అలీగఢ్ ఎన్‌కౌంటర్: ముస్లిం యువకుల ఎన్‌కౌంటర్‌లో నిజానిజాలు BBC INVESTIGATION

- రచయిత, ప్రియాంక దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
దాదాపు నెల రోజుల కిందట క్రితం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో సాధువులు, రైతులు ఆరుగురిని క్రూరంగా హత్య చేసిన కేసుల్లో దోషులుగా భావించి ఉత్తరప్రదేశ్ పోలీసులు అతరైలీలో ఇద్దరు ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్ చేశారు.
కానీ, బీబీసీ దీనిపై చేసిన ప్రత్యేక పరిశోధనలో పోలీసులు, సాక్షుల కథనాలు వేర్వేరుగా ఉన్నాయని గుర్తించింది. మా పరిశోధనలో ఈ మొత్తం ఘటనపై సందేహాలు కలిగించే ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
స్వయంగా మృతుల కుటుంబ సభ్యులే ఇక్కడ పోలీసుల ఎదురుకాల్పులపై ప్రశ్నలు లేవనెత్తారు.
అలీగఢ్ పోలీస్ ఎన్‌కౌంటర్ మొత్తం కథ చెప్పడానికి ముందు గత ఏడాది సమయంలో ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన 1500కు పైగా ఎన్‌కౌంటర్లలో నేరస్థులుగా చెబుతున్న 67 మందిని పోలీసులు కాల్చి చంపారనే విషయం మేం పాఠకులకు గుర్తు చేయాలి.
సెప్టెంబర్ చివర్లో లక్నో నడిబొడ్డున ఆపిల్ అధికారి వివేక్ తివారీ పోలీస్ ఎన్‌కౌంటర్లో చనిపోయినప్పుడు ఈ వరుస ఎన్‌కౌంటర్లకు బ్రేక్ పడింది.
కారు ఆపకపోవడంతో ఆయనపై కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు. వివేక్‌పై కాల్పులు జరిపిన పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. కానీ ఈ హత్యతో పోలీసుల వైఖరిపై సామాన్యుల దృష్టి పడింది.
రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు ఎన్‌కౌంటర్లపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది.
వివేక్ తివారీ హత్యతోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ 2017 జూన్‌లో "నేరం చేస్తే కాల్చి పారేస్తామని" హెచ్చరించడం పతాక శీర్షికల్లో నిలిచింది.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న ఎదురుకాల్పుల గురించి పరిశోధన చేసేందుకు బీబీసీ పక్షం రోజుల పాటు అలీగఢ్, ఆజంగఢ్, మీరట్, బాఘ్‌పట్, లక్నో జిల్లాల్లో పర్యటించింది. ఈ పరిశోధనలో మేం బాధిత కుటుంబాలు, బాధితులు, పోలీసు అధికారులు, మంత్రులతో కూడా మాట్లాడాం.
స్పెషల్ టాస్క్ ఫోర్స్, యాంటీ టెర్రర్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీసు అధికారుల నుంచి పోలీస్ డైరెక్టర్ జనరల్‌ల వరకూ వెళ్లి వారితో మాట్లాడాం. వివాదాస్పద ఎదురుకాల్పులకు సంబంధించిన ఎన్నో పత్రాలను తిరగేసిన తర్వాత మాకు తెలిసిన వివరాలను మేం మూడు భాగాల ఒక ప్రత్యేక సిరీస్‌గా మీ ముందుకు తెస్తున్నాం.
ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న ఎదురు కాల్పులపై బీబీసీ ప్రత్యేక పరిశోధనలో మొదటి భాగాన్ని చదవండి.
అలీగఢ్ ఎన్‌కౌంటర్
సెప్టంబర్ 20 ఉదయం అలీగఢ్ హర్దువాగంజ్ ప్రాంతంలో ఒక పోలీస్ ఎన్‌కౌంటర్ జరిగింది. అక్కడ ఆంగ్లేయుల కాలం నాటి పాడుబడ్డ బంగళాలో మధ్యాహ్నం ఒకటిన్నరకు జరిగిన ఎదురు కాల్పుల తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడారు. తమ కాల్పుల్లో ముస్తకీన్, నౌషాద్ అనే ఇద్దరు యువకులు చనిపోయారని చెప్పారు.
