విదేశాల్లో కరెన్సీ నోట్లను ముద్రిస్తే దేశానికి ప్రమాదమా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, క్రిస్టఫర్ గైల్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత వారం లైబీరియా ప్రభుత్వం తమకు సుమారు రూ.750 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది. దీనికి కారణం ఆ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల్లో నష్టం రావడమో లేదా అకౌంట్లలో మోసం జరగడమో కాదు. ఆ దేశానికి చెందిన అక్షరాలా రూ.750 కోట్లు కనిపించకుండా పోయాయి.
ఆ నోట్లను ముద్రించాలంటూ లైబీరియా సెంట్రల్ బ్యాంకు విదేశాలలోని ప్రింటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే దేశంలోకి ప్రవేశించాక అవి మాయమైపోయాయి.
మరోవైపు, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికలో చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్.. భారతీయ నోట్లను ముద్రించే కాంట్రాక్టును గెల్చుకుందన్న వార్తలు వెలువడ్డ నేపథ్యంలో.. గత నెల భారతీయులు ఆ వార్తపై సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.
అయితే భారత ప్రభుత్వం మాత్రం వారి సందేహాలను నిరాధారంగా పేర్కొంటూ కొట్టిపారేసింది.
కానీ ఈ రెండు వార్తలు.. నోట్ల ముద్రణ విషయంలో మనం నిజంగా జాగ్రత్తలు తీసుకోవాలా అన్న ప్రశ్నను లేవనెత్తాయి.

ఫొటో సోర్స్, PA
విదేశాలలో నోట్ల ముద్రణ
భారతదేశంలాంటి కొన్ని దేశాలు తమ నగదును మొత్తం తామే తయారు చేసుకుంటాయి. అలాగే అమెరికా తమ బ్యాంకు నోట్లను తమ దేశం సరిహద్దుల లోపలే ముద్రించుకోవాలని చట్టంలో ఉంది.
కానీ చాలా దేశాలు తమ నోట్లను విదేశాలలో ముద్రించుకుంటాయి. ఇక లైబీరియాలాంటి దేశాలకైతే వాటికంటూ సొంత ముద్రణాసంస్థలు కూడా లేవు.
వివిధ దేశాల కరెన్సీ ముద్రణ కోసం అనేక ప్రముఖ సంస్థలు ఉన్నాయి.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీలో 11 శాతం ప్రైవేటుగానే ముద్రిస్తున్నారు.
వీటిలో ఎక్కువభాగం యూరప్, ఉత్తర అమెరికాలో ముద్రిస్తున్నారు. బ్రిటన్ సంస్థ 'డె లా రూ' ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బ్యాంకు నోట్లను ముద్రిస్తున్న సంస్థ. ఆ సంస్థ దాదాపు 140 సెంట్రల్ బ్యాంకులకు కరెన్సీని ముద్రించి ఇస్తోంది. ప్రతి వారం అది ముద్రించే నోట్లను నిలబెడితే అవి ఎవరెస్టు శిఖరం కన్నా రెండు రెట్లు ఎత్తుంటాయి.
డె లా రూకు ప్రధాన పోటీదారు జర్మనీ సంస్థ గైసెక్ అండ్ డెవ్రియెంట్. ఇది దాదాపు 100 సెంట్రల్ బ్యాంకుల నోట్లను ముద్రిస్తుంది. కెనడాకు చెందిన బ్యాంక్ నోట్ కంపెనీ, అమెరికా, స్వీడన్‌లలో ప్రధాన కార్యాలయాలు కలిగిన క్రేన్‌లు కూడా నోట్ల ముద్రణ విషయంలో ఇతర ప్రముఖ సంస్థలు.
అయితే వీటి గురించి సాధారణంగా వివరాలు బయటకు పొక్కవు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు దేశాలు తమ కరెన్సీని తామే ముద్రించుకోవు?
అది చాలా ఖర్చుతో కూడుకున్నది, కష్టం కాబట్టి అని సమాధానం ఇవ్వొచ్చు.
