డేటా చోరీ వివాదం: #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌ను డబ్బులిచ్చి ట్రెండ్ చేయించారా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య డేటా చోరీ విషయంలో రగులుకున్న యుద్ధం సోషల్ మీడియాకు పాకింది. టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేల్చుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు టీడీపీ నేతలు కొందరు వ్యక్తులకు డబ్బులిచ్చి #TSGovtStealsData అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
#TSGovtStealsData అనే హ్యాష్‌ట్యాగ్ ఇటీవల ట్రెండ్ అయ్యింది. అనేక మంది ఈ హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించి సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు.
అయితే, టీడీపీ నేతలు కుట్రపూరితంగా ఆ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారని టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. "తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించేందుకు డబ్బులిచ్చి ట్విటర్ ఖాతాల ద్వారా ప్రచారం చేయిస్తున్న టీడీపీ నాయకత్వ కుట్ర ప్రణాళిక బయటపడింది. ట్వీట్లు కొన్నుక్కోవచ్చేమో కానీ, ఓట్లు కొనుక్కోలేరు" అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
తమపై ఉన్న నిందను తెలంగాణ ప్రభుత్వం మీదికి నెట్టేందుకు టీడీపీ ఇలా హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తోందని టీఆర్‌ఎస్ అంటోంది.
"తెలుగు దేశం పార్టీ వాళ్లు చాలా కష్టపడుతున్నారు. ట్విటర్‌లో ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్స్, డమ్మీ ప్రొఫైల్స్ సృష్టించారు. వీరికి కొంత మంది పెయిడ్ ప్రొఫైల్స్ పెట్టి, రోబోట్స్‌ని పెట్టి తెలంగాణ ప్రభుత్వం దొంగతనం చేసిందని గొంతు చించుకొని బదనాం చేసే పనిలో ఉన్నారు. దొంగతనం చేసింది టీడీపీ. ఆ పార్టీ నాయకులే ఇప్పుడు మా ప్రభుత్వాన్ని బదనాం చేసే క్యాంపెయిన్ నడుపుతున్నారు. ఇప్పుడు ఈ స్టెంట్లు, నాటకాలు నడవు" అని వ్యాఖ్యానించారు కేటీఆర్.
అయితే, కేటీఆర్ ఆరోపణలను టీడీపీ తోసిపుచ్చింది. డబ్బులిచ్చి ఆ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పిన 'సీబీఎన్ ఆర్మీ' రాష్ట్ర సమన్వయకర్త మానం బ్రహ్మయ్య, "సీబీఎన్ ఆర్మీకి 68,219 మంది సభ్యులు ఉన్నారు. వాళ్లంతా ఎప్పుడూ పార్టీ కోసం పని చేస్తుంటారు. జరుగుతున్న వివాదంపై #TSGovtStealsData అన్న హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేశాం. సమస్యలను అందరికీ వివరించేలా, అర్థమయ్యేలా హ్యాష్‌ట్యాగ్‌లను పెడతాం. ఇది కూడా అలాగే మేమే పెట్టాం. మేము నకిలీ ప్రొఫైల్స్, బాట్స్ ఉపయోగించామనడంలో వాస్తవం లేదు. నిజం చెప్పాలంటే, వైఎస్సార్‌సీపీ వారే బాట్స్‌ని పెట్టి ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
ట్వీట్లు డిలీట్ చేశారు
అయితే, ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టినవారి ప్రొఫైల్స్ గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని వారు కూడా పోస్టులు చేసినట్టు ఉందని సోషల్ మీడియా నిపుణులు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు కూడా కొన్ని ట్విటర్ హ్యాండిల్స్‌ను పరిశీలించింది. ఉదాహరణకు, @streetclub అనే హ్యాండిల్ నుంచి ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసి ఉంది. కానీ, ఆ ట్వీట్‌ను ఇప్పుడు తొలగించారు.
మార్చ్ 3న #TSGovtStealsData హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసిన మూడు గంటలలోనే ట్రెండ్ అయ్యిందని ట్రెండినాలియా అనే సంస్థ తెలిపింది. దాదాపు 4,30,900 మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌ని చూసి ఉంటారని ట్రెండినాలియా అంచనా వేసింది.
ఒక వెరిఫైడ్ అకౌంట్ @StreetClub. బీబీసీ న్యూస్ తెలుగు ఈ అకౌంట్‌కు మెసేజ్ చేయగా.. అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

ఫొటో సోర్స్, TWITTER
అలాగే, bollywood chowk అనే ట్విట్టర్ యూజర్ కూడా ఇదే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. కానీ, ఆ ట్వీట్ ఇవాళ లేదు. ఇలా ఆ హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన అనేక ట్వీట్లను తరువాత తొలగించారు.
