BBC EXCLUSIVE INTERVIEW: కేసీఆర్‌తో కోదండరామ్‌కు ఎక్కడ చెడింది?

ఫొటో సోర్స్, Getty Images/FB
- రచయిత, వెంకట కిషన్ ప్రసాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని జేఏసీ నేత కోదండరామ్ బీబీసీతో అన్నారు. తమ మధ్య విభేదాలు ఉద్యమ కాలంలోనూ ఉన్నాయని ఆయన చెప్పారు.
తమ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు, తెలంగాణ పరిస్థితులు వంటి విషయాలపై ఆయన బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇంకా కోదండరామ్ ఏమేం చెప్పారో, ఆయన మాటల్లోనే..
కేసీఆర్‌కూ, నాకూ మధ్య ఉన్నవి వ్యక్తిగత విబేధాలు కావు. సమాజ మార్పు కోసం నిర్వహించాల్సిన పాత్రపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు తెలంగాణ కోసం, ఆ తరువాత తెలంగాణ అభివృద్ధి కోసం కచ్చితంగా పని చేయాలనేది మా నిర్ణయం. అభివృద్ధిని పూర్తిగా రాజకీయ పార్టీలకు వదిలేయకుండా మేం స్వతంత్రంగా నిలబడి, ఒక పౌరవేదికగా కొనసాగుతూ మార్పును తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నాం.

ఫొటో సోర్స్, Facebook/jaconline
నాటి ఉద్యమ నేస్తాల బాటలు నేడు ఎలా వేరయ్యాయి?
టీఆర్ఎస్ ముందున్న మార్గాలు ఏమిటంటే.. గతంలో మాదిరిగానే మాలాంటి వారితో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవచ్చు. లేదంటే 'మీరెవరూ మాకు అవసరం లేదు మా పని మేం చేసుకుంటామ'నే నిర్ణయమూ తీసుకోవచ్చు.
టీఆర్ఎస్ రెండో మార్గాన్ని ఎంచుకున్నది. టీఆర్ఎస్ మమ్మల్ని శత్రువుగానే చూస్తున్నది తప్ప మా లాంటి సంస్థలతో సంబంధాల వల్ల సమాజంలో మార్పు వస్తుందని, ప్రజాస్వామ్య విస్తరణ జరుగుతుందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని భావించడం లేదు. అలాంటి ఆలోచన, దృక్పథం వారికి లేవు.
ప్రశ్నించే అన్ని వేదికలు తమకు శత్రువులే అనే వైఖరిని కేసీఆర్ చేపట్టారు. అందువల్లే మా మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. అంతేకానీ మా మధ్య ఎటువంటి వ్యక్తిగత బేధాలు లేవు.
ఉద్యమ కాలంలో కూడా అభిప్రాయ బేధాలు ఉన్నాయి. లేవని అనడం లేదు. అయితే ఉమ్మడి లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అయినంత కాలం వాటిని పరిష్కరించుకుంటూ ముందుకుపోయాం.
అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అధికారాన్ని కాపాడుకోవడం ముఖ్యం అని టీఆర్ఎస్ భావించింది. ప్రజా సంఘాలతో సంబంధాలు అనవసరం అనే నిర్ణయానికి వచ్చిన తరువాత టీఆర్ఎస్‌తో మేం మాట్లాడటం కానీ, మాతో టీఆర్ఎస్ సఖ్యతగా ఉండే అవకాశం కానీ లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలోనే వారు మమ్మల్ని శత్రువులుగా చూడటం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Facebook/jaconline
హక్కుల నేతగా పని చేసిన అనుభవం లాభమే..
తెలంగాణ అంతటా తిరిగాం. అనేక గ్రామాలు చూశాం. అనేక సంఘటనలు చూశాం. చాలా మంది వ్యక్తులను కలుసుకున్నాం. కాబట్టి సమాజ పరిస్థితుల పైన మాకు మంచి అవగాహన ఏర్పడింది. ప్రతి జిల్లాలో ఉండే పరిస్థితులపై అవగాహన ఉంది. రాజకీయాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
అయితే, దీనికన్నా భిన్నమైన కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. వాటి గురించి క్రమక్రమంగా తెలుసుకోవచ్చు. నేర్చుకోవచ్చు.
ఇప్పుడెట్లా పని చేస్తున్నామో రాజకీయాల్లో కూడా అదే పద్ధతిలో పని చేయాలి. బాగా డబ్బులు పోగు చేసి ఏదో చేద్దామనుకుంటే అది మా వల్ల అయ్యేది కాదు.