టీవీ విలేఖరుల సమక్షంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో ఒక ఇన్‌స్పెక్టర్ గాయపడ్డారని కూడా పోలీసులు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం ఎన్‌కౌంటర్లో చనిపోయిన ముస్తకీన్, నౌషాద్ ఇదే ఏడాది ఆగస్టు, సెప్టంబర్‌లో అలీగఢ్‌లో జరిగిన ఆరు హత్యల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Hirdesh Kumar
హత్యకు గురైన ఆరుగురు ఎవరు?
సుమారు ఒక నెల క్రితం జిల్లాలో జరిగిన ఆరు హత్యల పరంపర, అలీగఢ్‌లోని పాలీ ముకీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యలతో మొదలైంది.
ఆగస్టు 12న రాత్రి పాలీ ముకీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భుడరా ఆశ్రమం రోడ్డులోని ఒక శివాలయంపై అజ్ఞాతవ్యక్తులు దాడి చేశారు. ఆ సమయంలో ఆలయంలో ఇద్దరు పూజారులు సహా ముగ్గురు నిద్రపోతున్నారు. వారిని కర్రలతో కొట్టారు. మృతుల్లో ఆలయానికి చెందిన 70 ఏళ్ల పూజారి, పక్క గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు ఉన్నారు.
మరో ఘటన ఆగస్టు 2 రాత్రి జిల్లాలోని అతరౌలీ పట్టణంలో జరిగింది. ఇక్కడ బహర్వాద్ అనే గ్రామంలోని పొలాల్లో పడుకున్న మంటూరీ సింగ్ అనే రైతులను కర్రలతో దారుణంగా కొట్టి చంపారు.
మూడో ఘటన సెప్టెంబర్ర 14 రాత్రి హర్దువాగంజ్ సమీపంలోని దురైనీ ఆశ్రమంలో జరిగింది. ఇక్కడ కూడా గుర్తు తెలియని దుండగులు ఒక సాధువును కర్రలతో కొట్టి చంపారు. అదే రాత్రి ఆలయం దగ్గరే ఉన్న పొలాల్లోని ఒక రైతు దంపతులను కూడా క్రూరంగా హత్య చేశారు. వీరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు దూరపు బంధువులు.

ఫొటో సోర్స్, Hirdesh Kumar
ఈ హత్యల తర్వాత పోలీసులపై కేసులు పరిష్కరించాలనే ఒత్తిడి ఎక్కువైంది. ఈ హత్యలకు సంబంధించి సెప్టెంబర్ 18న ఐదుగురిని అరెస్ట్ చేసి ముగ్గురు పారిపోయారని చెప్పిన పోలీసులు మొత్తం ఆరు హత్య కేసులూ పరిష్కరించేశామని చెప్పుకున్నారు.
ఇప్పుడు ప్రశ్న ఒకటే. పోలీసులు అరెస్ట్ చేసిన సాబిర్ అలీ అలియాస్ దినేష్ ప్రతాప్ సింగ్, సల్మాన్, ఇర్ఫాన్, యాసిన్, నదీమ్ అనే ఈ ఐదుగురూ ఎవరు? వీరితోపాటు పారిపోయారని చెప్పిన ముస్తకీన్, నౌషాద్, అఫ్సర్‌కు వీటితో సంబంధం ఏంటి? ఇక చివరగా.. వీటికీ, ముస్తకీన్, నౌషాద్‌ల ఎన్‌కౌంటర్‌కు లింకేంటి?
బీబీసీ పరిశోధనలో ఈ ప్రశ్నలకు పలురకాల సమాధానాలు లభించాయి.
ఆరు హత్యలకు ముస్తకీన్, నౌషాద్‌లను బాధ్యులుగా చెబుతుండగా, చనిపోయిన వారి బంధువులు, పోలీసులు చెబుతున్నది మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
ఈ దాడుల తర్వాత ప్రాణాలతో బతికి బయటపడ్డ ఒక పూజారి కూడా పోలీసులు పరిశోధనలో వెలుగుచూసిన విషయాలు తెలిసి గందరగోళానికి గురయ్యాడు. ఇక ముస్తకీన్, నౌషాద్ బంధువులు చెబుతున్న విషయాలైతే మరోలా ఉన్నాయి.

