బిహార్: టాయిలెట్లపై మోదీ చెప్పిన మాటల్లో వాస్తవమెంత?

ఫొటో సోర్స్, GEOFF ROBINS / AFP / GETTY IMAGES
- రచయిత, మనీష్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక వారంలో అత్యధికంగా ఎన్ని టాయిలెట్లు నిర్మించొచ్చు? అదీ వారం రోజులూ, రోజుకు 24 గంటలూ, గంటకు 60 నిమిషాలూ పని చేస్తూ..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ - '8 లక్షల 50 వేల టాయిలెట్లు' అని అంటున్నారు.
మోతిహారీలో జరిగిన చంపారణ్ సత్యాగ్రహ శతాబ్ది ముగింపు ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని, ''గత వారం రోజులలో బిహార్‌లో 8 లక్షల 50 వేల టాయిలెట్లు నిర్మించారు'' అని అన్నారు.
ఒక్క క్షణం ఆగి లెక్కిద్దామా?
వారానికి ఏడు రోజులు, రోజుకు 24 గంటలు అంటే వారానికి 168 గంటలు. గంటకు 60 నిమిషాలు లెక్కన 168 గంటల్లో 10080 నిమిషాలు. 10080 నిమిషాలలో 8,50,000 టాయిలెట్లు నిర్మించారని మోదీ చెబుతున్నారు. అంటే నిమిషానికి 84 టాయిలెట్లు నిర్మించారన్న మాట. వాహ్.. అద్భుతం!

ఫొటో సోర్స్, PRAKASH SINGH / AFP / GETTY IMAGES
వాస్తవం మరో విధంగా ఉంది...
కానీ బిహార్ ప్రభుత్వం మాత్రం ఈ ఎనిమిదిన్నర లక్షల టాయిలెట్లను వారంలో కాదు, నాలుగు వారాల్లో నిర్మించామని చెబుతోంది.
బిహార్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని లోహియా స్వచ్ఛ బిహార్ అభియాన్ సీఈఓ డి.బాలమురుగన్, ఈ ఎనిమిదిన్నర లక్షల టాయిలెట్లను మార్చి 13 నుంచి ఏప్రిల్ 9 మధ్య కాలంలో అంటే 4 వారాల వ్యవధిలో నిర్మించామని ఫోన్ ద్వారా బీబీసీకి వెల్లడించారు.
గత ఏడాదిన్నర కాలంగా చేసుకున్న ముందస్తు ఏర్పాట్ల వల్లే ఇది సాధ్యమైందని కూడా ఆయన తెలిపారు. ఇందుకోసం కూలీలకు, మేస్త్రీలకు ముందుగానే శిక్షణ ఇచ్చామని, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగస్వాములందరికీ ముందుగానే అవగాహన కల్పించామని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రస్తుతం బిహార్‌లో 86 లక్షల టాయిలెట్లు ఉన్నాయి. అదే సమయంలో సగం కన్నా తక్కువ, అంటే సుమారు 43 శాతం ఇళ్లలో మాత్రమే టాయిలెట్లు ఉన్నాయి.
బిహార్‌లో ఇప్పటివరకు ఒక్క బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా కూడా లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోహ్‌తాస్ జిల్లా దానికి సమీపంలో ఉంది.
ప్రధాని ప్రకటనను బిహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఇలాంటి బూటకపు మాటలను బిహార్ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోరేమో అంటూ తేజస్వీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








