#HerChoice: 'తమ ప్రేమ వ్యవహారాల కోసం అమ్మా నాన్నా నన్నొదిలేశారు'

- రచయిత, పద్మ మీనాక్షి, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నోటికి రుచించని ఆహారంలా, ఒంటికి సరిపడని బట్టల్లా నన్ను కూడా పక్కన పడేశారు. తమ జీవితానికి భారంగా భావించి పొత్తిళ్లలో ఉండగానే మా అమ్మా నాన్నా నాకు దూరంగా వెళ్లిపోయారు.
వాళ్లేమీ చనిపోలేదు. నేను అనాథనూ కాదు. ఆ విషయం తలచుకుంటే మరింత బాధగా ఉంటుంది.
మా అమ్మానాన్నా ఇంకా బతికే ఉన్నారు. నేను ఉంటున్న ఊళ్లోనే వాళ్లూ ఉన్నారు. అయినా నేనెవరో తెలియనట్టే వాళ్లు ప్రవర్తిస్తారు.
నేను ఉయ్యాలలో ఉండగానే వాళ్లు నన్ను వదిలేశారు. ఆకలైనా, దాహమైనా, భయమైనా.. అన్నిటినీ నేను ఏడుపు భాషలోనే బయటకు చెప్పే పసి వయసులో వాళ్లు నన్ను విడిచి వెళ్లిపోయారు.
నేను పుట్టిన కొద్ది రోజులకే నాన్న మమ్మల్ని వదిలేసి మరో మహిళను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారు.
మా అమ్మ కూడా వేరే వ్యక్తిని ఇష్టపడి అతడితో వెళ్లిపోయింది.
నన్నెవరూ ప్రేమించలేదు. నా గురించి ఎవరూ ఆలోచించలేదు.

#హర్‌చాయిస్ - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యతల గురించి వివరిస్తూ మన భావనను విస్తృతం చేస్తాయి.

నా మీద జాలిపడి మా మావయ్య నన్ను పెంచారు. నాకు కాస్త ఊహ తెలిశాక ఆయనే మా అమ్మానాన్నల దగ్గరకు నన్ను తీసుకెళ్లారు.
వాళ్లను చూడగానే దు:ఖం పొంగుకొచ్చింది. నన్ను దగ్గరకు తీసుకొని హత్తుకుంటారనీ, ప్రేమగా మాట్లాడతారనీ, ముద్దులు కురిపిస్తారనీ ఆశపడ్డాను. కానీ వాళ్లు నన్నో అపరిచితురాలిలా చూశారు.
నేను వాళ్లకు అక్కర్లేదని నాకు ఆ క్షణమే అర్థమైంది. దాంతో మావయ్య నన్నో హాస్టల్‌లో చేర్చారు.
అక్కడ నాకు మరో చేదు అనుభవం ఎదురైంది. మా నాన్న తన రెండో భార్య కూతుర్ని కూడా అదే హాస్టల్‌లో చేర్చారు.
ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నేను అందరూ ఉన్న అనాథననే విషయం గుర్తొస్తుంది.

ఆ అమ్మాయిపైన నాకెలాంటి కోపం లేదు. మేం అప్పుడప్పుడూ మాట్లాడుకునేవాళ్లం. తనకు అన్ని విషయాలూ తెలుసని నాకు తెలుసు.
మా నాన్న ఆ అమ్మాయిని చూడ్డానికి హాస్టల్‌కు వస్తుండేవారు. సెలవుల్లో తనను ఇంటికి తీసుకెళ్లేవారు. నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్తారేమోనన్న ఆశతో ఎదురుచూసేదాన్ని.
కానీ నా ఎదురుచూపులన్నీ వృథాగా మిగిలిపోయేవి. ఆయన కనీసం నన్ను కన్నెత్తి కూడా చూసేవారు కాదు.
ఆయనకు నేనంటే ఇష్టం ఉందో లేదో, నా సవతి తల్లి నన్ను ఇంటికి రానిచ్చేదో లేదో నాకు తెలీదు. కానీ రమ్మని పిలుస్తారేమోనని ఆశ పడేదాన్ని. తరువాత ఒంటరిగా గదిలో కూర్చొని ఏడ్చేదాన్ని. సెలవులొస్తే హాస్టల్ వదిలి నేను పొలాల్లో పనిచేయాలి. గేదెల్ని మేపాలి. లేకపోతే నాకు తిండి దొరకదు.
అందుకే అందరు పిల్లల్లా నేను సెలవుల కోసం ఎదురు చూడను.
పనిచేస్తే వచ్చే డబ్బులో కొంత మా మావయ్య కుటుంబానికి ఇస్తేనే వాళ్లు భోజనం పెట్టి ఇంట్లో ఉండనిచ్చేవారు. మిగతా డబ్బుతో నేను స్కూల్‌కి కావల్సిన వస్తువులను కొనుక్కునేదాన్ని.