మరికొన్ని ట్విటర్ హ్యాండిల్స్ పరిశీలిస్తే వారు తెలుగువారు కాకపోయినా తెలుగు వార్తలను ట్వీట్ చేశారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ట్విటర్ హ్యాండిల్స్‌లో కొన్ని వెరిఫైడ్‌గా గుర్తించిన నీలం రంగు టిక్ మార్కుతో కూడా ఉన్నాయి.
ట్విటర్ బ్లాగ్ ప్రకారం "ఫలానా ఖాతా విశ్వసనీయమైనది" అని చెప్పడానికి గుర్తుగా ఆ ఖాతాకు ట్విటర్ నీలిరంగు టిక్ మార్కు ఇస్తుంది. ఇది సాధారణంగా వినోదం, ఫ్యాషన్, ప్రభుత్వం, రాజకీయం, మతం, జర్నలిజం, క్రీడలు, వ్యాపారం ఇలా అనేక రంగాలలో ఉన్నవారికి ఈ వెరిఫైడ్ టిక్ ఇస్తుంది ట్విటర్. అయితే ప్రస్తుతం దాన్ని నిలిపివేశారు.
ఒక వెరిఫైడ్ యూజర్ కూడా #TSGovtStealsData హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. కానీ, ఆ ట్వీట్ ఇప్పుడు కనిపించట్లేదు.
బీబీసీ న్యూస్ తెలుగు ఆ యూజర్‌కి ట్విట్టర్‌లో మెసేజ్ చేసింది. తొలుత అటువైపు నుంచి స్పందన వచ్చింది. అయితే, "మీరు ఈ అంశంపై ట్వీట్ ఎందుకు చేశారు? టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి?" అని బీబీసీ ప్రశ్నలు వేయగానే, మెసేజీలు పంపే అవకాశం లేకుండా బ్లాక్ చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు ఈ యూజర్ వివరాలు వెల్లడించడంలేదు. అందుకు ఆ యూజర్ మాకు అనుమతి ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, TWITTER
"నేనొక పెయిడ్ ఇన్‌ఫ్లూయెన్సర్, నా వివరాలు గోప్యంగా ఉంచాలి"
అయితే, ఒక యూజర్ బీబీసీ న్యూస్ తెలుగు పెట్టిన మెసేజ్‌కి ట్విటర్‌లో స్పందించారు. కానీ, తన వివరాలు గోప్యంగా ఉంచాలని అతను కోరారు. తాను ఒక పెయిడ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అని తెలిపారు.
"అవును నేను పెయిడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను. డబ్బులు తీసుకొని హ్యాట్యాగ్‌లను ట్వీట్ చేస్తాను. #TSGovtStealsData అనే హ్యాష్‌ట్యాగ్ కూడా అలా వచ్చిందే. నేనే కాదు చాలామంది అలా చేశారు. నాకు దీని వెనకున్న అసలు విషయం తెలీదు. కానీ, ఇప్పుడు ఆ ట్వీట్లను తొలగించేశాను" అని చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడిన తర్వాత ఈ యూజర్ #TSGovtStealsData తో చేసిన ట్వీట్లను తొలగించారు. అతను మాతో ఫోన్‌లోనూ మాట్లాడారు. తాను కాన్పూర్ వాసినని, అనేక వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నానని, అలాగే మార్కెటింగ్ ఏజెన్సీలతో రిజిస్టరై ఉన్నానని చెప్పారు. వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా ఏ ట్వీట్ చేయాలో సూచనలు వస్తాయని వివరించారు.

ఫొటో సోర్స్, TWITTER
ఒక్కో ట్వీట్‌కు 7 రూపాయలు
రాజకీయ, వాణిజ్య ఉత్పత్తులు, టీవీ షోలు ఇలా అనేక అంశాలకు సంబంధించి ట్రెండ్ చేయాలంటూ సూచనలు వస్తాయని తెలిపారు.
"ఇలా రోజుకు 20 నుంచి 30 ట్వీట్లు వివిధ క్లయింట్లకు చేస్తాను. ఒక్క ట్వీట్‌కి 7 రూపాయలు వస్తాయి. నెలాఖరుకు డబ్బు వస్తది." అని ఆయన వివరించారు.
అంతేకాదు, #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసిన మరో ఇద్దరు ట్విటర్ యూజర్లు కూడా డబ్బులు తీసుకుని చేసినవారే అని తెలిపారు. తమకు అందిన సూచనల మేరకు ట్వీట్ చేశామని అన్నారు.
