బీబీసీ రియాలిటీ చెక్ : ప్రధాని మోదీ మాట నిజమేనా? మిగతా వారికన్నా ఎక్కువ విమానాశ్రయాలు కట్టించారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
భారతదేశంలో విమానాశ్రయ నిర్మాణాల వెల్లువ తన వల్లే సాధ్యమైందన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట నిజమేనా?
దేశంలో ఇప్పుడు 100 విమానాశ్రయాలు ఉన్నాయని.. అందులో 35 విమానాశ్రాయాల నిర్మాణం.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన గత నాలుగేళ్లలోనే పూర్తయిందని ప్రధాని మోదీ గత వారంలో ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు సంధిస్తూ.. ‘‘స్వాతంత్రం వచ్చిన తర్వాత 67 ఏళ్లలో.. 2014 వరకూ కేవలం 65 విమానాశ్రయాలే ఉన్నాయి. అంటే, సగటున ఏడాదికి ఒక విమానాశ్రయం’’ అని కూడా మోదీ వ్యాఖ్యానించారు.
ప్రధాని చెప్పిన లెక్క ప్రకారం, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున దాదాపు తొమ్మిది విమానాశ్రయాలు చొప్పున నిర్మించారు.
మరైతే, ఈ మాటలన్నీ అధికారిక లెక్కల ఆధారంగా చెబుతున్నవేనా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాణికుల డిమాండ్
దేశంలో పౌర విమానయాన సదుపాయాల కల్పన బాధ్యతలు నిర్వర్తించే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. తన వెబ్‌సైట్‌లో 101 విమానాశ్రయాల జాబితాను చూపుతోంది.
పౌర విమానయానాన్ని నియంత్రించే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా 2018 మార్చి 31 నాటికి దేశంలో 101 విమానాశ్రయాలు ఉన్నట్లు చెబుతోంది.
అయితే, గత సంవత్సరాలలోకి తొంగి చూస్తే ఈ దృశ్యం సంక్లిష్టంగా మారుతుంది.
దేశీయ విమానాశ్రయాలకు సంబంధించి డీజీసీఏ కింది విధంగా లెక్క చెప్తోంది:
2015లో 95 విమానాశ్రయాలు ఉన్నాయి.. అందులో 31 విమానాశ్రయాలు ‘ఉపయోగంలో లేవు’
2018లో 101 విమానాశ్రయాలు ఉన్నాయి.. అందులో 27 విమానాశ్రయాలు ‘ఉపయోగంలో లేవు’
అంటే.. ఈ లెక్కలను బట్టి.. 2015 నుంచి ఇప్పటివరకూ కేవలం ఆరు విమానాశ్రయాలే పెరిగాయి. లేదంటే ‘ఉపయోగంలో ఉన్న’ విమానాశ్రయాలు 10 పెరిగాయి.
ఈ లెక్కన 2014 నుంచి నిర్మించామని మోదీ చెప్తున్న 35 విమానాశ్రయాలకన్నా ఇది చాలా తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబర్ నెలలో దిల్లీలో జరిగిన ఒక విమానయాన సదస్సులో విమానాశ్రయాల నిర్మాణం విషయంలో భారతదేశాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అధిపతి అలెక్జాంద్ర దె జ్యునియాక్ ప్రశంసించారు.
‘‘గత దశాబ్ద కాలంలో భారత విమానాశ్రయ సదుపాయాలు ఎలా మారాయన్నది అద్భుతం’’ అన్నది ఆయన చేసిన అసలు వ్యాఖ్య.
అంటే, 2014లో బీజేపీ అధికారంలోకి రావటానికి ముందరి కాలం కూడా ఇందులో ఉంది.
అలాగే, గత నాలుగేళ్లలో ప్రారంభించిన ఏ విమానాశ్రయమైనా అవి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తయినప్పటికీ.. వాటిని ఇంతకుముందలి ప్రభుత్వాలు ప్రారంభించినవే అయి ఉండవచ్చు.
‘‘ఒక విమానాశ్రయాన్ని నిర్మించటం కోసం.. ప్రయాణికుల డిమాండ్ ఎలా ఉండబోతోందనేది అంచనా వేయటం, తగిన స్థలాన్ని సేకరించటం, అవసరమైనన్ని నిధులు సమీకరించటం వంటివి పూర్తిచేయాల్సి ఉంటుంది. అంటే, ప్రారంభించటానికి చాలా ఏళ్ల ముందుగానే సదరు విమానాశ్రయానికి ప్రణాళిక జరుగుతుంది’’ అని బ్రిటన్‌లోని లోబరో యూనివర్సిటీలో విమానాశ్రయ సదుపాయాల నిపుణురాలు ల్యూసీ బడ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విమానయాన వెల్లువ
భారతదేశానికి మరింత ఎక్కువగా విమానాశ్రయ సామర్థ్యం అవసరమవుతుందన్న విషయంలో సందేహం లేదు. విమానాశ్రయ సదుపాయాలను విస్తరించటానికి ప్రస్తుత ప్రభుత్వం ఉత్సాహంగా ప్రణాళికలు రచిస్తోంది.
