#MeToo: ఆరోపణలు చేసిన మహిళల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Shutapa Paul/twitter
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘ఎంజే అక్బర్ నన్ను ఎలా వేధించారో రాసినప్పటినుంచి నా ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. అందరం కలిసి పోరాడితే మార్పు సాధ్యమే అనే నమ్మకం కలిగింది’ అంటారు పాత్రికేయురాలు గజాలా వహాబ్.
మాజీ కేంద్ర మంత్రి అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెండో మహిళ ఆమె.
భారత్‌లో మీటూ క్యాంపైన్ సృష్టించిన ప్రకంపనలు రాబోయే రోజుల్లో సమాజంలో వినిపిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మహిళలు ఇప్పుడు నోరు ఎలా విప్పారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఆ తరువాత వాళ్ల జీవితాలు ఎలా మారాయో తెలుసుకోవడం ముఖ్యం.
‘గతంలో మాట్లాడాలా వద్దా అనే సందిగ్ధంలో ఊగిసలాడేదాన్ని. కానీ, ఒక్కసారి నోరు తెరిచాక ఆ భయం పోయింది’ అన్నారు గజాలా.
ది వైర్ వెబ్ మేగజైన్‌లో పనిచేస్తున్న అనూ భుయాన్ అనే పాత్రికేయురాలు కూడా మీడియాలో లైంగిక వేధింపులకు సంబంధించి ట్వీట్ చేశారు. ‘నేను ట్వీట్ చేశాక, చాలామంది మహిళలు నన్ను ఆశ్రయించడం మొదలుపెట్టారు. మగవాళ్లు నా నుంచి దూరంగా జరిగారు. నాకు బాగా దగ్గరి మగవాళ్లు కూడా అలాగే వ్యవహరించడం మొదలుపెట్టారు’ అన్నారు అను.

ఫొటో సోర్స్, Ghazala wahab/facebook
#MeToo ఉద్యమం ఫలితంగానే ఎంజే అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. భవిష్యత్తులో అలాంటి పరిణామాలను చాలా చూసే అవకాశం ఉందని అను చెప్పారు. మహిళలు కలిసి పనిచేస్తే సమాజంలో మార్పు వస్తుందనడానికి ఈ ఉద్యమం ఓ సాక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
బాధను అనుభవించిన ఆడవాళ్లంతా ఇప్పుడు నోరు విప్పుతారని, పైఅధికారులకు భయపడి ఇకపై వాళ్లు వెనకడుగు వేయకపోవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇది వ్యక్తిగత పోరాటం కాదు. అక్బర్ విషయంలోలానే, అన్ని సందర్భాల్లోనూ కలిసి ముందడుగేస్తేనే లక్ష్యం సాకారమవుతుంది అన్నారామె.
‘మేం మిమ్మల్ని నమ్ముతున్నాం. మేం మీతో ఉన్నాం’... #MeToo ఉద్యమంలో భాగంగా మాట్లాడటం మొదలుపెట్టాక తనకు అన్నీ ఇలాంటి సందేశాలే వచ్చాయంటూ చెప్పారు ది ఏషియన్ ఏజ్ రెసిడెంట్ ఎడిటర్ సుపర్ణ శర్మ.
కుటుంబ సభ్యులతో పాటు అపరిచితులు కూడా తనకు అండగా నిలిచారని ఆమె అన్నారు. ‘‘ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా తెలియని వాళ్లు కూడా సందేశాలు పంపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా నన్ను ఆపి అభినందిస్తున్నారు. మొన్న ఓ పుస్తకాల దుకాణానికి వెళ్తే, ఇద్దరు పెద్దవాళ్లు నా దగ్గరకు వచ్చి, ‘మీరంతా చాలామంచి పని చేస్తున్నారు’ అని భుజం తట్టారు’ అంటున్నారామె.