పోలీసులు ఏమంటున్నారు
బీబీసీకి 45 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ సహానీ అలీగఢ్ ఎన్‌కౌంటర్ నేపథ్యం గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఆయన కథలో ఒక కొత్త పాత్ర కూడా ఉంది. అది.. ఈటానగరంలో కాజీ హత్యా నేరంలో విచారణ ఎదుర్కుంటున్న సాబిర్ అలీ అలియాస్ దినేష్ ప్రతాప్ సింగ్.
"ఇటా జిల్లా వాసి అయిన సాబిర్ అలీ అసలు పేరు దినేష్ ప్రతాప్ సింగ్. అతను జాటవ్ కులానికి చెందినవాడు. మతం మార్చుకున్న తర్వాత కూడా రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొంది ఎటా కౌన్సిలర్‌గా ఉన్నాడు. మా దర్యాప్తులో అతడికి మొదట కిద్వాయ్ నగరంలో భూమి ఉండేదని తెలిసింది. తన భూమిలో కొంత భాగాన్ని సాబిర్ అలీ మదరసా నిర్మించడానికి ఇచ్చేశాడు. మదరసా నడపడానికి బీహార్ నుంచి షహజాద్ అనే ముఫ్తీని పిలిపించారు. మదరసా బాగా నడిచేది. ఇంతలో భూముల ధర పెరగడంతో సాబిర్ మదరసా భూమిని అమ్మాలనుకున్నాడు. కానీ ముఫ్తీ మదరసా వదిలి వెళ్లనన్నాడు. దాంతో చాలా గొడవల అనంతరం 2016లో సాబిర్ ఇద్దరు కిరాయి హంతకులతో ముఫ్తీని హత్య చేయించాడు" అని చెప్పారు.

ముఫ్తీ తనకు వస్తున్న బెదిరింపుల గురించి భార్య, పిల్లలకు చెప్పడంతో ఆయన ప్రాణభయం గురించి పోలీసులకు కూడా తెలుసు. ముఫ్తీ హత్య జరిగినపుడు ఆయన కుమారుడు ఘటనాస్థలంలో ఉన్నాడు. అతనే ఆ హత్యకు ప్రత్యక్ష సాక్షి.
ఇటా పోలీస్ 40 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిందని, సాబిర్, అతడి కొడుకును అరెస్టు చేసిందని అలీగఢ్ పోలీసులు తెలిపారు. జైల్లో సాబిర్‌ను అస్గర్, అఫ్సర్, పాషా అనే ముగ్గురు కలిశారు. వారంతా స్నేహితులయ్యారు.
సాబిర్ కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై బయటికొచ్చాడు. కానీ ముఫ్తీ హత్య కేసులో తనకు శిక్ష పడుతుందనే భయంతో అతడు అస్గర్, అఫ్సర్, పాషాను కూడా బెయిలుపై బయటకు తీసుకొచ్చాడు. బదులుగా ముఫ్తీ కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చిన వారిని అబద్ధపు కేసుల్లో ఇరికించాలని చెప్పాడు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
సహానీ వివరాల ప్రకారం నెల రోజులు పాటు అలీగఢ్‌లో జరిగిన హత్యల తర్వాత పోలీసులకు ఘటనా స్థలంలో ఒక పేపరు దొరికేది. అందులో కొన్ని పేర్లు, ఫోన్ నంబర్లు ఉండేవి.
అందులో హాజీ కౌసర్, జాన్ మహమ్మద్, ఫిరోజ్ అలియాస్ కాలే అనే ముగ్గురు ఇటా వాసుల పేర్లున్నాయి. ఈ ముగ్గురూ ముఫ్తీ హత్య కేసులో సాబిర్ అలీకి వ్యతిరేకంగా ప్రధాన సాక్షులు.