నోట్లను ముద్రించే కంపెనీలు కొన్ని వందల ఏళ్లుగా ఆ వ్యాపారంలో ఉన్నాయి. నోట్ల ముద్రణ, భద్రతకు సంబంధించి వాటి వద్ద ప్రత్యేక టెక్నాలజీ ఉంది. డె లా రూ 1860లో నోట్లను ముద్రించడం ప్రారంభించింది. మొదట అది మారిషస్‌కు కరెన్సీని ముద్రించి ఇచ్చింది.
చిన్న దేశాలు తమ కరెన్సీని తాము ముద్రించుకోవడం అంత లాభదాయకం కాదు. నోట్ల ముద్రణ కోసం చాలా ఎక్కువ ఖరీదయ్యే ప్రెస్సులను కొనుగోలు చేయడం.. దాంతోపాటు ఎప్పటికప్పుడు నకిలీ నోట్లను అరికట్టడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌డేట్ చేసుకోవడం కూడా వాటికి చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని.
ఒక బ్యాంకు నోటు ప్రింటర్ ఏడాదిలో సుమారు 100 నుంచి 140 కోట్ల నోట్లను ముద్రిస్తుంది. అమెరికా సగటున ఏడాదికి 700 కోట్ల నోట్లను ముద్రిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఔట్‌సోర్స్ చేయడం ఎందుకు ప్రమాదకరం?
దీనికి 2011లో లిబియాలో జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకోవాలి. డె లా రూ ముద్రించిన దీనార్లను బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేయడానికి నిరాకరించింది. దాంతో కల్నన్ గడాఫీ దేశాన్ని పాలించిన చివరి రోజుల్లో బ్యాంకునోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. అయితే ఇలాంటి సంఘటనలు చాలా అరుదు.
సైద్ధాంతికంగా చూస్తే.. ఒక ప్రింటింగ్ సంస్థ అనుమతి లేకుండా కోరిన దానికంటే ఎక్కువ నోట్లను ముద్రిస్తే, దాని వల్ల ఆర్థిక వ్యవస్థలోకి అవసరమైన దానికన్నా ఎక్కువ నోట్లు రావడం వల్ల ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
విదేశాలలో నోట్ల ముద్రణ వల్ల, నోట్ల భద్రతకు సంబంధించిన విషయాలన్నీ ఆ దేశానికి తెలిసిపోయి, నకిలీ నోట్లు ముద్రించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలా ఇప్పటివరకు లేదు.
చాలా దేశాలు తమ కరెన్సీలో అధిక భాగం తామే ముద్రించుకుంటూ కొంత భాగాన్ని మాత్రం బయటి దేశాలకు అప్పగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకూ భవిష్యత్తులో మనకు నగదు అవసరం అవుతుందా?
ఇటీవల చాలావరకు నగదు వాడకం తగ్గిపోయింది. యాప్స్, ఆన్‌లైన్ పేమెంట్ల వల్ల నగదు అవసరం లేకుండా పోతోంది.
మొబైల్ పేమెంట్లు పెరగడంతో 2016లో తమ దేశంలో రిటైల్ రంగంలో కేవలం 10 శాతం మాత్రమే నగదు చెల్లింపుల రూపంలో జరిగాయని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వెల్లడించింది.
అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకునోట్ల డిమాండ్ పెరుగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- బిగ్ బాస్: ‘ఒక సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్’ –బాబు గోగినేని
- ఫేస్‌బుక్: ‘భద్రతాలోపం.. హ్యాకింగ్ బారిన 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’
- ఆసియా కప్: విజేత భారత్, కానీ చాంపియన్ మెరుపులు ఎక్కడ?
- #HisChoice: నేను లేడీస్ బ్యూటీపార్లర్ నడుపుతున్నా.. తప్పేంటి?
- ‘సుప్రీంకోర్టు చెప్పినా సరే... 50 ఏళ్లు దాటాకే శబరిమలలో అడుగుపెడతాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








