పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది? -Reality Check

ఫొటో సోర్స్, Getty Images/BBC
మాటలు: దేశంలోని ప్రతి గ్రామానికి హైస్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్పింది. 2019 మార్చిలోగా ఈ పని పూర్తిచేస్తామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర హోదా) మనోజ్ సిన్హా చెప్పారు.
వాస్తవాలు: గ్రామీణ భారతంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించింది. కానీ లక్ష్యాలను చేరుకోలేకపోయింది.
వంద కోట్ల మందికి పైగా ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తక్కువ ధరకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే 'భారత్‌నెట్' ప్రాజెక్టు ద్వారా ఈ లక్ష్యాన్ని అందుకొనేందుకు ఆయన ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
దేశంలోని ఆరు లక్షలకు పైగా గ్రామాలకు కనీసం 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం భారత్‌నెట్ పథకం లక్ష్యం. సర్వీసు ప్రొవైడర్లు వైఫై, ఇతర విధానాల్లో స్థానిక జనాభాకు ఇంటర్నెట్ అందించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
2014లో ప్రారంభించిన ఈ పథకం మోదీ 'డిజిటల్ ఇండియా' కార్యక్రమంలో ప్రధానమైనది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
పథకం ప్రారంభమయ్యాక నాలుగేళ్లలో లక్ష్యంలో 50 శాతంలోపే సాధించగలిగింది.
ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచ దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే భారత్ విస్తీర్ణం, జనాభాను పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇది చాలా తక్కువ. 2018 సెప్టెంబరు నాటికి దేశంలో 56 కోట్ల (560 మిలియన్లు) ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయని టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) తెలిపింది. ఈ యూజర్లలో అత్యధికులు బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌పై ఉన్నారు. వాడకందారులు ప్రధానంగా మొబైల్ ఫోన్లో, వెంట తీసుకెళ్లగిలిగిన ఇతర పోర్టబుల్ సాధనాల్లో ఇంటర్నెట్ వాడుతున్నారు.
కనీసం 512 కేబీపీఎస్ డౌన్‌లోడ్ వేగమున్న కనెక్షన్లను భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్‌గా పరిగణిస్తారు.
భారత్‌లో అత్యధిక జనాభా గ్రామాల్లోనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇంటర్నెట్ వినియోగానికి చాలా నెమ్మదిగా అలవాటుపడుతున్నారు.
గ్రామీణ భారతంలో నాలుగో వంతు మందికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్లు లేవు. సగటున ప్రతి వంద మందికి 21.76 కనెక్షన్లే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు ఏం జరిగింది?
దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు(విలేజ్ బ్లాక్‌లకు) ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ప్రభుత్వం లక్ష్యం. దేశంలోని మొత్తం ఆరు లక్షలకు పైగా గ్రామాలు వీటి పరిధిలోకి వస్తాయి.
ఈ 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో లక్ష పంచాయతీలకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు కేబుళ్లు వేయడం, పరికరాలు అమర్చడం ఎట్టకేలకు 2017 డిసెంబరులో పూర్తయ్యాయి. ప్రాజెక్టు అమల్లో ఇదో మైలురాయి. దీనిని అందుకోవడం ప్రభుత్వం సాధించిన విజయమనే ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో, ఈ కేబుళ్లు అసలు పనిచేస్తున్నాయా అనే విమర్శలూ విపక్షాల నుంచి వచ్చాయి.
పథకం మలి దశ లక్ష్యం ప్రకారం- ఈ రెండున్నర లక్షల పంచాయతీల్లో లక్ష పంచాయతీలు పోగా మిగిలిన పంచాయతీలకు 2019 మార్చి నాటికి బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించాల్సి ఉంది.
అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి చివరి నాటికి 1,23,489 పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేశారు. ఇందులో 1,16,876 పంచాయతీల్లో పరికరాలు అమర్చారు.
లక్షకు పైగా పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి 12,500 హాట్‌స్పాట్లు మాత్రమే పనిచేస్తున్నాయి.
కొత్త సీసాలో పాత మద్యం
దేశమంతటా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్నది గత ప్రభుత్వాల లక్ష్యం కూడా. అయితే వాటి ప్రయత్నాలకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి.
'భారత్‌నెట్'కు 2011లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే బీజం పడింది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ప్రాజెక్టు ప్రయోగాత్మక అమలు దశలో ఇది పెద్దగా ముందుకు వెళ్లలేదు.
2011 నుంచి 2014 వరకు ప్రణాళికాలోపం ఈ ప్రాజెక్టుపై ప్రభావం చూపిందని పార్లమెంటరీ కమిటీ ఒకటి తన నివేదికలో చెప్పింది.