"పాలీ-ముంకీపూర్‌లో జరిగిన మొదటి హత్య ఘటన తర్వాత మాకు మొబైల్ నంబర్ల పేపర్ దొరికినప్పుడు మేం ఆ నంబర్ల ఆధారంగా దర్యాప్తు జరిపాం. ఘటనా స్థలంలో సాధువుల నుంచి దొంగిలించిన ఫోన్లతో ముగ్గురు సాక్షుల నంబర్లకు అర్థరాత్రి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడినట్టు తెలిసింది".
"మరో హత్య ఘటనలో కూడా అలాంటి ఆధారాల దొరికాయి. దాంతో మేం ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసిందని గుర్తించాం. నిజం తెలుసుకునేందుకు మేం ఇటాలో ఆ సాక్షులను పిలిపించి విచారించాం. ముగ్గురూ సాబిర్ అలీపైనే సందేహం వ్యక్తం చేశారు. అతడి నంబరుపై నిఘా పెట్టేసరికి అతరౌలీ లోని ఒక నంబరుతో అతడు ఎక్కువ మాట్లాడేవాడని గుర్తించాం. ఆ కాల్స్ భైంస్‌పాడాలోని ముస్తకీన్, నౌషాద్ ఇంటి నుంచి వచ్చేవని గుర్తించాం".
"సెప్టెంబర్ 18న భైంస్‌పాడాలో దాడి చేసి ఐదుగురినీ పట్టుకున్నాం కానీ ముస్తకీన్, నౌషాద్, అఫ్సర్ పారిపోయారని పోలీసులు చెప్పారు. అదే 20వ తేదీ ఉదయం నౌషాద్, ముస్తకీన్ దొంగిలించిన బైకుతో వెళ్తూ దొరికిపోయారు. ఇద్దరూ పోలీసుల కంట పడకుండా పారిపోవాలని ప్రయత్నించారు. కానీ ఖండ్హర్‌లో మేం వారిని చుట్టుముట్టాం. వాళ్లు పోలీసులపై కాల్పులు జరిపారు. దాంతో మేం ఆత్మరక్షణగా కాల్పులు జరపాల్సొచ్చింది. మా కాల్పుల్లో ఇద్దరూ చనిపోయారు" అని సహానీ చెప్పారు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
ఎన్‌కౌంటర్ గురించి వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా సహానీ "కాల్పుల్లో చనిపోయిన ముస్తకీన్, నౌషాద్‌ల కుటుంబాల గురించి ఏమీ తెలీదు. వీరంతా కుటుంబంలో వాళ్లనే పెళ్లిళ్లు చేసుకున్నారు. వీళ్లు తమ పేర్లు, ప్రాంతాలు మార్చేస్తూ ఉంటారు. వాళ్ల మూలాలు వెతుకుతూ మేం పశ్చిమ బెంగాల్ పురూలియా జిల్లా వరకూ వెళ్లొచ్చాం. బహుశా వాళ్లకు బంగ్లాదేశ్‌తో సంబంధాలు బయటపడచ్చు. వీళ్లిద్దరూ పాత నేరస్తులు. ముస్తకీన్ దొంగతనాల్లో జైలుకు కూడా వెళ్లాడు" అన్నారు.
అదే పోలీస్ సూపరింటెండ్‌ను నౌషాద్ గురించి ప్రశ్నిస్తే, అతని వివరాలు ఇంకా జైలు నుంచి తీయించాలని, త్వరలో ఆ వివరాలు కూడా తెలుస్తాయని అన్నారు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
పూజారి ఆయన కుటుంబం
ఈ పరిశోధనలో భాగంగా మేం మొదట పాలీ-ముకీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర హత్యల పరంపర మొదలైన భుడ్రా ఆశ్రమం చేరుకున్నాం. రూప్‌వాస్ గ్రామం మొదట్లో ఉన్న ఒక శివాలయానికి ఆనుకుని ఉన్న రెండు గదులనే అక్కడ భుడ్రా ఆశ్రమం అంటారు.
