#HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'

#HerChoice, औरतों की कहानियां, रिलेशनशिप, शादी, प्यार

నేను, నా స్నేహితురాలు స్వలింగ సంపర్కులం కాదు. మా మధ్య లైంగిక ఆకర్షణ లేదు.

మా ఆలోచనలు, ఆదర్శాలు, విశ్వాసాల పట్ల మేం పరస్పరం ఆకర్షితులమయ్యాం. అందుకే మేం గత 40ఏళ్లుగా ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నాం.

ఇప్పుడు మేమిద్దరం 70 ఏళ్ల వయసులో ఉన్నాం. మేం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నపుడు మా వయసు కేవలం 30 ఏళ్లు.

ఆ యువ వయసులోనే మేమిద్దరం జీవితంలో ప్రశాంతత కోసం, స్థిరత్వం కోసం తపించాం. కానీ సాహసం కోసం కాదు.

మేమిద్దరం సహజీవనం చేయాలని నిర్ణయించుకోవటానికి అదే పెద్ద కారణం.

ఇద్దరి ఆలోచనలు..అభిరుచులు వేర్వేరు

మేమిద్దరం పరస్పరం చాలా భిన్నమైన వారిమే.

నాకు వెలిగిపోతూ కనిపించే రంగులంటే ఇష్టం. ఈ వయసులో కూడా లిప్‌స్టిక్ వాడతాను.

కానీ నా స్నేహితురాలికి తేలికైన, లేత రంగులంటే ఇష్టం.

నేను ఎత్తు మడమలున్న శాండల్స్ వాడతాను. ఆమె ’డాక్టర్ స్లిప్పర్లే’ ఎప్పుడూ తొడుక్కుంటారు.

నేను టీవీ చూసేటపుడు ఆమె తన మొబైల్ ఫోన్‌తో బిజీగా ఉంటుంది. ‘ఈ ముసలితనంలో నీకు కొత్త అలవాటు ఎలా అయింది?’ అని నన్ను వెక్కిరిస్తుంది.

మహిళల పెయింటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇది మా జీవితం. కాస్త ఆరోగ్యవంతమైన పరిహాసం. మా జీవితాలను మా ఇష్ట ప్రకారం జీవించే సంపూర్ణ స్వేచ్ఛ.

మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం. కానీ మా ఇద్దరికీ ఎవరి ప్రపంచం వారికే ఉంటుంది.

ఆధునిక కాలపు పెళ్లిళ్లలో అంతగా పారదర్శకత ఉండకపోవచ్చు. ఎన్నో ఆకాంక్షలుంటాయి. వాటి బరువు కింద సంబంధాలు కూలిపోతుంటాయి.

నా పెళ్లి కూడా విఫలమైంది. కానీ ఆ అంకం గతించిపోయింది. ఆ పేజీలు తిప్పి చూడటం నాకు ఇష్టం లేదు.

నా పిల్లలు పెరిగి పెద్దయ్యారు. వారి జీవితాల్లో ముందుకు సాగారు.

Presentational grey line

#హర్‌చాయిస్ - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యతల గురించి వివరిస్తూ మన భావనను విస్తృతం చేస్తాయి.

Presentational grey line
మహిళ కార్టూన్

ఒంటరి జీవితమే ఇష్టం

నా స్నేహితురాలు ఒంటరిగా జీవించటాన్నే ఎల్లప్పుడూ విశ్వసించేది. ఇప్పుడు కూడా ఆమెది అదే విశ్వాసం.

ఎందుకంటే.. మేం కలిసివున్నా కానీ కొన్ని విషయాల్లో ఒంటరిగానే ఉన్నాం.

ఇన్ని సంవత్సరాలు కలిసి గడిపినా కానీ ఇప్పటికీ పరస్పరం కొత్త విషయాలు తరచుగా తెలుస్తుంటాయి.

మా సంబంధంలోని అందం ఇది. ఒకరి గురించి మరొకరికి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఈ సంబంధం ఇంకా ప్రకాశిస్తూ ఉండటానికి ఇదే కారణం.

మేం కేవలం ఒకరితో ఒకరం సమయం గడపటం వల్ల మాకు విసుగు పుడుతుందా? అని జనం అడుగుతుంటారు.

కానీ నిజానికి మేం ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం చాలా తక్కువ.

మేం ఒక పైకప్పు కింద నివసిస్తాం. కానీ మేం ఎక్కువగా కలిసేది డైనింగ్ టేబుల్ దగ్గరే. ఆ తర్వాత మా సొంత పనుల్లో మునిగిపోతాం.

మేం మా ఉద్యోగాలు చేస్తున్నపుడు అయిన అలవాటిది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

#HerChoice, औरतों की कहानियां, रिलेशनशिप, शादी, प्यार

మా బంధంపై అందరికీ అన్నీ అనుమానాలే!

మొదట్లో మా ఇంటి పని మనిషి చాలా కంగారుపడేది. మాకు ఎవరైనా బంధువులున్నారా? వయసులో ఉన్న వ్యక్తి ఎవరైనా వచ్చి మాతో నివసిస్తారా? అని ఆమె పదే పదే అడిగేది.

ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పటం నాకు ఇష్టం లేదు. మాకు చాలా మంది స్నేహితులు, బంధువులు ఉన్నారని.. కానీ మేమిద్దరం కలిసి నివసించే జీవితాన్ని మాకోసం మేం ఎంచుకున్నామని ఆమెకు వివరించాలని అనిపించదు.

ఇంట్లో మగ తోడు లేకుంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని హత్య చేస్తారనో, ఇంటిని దోచుకుంటారనో ఆమె మమ్మల్ని భయపెట్టేది.

ఆమె మాటలు విని నేను నవ్వేదాన్ని. దొంగలు దోచుకోవటానికి మా దగ్గర ఏమీ లేదని ఆమెకు నేను వివరించి చెప్పాను కూడా.

వికారంగా కనిపించే మా ఇంటి గోడల రంగును చూసి ఆ దొంగ ఇక్కడ ఎలాంటి మనుషులు నివసిస్తున్నారనేది అర్థం చేసుకుంటాడు.

ఆమెకు నా మాటలు ఎంతవరకూ అర్థమవుతాయనేది నాకు తెలీదు. కానీ ఆమె అప్పుడప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తూ, మా జీవన విధానాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది.

బీచ్ లో మహిళ

ఫొటో సోర్స్, Getty Images

జీవితంలో ప్రశాంతత ఉండాలి..హడావుడి కాదు

చిత్రమేమిటంటే.. మేం కలిసి గడపాలని ఊహించిన జీవితం సరిగ్గా ఇదే.

మేం ప్రశాంతమైన ఆలోచనతో నిద్ర లేస్తాం. జీవితం కోసం హడావుడి లేదు.

ప్రతీ ఉదయం ఒత్తిడితో మొదలవటం నాకు ఇష్టం లేదు. ప్రతి ఉదయం నా మీద నేను దృష్టి కేంద్రీకరించుకోవాలని కోరుకున్నాను.

అయితే దీనర్థం.. మా సంబంధాల బాధ్యతల నుంచి పారిపోవటం కోసం మేం ఈ జీవితాన్ని ఎంచుకున్నామని కాదు.

జనం మమ్మల్ని కలిసినపుడో, మమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడో.. మేం బరువు బాధ్యతలు లేని జీవితం గడుపుతున్నామని అనుకుంటారు.

కానీ.. మన సొంత జీవితాన్ని స్వతంత్రంగా నిర్వహించుకోవటమనేది సరిపోయేంత బాధ్యత కాదా?

మహిళ కార్టూన్

జనం మాటలను మేం పట్టించుకోం

మేం మా అవసరాల కోసం మరో వ్యక్తి మీద ఆధారపడం.

మొదట్లో.. మేం కలిసి జీవిస్తున్నామంటే అందులో ఏదో తేడా ఉందని, మా మధ్య ఇంకేదో ఉందని జనం అనుకునేవారు.

కానీ జనం దృష్టిలో మా ప్రతిష్టను సరిచేసుకోవటం కానీ, ఆ విషయాన్ని పట్టించుకోవటం కానీ నాకు ముఖ్యం కాదు.

నేను బొట్టు పెట్టుకుంటాను. కాలి వేళ్లకు మెట్టెలు పెట్టుకుంటాను. బంగారు ముక్కు పుడక పెట్టుకుంటాను.

నా మనసు కోరుకున్నంత వరకూ అలా చేస్తూనే ఉంటాను. ఇవి ఇక చాలు అనుకున్నపుడు అపేస్తాను.

ఈ సంబంధంలో నేను తెలుసుకున్న ఒక విషయం ఏమిటంటే.. మనం మన జీవితాన్ని ఎవరితోనైనా గడపవచ్చు.

కానీ మనం జీవించటం మాత్రం.. మనతో ఉంటూ మనతో అధికంగా జోక్యం చేసుకోని వాళ్లతో మాత్రమే సాధ్యమవుతుంది.

చక్కటి సమన్వయంతో కూడిన మా జీవితం జనానికి వింతగా కనిపిస్తుంది. ఎందుకో నాకు అర్థంకాదు.

మేం స్నేహితులం. సొంతంగా జీవిస్తున్నాం. మేం ఎవరినీ దేనికోసమూ అడగం. ఎవరితోనూ అంతగా చెప్పం.

మా వ్యక్తిగత జీవితాలతో మేం సంతృప్తిగా ఉన్నాం. ఇందులో తప్పు ఏమిటి..? ఇందులో వింతేముంది.?

(ఉత్తర భారతదేశంలో నివసించే ఓ మహిళ.. బీబీసీ ప్రతినిధి భూమికా రాయ్‌కి చెప్పిన నిజ జీవిత కథ ఇది. దివ్య ఆర్య దీనిని ప్రొడ్యూస్ చేశారు. ఆ మహిళ కోరిక మేరకు ఆమె పేరును వెల్లడించలేదు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)