ఫేస్‌బుక్‌లో ప్రకటనలకు టీడీపీ, వైసీపీ ఎంత ఖర్చు చేస్తున్నాయి?

ఫొటో సోర్స్, facebook/NaraChandrababuNaidu/YSJaganmohanReddy
- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పలు మార్గాలు అన్వేషిస్తాయి. అందులో ప్రచార పర్వంలో పలు పద్ధతులు అనుసరించి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతున్న రీత్యా ఆ వేదికల మీద కూడా పెద్ద మొత్తంలో వెచ్చించి, ప్రచార కార్యకలాపాలు సాగించేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
తెలుగులో కూడా నెటిజన్ల సంఖ్య అమాంతంగా పెరగడం, డేటా వినియోగం విస్తృతం కావడంతో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీల దృష్టి సోషల్ మీడియాపై పడింది.
2019 ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారానికి ఆంధప్రదేశ్‌లోని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు పోటీ పడుతున్నాయి. ప్రధానంగా ఫేస్ బుక్ కేంద్రంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు రెండు పార్టీలు ముమ్మరం చేశాయి.
యాడ్ లైబ్రరీ రిపోర్ట్ అందించిన వివరాలు గమనిస్తే ఈ రెండు పార్టీలు ఫేస్‌బుక్‌లో ప్రచారానికి భారీగానే ఖర్చు చేస్తున్నాయని తెలుస్తుంది.

ఫొటో సోర్స్, facebook
ఏమిటీ యాడ్ లైబ్రరీ రిపోర్ట్
ఫేస్‌బుక్‌లో తమ పేజీలను ప్రమోట్ చేసుకునే వినియోగదారుల వివరాలను ఆ సంస్థ యాడ్ లైబ్రరీ పేరుతో ఒక రిపోర్టులో వెలువరిస్తోంది. దీనిలో శోధించి వివిధ సంస్థలు, వ్యక్తులు ఫేస్‌బుక్‌లో ప్రచారానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవచ్చు.
యాడ్ లైబ్రరీ రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్‌లో ప్రచారానికి ఖర్చు చేసినవారిలో ఏపీలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే టాప్ 50లో నిలిచారు.
గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు వివిధ సంస్థలు, వ్యక్తులు చేసిన వ్యయంపై యాడ్ లైబ్రరీ రిపోర్ట్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2,501 మంది తమ విధానాలు, వివిధ పోస్టుల ప్రచారం కోసం కోట్ల రూపాయిలు వ్యయం చేశారు.
ఈ రిపోర్ట్ ప్రకారం.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 27వ స్థానంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 44వ స్థానంలో నిలిచారు. ఈ కాలంలో జగన్.. లక్షా 79 వేల 682 రూపాయలు, చంద్రబాబు 90 వేల 975 రూపాయలు ఖర్చు చేశారు.
వీరిద్దరితో పాటుగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలువురు నేతలున్నారు. వైసీపీ రాజకీయ సలహాదారుడిగా చేసిన ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) కూడా ఆ పార్టీ ప్రచార కార్యక్రమం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది.

