టీడీపీ డేటా లీక్: ఏపీ, తెలంగాణల మధ్య ముదురుతున్న వివాదం

ఫొటో సోర్స్, Google play store
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా లీక్‌పై మాటల యుద్ధం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కీలక సమాచారం దుర్వినియోగం చేసేందుకు టీడీపీ ప్రయత్నించిందంటూ టీడీపీపై ఆరోపణలు వస్తుంటే... తమ కార్యకర్తల డేటాను చోరీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ టీడీపీ ప్రత్యారోపణలు చేస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఈ వివాదంపై మాటల యుద్ధం ముదురుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల కీలక సమాచారాన్ని ఒక ఐటీ సంస్థ అక్రమంగా సేకరించి ఓటర్ల లిస్ట్‌లో నుంచి వేలాది మందిని తొలగించారని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. దీనిపై మార్చి 2 న తెలంగాణలోని మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, cyberabadpolice/fb
లోకేష్ రెడ్డి ఫిర్యాదులో ఏముంది?
''వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సేవామిత్ర లాంటి యాప్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏపీలోని ఓటర్ల లిస్టును సేకరించి టీడీపీ విజయావకాశాలు మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తున్నారు'' అని లోకేశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
''సేవామిత్ర అనే యాప్‌ను ఐటీగ్రిడ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాలలోని లబ్ధిదారుల పేరు, వయసు, ఆధార్‌తో పాటు అనేక వివరాలను అక్రమంగా ఈ యాప్ ద్వారా సేకరిస్తూ టీడీపీ శ్రేణులు దుర్వినియోగం చేస్తున్నాయి. తమ పార్టీకి అనుకూలమైన ఓటర్లు ఎవరు, వ్యతిరేకంగా ఎవరున్నారనేది విశ్లేషణ చేసి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని ఎన్నికల జాబితా నుంచి తొలగిస్తున్నారు’' అని లోకేశ్వర్ రెడ్డి తన ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసుల దర్యాప్తు
లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకొని సంస్థకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ దీనిపై సోమవారం మీడియాతో మాట్లాడుతూ.."ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఐటీగ్రిడ్ సంస్థ వద్ద వేలాది మంది ప్రజల కీలక సమాచారం (ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు, వివిధ రాజకీయ పార్టీల అనుకూల ఓటర్ల వివరాలు) ఉన్నాయి. ఐటీ గ్రిడ్ సంస్థే టీడీపీకి అనుబంధంగా సేవామిత్ర అనే యాప్ కూడా నడుపుతోంది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, NAralokesh/fb
వివిధ మార్గాల ద్వారా వీరు సేకరించిన సమాచారం, ఓటర్ల వివరాలను రాజకీయ లబ్ధి కోసం విశ్లేషించారని కమిషనర్ తెలిపారు. దర్యాప్తు కొనసాగించేందుకు వివిధ ప్రభుత్వ సంస్థలకు నోటీసులు పంపినట్లు తెలిపారు. "ప్రజల కీలక సమాచారం ఈ సంస్థ చేతికి ఎలా అందింది అనేది దర్యాప్తు చేసేందుకు యూఐడీఏఐ, ఎలక్షన్ కమిషన్‌కు నోటీసులు పంపాం'' అని తెలిపారు.
సేవామిత్రపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇంటిపై తనిఖీలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మార్చ్ 4న ఆయన ఇంటికి వచ్చారు. దీంతో ఇది రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదానికి దారి తీసింది.
ఎవరి వాదన వారిదే!
డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది.
వైసీపీకి లబ్ధి చేకూరేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేశ్ ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
మరోవైపు ఇది మరో 'కేంబ్రిడ్జ్ అనలటికా'లాంటిదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
"ఎన్నికల ముందు ఇటు వంటి డేటా తస్కరణ రాజకీయ లబ్ధి కోసమే జరిగింది. ఇది అధికార దుర్వినియోగం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలి'' అని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన్న రాజేంద్రరెడ్డి డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, facebook/ktr
ఎన్నికల జాబితా నుంచి కొందరి ఓటర్ల పేర్లు తొలగించారని గత ఫిబ్రవరిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిల్లీలోని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు నకిలీ ఓట్ల అంశంపై వైసీపీ లీగల్ సెల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసింది.