ఇప్పటికీ మా అమ్మానాన్నలపైన నాకెలాంటి కోపం లేదు. వాళ్లను నేను చాలా ప్రేమిస్తున్నా. వాళ్లతో కలిసి పండగలు జరుపుకోవాలనీ, వాళ్ల ఆప్యాయతను రుచి చూడాలనీ ఆశ పడుతున్నా.
కానీ వాళ్లిద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. నన్ను వాళ్ల గుమ్మం దగ్గరకు కూడా రానివ్వరు. నోరు తెరిచి అడగడానికి నేనూ ధైర్యం చేయలేను.
అందుకే నా జీవితంలో పండగలు వచ్చి వెళ్లిపోతుంటాయి తప్ప నేను కుటుంబంతో కలిసి ఏ పండగనూ జరుపుకోలేదు. ఆ భాగ్యం నాకు ఎప్పటికీ అందని ద్రాక్షే.
నేను స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతాను. వాళ్లు చెప్పే కథలన్నీ ఆసక్తిగా వింటాను. నా ఆలోచనలన్నీ వాళ్లతో పంచుకుంటాను. అన్ని విషయాల్లోనూ వాళ్లు నాకు తోడుగా ఉన్నారు.
మా హాస్టల్ వార్డెన్‌లోనే నేను అమ్మను చూసుకున్నాను. తన ద్వారానే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను.
తను నన్ను చాలా బాగా చూసుకునేది. నాకు మంచి బట్టలు ఇచ్చేది. నన్ను కూడా ఒకరు ప్రేమిస్తారనే భావన ఆమె వల్లే నాకు కలిగింది.


జీవితంలో అందరికీ చిన్న చిన్న కోరికలుంటాయి. కానీ నేను వాటిని చంపుకొని బతకడం అలవాటు చేసుకున్నా. అందరిలా నోరు తెరిచి నాకు ఇష్టమైన వంట చేయమని నేను ఎవరినీ అడగలేను.
నేనిప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఈ హాస్టల్‌లో పదో తరగతి పూర్తయ్యే వరకే మమ్మల్ని ఉండనిస్తారు.
ఆ తరువాత ఎక్కడికి వెళ్లాలో నాకు తెలీదు. మా మావయ్య నాకు సాయం చేయరు. కాబట్టి నేనే ఏదైనా పనిచేసుకుంటూ చదువుకోవాలి.
ఏదేమైనా నేను చదువుని విడిచిపెట్టను. నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి చదువు తప్ప నాకు మరో మార్గం లేదు.
డాక్టర్ కావాలన్నది నా కల.
మా ఊరికెళ్తే నాకు పెళ్లి చేసే అవకాశాలున్నాయి. కానీ నాకది ఇష్టం లేదు. మొదట నేను స్వతంత్రంగా బతకాలి. నా కాళ్లపైన నిలబడాలి.
నేను పెద్దయ్యాక ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటా. అతనితో కలిసి ప్రేమతో నిండిన ఓ అందమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటా.
(దక్షిణాదికి చెందిన ఒక అమ్మాయి తన నిజ జీవిత గాథను బీబీసీ ప్రతినిధి పద్మ మీనాక్షితో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు. ఆ అమ్మాయి విజ్ఞప్తి మేరకు ఆమె పేరును రహస్యంగా ఉంచుతున్నాం.)
ఇవి కూడా చదవండి:
- రిపబ్లిక్ డే పరేడ్‌కు పది దేశాల అధినేతలు.. ఎవరు వాళ్లు? ఎందుకొస్తున్నారు?
- పద్మావత్ వివాదాలకు అసలు కారణాలేంటి?
- చివరికి తిట్లు కూడా మహిళలకేనా!
- హజ్ యాత్ర-మానస సరోవర్ యాత్ర రాయితీ ఒకటేనా?
- Quiz: ట్రంప్‌కు పెట్టిన పరీక్ష ఇదే.. మీరు రాస్తే పాసవుతారా?
- మీ ఆధార్‌కి తాళం వేశారా?
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
- నాడు దీపిక పదుకొణెకు సెక్యూరిటీ ఇచ్చి.. నేడు పద్మావత్ వ్యతిరేకంగా ఉద్యమం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








