కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్కాండల్: ఫేస్‌బుక్‌కు రూ.4.7కోట్ల జరిమానా

యూకేకు చెందిన డేటా పరిరక్షణ విభాగం ఫేస్‌బుక్ యాజమాన్యానికి దాదాపు 4.7కోట్ల రూపాయల జరిమానా విధించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్కాండల్‌లో ఫేస్‌బుక్ పాత్ర ఉన్నందుకే ఈ జరిమానా విధించినట్లు యూకే సమాచార కమిషనర్ కార్యాలయం (ఐసీఓ) తెలిపింది.
చాలా తీవ్రమైన తప్పిదానికి ఫేస్‌బుక్ ఆస్కారం కల్పించిందని ఐసీఓ పేర్కొంది. పాత డేటా భద్రతా చట్టాల ప్రకారం అత్యధిక జరిమానాను ఫేస్‌బుక్‌కు విధించారు.
సరైన పరిమితులు విధించకుండా యాప్ డెవలపర్లకు ఫేస్‌బుక్ వినియోగదార్ల డేటాను అందించిందని ఐసీవో చెప్పింది.
‘2007-2014 మధ్య ఫేస్‌బుక్ తమ వినియోగాదర్ల వ్యక్తిగత డేటాను అనుచితంగా యాప్ డెవలపర్లకు అందించింది. దానికోసం వినియోగదార్ల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోని వాళ్ల సమాచారాన్ని కూడా అది అందించింది’ అని ఐసీవో వివరించింది. వినియోగదార్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడంలో ఫేస్‌బుక్ విఫలమైనట్లు తెలిపింది.
ఐసీవో నిర్ణయాన్ని ‘విశ్లేషిస్తున్నట్లు’ ఫేస్‌బుక్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఐసీవో పరిశీలనలోని కొన్ని అంశాలను మేం గౌరవంగా తిరస్కరిస్తున్నాం. కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై మేం మరింత లోతైన విచారణ చేయాల్సి ఉందని గతంలోనే చెప్పాం’ అని ఫేస్‌బుక్ తన ప్రకటనలో పేర్కొంది.
ఏంటీ కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్కాండల్?
పరిశోధకుడు డాక్టర్.అలెగ్జాండర్ కోగన్‌కు చెందిన జీఎస్ఆర్ సంస్థ... ఫేస్‌బుక్‌లో ఒక పర్సనాలిటీ క్విజ్ ద్వారా దాదాపు 8.7కోట్ల మంది డేటాను సేకరించింది.
ఇందులో కొంత డేటాను కేంబ్రిడ్జ్ ఎనలిటికాతో పంచుకుంది. ఆ డేటాను అమెరికా రాజకీయ ప్రకటనల కోసం ఉపయోగించారు.
‘ఈ డేటా దుర్వినియోగాన్ని 2015లోనే గుర్తించినప్పటికీ ఫేస్‌బుక్ సరైన చర్యలు తీసుకోలేదు’ అని ఐసీవో తెలిపింది.
ఫేస్‌బుక్ డేటాను ఎలా దుర్వినియోగం చేశారు?

‘అంత పెద్ద కంపెనీ ఈ విషయంలో మెరుగ్గా వ్యవహరించాల్సింది’ అని యూకే సమాచార కమిషనర్ ఎలిజబెత్ డెన్హామ్ చెప్పారు. డేటాను రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వినియోగిస్తారనే దానిపై ఐసీఓ విచారణ కొనసాగిస్తోంది.
ఇవి కూడా చదవండి
- జగన్‌పై కత్తితో దాడి: ‘ఇలాంటి వాటికి భయపడను’
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపుకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- ఒబామా, హిల్లరీ నివాసాలకు ‘పేలుడు పదార్థాలు’
- పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరువు
- BBC INVESTIGATION: అలీగఢ్‌లో ముస్లిం యువకుల ఎన్కౌంటర్లో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








