జుకర్‌బర్గ్: ‘భారత్ ఎన్నికల్లో మోసాలకు తావు లేకుండా చూస్తాం’

ఫేస్‌బుక్, జుకర్‌బర్గ్, కేంబ్రిడ్జి అనలిటికా, అమెరికా సెనేటర్లు

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి మోసాలకు తావు లేకుండా చూసేందుకు సహకరిస్తామని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

డేటా దుర్వినియోగంపై అమెరికా కాంగ్రెస్ ఎదుట హాజరైన జుకర్‌బర్గ్ సెనేటర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

భారత్‌తో పాటు బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, హంగరీలలో జరగబోయే ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు తాము చేయగలిగిందంతా చేస్తామని జుకర్‌బర్గ్ తెలిపారు. రెచ్చగొట్టే ప్రకటనలు, నకిలీ అకౌంట్లపై ఒక కన్నేసి ఉంచుతామని అన్నారు.

ఫేస్‌బుక్, జుకర్‌బర్గ్, కేంబ్రిడ్జి అనలిటికా, అమెరికా సెనేటర్లు

ఫొటో సోర్స్, Getty Images

కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా సేకరణపై మాట్లాడుతూ, సోషల్ మీడియాను రష్యా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అందుకే తమ సంస్థ నకిలీ అకౌంట్లను గుర్తించడానికి కొత్త టూల్స్ తయారు చేస్తోందని వివరించారు.

దీనిని ఒక రకమైన ఆయుధాల పోటీగా అభివర్ణించారు.

తమపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని మాట నిజమే అని అంగీకరించారు. అది తన తప్పే అన్న జుకర్‌బర్గ్, అందుకు క్షమాపణలు కోరారు.

2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ జరుపుతున్న రాబర్ట్ ముల్లర్, ఫేస్‌బుక్ సిబ్బందిని విచారించిన మాట నిజమే అని అంగీకరించారు. అయితే ముల్లర్ కార్యాలయం తనను మాత్రం విచారించలేదని స్పష్టం చేశారు.

ఫేస్‌బుక్, జుకర్‌బర్గ్, కేంబ్రిడ్జి అనలిటికా, అమెరికా సెనేటర్లు

ఫొటో సోర్స్, Getty Images

అయితే సెనేటర్లు అడిగిన పలు ప్రశ్నలకు జుకర్‌బర్గ్ సమాధానాలు దాటవేశారు. వాటికి తమ టీమ్ సమాధానం ఇస్తుందని బదులిచ్చారు.

జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించిన సెనేటర్ జాన్ కెన్నడీ, ఫేస్‌బుక్‌ను తాము నియంత్రించాలనుకోవడం లేదని తెలిపారు. అయితే ఫేస్‌బుక్‌ యూజర్ అగ్రిమెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సెనేటర్లు చేసిన సూచనలు విన్న జుకర్‌బర్గ్ నియంత్రణలు సక్రమంగా ఉంటే వాటిని స్వాగతిస్తామని అన్నారు. అయితే ఎలాంటి నియంత్రణ అన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఫేస్‌బుక్, జుకర్‌బర్గ్, కేంబ్రిడ్జి అనలిటికా, అమెరికా సెనేటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హియరింగ్ సందర్భంగా నిరసనలు

జుకర్‌బర్గ్ ఇంకా ఏమేం చెప్పారు?

  • ఫేస్‌బుక్‌ దుర్వినియోగాన్ని అరికట్టడానికి సరైన ఏర్పాట్లు చేసుకోలేదని ఇప్పుడు మాకు అర్థమైంది.
  • సరిగ్గా పరిశీలించకుండానే కేంబ్రిడ్జి అనలిటికా సేకరించిన సమాచారాన్ని డిలీట్ చేసిందని విశ్వసించడం తప్పే.
  • ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం ఉందని భావించడం లేదు.
  • భవిష్యత్తుల్లో ఫేస్‌బుక్ ఉచిత వర్షన్ కూడా లభిస్తుంది. పెయిడ్, యాడ్‌లు లేని ఫేస్‌బుక్ వర్షన్‌లో చేరడం, చేరకపోవడం మీ యిష్టం.
  • విద్వేషపూరిత వ్యాఖ్యల విషయంలో ఫేస్‌బుక్ ఆటోమాటిక్ ప్రతిస్పందనపై సంతృప్తిగా లేను.
  • సంస్థ లోపలి వారు ఎవరైనా ఏదైనా రాజకీయ పక్షం వైపు మొగ్గు చూపారా అన్నదానిని స్వయంగా పరిశీలిస్తా.

అయితే, జుకర్‌బర్గ్‌తో సెనేటర్ల ప్రశ్నోత్తరాల క్రమం కొనసాగుతుండగానే ఫేస్‌బుక్ షేర్లు సుమారు 5 శాతం పెరిగాయి. దాంతో ఆయన ఆదాయం మరో రూ. 19 వేల కోట్ల మేర పెరిగింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)