ఫొటో సోర్స్, iStock
న్యూ క్రాప్ వ్యవస్థాపక ఎడిటర్ శుథాపా పాల్ కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు. ‘మొదట కొన్ని రోజులపాటు నా ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. అదే నా జీవితంలో వచ్చిన మొదటి మార్పు. మద్దతుగా వచ్చిన సందేశాలకైతే లెక్కేలేదు. అంతకుమించి జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదు’ అంటారామె.
అమెరికాలో ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కెవనా గురించి డాక్టర్.క్రిస్టీన్ ఫోర్డ్ అనే మహిళ ఇచ్చిన వాంగ్మూలమే తనకు స్ఫూర్తి అని అనూ భుయాన్ చెబుతారు. ఆమె కూడా తనలానే చాలాకాలంగా ఆ విషయాలు బయటపెట్టాలనుకొని పెట్టలేకపోయారని ఆమె అన్నారు. ‘వేధించినవాళ్లు సిగ్గుపడాలి కానీ, నేను కాదు అని చాలా సార్లు అనుకున్నా. మౌనంగా ఉండటానికి నాకు ఎలాంటి కారణం కనిపించలేదు. అప్పుడే కెవనా కేసు గురించి చదివా’ అన్నారామె.
ఆరోపణలపై స్పందించి రాజీనామా చేసినవాళ్లలో టైమ్స్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్) రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. సాజిద్ ఖాన్ ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రశాంత్ ఝా... హిందుస్తాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్‌గా, మయాంక్ జైన్... బిజినెస్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్‌గా తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. #MeToo సెగ తగిలిన వారిలో వీరు కొందరు.
‘ఆ వ్యక్తి రిజైన్ చేశాడు. ఏదో ఒకలా తాను చేసిన పనికి ఫలితాన్ని అందుకున్నాడు. అతడిపైన ఎదురైన ఆరోపణలను పరిశీలిస్తామని అతడు గతంలో పనిచేసిన సంస్థల యాజమాన్యాలు చెప్పాయి. వీటివల్ల భవిష్యత్తులో అతడికి ఉద్యోగం ఇచ్చేవాళ్లు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. మహిళలు ఆటబొమ్మలు కాదని, వాళ్లతో ప్రవర్తించే పద్ధతి అది కాదని ఇప్పటికైనా అతడికి తెలిసుంటుంది’ అని అను భూయాన్ తన ఆరోపణల పర్యవసానాలను వివరించారు.

#MeToo వల్ల సానుకూల చర్చలు మొదలవుతున్నాయని, దీని వల్ల పని ప్రదేశాలు మరింత సురక్షితంగా మారే అవకాశం ఉందని శుథాపా చెప్పారు.
‘ఈ పోరాటాలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. ఆఫీసుల్లో, కోర్టుల్లో కూడా వీటిపై పోరాడుతున్నాం. శక్తిమంతమైన స్థానాల్లో ఉన్న మగవాళ్లు మహిళలను సమానంగా చూడటం, గౌరవించడం మొదలుపెట్టేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది’ అని ది ఏషియన్ ఏజ్ రెసిడెంట్ ఎడిటర్ సుపర్ణ తెలిపారు.
కేసుల వల్ల నిజాలు అబద్ధాలుగా మారవని, కోర్టులో కూడా తాము గెలుస్తామని గజాలా వహాబ్ అన్నారు.
#MeToo వల్ల కేవలం కొందరి పేర్లు బయటపెట్టి అవమానపరచడం తప్ప, దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని కొందరు విమర్శిస్తారు. కానీ, గజాలా ఆ విమర్శలను ఒప్పుకోవట్లేదు. అలాంటి వాళ్లు అనే మాటలను తాను పట్టించుకోనని చెప్పారు.
ఈ ఉద్యమం వల్ల మహిళల ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఎలాంటి వేధింపులనైనా ఉపేక్షించేది లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారని గజాలా అన్నారు.
‘ఈ ఉద్యమం ఇంకా ఉద్ధృతమవుతుందని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ, ఇది ప్రారంభం మాత్రమే. దేశంలో ప్రతి రంగానికీ, ప్రతి నగరానికీ, ప్రతి గ్రామానికీ ఇది విస్తరించాలి. అప్పుడే పని ప్రదేశాలు అందరికీ సురక్షితంగా మారతాయి’ అంటారు గజాలా.
ఇవి కూడా చదవండి:
- నేను నిత్యం పూజించే అయ్యప్పపై నాకు కోపం వచ్చింది.. ఎందుకంటే
- సౌదీ అరేబియా: అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచానికి ఏమవుతుంది?
- రామ్‌లీల: ‘సంపూర్ణ రామాయణాన్ని’ తొలిసారి ప్రదర్శించింది ఇక్కడే
- కెనెడా: ఇకపై పెరట్లో నాలుగు గంజాయి మొక్కలు పెంచుకోవచ్చు
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








