#HisChoice: నేను లేడీస్ బ్యూటీపార్లర్‌ నడుపుతున్నా.. తప్పేంటి?

బ్యూటీపార్లర్

ఉత్తరాఖండ్‌లో రూర్కీ అనే ఓ చిన్న పట్టణంలో నేను బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నా. నాలాంటి ఒకరిద్దరు తప్ప అక్కడ మరెవరూ ఆ పనిచేయడం లేదు. నేను ఇలా బ్యూటీ పార్లర్ తెరవడం చూసి తెలిసినవాళ్లు చాలామంది కోప్పడ్డారు.

మహిళా కస్టమర్లు కూడా నా పార్లర్‌కు రావడానికి వెనకాడేవారు. చుట్టపక్కల వాళ్లు నా గురించి రకరకాలుగా మాట్లాడేవాళ్లు. లేడీస్ బ్యూటీపార్లర్‌ను నిర్వహించాల్సింది మహిళలే కాని మగవాళ్లు కాదని చెప్పేవారు.

ఆడవాళ్లను నా పార్లర్‌కు రప్పించడం, వాళ్ల నమ్మకాన్ని పొందడం, మేకప్ వేయడంలో నేను కూడా ఏ అమ్మాయికీ తీసిపోనని రుజువు చేయడం నాకు చాలా కష్టంగా మారింది.

ఎవరైనా అమ్మాయి నా పార్లర్‌లో అడుగుపెట్టినా, లోపల నన్ను చూసి వాళ్ల అన్నయో, నాన్నో ఆమెను ఆపేసేవారు. ‘అరె, ఇక్కడ అబ్బాయి పనిచేస్తున్నాడే..’ అనేవారు.

అమ్మాయిలు నాతో కనీసం కనుబొమల త్రెడింగ్ చేయించుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అంత చిన్న గదిలో ఓ మగవాడు తమకు అంత దగ్గరగా నిలబడటం వాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తుందేమో.

నా మనసులో కూడా రకరకాల ఆలోచనలు మెదిలేవి. పార్లర్‌లో మహిళలతో తమ ఇష్టాయిష్టాలు చెప్పుకున్నట్లే, కస్టమర్లు నాతో కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకోగలరా అనే సందేహం కలిగేది.

వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ముందే నాకీ ఆలోచనలన్నీ వచ్చాయి. కానీ, నా మనసుకు నచ్చిన పని ఇదే. అందుకే నేను ఈ రంగంలోకి వచ్చా.

బ్యూటీపార్లర్

నాకు మేకప్‌పైన ఆసక్తి మా అక్క పెళ్లితో మొదలైంది. పెళ్లి సమయంలో ఆమె చేతికి గోరింటాకు పెట్టింది కూడా ఒక మగాడే. ఆ రాత్రంతా నా మెదడులో ఆ గోరింటాకు డిజైన్లే తిరిగాయి.

తరువాత నేనే సొంతంగా కోన్ తయారు చేయడం నేర్చుకున్నా. క్రమంగా పేపర్ మీద గోరింటాకు డిజైన్లు వేయడం సాధన చేశా. తరువాత చిన్న పిల్లలకు గోరింటాకు పెట్టడం ప్రారంభించా.

ఓసారి ఇంట్లో ఈ విషయం తెలిసి నన్ను బాగా తిట్టారు. ‘ఈ అమ్మాయిల పనులు చేయడానికి బుద్ధి లేదా’ అని నాన్న గట్టిగా మందలించారు. నేను కూడా ఆయనలానే సైన్యంలో చేరాలన్నది నాన్న కోరిక. కానీ నాకు మాత్రం సైన్యంలో చేరాలన్న ఆలోచన లేదు.

తరువాత ఓసారి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు, అక్కడ అమ్మాయిలకు గోరింటాకు పెట్టా. అది వాళ్లకు బాగా నచ్చింది. నాకు బహుమతి కింద 21రూపాయలు ఇచ్చారు. నా జీవితంలో తొలి సంపాదన అదే.

మా అమ్మ, అక్క, సోదరుడు నా ఇష్టాన్ని గుర్తించారు. కానీ, నాన్నకు మాత్రం ఆ పనంటే అసహ్యం.

చదువైపోయాక నేను హరిద్వార్‌లో ఓ ఉద్యోగంలో చేరా. అందరికీ నా పని చాలా నచ్చింది. ఎందుకంటే, అది మగవాళ్లు చేసే పని.