2014లో బీజేపీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. నిర్దేశిత గడువైన 2019 మార్చిలోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని 2018 జనవరిలో మోదీ ప్రభుత్వం ప్రకటించింది.
మరి గడువులోగా పూర్తయిందా?
2016-2017 మధ్య ఈ ప్రాజెక్టులో మంచి పురోగతి కనిపించింది. తర్వాతి నుంచి ఇది మందగించింది.
1,16,411 గ్రామ పంచాయతీల్లో కనెక్షన్ల పనులన్నీ పూర్తయ్యాయని, ఇవి సర్వీసు అందించడానికి సిద్ధమైన (సర్వీస్-రెడీ) కనెక్షన్లని భారత్‌నెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్న భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరిలో చెప్పింది.
'సర్వీస్-రెడీ' పంచాయతీల్లో సరైన కనెక్షన్లు అన్ని చోట్లా లేవని దిల్లీలోని స్వచ్ఛంద సంస్థ 'డిజిటల్ సాధికారత ఫౌండేషన్(డీఈఎఫ్)'కు చెందిన ఒసామా మంజర్ వెల్లడించారు.
నిరుడు 13 రాష్ట్రాల్లో ఇలాంటి 269 పంచాయతీల్లో తాము పరిశీలన జరపగా, కేవలం 50 పంచాయతీల్లోనే అవసరమైన పరికరాలు, సరైన కనెక్షన్లు ఉన్నాయని తేలిందని డీఈఎఫ్ తెలిపింది. ఆ 50లోనూ 31 కనెక్షన్లు మాత్రమే పనిచేస్తున్నాయని, అయితే ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉందని వివరించింది.
ప్రజా సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీలు డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఎంతగానో ఆధారపడి ఉన్నాయని, సరైన ఇంటర్నెట్ లేకపోవడం సమస్యేనని ఒసామా మంజర్ అభిప్రాయపడ్డారు.
'సర్వీస్-రెడీ' పంచాయతీల్లో సగానికి పైగా పంచాయతీల్లో ఇంటర్నెట్ నెట్‌వర్క్ పనిచేయట్లేదని, లేదా లోపాలతో కూడిన పరికరాలు ఉన్నాయని ప్రభుత్వ అంతర్గత అధికారిక మెమోను ఒకటి ఉటంకిస్తూ'ద వైర్' జనవరిలో వెలువరించిన ఒక కథనం వెల్లడిస్తోంది.
దొంగతనాలు, విద్యుత్ సమస్యలు
దొంగతనాలు, విద్యుత్ సరఫరా సమస్యలు, నాసిరకం కేబుళ్లు, సరైన నిర్వహణలేని పరికరాలు కూడా భారత్‌నెట్ ప్రాజెక్టు పురోగతికి ప్రతిబంధకాలుగా మారాయి.
2022లోగా అన్ని కుటుంబాలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించి, 5జీ నెట్‌వర్క్ వైపు మళ్లాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు ఈ లక్ష్యం వైపు సాగాల్సి ఉండగా, మరోవైపు భారత్‌నెట్ ప్రాజెక్టులో జాప్యం సమస్యాత్మకంగా మారింది.
భారత్‌నెట్ ప్రాజెక్టు పూర్తిలో జాప్యాన్ని అధికార యంత్రాంగంలోని ఒకరు సమర్థించుకొన్నారు. ఇది మౌలిక సదుపాయాలకు సంబంధించిన భారీ ప్రాజెక్టు అని, ఇలాంటి ప్రాజెక్టుల్లో సదుపాయాల ఏర్పాటుకు, వినియోగానికి మధ్యలో జాప్యం సహజమేనని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.
- గూగుల్ హోమ్: త్వరలో మీరు మెషీన్లతో మాట్లాడొచ్చు!
- డేటా చోరీ వివాదం: #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌ను డబ్బులిచ్చి ట్రెండ్ చేయించారా...
- 'ఫేక్ న్యూస్' గుర్తించడం ఎలా?
- ఫేస్‌బుక్ హ్యాకింగ్: 'ఇచ్చట పర్సనల్ మెసేజ్‌లు అమ్మబడును'
- ‘హలో.. మీరు చావబోతున్నారు.. అంతవరకూ ఈ మందులు వాడండి’
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- పోర్న్ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- 2జీ.. 3జీ.. 4జీ.. మరి 5జీ ఎప్పుడు?
- ఇంటర్నెట్ ఓటింగ్.. తెలుసుకోవాల్సిన విషయాలు
- స్మార్ట్ ఫోన్‌ను అతిగా వాడుతున్న పిల్లలను ఎలా నియంత్రించాలి?
- ఇంటర్నెట్ ప్రకటనలు: ఎలా మొదలయ్యాయి? ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? ఇకపై ఏమవుతాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










