు ఆదర్శాలు, సిద్ధాంతాల గురించి మాట్లాడుతాయి కానీ, అన్నీ డబ్బుతో రాజకీయాలు చేసేవేనని సీనియర్ జర్నలిస్టు డానీ అభిప్రాయపడ్డారు.
"సిద్ధాంతాలు, ఆదర్శాలు ఆధారంగా రాజకీయాలు సాగే కాలం ఒకటి వుండేది. పార్టీ ఓడినా గెలిచినా అభిమానులు వాటినే నమ్ముకుని వుండేవారు. ఎన్నికల ఖర్చుకూడా పెద్దగా వుండేదికాదు.
అది గతించింది. అప్పట్లో పోటీదార్లు ఇద్దరూ మంచివాళ్ళే. గుడ్ వెర్సస్ గుడ్. ఆ తరువాత గుడ్ వెర్సస్ బ్యాడ్ రాజకీయాలు వచ్చాయి. అవి పోయి బ్యాడ్ వెర్సస్ బ్యాడ్ రాజకీయాలు వచ్చాయి. ఇప్పుడు దొంగ వర్సెస్ గజదొంగ (బ్యాడ్ వర్సెస్ వర్స్) రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయం కార్పొరేటీకరణ చెందింది. అభ్యర్ధులు టికెట్లు కొనుక్కుంటున్నారు. ఎమ్మెల్యే ఆశావహులు 10 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ టికెట్టు కోనుక్కోవాలి. 20 కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొనుక్కోవాలి. ఎంపీ ఆశావహులు 30 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ టికెట్టు కోనుక్కోవాలి. 35 కోట్ల రూపాయలు ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఇంకో 35 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం సాగించాలి. వెరసి వంద కోట్ల రూపాయలు వెదజల్లాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్నది ఇదే. కార్పొరేట్ సంస్థలు తమ వనరుల్ని, వాణిజ్యాన్నీ కాపాడుకోవడానికి రాజకీయం గొప్ప కవచం అని భావిస్తున్నాయి. అంచేత చట్ట సభల్లోకి వెళ్లడం వారికి తప్పనిసరిగా మారింది. ఎక్కడ టికెట్టు దొరికితే అక్కడికి పోతున్నారు. సినిమా చూడాలని అనుకున్నాక ఏ థియేటరులో చూస్తే ఏమిటీ? చట్ట సభల్లోకి వెళ్లాలని తీర్మానించుకున్నాక ఏ పార్టీ అయితే ఏమిటీ? అంచేత పార్టీలు మారడం అతి సహజమైన వ్యవహారంగా మారిపోయింది. కార్పొరేట్ రాజకీయాల గురించి అవగాహన లేనివాళ్లు మాత్రం చాలా ఆశ్చర్యపోతున్నారు. టిక్కెట్టు అంటే అమ్మే వస్తువేగా. అది సరుకేగా!" అని డానీ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