ఫొటో సోర్స్, Facebook/jaconline
లెఫ్ట్ బహుజన కూటమి గురించి..
వీటికి కొంత పరిమితమైన పాత్ర ఉంటుంది. ప్రభావం బాగా ఉండాలంటే, ప్రజాస్వామిక మార్పు జరగాలంటే విస్తృతమైన ఐక్యత చాలా అవసరం.
అదెట్లా సాధించాలనే దానిపై కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. దీని పరిధిని పరిమితం చేసుకుంటే మార్పు సాధించే లక్ష్యం కష్టమవుతుంది.
అసలు సమస్యలు వదిలేసి తిండి విషయాలపై అనవసర చర్చ
జాతీయస్థాయిలో కూడా రాజకీయాలు కలుషితం అయ్యాయి. ఏవైతే సమస్యలు కాకూడదో అవే బలంగా ముందుకు వస్తున్నాయి.
ఎవరు ఏం తినాలి అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇలాంటివి మనం పట్టించుకోవల్సినవి కానే కావు. వీటికంటే ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి.
వ్యవసాయం బాగా లేదు. యువతకు ఉపాధి లేదు. ఆర్థిక వృద్ధి మందగించింది. ఉపాధి కల్పన ఎట్లా జరగాలనే దానిపై చర్చ లేదు.
ఇలాంటి మౌలిక సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చ అసలే జరగడం లేదు.
ఆర్థిక వ్యవస్థ మందగించిందని వేరెవరో కాదు, అధికార పార్టీ నాయకులే కొందరు బహిరంగంగా చెబుతున్న నిజాలివి.
తెలంగాణలో కనీసం వీటిపై చర్చించే వేదికలున్నాయి. ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలను ముందుకు తేగలిగే వేదికలున్నాయి.
కానీ జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రయత్నం జరగడం లేదు.

ఫొటో సోర్స్, Facebook/jaconline
దళిత ముఖ్యమంత్రి ఎప్పటికి?
నేను అనుకునేదేంటంటే... రాజకీయాల్లో ఎవరో ఒకరు బలాన్ని చెలాయిస్తున్నంత కాలం ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానికి ప్రాధాన్యం లేదు. దాని వల్ల పెద్ద మార్పేమీ ఉండదు. భాగస్వామ్యం అందరికీ సమానంగా ఉండాలి.
చాలా చోట్ల ఆడవాళ్లు సర్పంచులుగా ఉన్నారు. భర్తలు పెత్తనం చెలాయిస్తుంటారు. అలాంటి చోట్ల వాళ్లకు కొంత చైతన్యం పెరగొచ్చు. అయితే, ఎంత సేపూ వెనుక నుంచి ఎవరో నడిపినంత కాలం స్వతంత్రత అనేది ఉండదు.
రాజకీయాల్లో స్వతంత్రంగా భాగస్వామ్యం పొందగలగడం చాలా ముఖ్యం. అలా భాగస్వామ్యం పొందే క్రమంలో నాయకత్వం సాధించుకోగలిగితే అది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
అలా నాయకులుగా ఎదిగితే ప్రజలలో కూడా ప్రభుత్వాల పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Facebook/jaconline
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కోయ-లంబాడాల ఘర్షణ
ఆదివాసుల పట్ల ప్రభుత్వానికి కనీసమైన స్పృహ కూడా లేదు. ఇష్టారాజ్యంగా వారి భూములు గుంజుకున్నారు.
వాళ్లకు ఉద్యోగావకాశాలు పెంచే ప్రయత్నాలు చేయలేదు. వాళ్ల వ్యవసాయం చితికిపోతున్నా పట్టించుకోలేదు.
మరోవైపు లంబాడాలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు కానీ ఆ దిశగా ప్రయత్నాలు లేవు.
లంబాడీ తండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తామన్నారు. అదీ జరగలేదు. దీని వల్ల అసంతృప్తి రెండు వర్గాల్లోనూ పేరుకుపోయింది. ఈ అసంతృప్తే ఘర్షణలకు దారి తీసింది.
లంబాడాల వల్ల మాకు అవకాశాలు తగ్గాయని ఆదివాసుల్లో అభిప్రాయం ఉంది. మాపై దాడి చేస్తున్నారని లంబాడాలంటున్నారు.
అయితే, లోతుగా ఆలోచిస్తే పరిష్కారం కష్టమైందేమీ కాదు. ఆదివాసుల బతుకుదెరువు అవకాశాలను ముందుగా పెంచాలి.
వాళ్లకు భూములపై హక్కు కల్పించాలి. వ్యవసాయాన్ని బాగు చేసుకునే వీలు కల్పించాలి. ఐటీడీఏను బలోపేతం చేయాలి.