కానీ, అమ్మాయిలకు గోరింటాకు పెట్టాలనే నా కోరిక మాత్రం మనసులోనే అలా స్థిరపడిపోయింది. ఒకరోజు... ‘అసలు ఈ ఉద్యోగం వల్ల నాకు ఏమొస్తోంది? తగినన్ని డబ్బులు రావట్లేదు. మనసుకు సంతోషం కూడా లేదు కదా’ అనిపించింది.

ఈలోగా అనారోగ్యంతో నాన్న చనిపోయారు. దాంతో ఒక్కసారిగా కుటుంబ బాధ్యత నా భుజాలపైన పడింది. ఆ బాధ్యతే నాకో కొత్త దారి కూడా చూపించింది. నేను ఉద్యోగానికి సెలవుపెట్టి ఇంటికొచ్చినప్పుడల్లా పెళ్లిళ్లలో గోరింటాకు పెట్టడం ప్రారంభించా.

line

బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి.

ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి.

line

నేను ఉద్యోగంలో నెలంతా కష్టపడితే రూ.1500 వచ్చేవి. కానీ, ఒక పెళ్లిలో గోరింటాకు పెడితే రూ.500 దాకా వచ్చేది. నా సంపాదన వల్లేనేమో, ఇంట్లో వాళ్లు కూడా నేను చేసే పనికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

నేను ఉద్యోగం చేసే చోట ఓ వ్యక్తి బ్యూటీ పార్లర్ నిర్వహణలో తన భార్యకు సాయం చేస్తాడని, ఇద్దరూ కలిసి బాగా సంపాదిస్తున్నారని తెలిసింది.

నేను కూడా ఓ బ్యూటీ పార్లర్‌ తెరిస్తే బావుంటుందని అప్పుడే మనసులో అనుకున్నా. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు, అంతా రకరకాల ప్రశ్నలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అమ్మాయిల పని నేనెలా చేస్తానంటూ ప్రశ్నించారు.

కానీ ధైర్యంగా ముందడుగేస్తే అన్నీ అవే సర్దుకుంటాయని నాకనిపించింది.

బ్యూటీపార్లర్

మా మావయ్యగారి అమ్మాయి బ్యూటీ పార్లర్ పనులు నేర్చుకుంటోంది. తనే నాకు ఆ మెలకువలు నేర్పించడం మొదలుపెట్టింది. తరువాత మేమిద్దరం కలిసి ఓ బ్యూటీపార్లర్ తెరిచాం. మొదట్లో తన సాయం వల్లే పార్లర్ నిర్వహణ తేలికైంది.

పార్లర్‌లో నాతో పాటు నా సోదరి, మరో మహిళ కూడా ఉండటంతో కస్టమర్ల నమ్మకాన్ని పొందడం తేలికైంది.

మేం ఆ చిన్న గదిలో ఓ పరదా కట్టి దాన్నే గోడలా మార్చాం. నా సోదరి అమ్మాయిలకు వాక్సింగ్ చేస్తుంది. నేను వాళ్లకు త్రెడింగ్, మేకప్ చేస్తుంటాను. రోజులు గడిచేకొద్దీ నాకు పనిలో నైపుణ్యం కూడా పెరిగింది.

ఓసారి పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు, ‘ఈ పని ఎందుకు ఎంచుకున్నారు?’ అని అమ్మాయి అడిగింది. నాకు ఈ పనంటే ఇష్టమని, అందుకే ఎంచుకున్నానని చెప్పా. తరువాత ఆ అమ్మాయితోనే నాకు పెళ్లయింది. ఇప్పటిదాకా నా పని గురించి నా భార్య ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

పెళ్లయ్యాక నా భార్యను కూడా బ్యూటీ పార్లర్‌కు తీసుకెళ్లి నా స్టాఫ్‌ను పరిచయం చేశా. ఆమె మనసులో ఎలాంటి అనుమానాలు తలెత్తకూడదన్నదే నా కోరిక.

గత పదమూడేళ్లలో నా పార్లర్ ఓ చిన్న గది నుంచి మూడు గదులకు విస్తరించింది.

ఇప్పుడు నా బంధువులంతా నన్ను గౌరవిస్తారు. ఒకప్పుడు నన్ను సందేహించిన మగవాళ్లే, ఇప్పుడు వాళ్ల ఇంట్లో మహిళలను నా పార్లర్‌ దగ్గర విడిచి వెళ్తారు.

(ఉత్తరాఖండ్‌లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోన్న ఒక వ్యక్తితో మాట్లాడి, అతడి అంతరంగాన్ని బీబీసీ ప్రతినిధి నవీన్ నేగి అక్షర బద్ధం చేశారు. ఆ వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాం. ప్రొడ్యూసర్: సుశీలా సింగ్)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)