ఎంజే అక్బర్: ప్రముఖ సంపాదకుడి నుంచి మంత్రి పదవికి రాజీనామా వరకు...

ఎంజే అక్బర్, లైంగిక వేధింపులు, #MeToo

ఫొటో సోర్స్, AFP/Getty Images

    • రచయిత, ప్రదీప్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గతం ఎన్నడూ మిమ్మల్ని వెంటాడడం మానదు. ఆ గతంలో ఏదైనా మరక ఉంటే అది మెరుపులాంటి కెరీర్‌కు గ్రహణంగా మారుతుంది. ఎంజే అక్బర్ విషయంలో అదే జరిగింది.

ఎంజే అక్బర్‌పై దాదాపు 20 మంది మహిళల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజమెంతో కోర్టులు తేల్చనున్నాయి.

ఆ ఆరోపణల ఒత్తిడితో ఆయన రాజీనామా చేయక తప్పింది కాదు. నిజానికి అక్బర్ రాజీనామా చేయడంలో ఆలస్యం చేశారా?

'ఏషియన్ ఏజ్‌'లో ఆయనతో కలిసి పని చేసిన సీమా ముస్తఫా, ''అక్బర్‌పై ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేసి ఉంటే, ఆయన గౌరవం కొంతైనా దక్కేది'' అన్నారు.

ఆయనపై సివిల్ సర్వెంట్లు కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేంత వరకు తెచ్చుకోకుండా ఉండాల్సిందని ఆమె అన్నారు.

రాజీనామా తర్వాత న్యాయపరమైన పోరాటంలో తీర్పు ఎలా వచ్చినా, అక్బర్ మాత్రం తన కెరీర్‌లో పతనాన్ని చేరుకున్నారనేది మాత్రం నిజం.

దేవానంద్

ఫొటో సోర్స్, JH THAKKER VIMAL THAKKER

దేవానంద్ పిచ్చి

ఎంజే అక్బర్ జనవరి 11, 1951న బిహార్‌లో జన్మించారు. హిందూ మతం నుంచి ఇస్లాంకు మారిన ఆయన కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి స్థిరపడింది. ఆయనకు మొదట పెట్టిన పేరు ముబాషిర్. అయితే పాఠశాలలో చేర్పించేప్పుడు ఆయన పేరును మొబాషర్ జావేద్ అక్బర్ అని రాశారు.

అక్బర్ స్వయంగా దీని గురించి తన 'బ్లడ్ బ్రదర్స్' అన్న పుస్తకంలో పేర్కొన్నారు. అదే పుస్తకంలో ఆయన హిందూ ముస్లిం సంబంధాల గురించి లోతుగా చర్చించారు.

ఈ పుస్తకంలో అక్బర్ తనను తాను దేవానంద్ అభిమానిగా చెప్పుకున్నారు.

'హమ్ దోనో' సినిమాలోని ''మై జిందగీ కా సాథ్ నిభాతా చలా గయా, హర్ ఫిక్ర్ కో ధుయె మే చలాతా గయా..' అక్బర్‌కు ఇష్టమైన పాట.

లైంగిక వేధింపుల ఆరోపణలకు ముందు అక్బర్ అన్ని సమస్యలను ధూళిలా తీసేసి ఉండొచ్చు కానీ, ఇప్పుడు ఆయన ఎదుట ఉన్న సమస్య చాలా పెద్దది.

షర్మిలా ఠాగూర్, ఎంజే అక్బర్, లైంగిక వేధింపులు, #MeToo

ఫొటో సోర్స్, Getty Images

50 పైసల పత్రికకు 5 రూపాయలు

ఇదే పుస్తకంలో అక్బర్ షర్మిలా ఠాగూర్‌ బికినీపై పూర్తిగా ఒక అధ్యాయమే రాశారు. 1967లో ఫిల్మ్ ఫేర్ పత్రిక కవర్ పేజీపై షర్మిల ఠాగూర్ 'ఎన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్' చిత్రంలోని బికినీ ఫొటోను ప్రచురించింది. 50 పైసల ఆ పత్రికను ఆయన ఐదు రూపాయలు ఇచ్చి కొన్నారు.

కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్ పూర్తి చేశాక, అక్బర్ 1971లో టైమ్స్ గ్రూప్‌లో ట్రైనీ జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు.

రెండేళ్ల లోపలే అక్బర్ ఫీచర్ రైటర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. టైమ్స్ గ్రూప్‌లో పని చేసే మల్లికా జోసెఫ్ ఆయన ప్రేమను అంగీకరించడంతో 1975లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

ఎంజే అక్బర్, లైంగిక వేధింపులు, #MeToo

ఫొటో సోర్స్, Getty Images

'సండే'పై ఆధిపత్యం

1976లో అక్బర్ ఆనంద బజార్ 'సండే' పత్రికను ప్రారంభించడం కోసం కోల్‌కతా వెళ్లారు. చూస్తుండగానే ఆ పత్రిక రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించడం ప్రారంభించింది. అక్బర్ దానిని అనతి కాలంలోనే భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేర్చారు.

అందుకే ఆయన సంపాదకీయ ప్రతిభను ప్రస్తుతించే వారు ఇప్పటికీ ఉన్నారు.

ఆయనతో కలిసి పని చేసిన శుభవ్రత్ భట్టాచార్య, ''నా దృష్టిలో అక్బర్ లాంటి సృజనాత్మక సంపాదకుడు ఇంత వరకు రాలేదు. జర్నలిజంలో అంతటి ముద్ర వేసిన సంపాదకులు మరొకరు లేరు'' అన్నారు.

జర్నలిజం ప్రారంభంలో అక్బర్‌కు హిందీ జర్నలిస్ట్ సురేంద్ర ప్రతాప్ సింగ్‌తో మంచి స్నేహం ఉండేది. టైమ్స్ గ్రూప్‌లో సురేంద్ర ఆయన బ్యాచ్ వారే. తర్వాత అక్బర్ సండే పత్రిక హిందీ ప్రచురణ 'రవివార్'కు ఆయనను సంపాదకుణ్ని చేశారు.

ఎస్‌పీ సింగ్ మరణించినప్పుడు అక్బర్ తమ స్నేహం గురించి, ''ముంబైలో కెరీర్ ప్రారంభించేందుకు చాలా మంది వచ్చేవాళ్లు. అలాంటి వాళ్లందరికీ మా ఫ్లాట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. వారంలో ఒక రోజు చికెన్, క్వార్టర్ రమ్ బాటిల్‌తో మా మేధోకార్యక్రమం ప్రారంభమయ్యేది'' అని గుర్తు చేసుకున్నారు.

ఎంజే అక్బర్, లైంగిక వేధింపులు, #MeToo

ఫొటో సోర్స్, Reuters

శిఖరాగ్రానికి 'టెలిగ్రాఫ్'

'సండే' విజయంతో ఆనంద్ బజార్‌కు అక్బర్‌పై నమ్మకం పెరిగింది. దాంతో 1982లో మొట్టమొదటి ఆధునిక పత్రిక 'టెలిగ్రాఫ్' ప్రారంభించారు. లేఔట్, డిజైన్ విషయంలో అది నూతన ఒరవడిని సృష్టించింది. డెస్క్‌లో ఉండే జర్నలిస్టులకూ బైలైన్ ఇచ్చే ఒరవడిని అక్బర్ ప్రోత్సహించేవారని శుభవ్రత్ భట్టాచార్య తెలిపారు.

'టెలిగ్రాఫ్'లో మొదటి పేజీలోనే అర పేజీలో ఫొటోనే ఉండేది. ఫొటోగ్రాఫర్లను కూడా ప్రధాన స్రవంతి జర్నలిజంలోకి తీసుకొచ్చిన ఘనత అక్బర్‌దే. దాంతోపాటు 600 పదాలతో బిగ్ స్టోరీని, 300 పదాలతో స్టోరీని తయారు చేసే పద్ధతికి అక్బర్ శ్రీకారం చుట్టారు.