ఫొటో సోర్స్, facebook
వైసీపీ డిజిటల్ ప్రచారం కోసం రూ.53,392లు ఖర్చు చేశారు. భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.50,061 లు వ్యయం చేయగా, తెలుగుదేశం పార్టీ రూ. 35,867 వెచ్చించింది.
టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో నినాదంగా చెబుతున్న ‘మళ్లీ నువ్వే రావాలి’ ఫేస్‌బుక్ పేజీ ప్రచారం కోసం పెద్ద మొత్తంలో యాడ్స్ ఇవ్వగా, వైసీపీ తరుపున ‘జగనన్నకి తోడు’గా ప్రచారం కోసం భారీగా ఖర్చు చేశారు.
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తన ఫేస్‌బుక్ పేజీ ప్రచారానికి రూ. 39,288, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి రూ. 34, 051 ఖర్చు చేసినట్లు రిపోర్ట్‌లో ఉంది.
ఈ జాబితాలో బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి నల్లమిల్లి శేషారెడ్డి వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, facebook
‘ప్రచారంలో ఇవన్నీ సాధారణమే’
వైసీపీ తరుపున ప్రచారం నిర్వహిస్తున్న ఐ ప్యాక్ ప్రతినిధి బ్రహ్మ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ ఇది సాధారణమైన విషయమేనని అన్నారు. దాదాపుగా అందరూ ఇలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారని చెప్పారు.
టీడీపీ ప్రచార కార్యక్రమాలకు పోటీగా తాము కూడా కొన్ని పోస్టులను ప్రమోషన్ కోసం ప్రయత్నించామన్నారు. ‘‘గతంలో ఆర్గానిక్ రీచ్ ఉండేది. కానీ, ఫిబ్రవరిలో ప్రచారానికి కొంత మొత్తం వ్యయం చేశాం’’ అని తెలిపారు.
ఇదే విషయంపై టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని బీబీసీ సంప్రదించగా తాము పూర్తిగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, facebok
‘ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి’
ప్రమోట్ చేసే పేజీల వల్ల భవిష్యత్తులో సామాన్యుల స్వరానికి చోటు లేకుండా పోయే ప్రమాదం ఉందని పాత్రికేయుడు, సోషల్ మీడియా యాక్టివిస్టు విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాలపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "సోషల్ మీడియా అనేది ఇప్పుడు రాజకీయలకు పెద్ద వేదికగా మారింది. గతంలోనే దాని ఫలితాలు అనుభవిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో మరింత మంది వినియోగదారులు పెరగడంతో ప్రాధాన్యత మరింత పెరిగింది. మిగిలిన సోషల్ మీడియా వేదికలతో పోలిస్తే ఫేస్ బుక్ ఎక్కువ మందిని ఆకర్షించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దానికి తగ్గట్టుగానే యాడ్స్ కోసం ఎక్కువగా వ్యయం చేయడం పెరుగుతోంది. అయితే, అలాంటి ప్రమోటింగ్ పోస్టుల కంటే సాధారణ ప్రజల వాణికే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. ప్రమోట్ చేసే పేజీలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. పెయిడ్ న్యూస్ మాదిరిగానే సోషల్ మీడియాలో చేస్తున్న వ్యయంపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలి. ఎన్నికల ఖర్చులో లెక్కిస్తున్నప్పటికీ సంపూర్ణ యంత్రాంగం ద్వారా పర్యవేక్షణ పెరగాలి" అని తెలిపారు.
సోషల్ మీడియా ఫర్ సొసైటీ (ఎస్ఎంఎస్) కన్వీనర్ కె శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడుతూ "సామాజిక మాధ్యమాలలో కూడా పెయిడ్ ప్రచారం పెరుగుతుండడం ఆందోళనకరం. ప్రధాన పార్టీలు రెండూ ఎన్నికల ముంగిట అనేక పద్ధతుల్లో మభ్య పెడుతున్నట్టుగానే ప్రజాభిప్రాయాలను తమకనుగుణంగా మలచుకునేందుకు సోషల్ మీడియాలో ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. సాధారణ ప్రజల అభిప్రాయాల కన్నా పార్టీల పెయిడ్ ప్రచారం జోరుగా సాగుతుండడం శ్రేయస్కరం కాదు. ఇలాంటి ప్రచార జిమ్మిక్కులను జనం అర్థం చేసుకోవాలి" అని సూచించారు.
ఇవి కూడా చదవండి:
- అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందిస్తా: 'సమర శంఖారావం'లో జగన్
- ఫేక్ న్యూస్‌ను తొలగించబోమన్న ఫేస్‌బుక్
- ఫేస్‌బుక్‌లో పెరిగిన 'ద్వేషం'
- రాజకీయ ప్రకటనల గుట్టు ఇక రట్టు!
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
- ఫేస్‌బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
- బిజెపి, కాంగ్రెస్‌లు మీ ఫేస్‌బుక్ డేటా వాడుకుంటున్నాయా!
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- "మోదీ బ్రహ్మాస్త్రాలు వేస్తుంటే, ప్రతిపక్షాలు మౌనంగా ఉంటున్నాయి"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