డేటా చోరీ వివాదంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయడాన్ని టీడీపీ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"నిజానికి చోరీ అయింది మా డేటా. ఐటీ గ్రిడ్ సంస్థ నడుపుతున్న సేవామిత్ర యాప్‌లో టీడీపీ పార్టీ కార్యకర్తల సమాచారం మాత్రమే ఉంది. తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థ పై దాడి చేసి ఆ డేటా తీసుకున్నారు. అసలు సేవామిత్ర యాప్‌లోని సమాచారం ప్రతీ రాజకీయ పార్టీ వద్ద ఉంటుంది. ఎన్నికల జాబితా అన్నది పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారం. ఆ సమాచారం ఐటీ గ్రిడ్ సంస్థ తన సేవామిత్ర యాప్‌లో పెట్టింది. ఆ డేటాను టీడీపీ బూత్ స్థాయి సమన్వయకర్తలు ఉపయోగించి సర్వేలు చేస్తుంటారు. ఇది అక్రమం కాదు. ప్రతి రాజకీయ పార్టీ చేసేదే. ఇక ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు కూడా చాలా వరకు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లో ఉండకూడని డేటా ప్రభుత్వం వద్ద సురక్షింతంగా ఉంది" అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఐటీ గ్రిడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు చేస్తుందని వెల్లడించారు.
"టీడీపీ కూడా ఆ సంస్థకు ఒక వినియోగదారు మాత్రమే. ఇలా అనేక మంది వినియోగదారులు ఆ సంస్థకు ఉన్నారు. దీనిపై మేం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం'' అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, ఏపీ ప్రజల డేటా చోరీ చేసే అవసరం తమకు లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. "అసలు తెలంగాణలో ఏపీ పోలీసులకు ఏం పని? నేరం జరిగింది తెలంగాణలో, దానిపై ఫిర్యాదు తెలంగాణ పోలీసులకు వచ్చింది. అలాంటప్పుడు ఆంధ్ర పోలీసులు ఇక్కడకి రావడం సరైనదేనా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు చంద్రబాబు గారు’’ అని ట్విటర్‌లో ఆయన ప్రశ్నించారు.
ప్రజల్లో అనుమానాలు
ఎన్నికల జాబితాలో నుంచి తమ పేరు తొలగించారేమో అన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బోస్ బీబీసీతో మాట్లాడుతూ, '' ఇటీవల కొంత మంది సర్వే పేరుతో మా ఊరికి వచ్చారు. ఇంటింటికి వచ్చి ఏ పార్టీకి ఓటేస్తారని అడిగారు. దీంతో మేం వారిని పట్టుకొని ఊరి నుంచి పంపించి వేశాం. ఇప్పుడు ఓటరు జాబితాలో మా పేర్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి'' అని అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పినతండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబడినట్లు వార్తలు వచ్చాయి. తన ప్రమేయం లేకుండానే ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల్ కృష్ణ ద్వివేది దీనిపై మాట్లాడుతూ, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించటానికి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటిపై పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు.
''ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని దాదాపు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి'' అని ఆయన వెల్లడించారు.
డేటా వివాదంపై లోకేశ్వర్ రెడ్డి అలాగే ఐటీ గ్రిడ్ సంస్థ సీఈవో అశోక్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
- సోనియా గాంధీ గౌను ఇందిర రక్తంతో తడిచిపోయింది..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- మహాభారత యుద్ధానికి ద్రౌపది పట్టుదలే కారణమా?
- బిజెపి, కాంగ్రెస్‌లు మీ ఫేస్‌బుక్ డేటా వాడుకుంటున్నాయా!
- కేంబ్రిడ్జ్ అనలటికా మూసివేత!
- ఫేస్‌బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
- మీ డేటాతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చా?
- జుకర్‌బర్గ్: ‘భారత్ ఎన్నికల్లో మోసాలకు తావు లేకుండా చూస్తాం’
- ఆన్లైన్లో మీ వ్యక్తిగత డేటా చోరీ కాకుండా ఉండాలంటే ఈ 5 పనులు చేయండి
- ఫేస్‌బుక్ హ్యాకింగ్: 'ఇచ్చట పర్సనల్ మెసేజ్‌లు అమ్మబడును'
- ఇంటర్నెట్ ప్రకటనలు: ఎలా మొదలయ్యాయి? ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? ఇకపై ఏమవుతాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








