#HisChoice: చట్రంలో ఇమడని పురుషుల కథలు

- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"స్త్రీ జన్మించడం లేదు, స్త్రీని సృష్టిస్తున్నారు.." ఈ మాట సుమారు 70 ఏళ్ల ముందు ఫ్రాన్స్ రచయిత్రి, తత్వవేత్త 'సిమోన్ దె బువేరా' తన ప్రముఖ పుస్తకం 'ది సెకండ్ సెక్స్'లో చెప్పారు.
సమాజంలో అవసరాలకు అనుగుణంగా స్త్రీని సృష్టిస్తూ, ఆమెను మార్చుకుంటూ, వంచనకు గురిచేస్తూ వస్తున్నారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. దానికోసం రకరకాల కథలు కూడా అల్లుకుంటూ వచ్చారు.
సత్యవంతుడు చనిపోయినపుడు, సావిత్రి యమధర్మరాజుతో పోరాడి అతడిని తిరిగి బతికించుకుందనే కథ మనకు తెలుసు. కానీ ఎప్పుడైనా భార్య చనిపోతే భర్త ఆమెను తిరిగి బతికించుకున్నాడనే కథను మనం ఎప్పుడైనా విన్నామా?
ఏ పురుషుడిలోనూ సావిత్రి లక్షణాలు లేవా?
దేశంలో వేల సంవత్సరాల నుంచీ స్త్రీలు పురుషుల అణచివేతకు గురవుతూ వస్తున్నారు. 'సతీ సహగమనం' గురించి మనకు తెలుసు, కానీ భర్త తన భార్య కోసం చేసిన 'పతీ సహగమనం' చేశాడని మనం ఎప్పుడైనా విన్నామా?
ఎందుకంటే ఈ నియమాలు, వ్యవస్థలు, పద్ధతులు అన్నీ పురుషులు ఏర్పాటు చేసినవే. వాటినే స్త్రీల మీద బలవంతంగా రుద్దారు. వాటిని అల్లుతూనే కథలన్నీ వచ్చాయి. ఏ కథ చూసినా స్త్రీ పురుషుడిని కాపాడుకుందని, బతికించుకుందని చెబుతారు. కానీ ఒక్క కథలో అయినా పురుషుడు స్త్రీకోసం ఏదైనా చేశాడని చెప్పదు.
స్త్రీల కోసం సృష్టించిన కుట్రలతో నిండిన ఈ ప్రపంచంలో మహిళలు తమ ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనే ధైర్యంతో ముందుకు వస్తున్నారు. వాటిలో కొన్నింటిని మేం మా బీబీసీ #HerChoiceలో మీ ముందుకు తెచ్చాం.
#HerChoice ద్వారా మేం మహిళల కథలను మీ ముందుకు తీసుకొచ్చినపుడు ప్రేక్షకులు, ఆఫీసులో ఉన్న మా పురుష సహచరులు మమ్మల్ని "సమస్యలు కేవలం మహిళలేనా?, #HisChoice కూడా ఎందుకు ఉండకూడదు" అని ప్రశ్నించారు.
మాకంటూ కొన్ని కోరికలు ఉండవా?. మాకూ కష్టాలు ఉండవా?, మాకూ కట్టుబాట్లు, బంధనాలు లేవా? అన్నారు.
ఈ ప్రశ్న చాలా తీవ్రమైనది. అందుకే దాని గురించి మేమంతా మా ఎడిటోరియల్ సమావేశంలో చర్చించాం. అందరూ అంగీకరించడంతో బీబీసీ టీమ్ మీ కోసం #HisChoice కూడా తీసుకొస్తోంది.
#HisChoice సిరీస్ ద్వారా అప్పటివరకూ ఒక చట్రంలో ఇరుక్కుపోయినా, దాన్నుంచి బయటపడి తమ ఆశలు, ఆశయాలను వ్యక్తం చేసేందుకు సిద్ధమైన పురుషుల కథలను మీ ముందుకు తీసుకురాబోతోంది.
#HisChoice కథల ద్వారా మేం పురుషుల మనసుల్లో, వారి ఆలోచనల్లో, వారి పట్ల సమాజంలో ఉన్న అగాధాల లోతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం.

#HisChoice సిరీస్ కథనాలు
ఈ సిరీస్‌లో మేం ఇచ్చే ఈ పది కథలు మిమ్మల్ని ఆశ్చర్యపరచడం మాత్రమే కాదు, అవి మిమ్మల్ని మీరు మీలో ఒకసారి తొంగి చూసుకునేలా చేస్తాయి.