ఆశ్రమం ముందు ఒక మైదానం ఉంది. కొంతమంది వృద్ధులు అక్కడ చెట్ల కింద మంచాలపై కూచుని కనిపించారు. సెక్యూరిటీ కోసం ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆశ్రమం దగ్గరున్నారు. పక్కనే ఒక పోలీస్ పోస్ట్ కూడా కడుతున్నారు. ఆశ్రమం ముందు దుప్పట్ల చాటున ఒక సమాధి కనిపిస్తోంది. అక్కడున్న వాళ్లు అది చనిపోయిన సాధువు కాళిదాసుదని చెప్పారు. ఆగస్టు 12 రాత్రి కాళిదాసు హత్యకు గురైన తర్వాత అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టారన్నారు.
అక్కడే ఉన్న లాల్ రాం అనే వృద్ధుడు "గ్రామస్తులంతా చందాలు వేసుకుని సుమారు 50 ఏళ్ల ముందు ఈ గుడి కట్టాం. అప్పటి నుంచి కాళిదాసు ఇక్కడే ఉండేవారు. ఖుషీపూర్‌కు చెందిన మహేంద్ర శర్మ ఆయనతోపాటూ ఉండేవారు. ఆయన ఈ ఆలయం పూజారి" అన్నారు.
''రాత్రి పొలానికి నీళ్లు పెట్టిన సోంపాల్ కూడా గుడిలోనే ఉండిపోయారు. కాళిదాస్, మహేంద్ర, సోంపాల్ ముగ్గురూ డాబా పైన నిద్రపోతున్నారు. అప్పుడే వాళ్లపై దాడి జరిగింది. కాళిదాసు, సోంపాల్ చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పూజారి ప్రాణాలతో బయటపడ్డారు'' అని వివరించారు.
అక్కడే కూచున్న మఖన్ సింగ్ అనే మరో వృద్ధుడు, "వాళ్లను చాలా క్రూరంగా చంపారు. కర్రలతో కొట్టి తల పగలగొట్టారు. కాళిదాసు కళ్లు కూడా పొడిచేశారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
గొడవంతా భూమి గురించే...
అలీగఢ్ ఎన్‌కౌంటర్ గురించి అడిగినపుడు నా ఎదురుగా కూచున్న పంజాబీ సింగ్ అనే మరో గ్రామస్తుడు, "అసలు ఈ గొడవంతా ఆలయం భూమి గురించే. ఈ ఆలయం ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. కానీ ఈ ఏడాది మా పక్కనే ఉన్న పీడౌల్ గ్రామంలోని కొందరు వచ్చి ఆశ్రమం ఉన్న భూమిలో వాళ్ల గ్రామానికి చెందిన కొంతమందికి పట్టాలున్నాయన్నారు. ఇంకోసారి వాళ్లు సర్వేయర్‌ను కూడా తీసుకొచ్చారు. గుడి చుట్టూ ఉన్న భూమిని కొలిచి బాబాను ఆలయం వదిలి వెళ్లిపోవాలని బెదిరించి పోయారు" అని చెప్పారు.
అలీగఢ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముస్తకీన్, నౌషాద్ గురించి గ్రామస్థులను అడిగినపుడు వాళ్లు "ఈ హత్యలను పీడౌల్ గ్రామం వాళ్లే చేశారని గట్టిగా నమ్ముతున్నాం. బాబా హత్య తర్వాత ఆ గ్రామంలో కొందరిని అరెస్టు కూడా చేశారు. కానీ తర్వాత అందరినీ వదిలేశారు. తర్వాత ఈ ఇద్దరు కుర్రాళ్లను పట్టుకుని అకారణంగా చంపేశారు. రూపవాస్ బాబాను చంపితే ఆ ముస్లిం యువకులకు ఏమొస్తుంది చెప్పండి?" అన్నారు.
బీబీసీ పరిశోధనలో సాధువు కాళిదాసు హత్య జరిగిన 20 రోజుల తర్వాత పోలీసులు పీడౌల్ గ్రామంలో తులసి, బబ్లు అలియాస్ కలువా అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిందని, కానీ తర్వాత వాళ్లను వదిలేసిందని తెలిసింది.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
ప్రత్యక్ష సాక్షి కథనం
ఆలయంలో దాడి తర్వాత ప్రాణాలతో బయటపడి, ఈ కేసులో ఒకే ఒక ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఖుషీపురా గ్రామ పూజారి మహేంద్ర శర్మతో బీబీసీ మాట్లాడింది.