"మాకు క్లయింట్ ఎవరో తెలియదు. మాకు గ్రూప్‌లో సూచనలు వచ్చాయి, మేము ట్వీట్ చేశాము. ఇది మామూలు విషయమే. ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఒక రాజకీయ పార్టీ గురించి ట్వీట్ చేశాము. అప్పుడు కూడా ఆ అంశం వివాదాస్పదం అయ్యింది. మా ట్విటర్ ఖాతాలు కూడా సస్పెండ్ అయ్యాయి. కానీ, మళ్లీ కొత్త ఖాతాలు తెరిచాం" అని వివరించారు. వారి విజ్ఞప్తి మేరకు వారి వివరాలను బీబీసీ న్యూస్ తెలుగు బయట పెట్టడంలేదు.

ఫొటో సోర్స్, TWITTER
వాట్సాప్‌లో సూచనలు వచ్చాయి
#TSGovtStealsData అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్ చేయాలంటూ తాను సభ్యుడిగా ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో, గ్రూప్ అడ్మిన్ మార్చ్ 3న సూచనలు వచ్చాయని తెలిపారు.
ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ని సంప్రదించేందుకు కూడా బీబీసీ న్యూస్ తెలుగు ప్రయత్నించింది. కానీ, ఈ కథనం రాసే సమయానికి అటువైపు నుంచి స్పందన రాలేదు.

ఫొటో సోర్స్, TWITTER
మార్కెటింగ్ వ్యూహం
వివిధ రాజకీయ పార్టీల సోషల్ మీడియా ప్రచారం చూసుకునే నిపుణులు మాత్రం ఇదేమీ కొత్త విషయం కాదని అంటున్నారు.
"ఏదైనా హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేయాలి అన్నప్పుడు ట్విటర్ బాట్స్‌ని ఉపయోగిస్తారు. ఏదైనా పోస్ట్ చేసినప్పుడు అందులో ఉన్న ముఖ్యమైన పదాలను గుర్తించి ఈ ట్విటర్ బాట్స్ దాన్ని మళ్ళీ పోస్ట్ చేస్తుంటాయి. ఇలా హ్యాష్‌ట్యాగ్‌ని అనేక బాట్స్ పోస్ట్ చేస్తే అది ట్రెండ్ అవుతుంది. మరో పద్ధతి ఏంటంటే, బయటి వారికి డబ్బులిచ్చి ఈ పని చేయించడం (అవుట్ డోర్ వెండర్స్)" అని వివరించారు.
ట్విటర్ బాట్ అంటే?
ట్విట్టర్ బాట్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. అది ఒక ట్విటర్ ఖాతా తరఫున అటోమేటిక్‌గా ట్వీట్లు, రీట్వీట్లు, లైకులు, ఫాలోయింగ్, అన్‌ఫాలోయింగ్ చేస్తుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసే ద్వేషపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు ట్విటర్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
"అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలను గుర్తించడంపై తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అందుకోసం కొన్ని సాఫ్ట్‌వేర్ టూల్స్ అభివృద్ధి చేశాం. అవి అనుమానాస్పద ఖతాలను ఆటోమేటిక్‌గా గుర్తించి, అప్పటికప్పుడే తగిన చర్యలు తీసుకుంటాయి. దాని ద్వారా ఇతర వినియోగదారులు గుర్తించి మాకు ఫిర్యాదులు చేసేవరకూ వేచి చూడాల్సిన పనిలేకుండా, సత్వరమే చర్యలు తీసుకునేందుకు దోహదపడుతోంది" అని ట్విటర్ వివరించింది.
బీబీసీ న్యూస్ తెలుగు ఒక సోషల్ మీడియా ప్రచారకర్తతో కూడా మాట్లాడింది. తన వద్ద 300 మంది బృందం ఉందని ఆయన తెలిపారు.
"సాధారణంగా మేము గంటకు 25 వేలు ఛార్జ్ చేస్తాం. మూడు వేల నుంచి నాలుగు వేల ట్వీట్లు చేయిస్తాము. ఈవెంట్స్, ఉత్పత్తులు, రాజకీయాల గురించి లేక ఇంకా ఏదైనా.. ట్వీట్ ట్రెండ్ చేయిస్తాం" అని వివరించారు. "అప్పుడప్పుడు మా ఖాతాలు సస్పెండ్ అవుతాయి, మళ్లీ కొత్తవి తెరుస్తాం" అని చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER
ట్విటర్ నిబంధనలు
ట్విటర్ నిబంధనల ప్రకారం, ఉద్దేశపూర్వకంగా బూటకపు సమాచారాన్ని వ్యాప్తి చేయడం నిషిద్ధం. స్వచ్ఛందంగా రాజకీయపరమైన వివరాలను షేర్ చేయడం ట్విటర్ నిబంధనలకు విరుద్ధం కాదు. అయితే, మూకుమ్మడిగా ఒక పథకం ప్రకారం ఒక విషయాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించడం మాత్రం ట్విటర్ నియమ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.