ప్రాంతీయ విమానయాన వ్యవస్థను విస్తరించటానికి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరింతగా విమాన అనుసంధానాన్ని ప్రోత్సహించటానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ‘ఉడాన్’ అనే పథకాన్ని ప్రారంభించింది.
ఈ ఏడాది ఆరంభంలో విమానయాన మంత్రి జయంత్‌సిన్హా మాట్లాడుతూ, 2035 నాటికి దేశంలో 150 నుంచి 200 విమానాశ్రయాలు అవసరమవుతాయని చెప్పారు.
భారతదేశం గత రెండు దశాబ్దాలలో విమానయాన రంగాన్ని క్రమక్రమంగా సరళీకరించింది.
ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. మార్కెట్‌లో విమానయాన సంస్థల మధ్య బలమైన పోటీ ఉంది. ఫలితంగా ఇటీవలి సంవత్సరాల్లో ధరల యుద్ధాలు కూడా జరిగాయి.
చాలా మంది భారతీయులు దూర ప్రయాణాలకు ఇంకా రైళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. విమానయానంతో పోలిస్తే రైలు ప్రయాణం నెమ్మదిగా ఉన్నా, అంత సౌకర్యంగా లేకున్నా... దానివైపే మొగ్గుచూపటానికి ప్రధాన కారణం రైలు ప్రయాణం చౌకగా ఉండటమే.
‘‘దేశంలో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల సంఖ్య దేశీయ విమానయాన మార్గాల వృద్ధికి దోహదం చేస్తోంది’’ అని ల్యూసీ బడ్ చెప్తున్నారు.
నిజానికి, ప్రపంచంలో ఇప్పుడు అత్యంత రద్దీ విమానయాన మార్గాల్లో, దేశ రాజధాని దిల్లీ - ఆర్థిక రాజధాని ముంబై మధ్య రెండు గంటల ప్రయాణం ఒకటిగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్య పరిమితులు
వచ్చే 20 ఏళ్లలో దేశంలో విమానయాన ట్రాఫిక్.. ఏడాదికి 50 కోట్ల మంది ప్రయాణికులను దాటుతుందని ఐఏటీఏ అంచనా.
అయితే, దేశంలో ప్రజలు, విమానాశ్రయాల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని ఇటీవల ఒక నివేదికలో ఆ సంస్థ పేర్కొంది.
విమానయాన రంగం వృద్ధికి గల సామర్థ్యాన్ని చేరుకోవాలంటే.. సరైన తరహా సదుపాయాలను సరైన సమయంలో సరైన ప్రాంతంలో ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
వాస్తవానికి దేశంలో విమాన ప్రయాణికుల వృద్ధి రేటును చూస్తుంటే, సమీప భవిష్యత్తులో అతి పెద్ద నగరాల్లో రెండో విమానాశ్రయాలు నిర్మించాల్సిన అవసరం వస్తుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
‘‘2030 నాటికి భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో రెండో విమానాశ్రయాలు (అప్పటికి ముంబై నగరంలో మూడో విమానాశ్రయం కూడా కావలసి రావచ్చు) అవసరమవుతాయి’’ అని విమానయాన కన్సల్టెన్సీ సీఏపీఏ దక్షిణాసియా డైరెక్టర్ బినీత్ సోమాయియా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- బిగ్ బాస్2: 'ఈక్వల్ గేమ్ ఎలా అవుతుంది?’ - BBC Exclusive
- బిగ్ బాస్: పోటీదారులను హౌజ్లోకి ఎలా తీసుకెళ్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- ఆడవారిని మగవారుగా, మగవారిని ఆడవారుగా ఎలా మార్చుతారు?
- ఇష్టపూర్వక వివాహేతర సంబంధం నేరం కాదు : సుప్రీం కోర్టు
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- హెచ్ఐవీ.. ఎయిడ్స్: చైనాలో 14 శాతం పెరిగిన కొత్త కేసులు
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
- బిగ్ బాస్-2: ‘‘ఆట బుకీస్ చేతిలోకి వెళ్లిపోయింది...’’- బాబు గోగినేని
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








