బిగ్‌ బాస్2: పోటీదారులను ఎలా ఎంపిక చేస్తారు? నిబంధనలేంటి?

బిగ్ బాస్
    • రచయిత, బాబు గోగినేని
    • హోదా, బీబీసీ తెలుగు కోసం

ఒక మిత్రుడి సలహా అడిగాను... "ఈ సంవత్సరం 'BIGG BOSS2' లో పాల్గొనమని ఆహ్వానం వచ్చిందండీ, వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను అక్కడకి వెళ్ళడం అర్థవంతంగా ఉండాలంటే ఏమి చేయాలి?"

"ఎందుకండీ బాబూ మీరు అక్కడికి? సమాజానికి ఏమి ఉపయోగం ఆ షో వల్ల? అయినా, మీ లాంటి వారు అక్కడకి వెళ్లడమేమిటి?" - ఇదీ ఆయన అసంకల్పిత ప్రతీకార స్పందన!

"అది ప్రత్యేక పరిస్థితుల్లో మనుషుల ప్రవర్తనకు, ఆ మనుషుల పరిశీలనకు ఒక ప్రయోగశాలండీ, అయినా, నేను వినోదానికి వ్యతిరేకిని కాదు! నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా నామోషీ లేదు - మన కంటే పెద్దవారు అన్ని చోట్లా, అన్ని రంగాలలో ఉంటారు. సరే, మీరు చెప్పిన మాట విని వెళ్ళను, మరి, ఆ 3 నెలల కాలంలో ఇంకేం చేయాలో చెప్పండి?" అని అడిగాను. ఆయన చెప్పిన కార్యక్రమాల లిస్టు చూస్తే, గత ౩౦ ఏళ్లుగా నేను చేస్తున్నది అదే!

నా ఆలోచన ఏమిటంటే, మనం మానవ విలువలు, మానవ హక్కులు, ఆధునిక భావాలను, వాటి గురించి అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి 'న్యూస్ ఛానల్' లో ఉంటున్నాము, కానీ అత్యధికంగా వీక్షకులేమో వినోద కార్య క్రమాలే చూస్తున్నారు! మరి, మనం ఛానల్ మారకపోతే ఎలా?

అలాగే, మనం ఎక్కడకు వెళ్ళామన్న దానికన్నా, అక్కడ ఏమి చేశామన్నది ముఖ్యం కదా?

బాబు గోగినేని

స్ట్రాటజీ కాదు, సిలబస్!

"షో కి రావడానికి ముందు ఏవైనా పాత ఎపిసోడ్స్ చూడాలా?" నిర్వాహకులకు నా ప్రశ్న. "కొంత మందికి చూడమని చెప్తాము, మీరు చూడనక్కరలేదు లెండి! ప్రతి రోజూ కొత్తగా ఉంటే మీకు కూడా బాగుంటుంది!" అన్నారు.

వారు నన్ను ఆహ్వానిస్తున్నది మానవవాదిగా కాబట్టి మానవ వాదం, హేతువాదం, సైన్సు గురించి మాట్లాడే, చెప్పే అవకాశం కదా ఇది! అలా అయితే, మనకి దీనికి పెద్ద ప్లాన్లు, స్ట్రాటజీలు అక్కరలేదు, కేవలం ఒక సిలబస్ ఉంటే చాలు అని అనుకున్నాను! ఏమేమి విషయాలను చర్చిద్దామనుకోన్నానో వాటికి అనుగుణంగా వారానికి ఒక టీ షర్ట్ చొప్పున 15 ఆగస్టు వరకు ప్రతి వారం ఒక కొత్త టీ షర్ట్ ప్రతి టీ షర్ట్ మీద ఒక కొత్త విషయం!

మొట్ట మొదటి టీ షర్ట్ మీద సందేశం, ఏకంగా BIGG BOSS గారికే! 'మీరు BIG అయితే, నేను BIGGER! అండీ' అని. ఇంకొకటి 'మనమంతా నక్షత్ర ధూళి' అని ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సేగన్ గారి కొటేషన్.

జూన్‌ 21న వేసుకోవడానికి ఒక టీ షర్ట్ మీద ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ మానవవాద దినోత్సవం గురించి సమాచారం.

ఫ్రాన్స్‌లో లాస్కో గుహలలో ఉన్న ప్రాచీన చిత్రాలతో సహా! ఒకప్పుడు ఫ్రెంచ్ భాష అధ్యాపకుడిగా ఉన్నాను కాబట్టి, ఫ్రెంచ్ సంస్కృతి పై మక్కువ కలిగి ఉన్నాను కాబట్టి 14 జూలై న వేసుకోవడానికి, 'ఫ్రెంచ్ విప్లవం వర్ధిల్లాలి' అని ఫ్రెంచ్ భాషలో ఇంకొక టీషర్ట్ చేయించుకున్నాను.

బాబు గోగినేని

ఇంకా, హేతువాదులను వికృతంగా దూషిస్తున్న, దారుణంగా హత్య చేస్తున్న ఈ కాలంలో హేతువాదులు నిజంగా ఎవరు అని చెప్పడానికి ఒక టీ షర్ట్ మీద 'హితవాది' అని ఒక నినాదం.