50 ఏళ్ల మహేంద్ర శర్మ, "నేను చాలా ఏళ్ల నుంచి బాబాతోపాటు ఆలయంలోనే ఉంటున్నా. ఒకరోజు అతరౌలీ నుంచి తహశీల్దార్, సర్వేయర్ ఆశ్రమానికి వచ్చారు. వాళ్లతోపాటు పీడౌల్ నుంచి విజయ అనే మహిళ కూడా వచ్చారు. మేలో వాళ్లు మళ్లీ ఆశ్రమానికి వచ్చారు. బాబాను ఇక్కడినుంచి వెళ్లిపోవాలన్నారు. బాబా ఏం మాట్లాడలేదు. మరోసారి వాళ్లు ఆశ్రమానికి వచ్చి బాబాను బెదిరించారు. వెళ్లకపోతే ఊరుకోం అన్నారు. ఆ తర్వాత రోజు రాత్రే ఆయన హత్యకు గురయ్యారు" అన్నారు.
ఘటన జరిగిన రాత్రిని గుర్తు చేసుకున్న మహేంద్ర, ''ఆ రోజు 9 గంటలకే మేమంతా నిద్రపోయాం. దాడి జరిగినప్పుడు నేను నిద్రపోతున్నా. కానీ, మమ్మల్ని బాగా కొట్టడం నాకు గుర్తుంది. మా ఊళ్లోవాళ్లు ఐదు రోజుల వరకూ నా చెవుల్లోంచి రక్తం వచ్చిందని చెప్పారు".
మీపై ఎవరు దాడి చేశారని ఆయన్ను అడిగినప్పుడు.. కాసేపు మౌనంగా ఉండిపోయిన మహేంద్ర భయపడుతూ, "వాళ్లు పీడౌల్ యువకులే" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
హర్దువాగంజ్‌లో మూడో హత్య
పాలీ ముకీంపూర్ తర్వాత సెప్టంబర్ 14 రాత్రి హర్దువాగంజ్ దగ్గరున్న దురౌనీ మాతా ఆలయంలో జరిగిన దాడిలో చనిపోయిన సాధువు రాంస్వరూప్ బంధువులను కలవడానికి మేం సఫేదాపురా వెళ్లాం. ఆలయానికి కాస్త దూరంలోనే ఉన్న ఊళ్లో ఒక చిన్న ఇంట్లో ఉన్న బాబా రాంస్వరూప్ కుటుంబం ఆయన మరణించిన షాక్ నుంచి కోలుకోలేదు.
మరణించిన సోదరుణ్ని మొదట తమ్ముడు సుందర్ లాల్ చూశారు. ఆయన బీబీసీతో ''ఉదయం పాలు తీసుకుని వెళ్లాను. అక్కడ బాబా దోమతెర ఉన్న మంచం కింద పడున్నారు. అక్కడంతా రక్తం కనిపించింది" అన్నారు.
బాబా రాంస్వరూప్ బంధువులు అలీగఢ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఇక బాబా హత్య కేసులో తమకు ఎప్పటికీ న్యాయం జరగదని అంటున్నారు.
సుందర్ లాల్ "మా బాబాను అతరౌలీ నుంచి వచ్చిన ఆ ముస్లిం కుర్రాళ్లిద్దరూ చంపారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. పోలీసులు ఆ కుర్రాళ్లపై బాబా హత్య కేసు తెరిచారని మాకు మీడియా ద్వారానే తెలిసింది. ఇప్పుడు వాళ్లిద్దరు కూడా చనిపోయారు. మా కేసు మూతబడింది. మేం ఈ ఘటనలో న్యాయం జరగాలని, సరైన విచారణ జరగాలని కోరుకున్నాం. కానీ న్యాయం లభిస్తుందో లేదో తెలీడం లేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
బాబా రాంస్వరూప్ హత్య ఘటన జరిగిన రాత్రి ఆలయం దగ్గర పొలంలో రైతు దంపతుల శవాలు కూడా దొరికాయి. ఆ దంపతులు కూడా అదే సఫేదాపురాలో ఉంటుంటారు. బాబా ఇంటి దగ్గర నుంచి మేం గ్రామానికి మరో వైపున్న ఆ దంపతుల ఇంటికి కూడా వెళ్లాం.