ఆ సమయంలో ఆయనతో కలిసి పని చేసిన అనేక మంది జర్నలిస్టులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రజలకు 600 పదాలకు మించిన కథనాలు ఇష్టం ఉండవని అక్బర్ అనేవారు.

దూరదర్శన్‌లో 'న్యూస్ లైన్' కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం అక్బర్ కెరీర్‌లో అత్యున్నత దశ. 1986-87లో అది చాలా పాపులర్ షో. అక్బర్ ఆ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులను ఆహ్వానించేవారు. సామాన్యులు వారిని ప్రశ్నించేవారు.

ఆ కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఖమర్ వహీద్ నఖ్వీ, ''ఆ రోజుల్లో ఆ షో పై చాలా చర్చ జరిగేది. సామాన్యులు మంత్రులను ప్రశ్నించవచ్చనే విషయం చాలా మందికి నమ్మశక్యం కాదు'' అన్నారు.

ఎంజే అక్బర్ రాజీవ్ గాంధీకి చాలా దగ్గర అని భావించేవారు. నాటి కాలాన్ని గుర్తు చేసుకుంటూ సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్, ''అక్బర్ కాంగ్రెస్‌ను పత్రికలలో విమర్శించేవారు, కానీ రాజీవ్‌ను మాత్రం పొగుడుతూ ఉండేవారు. అలా ఆయన రాజీవ్ గాంధీ దృష్టిలో పడ్డారు'' అని తెలిపారు.

రాజీవ్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ ప్రవేశం

'ఏషియన్ ఏజ్'లో అక్బర్‌తో కలిసి పని చేసిన రషీద్ కిద్వాయ్, ''అక్బర్ చాలా అద్భుతమైన సంపాదకులు. అయితే ఆయనకు రాజకీయ ఆశయాలూ ఉండేవి. అధికారంలో ఉన్నవాళ్ల చెంత కూర్చోవడం ఆయనకు మొదటి నుంచీ ఇష్టం. అందుకే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు'' అని తెలిపారు.

కాంగ్రెస్‌కు సన్నిహితంగా మారిన అక్బర్ 1989 ఎన్నికలలో ఆ పార్టీ టికెట్ పైనే బిహార్‌లో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే కిషన్ గంజ్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన 35 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఆయన రాజీవ్ గాంధీ అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. అయితే 1991లో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా సెక్యులర్ రాజకీయ వర్గాలలో అక్బర్ పేరు తరచుగా వినిపించేది.

ఇదే సమయంలో అక్బర్‌ రాజకీయవేత్తగా, రచయితగా కూడా మంచి పేరు సంపాదించకున్నారు. 1990లో 'నెహ్రూ - ద మేకింగ్ ఆఫ్ ఇండియా', 1991లో 'రైట్ ఆఫ్టర్ రైట్' పుస్తకాలు బెస్ట్ సెల్లర్‌లుగా నిలిచాయి.

ఎంజే అక్బర్, లైంగిక వేధింపులు, #MeToo

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయాల నుంచి మళ్లీ పత్రికా రంగానికి..

అయితే అక్బర్ అక్కడితో ఆగిపోలేదు. రాజకీయాల నుంచి తిరిగి ఆయన పత్రికా రంగానికి వచ్చారు. 1993లో దిల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వార్తాపత్రిక 'ఏషియన్ ఏజ్' ప్రారంభమైంది.

ఇక్కడ పని చేస్తున్నపుడే తమపై లైంగిక వేధింపులు జరిగాయని చాలా మంది ఆరోపిస్తున్నారు.