జీవో నెంబర్ 3 ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకు ఉద్యోగావకాశాలివ్వాలి. అట్లాగే, కొన్ని రాష్ట్రాల్లో లంబాడాలకు ఎస్‌టీ హోదా లేదు. వాళ్లంతా ఇక్కడికి వస్తున్నారు.
ఈ వలస ఆగనట్టయితే అది ఆదివాసులకు ఇబ్బందికరమే. వలసల వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న వనరులపై వారు అధికారం కోల్పోతారు.
ఇతర రాష్ట్రాల నుంచి వలసలు ఆగాలి. వలస వచ్చిన వారికి ఎస్‌టీ హోదా ఇవ్వనట్టయితే ఆదివాసులకు న్యాయం జరుగుతుందనే భావన చాలా మందిలో ఉంది.
అదే విధంగా, లంబాడా ప్రాంతాల్లో గ్రామ పంచాయితీల ఏర్పాటు జరిగితే అక్కడా కొంత అభివృద్ధికి వీలుంటుంది. చెరువులు, రోడ్లు, స్కూళ్లు వంటివి నిర్మాణమవుతాయి.
మరోవైపు, లంబాడాల పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. 90 శాతం లంబాడాలు చాలా తీవ్రమైన దారిద్ర్యంలో ఉన్నారు.
అయితే చదువులో కొంత ముందుండడం వల్ల ఆదివాసులకన్నా లంబాడాలు కొన్ని సౌకర్యాలు ఎక్కువ ఉపయోగించుకోగలుతున్నారనేది వాస్తవం.
వారు ఉద్యోగాల్లోకి కూడా రాగలుగుతున్నారు. ఆ అవకాశం ఆదివాసీ సమాజంలో లేదు. ఇది వాస్తవమే కానీ లంబాడాలు కూడా పేదరికంలో మగ్గుతున్నారని గ్రహించి సమస్యపై ఇరు పక్షాలూ సానుకూలంగా స్పందించాలి.
ఈ చర్చను ప్రభుత్వం ముందుండి నడపాలి. వారికి న్యాయం కలుగుతుందనే విశ్వాసం కల్పించాలి. ప్రభుత్వం వీరిని పట్టించుకోనప్పుడే, ఉన్న కొద్ది పాటి సౌకర్యాల కోసం సాటివారితో ఘర్షణ పడటం చాలా సహజం.
ముఖ్యంగా ఆదిలాబాద్‌కు మహారాష్ట్ర నుంచి విస్తృతంగా వలస వస్తున్న పరిస్థితుల్లో ఈ ఘర్షణ ఇంకా తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు కనిపెట్టిన అద్భుతాలివి
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- #metoo బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయంటే..
- #కోడిపందేలు: కోడి నెమలి ఎలా అయ్యింది?
- ‘ఇంతకీ అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా?’
- ఫేస్బుక్లో గ్యాస్ ఇలా బుక్ చేసుకోండి
- 'గ్రీన్ కార్డు రావాలంటే మరో 108 ఏళ్లు ఆగాలి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









