మోదీ ప్రభుత్వంలో రాజీనామాలు ఎందుకు జరగవు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ త్రివేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘లేదు లేదు బ్రదర్... ఈ ప్రభుత్వంలో మంత్రులు రాజీనామా చేయరు. ఇది యూపీఏ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం’... 2015 జూన్‌లో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ అన్న మాటలివి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన మాటలు నిజమేననిపిస్తాయి.
గతంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీని లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశాయి. ఆమె విద్యార్హతల విషయంలో వివాదాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో అవి ట్రెండింగ్‌గా మారాయి. న్యూస్ ఛానెళ్లలో ఆ అంశంపై గంటల తరబడి చర్చలు జరిగాయి. కానీ, ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన ‘రాజీనామా’ మాత్రం జరగలేదు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొదట ఈ ఆరోపణలు ఎదురైనప్పుడు ఆయన నైజీరియాలో ఉన్నారు. తిరిగొచ్చాక ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని చాలామంది భావించారు. కానీ, అలా జరగలేదు.
మహిళ భద్రత కోసం ‘బేటీ బచావో, బేటీ పడావో’ లాంటి నినాదాలు చేసే ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రిపై వేధింపుల ఆరోపణలు ఎదురైనప్పుడు, ఆయన ఎందుకు రాజీనామా చేయరనే సందేహం చాలామందికి కలుగుతోంది.
ఇదొక్కటే కాదు, మోదీ ప్రభుత్వంలో మంత్రులు గతంలో వివాదాల్లో చిక్కుకున్నప్పుడు రాజీనామా చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. దీనిపై సీనియర్ పాత్రికేయురాలు నీరజా చౌదరి మాట్లాడుతూ... ‘ మహిళలు బహిరంగంగా ఓ మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను రాజీనామా చేయమని ప్రభుత్వ కోరకపోతే, మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేసే నినాదాలన్నీ ఒట్టి మాటలే అనుకోవాలి’ అన్నారు.
కానీ, అజయ్ సింగ్ అనే పాత్రికేయుడు ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ‘ప్రజల డిమాండ్ మేరకు మంత్రి పదవి దక్కదు. కాబట్టి, ఎవరో డిమాండ్ చేశారని రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ విచారణ సంస్థలు ఈ ఆరోపణలు చేస్తే అప్పుడు ఆలోచించాలి’ అని ఆయన అన్నారు.
మోదీ ప్రభుత్వం - వివాదాలు

ఫొటో సోర్స్, PIB
నిహాల్ చంద్ మేఘ్వాల్
2014లో నిహాల్ చంద్ మేఘ్వాల్‌ను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రిగా మోదీ నియమించారు. అదే ఏడాది ఆయనపైన అత్యాచార ఆరోపణలు ఎదురయ్యాయి. కానీ, ఆయన మంత్రి పదవిని తొలగించలేదు. ఏడు నెలల తరువాత ఆయన శాఖను మాత్రం మార్చారు.
నిజానికి ఆ కేసు 2011లో నమోదైంది. కానీ, ఆయన మంత్రయ్యాకే దానికి ప్రాధాన్యం దక్కింది. 2016లో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. అంటే, ఆరోపణలు ఎదురైన రెండేళ్ల వరకూ కూడా ఆయన మంత్రిగా కొనసాగారు.

ఫొటో సోర్స్, SMRITI IRANI/FACEBOOK
స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ 2014లో అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. కానీ, ఆమె కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి పదవి చేపట్టాక ఆమె రకరకాల కారణల వల్ల వార్తల్లో నిలిచారు.
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపైన ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె ‘డిగ్రీ’ నకిలీదనే ఆరోపణలు ఎదురయ్యాయి. వీటితో పాటు అనేక ఇతర వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి.
ఈ విషయాల్లో ఆమెను విమర్శించిన వారితో పాటు, ఆమెకు మద్దతిచ్చిన వారూ ఉన్నారు. కానీ, పాత్రికేయుల సమావేశం పెట్టి మరీ కాంగ్రెస్ ఆమె రాజీనామాను డిమాండ్ చేసింది. ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి వైదొలగమని కొన్ని విద్యార్థి సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యా తీసుకోలేదు.
2016లో ఆమె మంత్రిత్వ శాఖను మార్చారు. ఆపైన ఆమెకు సమాచార, ప్రసార శాఖ బాధ్యతలు దక్కాయి. అక్కడా ఇరానీని వివాదాలు వదల్లేదు. నకిలీ పాత్రికేయులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలన్న ఆమె నిర్ణయం పత్రికల్లో ప్రధాన శీర్షికగా మారింది. ఆ నిర్ణయానికి ఎంతగా వ్యతిరేకత వచ్చిందంటే... స్వయంగా ప్రధాని మోదీయే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
ఆ వివాదం నేపథ్యంలో సమాచార, ప్రసారాల శాఖ నుంచి ఇరానీని తప్పించినా, ఇప్పటికీ ఆమె కేంద్ర మంత్రిగానే కొనసాగుతున్నారు.