అందుకే అంతకు ముందు ఆయనతో కలిసి పని చేసిన వారు ఈ ఆరోపణలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అక్బర్ తమతో కలిసి పని చేసేప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదని శుభవ్రత్ భట్టాచార్య అన్నారు. ''స్టార్ డస్ట్‌లో పని చేసేప్పుడు అక్బర్ కేబిన్, శోభా డే కేబిన్ కలిసి ఉండేవి. అప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదు. తవ్లీన్ సింగ్, మధు జైన్‌లాంటి వారు కూడా ఆ సమయంలో ఆయనతో కలిసి పని చేశారు. వాళ్లు కూడా అక్బర్‌పై ఎన్నడూ ఇలాంటి ఆరోపణలు చేయలేదు'' అని ఆయన అన్నారు.

ఎంజే అక్బర్, లైంగిక వేధింపులు, #MeToo

ఫొటో సోర్స్, Getty Images

కలుషితమైన వాతావరణం

కానీ క్రమక్రమంగా అక్బర్‌లో మార్పులు రావడం ప్రారంభించాయి. ఆయన ఎప్పుడేం అనుకుంటే, అవి జరిగేవని ఆయన సన్నిహితుడొకరు తెలిపారు.

ఏషియన్ ఏజ్‌లో పని చేసే రోజుల గురించి గుర్తు చేసుకుంటూ సీమా ముస్తఫా, ''లైంగిక వేధింపుల గురించి ఎవరూ బైట మాట్లాడేవాళ్లు కాదు. కానీ ఆఫీసులో వాతావరణం చాలా కలుషితమై పోయింది. జరుగుతున్న విషయాల గురించి అందరికీ తెలుసు. అయితే ఆ సమయంలో ఎవ్వరూ ధైర్యం చేసి ఫిర్యాదు చేయలేకపోయారు'' అని తెలిపారు.

అక్బర్ 2008లో 'ఏషియన్ ఏజ్' నుంచి బైటికి వచ్చి 'కోవర్ట్' పత్రికను ప్రారంభించారు. 2010లో ఆయన 'ఇండియా టుడే' గ్రూప్‌కు ఎడిటోరియల్ డైరెక్టర్ అయ్యారు.

2014లో ఆయన బీజేపీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట పార్టీ అధికార ప్రతినిధిగా తర్వాత మోదీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఈ పరిణామంపై సీమా ముస్తఫా, ''ఆరెస్సెస్, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా తాను 30-40 ఏళ్ల పాటు చెప్పిన లౌకికవాదాన్ని తోసిపుచ్చి అక్బర్ బీజేపీలో చేరారు'' అన్నారు.

ఎంజే అక్బర్, లైంగిక వేధింపులు, #MeToo

ఫొటో సోర్స్, Getty Images

'సెల్ఫ్ మేడ్' వ్యక్తిత్వం

అక్బర్‌పై ఆరోపణలను మోదీ ప్రభుత్వం మొదట్లో చూసీ చూడనట్లు వదిలేయడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారని కొందరు విశ్లేషకులు అంటారు. దోవల్‌కు అక్బర్‌తో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి.

అక్బర్‌ను దగ్గరగా చూసిన వ్యక్తుల ప్రకారం ఆయనది 'సెల్ఫ్ మేడ్' వ్యక్తిత్వం. చదవడం, రాయడం, జాతీయ అంతర్జాతీయ రాజకీయాలంటే ఆయనకు చాలా ఇష్టం.

ఆయనతో కలిసి పని చేసిన జర్నలిస్టు ఒకరు, ''ఆయన రాజకీయాలలోకి వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండేది. రాజకీయాల్లోకి వెళ్లిన వాళ్లకు ఒక రకమైన అధికార దర్పం అలవడుతుంది. అక్బర్ విషయంలో అదే జరిగింది. లేకపోతే అయిన చాలా మంచి సంపాదకుడు'' అన్నారు.

ఆయన సంపాదక ప్రావీణ్యంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ.. అధికార కేంద్రంగా ఉన్న రాజీవ్ గాంధీ లేదా పీవీ నరసింహారావు లేదా నరేంద్ర మోదీ.. వీళ్లందరినీ అక్బర్ పొగిడారన్నది కాదనలేని విషయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)