మృతుల కూతురు భావన ఇంటి తలుపు తెరిచింది. మృతుడి సోదరుడు లలిత్ కుమార్, తన అన్నావదినల పేర్లు యోగేంద్ర పాల్, విమలేష్ దేవి అని చెప్పారు.
‘‘ఆ రాత్రి మా అన్నావదినలు మా మొక్కజొన్న పొలంలో మందు కొట్టడానికి వెళ్లారు. వాళ్లు తిరిగి రాకపోవడంతో ఉదయం మేం వెతకడం ప్రారంభించాం. అప్పటికే ఆలయంలో రాంస్వరూప్ బాబా హత్య అందరికీ తెలిసిపోయింది. దాంతో మేం బాగా భయపడ్డాం. కాసేపట్లోనే అన్నయ్య శవం పొలంలో కనిపించింది. అక్కడి నుంచి సుమారు వంద మీటర్ల దూరంలో వదిన శవాన్ని పడేశారు'' అని లలిత్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
ఎముకలు విరిగి.. కళ్లు ఉబ్బి...
లలిత్‌తోపాటు ఉన్న రాజ్‌పాల్ అలీగఢ్ ఎన్‌కౌంటర్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు.
''ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు ఈ కేసును అణగదొక్కేశారు. స్థానిక ఎమ్మెల్యే దల్వీర్ సింగ్ మా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో ఈ కేసులో సరిగా దర్యాప్తు చేయాలని చెప్పారు. ఆ రోజు పోలీసులు కూడా మా గ్రామంలో ఉన్న కొందరికి ఈ హత్యతో సంబంధం ఉండచ్చని అన్నారు. మమ్మల్ని పిలిచి మూడు, నాలుగు రోజుల్లో కేసు ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ మాకు ఏం చెప్పలేదు. సెప్టెంబర్ 18న వాళ్లు పట్టుకున్న ఐదుగురి గురించి మీడియా ద్వారా తెలిసింది. 20న ఎన్‌కౌంటర్ కూడా జరిగిపోయింది" అని ఆయన అన్నారు.
లలిత్ వదినను చాలా తీవ్రంగా కొట్టారు. ఆమె శరీరంలో చాలా ఎముకలు విరిగిపోయాయి. కళ్లు కూడా ఉబ్బిపోయాయి. వాళ్లను ఏం చేశారో తెలీడం లేదు. వాళ్ల దగ్గర పాత మొబైల్ తప్ప వేరే ఏం లేదు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
ముస్తకీన్, నౌషాద్‌ల మృతిపై హినా వాదన
ఎన్‌కౌంటర్ మృతులు ముస్తకీన్, నౌషాద్‌ల ఇళ్ల ముందు పోలీసులు భారీగా ఉన్నారు. లోకల్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా అక్కడ మఫ్టీలో కనిపించారు. ఆ సమయంలో మృతుల బంధువుల వరకూ ఏదైనా మీడియా వెళ్లాలంటే అది అసాధ్యం. కానీ కాస్త కష్టపడ్డ తర్వాత నేను ముస్తకీన్ ఇంట్లోకి వెళ్లగలిగాను. అక్కడ ముస్తకీన్ భార్య హినా మూర్తీభవించిన విషాదంలా ఉంది.
తమ్ముడు, భర్త పోయిన బాధతో ఉన్న హినా ముఖంలో సాయం కోసం తపిస్తున్న మనిషి కనిపిస్తోంది.
హినా చెప్పిన కథ, పోలీసులు చెబుతున్న కథ పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ముస్తకీన్, నౌషాద్‌ను పోలీసులు తమ ఇంటి నుంచే సెప్టంబర్ 16నే తీసుకుపోయారని ఆమె చెప్పారు.
