కెనెడాలో గంజాయికి అనుమతి: ఇకపై పెరట్లో నాలుగు మొక్కలు పెంచుకోవచ్చు

చట్టబద్ధంగా గంజాయిని కొన్న బిల్లు చూపిస్తున్న వ్యక్త

ఫొటో సోర్స్, Reuters

గంజాయి వాడకాన్ని కెనెడా దేశం చట్టబద్ధం చేసింది. గంజాయిని కలిగి ఉండటం, ఉల్లాసం కోసం గంజాయి వినియోగం ఇకపై ఆ దేశంలో నేరం కాదు. ఉరుగ్వే దేశం తర్వాత పరిమిత మోతాదులో గంజాయిని కలిగి ఉండటాన్ని, వాడకాన్ని చట్టబద్ధం చేసిన రెండో దేశం కెనెడానే!

ప్రజారోగ్యం, శాంతిభద్రతలపై చాలాకాలంగా వినిపిస్తున్న ప్రశ్నల మధ్య.. కెనెడాలో అక్కడక్కడా బుధవారం రాత్రి గంజాయి అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

తాజాగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం..

ఒక కుటుంబం 4 గంజాయి మొక్కలను మాత్రమే పెంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మొక్కలను పెంచడం నేరం అవుతుంది.

బహిరంగ ప్రదేశాల్లో ఒక వ్యక్తి 30 గ్రాముల ఎండు గంజాయి(ఒక ఔన్స్)ని కలిగి ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ మోతాదులో గంజాయిని కలిగి ఉండటం నేరం అవుతుంది.

గంజాయి ఆయిల్, గంజాయి విత్తనాలు, గంజాయి మొక్కలను, ఎండిన గంజాయి ఆకును లైసెన్సు కలిగిన వ్యాపారుల నుంచి పెద్దవారు కొనుగోలు చేయొచ్చు.

మైనర్లకు ఈ డ్రగ్‌ను అమ్మినవారికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ, మైనర్లకు మద్యం అమ్మేవారికి వేసే శిక్షలకంటే గంజాయి అమ్మేవారికి వేసే శిక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయని విమర్శకుల అభిప్రాయం.

గంజాయిని ఎలాంటి ప్రాంతాల్లో అమ్మాలి? ఎలాంటి ప్రాంతాల్లో సేవించాలి? అన్న నిబంధనలు విధించే బాధ్యత కెనెడాలోని ప్రావిన్సులదే.. గంజాయి అమ్మకం, వాడకం విషయాల్లో ప్రావిన్సుల మధ్య తేడాలు ఉండొచ్చు.

దేశంలోనే తొలిసారిగా చట్టబద్ధమైన గంజాయిని అమ్మడానికి న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రావిన్సులోని షాపులను అర్ధరాత్రి వరకు తెరిచే ఉంచారు.

కానీ.. కెనెడాలో ఉల్లాసం కోసం గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయడం వల్ల పరిణామాలు ఏవిధంగా ఉంటాయి లాంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకాల్సివుంది.

చట్టబద్ధం చేసిన మొదటి సంవత్సరంలో గంజాయి నిల్వల కొరత ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో గంజాయి ఉత్పత్తి.. మార్కెట్లో దానికున్న డిమాండ్‌ను అందుకోవలసివుంది.

రిటైల్ దుకాణాలు అధిక సంఖ్యలో ప్రారంభమయ్యేవరకూ లైసెన్సు లేని దుకాణాల నిర్వహణ మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది. పోలీసులు ఇలాంటి దుకాణాలపై చర్యలు తీసుకుంటారా లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తారా ఇంకా స్పష్టం కాలేదు.

గంజాయి కొనడానికి క్యూలో నిల్చున్న ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

పరిణామాలు - ప్రమాదాలు

జెస్సికా మర్ఫీ, బీబీసీ వాన్కూవర్(కెనెడా) ప్రతినిధి

గంజాయిని చట్టబద్ధం చేయడం అన్నది గత కొన్ని నెలలుగా దేశంలో ఓ ప్రధానాంశంగా మారింది. ఆరోజు రానే వచ్చింది. ఈ కొత్త చట్టం దేశాన్ని ఎలా మారుస్తుందో కెనెడా ప్రజలు చూడబోతున్నారు.

కానీ ఇది కెనెడా అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు. పరిమిత మోతాదులో గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేస్తూ కెనెడా చేసిన ప్రయోగాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి.

2019లో ఫెడరల్ ఎన్నికలు ఉండగా కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్న ఈ నిర్ణయం విజయవంతం అవుతుందా అన్నది, ఆయన నిర్దేశించుకున్న లక్ష్యాలపైనే ఆధారపడివుంది.

కెనెడాలో అత్యధికంగా గంజాయిని వాడుతున్నది ఆ దేశ యువత మాత్రమే. ఈ నేపథ్యంలో యువత గంజాయి వాడకాన్ని నియంత్రించడం, గంజాయి చట్టాల తీవ్రతను తగ్గించడం, అక్రమంగా జరిగే డ్రగ్ వ్యాపారాన్ని తగ్గించడం.. ఇవీ జస్టిన్ ట్రూడో నిర్దేశించుకున్న లక్ష్యాలు.

ఈ కొత్త చట్టం సానుకూల ఫలితాలను ఇవ్వగలిగితే, ఇతర దేశాలు కూడా ఇలాంటి చట్టాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది.

కెనెడాలో గంజాయిపై నిషేధం ఎందుకు ఎత్తివేశారు?

2015 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉల్లాసం కోసం గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేస్తానని ఇప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడ్ హామీ ఇచ్చారు.

కెనెడాలో వంద సంవత్సరాలకు పైబడిన, కాలం చెల్లిన డ్రగ్ నిషేధ చట్టం వల్ల ఉపయోగం లేదన్నది ఆయన వాదన. పాత చట్టం అమల్లో ఉన్నప్పటికీ, ప్రపంచంలో గంజాయి వాడకం ఎక్కువగా ఉన్న దేశం కెనెడానే!

ఈ సరికొత్త చట్టం వల్ల మైనర్లు గంజాయి వాడకుండా జాగ్రత్త పడటంతోపాటు డ్రగ్స్ వ్యాపారుల అక్రమ సంపాదనను ప్రభుత్వ ఖజానాకు మళ్లించవచ్చని, గంజాయి అమ్మకాల వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి 400మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ట్రూడో అన్నారు.

డిస్పెన్సరీ

ఫొటో సోర్స్, Getty Images

1923లో మొదటిసారిగా గంజాయి వాడకాన్ని నేరంగా పరిగణించారు. కానీ ఔషధ తయారీలో గంజాయి వాడకాన్ని 2001లో అనుమతించారు.

2013లో ప్రపంచంలోనే తొలిసారిగా ఉరుగ్వేలో ఉల్లాసం కోసం గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేశారు. ఈ చట్టం చేసిన రెండో దేశం కెనెడా.

అమెరికాలోని చాలా రాష్ట్రాలు కూడా గంజాయిపై నిషేధం ఎత్తివేయడానికే మొగ్గు చూపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)