బీబీసీ న్యూస్ తెలుగు అడిగిన ప్రశ్నలకు ట్విటర్ అధికార ప్రతినిధి స్పందించారు. "ప్రజల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణ జరిగేలా చూడడం ఒక సంస్థగా మాకు తొలి ప్రాధాన్యం. కానీ, ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించడం తప్పకుండా ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలాంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తాం. మా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, గతేడాది కంటే 214 శాతం అధిక ఖాతాలను ఈ ఏడాది తొలగిస్తున్నాం" అని వివరించారు.
ట్విటర్‌కి ఫిర్యాదు
తాజా వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ట్విటర్‌కు ఫిర్యాదు చేసింది.
"సాధారణంగా బాట్స్‌ని ఉపయోగిస్తారు. అలా కాకుండా కొన్ని వెరిఫైడ్ హ్యాండిల్స్‌కి డబ్బు ఇచ్చి ట్వీట్స్ చేయించారు. ఇలాంటి వెరిఫైడ్ హ్యాండిల్స్ వివిధ ఉత్పత్తులు, ఈవెంట్స్ గురించి ట్వీట్ చేస్తుంటారు. ఈ వెరిఫైడ్ హ్యాండిల్స్ ఎవరివైనా అయ్యుండొచ్చు. అందులో మోడళ్లు, చిన్నపాటి నటీనటులు కూడా ఉంటారు. వారికి ఉన్న ఫాలోయర్స్ సంఖ్య బట్టి వారు డబ్బు చార్జి చేస్తారు. ఇప్పుడు చూస్తే మేము దాదాపు 7 వెరిఫైడ్ హ్యాండిల్స్ గుర్తించాం. వాణిజ్య ఉత్పత్తుల కార్యక్రమాలకు వారు డబ్బు తీసుకొని ట్వీట్ చేస్తే పర్లేదు. కానీ, తెలియని అంశంలో, రాజకీయ అంశం కూడా డబ్బు తీసుకుని ట్వీట్ చేయటం సరికాదు. మేము ట్విటర్‌కి ఫిర్యాదు చేశాం. ఇటువంటి వారి వెరిఫికేషన్ తొలగించాలని కోరాం" అని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం బీబీసీ న్యూస్ తెలుగుతో చెప్పారు.
అయితే, ఈ పెయిడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బు ఎవ్వరు ఇచ్చారు? అన్నది బీబీసీ న్యూస్ తెలుగు నిర్దారించడంలేదు.
కానీ, ఇది ప్రస్తుత మారుతున్న రాజకీయాల నిజ రూపమని పర్షాంతో రాయ్ లాంటి సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ఈ కేసులో చూస్తే, డేటాను రాజకీయ పార్టీలు వాడుకోవడం కొత్తేమీ కాదు. అయితే, ఇలా సోషల్ మీడియా వేదికలను, బాట్స్‌ను, యూజర్లను అద్దెకు తీసుకోవడం నైతికంగా దారుణమైన పని. ఇలాంటి పనులు చేసిపెట్టేందుకు కొన్ని ఏజెన్సీలు కూడా ఉన్నాయి. తప్పుడు సమాచారం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. దీన్ని కట్టడి చేసేందుకు ఆయా సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఆ నకిలీ సమాచారాన్ని ఎవరు సృష్టించారన్నది గుర్తించలేనంత వరకూ ఈ సమస్యకు పెద్దగా పరిష్కారం దొరకదు" అని పర్షాంతో రాయ్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
#TSGovtStealsData హ్యాష్ ట్యాగ్‌తో ఇప్పటి వరకు ఎన్ని ట్వీట్లు చేశారో కచ్చితమైన వివరాలు లేవు. అయితే, తొలి మూడు గంటల్లో 320 యూజర్లు 403 (339 రీట్వీట్లు) చేశారని, దాంతో అది భారత్‌లో ట్రెండింగ్ అంశాల్లో ఒకటి అయ్యిందనిట్రెండ్‌నాలియా తెలిపింది. ఇదే విషయాన్ని కొన్ని వార్తా పత్రికలు కూడా పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