"ఆదివారం మధ్యాహ్నం పోలీసులొచ్చారు. ఇంట్లోకిరాగానే మా ఆయనను, మా తమ్ముడిని కొట్టడం మొదలుపెట్టారు. మా చుట్టుపక్కల అందరూ దీన్ని చూశారు. తర్వాత వాళ్లు ముస్తకీన్, నౌషాద్‌లను జీపులో ఎక్కించి తీసుకెళ్లారు. ఏ కారణం లేకుండానే వాళ్లిద్దరినీ తీసుకెళ్లి చంపేశారు. మధ్యలో కూడా పోలీసులు మళ్లీ మా ఇంటికొచ్చారు. ఇంట్లో అందరి ఆధార్ కార్డులు, నిఖా పేపర్లు తీసుకెళ్లారు. నా దగ్గరున్న 230 రూపాయలు కూడా తీసుకెళ్లారు. మూడోసారి వచ్చినపుడు నాకు వాళ్ల శవాలు చూపించడానికి తీసుకెళ్లారు. మా తమ్ముడి శవం చూడగానే కళ్లు తిరిగి పడిపోయాను. తనకు 17 ఏళ్లే. తన పళ్లు విరిగిపోయాయి. కళ్లు ఉబ్బిపోయాయి. తర్వాత పోలీసులు నాతో వేలిముద్రలు వేయించుకుని ఇంటికి పంపించేశారు'' అని హినా వివరించారు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC
ప్రభుత్వ వాదన
అలీగఢ్ ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వ వాదనను కూడా తెలుసుకోవడానికి మేం లక్నో సెక్రటేరియట్‌లో ఉన్న రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధి శ్రీకాంత్ శర్మతో మాట్లాడాం.
ఆయన "రాష్ట్రంలో సురక్షిత వాతావరణం ఉండేలా చూడడం ప్రభుత్వం మొదటి పని. ఇంతకు ముందు ఇక్కడ ఎస్పీ-బీఎస్పీ, కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది. అవి నేరస్థులను కాపాడేవి. మా పనితీరు మరోలా ఉంటుంది. ఈ ప్రభుత్వం నేరస్తులకు ఎలాంటి రక్షణ కల్పించదు. ఎవరైనా నేరం చేస్తే వారికి పోలీసులు వారి భాషలోనే సమాధానం ఇస్తారు. అంతేకాదు, ఎవరైనా యూనిఫాం వేసుకుని దాదాగిరీ చేసినా, వారిని కూడా వదిలి పెట్టం" అన్నారు.
దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోడానికి మేం ఉత్తర ప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్‌ను కలిశాం. అలీగఢ్ ఎన్‌కౌంటర్ గురించి అడిగితే ఆయన నా చేతికి రాష్ట్రంలో గత మూడేళ్లలో జరిగిన నేరాల రికార్డ్ ఇచ్చారు.
"ప్రశ్నలు ఎవరైనా లేవనెత్తచ్చు. కానీ, మీరే చూడండి. రాష్ట్రంలో నేరాలు తగ్గాయా లేదా? గణాంకాలు అవే చెబుతున్నాయి. దానితోపాటే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఎన్‌కౌంటర్‌పై మేజిస్ట్రేట్ విచారణ జరగాలి, జరుగుతుంది. అది చట్టం. నేను ఏ ఎన్‌కౌంటర్ గురించీ మాట్లాడలేను. మా మొదటి లక్ష్యం నేరస్థులను ప్రాణాలతో పట్టుకోవాలి. ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపడం తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాం. అలా చేయాలనేం లేదు. అన్ని ఎన్‌కౌంటర్లపైనా విచారణ జరుగుతోంది. ఇందులో ఎవరైనా పోలీసులు దోషులుగా తేలితే, వారిపై తగిన విచారణ జరిపిస్తాం" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జమాల్ ఖషోగ్జీ హత్య: 'ప్రపంచ చరిత్రలోనే అత్యంత హేయమైన కపట నాటకం' - డోనల్డ్ ట్రంప్
- దిల్లీ కాలుష్యానికి కారణం... హరిత విప్లవమేనా?
- విరాట్ కోహ్లి వీగన్‌గా ఎందుకు మారాడు? ఏంటా డైట్ ప్రత్యేకత?
- #MeToo: ఆరోపణలు చేసిన మహిళల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి?
- లండన్: అంబేడ్కర్ నివసించిన ఇంటిని ప్రతిరోజూ సందర్శించే పనిమనిషి స్ఫూర్తి గాథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