BIGG BOSS ఇంటిలోకి వెళ్ళడానికి 2 రోజులు మాత్రమే మిగిలి ఉండగా వచ్చి౦ది ఈ మెరుపు టీ షర్ట్ ఆలోచన - ఇంకొంచెం టైం ఉంటే ఇంకేమి ఆలోచనలు వచ్చి ఉండేయో! కానీ, టైం ఎక్కడ? ముందు, నాతో, నా కుటుంబ సభ్యులతో పాటు, ఒక 11 మంది సభ్యుల టీం వచ్చి అత్యాధునిక పరికరాలతో ఒక వీడియో షూట్ చేశారు.

ఆ సందడి అయి పోయే లోపలే వైద్య పరీక్షలు. ఇంకా కొన్ని మీటింగులు. అలాంటి ఒక మీటింగులో, నాకు తెలియకుండా, తనను తాను పరిచయం చేసుకోకుండా, నన్ను కలిసి ఒక పది నిమిషాల పాటు మాట్లాడి వెళ్లిన ఒక వ్యక్తీ - తరువాత తెలుసుకున్నాను ఆయన BIGG BOSS ఇంటికి నేను తగునా లేదా అని అంచనా వేయడానికి వచ్చిన మానసిక వైద్యుడు అట!

దెబ్బలు తగిలితే మరీ ఇబ్బంది కలగకుండా tetanus ఇంజెక్షన్. మళ్ళీ కొత్తగా పంపిన ఇంకొన్ని నిబంధనలు: గడియారం, క్యాలెండర్, ఫోన్, పెన్, పేపర్ మాత్రమే కాదు, కత్తెరలు, గోళ్ళు కత్తిరించుకోవడానికి నైల్ క్లిప్పేర్స్ కూడా నిషిద్ధమే!

నేను కొనుక్కున్న కొన్ని బట్టలు కెమెరాకు సూట్ అవ్వవన్న కారణంగా అనుమతించలేదు. మేజిక్ చేసి సైన్సు పాఠాలు చెబుదామని సేకరించిన పరికరాలు, ఆఖరికి దారాలు, అయస్కాంతం ... ఇవన్నీ నిషిద్దం. మన మందులు కూడా వారికే అంద చేయాలి. డాక్టర్ గారు ఏ రోజు మందులు ఆ రోజు స్టోర్ రూమ్ ద్వారా పంపిస్తారు.

అందరూ అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటంతో, 'గృహ ప్రవేశానికి' ఇక లైన్ క్లియర్ అయ్యింది.

బాబు గోగినేని
ఫొటో క్యాప్షన్, బాబు గోగినేని

కుడి కాలా, ఎడమ కాలా?

BIGG BOSS ఇంటిలోకి మా ప్రవేశం ఎంత నాటకీయంగా జరిగిందో! ఇంటిలోకి ప్రవేశించే 36 గంటలకు ముందే మమ్మల్ని మా ఇళ్ళ నుండి తీసుకువెళ్ళడం జరిగింది.

బయటకు వెళ్ళేటప్పుడు మొఖానికి ముసుగు వేసి, లోపల ఉన్నవారు బయట ఎవరికీ కనపడకుండా కారు అద్దాలకు తెరలు కట్టి, చివరికి ఒక ఐదు నక్షత్రాల హోటల్ కు తీసుకు వచ్చారు.

మాతో ఒక 'షాడో'కూడా. ఆ వ్యక్తీ పనేమిటంటే మాతోనే ఉండి, మేము ఎవరితో మాట్లాడకుండా చూసుకోవాలి. రాత్రి కూడా హోటల్లో మాతోనే!

హీరో నాని

ఫొటో సోర్స్, maatv/Facebook

తరువాత, ఎంతో రహస్యంగా, ఇతర పోటీదారుల కంట కూడా పడనివ్వకుండా హోస్టు నాని గారి దగ్గరకు మమ్మల్ని ఒకరి తరువాత ఒకరిని తీసుకు వెళ్ళారు నిర్వాహకులు. ఇంకా మాకు మాతో పాటు ఆ ఇంటిలో ఎవరు ఉండబోతున్నారో తెలియదు.

కుశల ప్రశ్నల తరువాత నాని గారు నా పైన, నా మానవ హక్కుల ఉద్యమం పైన, నా ఆలోచనల పైన, నా కుటుంబం పైన ఒక అద్భుతమైన వీడియో ప్రదర్శించారు. తరువాత ఇంటిలోనికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది.

నానీ గారూ, కుడి కాలు ముందు పెట్టాలా, ఎడమ కాలు ముందు పెట్టాలా ?" అని అడిగాను. అందరూ గొల్లున నవ్వారు. ఏ కాలైనా పర్వాలేదు అని సాదరంగా నాని గారు నన్ను ఇంట్లోకి సాగనంపారు. నేను ఎడమ కాలు ముందు పెట్టి ఇంటిలోకి ప్రవేశించాను.

(రచయిత బిగ్ బాస్‌2లో పోటీదారు, మానవవాది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)