ఫొటో సోర్స్, PTI
సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే
వ్యాపారవేత్త లలిత్ మోదీకి సహాయం చేశారంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదురయ్యాయి. లలిత్ మోదీ, వసుంధరా రాజే కలిసున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.
వసుంధరా రాజే తనకు అనుకూలంగా ప్రమాణ పత్రం ఇచ్చారని స్వయంగా లలిత్ మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వ్యాఖ్యలను వసుంధరా రాజే ఖండించినా, లలిత్ మోదీ కుటుంబంతో ఆమెకు సాన్నిహిత్యం ఉందని చాలామంది నమ్ముతారు.
లలిత్ మోదీ భార్య పోర్చుగల్ వెళ్లడంలో సుష్మా స్వరాజ్ సహాయం చేశారు. ఆమె కేన్సర్ చికిత్స కోసం మాత్రమే పోర్చుగల్ వెళ్లేందుకు సహాయం చేశానని, అది మానవతా దృక్పథంతో మాత్రమే చేసిన పని అని ఆమె అన్నారు.
కానీ, వాళ్లిద్దరూ తప్పు చేశారని, తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఓ దశలో వసుంధరా రాజే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని భావించారు. కాలక్రమంలో ఆ వివాదాలు మరుగున పడిపోయాయి.

ఫొటో సోర్స్, AFP
సురేష్ ప్రభు
శివ సేనను వదిలి బీజేపీలో చేరిన కొన్ని గంటల్లోనే సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలంలో అనేక రైలు ప్రమాదాలు జరిగాయి. దాని వల్ల ఆయన విమర్శల పాలయ్యారు.
ఈ నేపథ్యంలో 2017 ఆగస్టులో ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించారు. మోదీ ప్రభుత్వంలో ప్రమాదాలకు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తానన్న తొలి మంత్రి సురేష్ ప్రభు. కానీ, ఆయన రాజీనామాను ఆమోదించలేదు. నెల రోజుల తరువాత ఆయన్ను రైల్వే మంత్రి పదవి నుంచి తప్పించి, వాణిజ్య పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు.
అలా, మోదీ ప్రభుత్వంలో మంత్రులు రాజీనామా చేయరని చెప్పకనే చెప్పారు.

ఫొటో సోర్స్, @ARUNJAITLEY
అరుణ్ జైట్లీ
‘దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని 2015లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ విషయం కోర్టుల వరకూ వెళ్లింది. తర్వాత కేజ్రివాల్ జైట్లీని క్షమాపణ కోరారు.
దేశాన్ని వదలి వెళ్లడానికి ముందు తాను అరుణ్ జైట్లీని కలిశానని బ్యాంకులకు రూ. 9వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడు విజయ్ మాల్యా చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు ఎదురయ్యాయి.
కానీ, ఇప్పటికీ ఆయనే కేంద్ర ఆర్థిక మంత్రి.
యూపీఏ ప్రభుత్వంలో రాజీనామాలు జరిగాయా?
యూపీఏ పదేళ్ల పాలనా కాలంలో ముగ్గురు మంత్రులను పదవీచ్యుతులను చేయడంలో బీజేపీ విజయం సాధించింది.
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసు నేపథ్యంలో 2013లో న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ రాజీనామా చేశారు.
రైల్వేలో అవినీతి కేసులో నాటి రైల్వే మంత్రి పవన్ బన్సల్ 2013లో రాజీనామా చేశారు.
2010లో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల వివాదం నేపథ్యంలో టెలికాం శాఖా మంత్రి ఎ.రాజా రాజీనామా చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాజీనామాల రాజకీయం
ప్రస్తుతం అక్బర్‌పై ఆరోపణలు కొందరు వ్యక్తులు మాత్రమే చేస్తున్నారని, అవి రుజువైతే కథ మరోలా ఉంటుందని, ప్రస్తుతానికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని తాను భావించట్లేదని పాత్రికేయుడు అజయ్ సింగ్ చెప్పారు.
సీనియర్ పాత్రికేయురాలు నీరజా చౌదరి మాత్రం దీన్ని నైతికతకు సంబంధించిన అంశంగా అభివర్ణించారు. ‘గతంలో నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసేవారు. ఇప్పుడా సంస్కృతి పోయింది. అధికారంలో ఉన్నవాళ్లదే రాజ్యంగా మారింది’ అని ఆమె అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో, ఆ వ్యక్తిపై విచారణ సజావుగా సాగే అవకాశం లేదని, అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు.
తమ మంత్రులు రాజీనామా చేయరని మూడున్నరేళ్ల క్రితం రాజనాథ్ సింగ్ అన్న వెంటనే, గత ప్రభుత్వ మంత్రులు చేసిన తప్పులను తమ మంత్రులు చేయరని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే... ఆయన వ్యాఖ్యలు సబబేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