- ఒక పురుషుడు.. ఇంట్లో పని నాది, బయటి పని నీది అన్నాడు. నువ్వు ఉద్యోగం చెయ్, నేను ఇల్లు చూసుకుంటాలే అన్నాడు.
- బాగా చదువుకున్న ఒక యువకుడు ఉద్యోగం చేస్తుంటాడు. కానీ తన అవసరాల కోసం 'మూసిన తలుపుల' వెనక చేయాల్సిన ఒక వృత్తిని ఎంచుకున్నాడు.
- "పెళ్లి ఏ వయసులో జరగాలో అప్పుడు జరిగిపోవాలి. పెళ్లి కాలేదని నేను చాలా టెన్షన్ పడుతున్నా" అని అమ్మాయిలు తరచూ చెబుతుంటారు. కానీ ఒక పురుషుడు 35 ఏళ్లు దాటినా "పెళ్లి చేసుకోవాలని లేదు" అంటున్నాడంటే, మీ మనసులో ఎలాంటి ప్రశ్న వస్తుంది? ఇది తమిళనాడులో జరిగింది.
- ఒక అబ్బాయికి చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకోవాలనిపించేది. పెరిగేకొద్దీ, అలాంటి పనులే చేయాలనిపించేది. కానీ ఒక అబ్బాయి మహిళలను అలంకరించే పనులు ఎలా చేయగలడు? ఇన్ని ప్రశ్నల మధ్య అతడు ఏం చేశాడు? అనేది మరో కథ.
- స్నేహితులందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. కానీ తన కోసం పెళ్లి సంబంధాలు రావడం లేదు. వచ్చినవాళ్లు కూడా వద్దని వెళ్లిపోయారు. అతడు అంత తప్పేం చేశాడు? గుజరాత్ కు చెందిన ఒక వ్యక్తి కథ చదివితే అది ఎందుకో తెలుస్తుంది.
- జీవితంలో తొలి ప్రేమకు చాలా విలువ ఉంటుంది. వాళ్లు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్లు. ప్రేమించుకున్నారు. తను ప్రేమించింది అమ్మాయిని కాదని తెలిసీ, అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి సమాజంలో విలువ ఉంటుందా?
- పత్రికలో ప్రకటన చూసిన ఒక యువకుడి మనసులో ఎన్నో ప్రశ్నలు, కానీ సాయం చేస్తే ఏం పోతుంది అనుకున్నాడు. కానీ తను చేసిన సాయం గురించి అతడు తన గర్ల్ ఫ్రెండుకు చెప్పలేడు, భవిష్యత్తులో తన భార్యకు కూడా చెప్పాలనుకోలేడు.
- ఇంకో వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బిడ్డ కూడా పుట్టాడు, తర్వాత విడాకులు తీసుకున్నాడు. భార్య రెండో పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆ భర్త తన బిడ్డను ఏం చేశాడు? ఇది మరో కథ.
- అత్యాచారాలు, వేధింపులు జరిగితే, అందరూ అమ్మాయినే తప్పుబడతారు. అంటే కొడుకుకు చిన్నతనం నుంచే అమ్మాయిలను గౌరవించడం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా? ఆడుకుంటున్న రెండున్నరేళ్ల కొడుకును చూసిన ఒక తండ్రి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది?
- ప్రియాంక చోప్రాకు తన కంటే చిన్న వాడైన నిక్ జోనస్‌తో నిశ్చితార్థం అయినప్పుడు కొందరు శుభాకాంక్షలు చెబితే, కొందరు 'మిస్ మ్యాచ్' అన్నారు. ఈ సిరీస్‌లో ఒక కథ తనకంటే పెద్దదైన మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి గురించి చెబుతుంది. ఆయన ఎప్పుడైనా తన నిర్ణయానికి బాధపడ్డారా? ఆయన సంతోషంగానే ఉన్నారా?
బీబీసీ స్పెషల్ సిరీస్ #HisChoiceలో మీరు ప్రతి శనివారం-ఆదివారం ఈ కథలను చదవచ్చు.
బహుశా ఈ కథలు మిమ్మల్ని ఆలోచించేలా చేయవచ్చు. ఇతరులపై ఉన్న మీ అభిప్రాయాలను మార్చుకోడానికి సాయం కావచ్చు.
ఇవి కూడా చదవండి:
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- #HerChoice: 'తమ ప్రేమ వ్యవహారాల కోసం అమ్మా నాన్నా నన్నొదిలేశారు'
- #HerChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. అందుకే నీకు నాన్న లేడు!
- #HerChoice: పెళ్లి కాకుండానే తల్లిగా ఉండాలనుకున్నాను!
- #HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








