ఇజ్రాయెల్: శత్రువును ప్రేమతో ఉచ్చులో పడేసే 'మొసాద్‌' మహిళా గూఢచారి కథ

'సిండీ'
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, మానసీ దాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1986లో ప్రపంచం మొత్తం దావానలంలా వ్యాపించిన వార్త - ఇజ్రాయెల్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అది అనేక ఇతర దేశాలకంటే ఎక్కువ అణ్వాయుధాల్ని పోగు చేసుకుంది.

ఈ రహస్యాన్ని ప్రపంచానికి బట్టబయలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ముర్డేఖాయి వనును. ఆయన్ని పట్టుకోవడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక మహిళా గూఢచారిని నియమించింది. వనునుని ఆమె తన ప్రేమ వలలో బంధించి లండన్ నుంచి వేరే దేశానికి తీసుకుని వెళ్లిపోయేట్టు ఓ రహస్య పథకం రచించింది.

ఈ పథకం ఫలించి వనును పట్టుబడ్డాక, ఇజ్రాయెల్ ప్రభుత్వం అతనిపై నేరవిచారణ జరిపి కటకటాల వెనక్కి పంపింది. వనును తన విడుదలకోసం పరితపిస్తూ, స్వేచ్ఛావాయువులు పీల్చే క్షణాల కోసం ఇంకా ఊచల వెనుకే ఎదురుచూస్తున్నాడు.

ముర్డేఖాయి, అతణ్ని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి పట్టించిన డిటెక్టివ్ ప్రియురాలు 'సిండీ'ల కథ ఇది.

నెగేవ్ వద్ద ఉన్న అణు ప్లాంటు

ఫొటో సోర్స్, Getty/AFP

ఫొటో క్యాప్షన్, నెగేవ్ వద్ద ఉన్న డిమోనో అణు కేంద్రం ఫొటో ఇది. ఈ ఫొటో 2002 నాటిది. ఈ ప్లాంటును 1950లో ఫ్రాన్స్ మద్దతుతో ఏర్పాటు చేశారు. ఆ కాలంలో అది ఈ యూదు ప్రాంతానికి ఆయుధాలమ్మేది.

మొదట సాంకేతిక నిపుణుడు.. తరువాత గుట్టువిప్పేశాడు…

వనును 1976 నుంచి 1985 వరకు ఇజ్రాయెల్‌లోని బీర్షెబా దగ్గర నెగేవ్ ఎడారిలోని డిమోనా అటామిక్ ప్లాంట్‌లో పని చేసేవాడు. అతను బెన్ గురియోన్ యూనివర్సిటీలో ఫిలాసఫీ అభ్యసించాడు.

చదువు పూర్తయిన తరువాత అతనికి పాలస్తీనా సానుభూతిపరుల బృందంతో పరిచయం ఏర్పడింది. ఇజ్రాయెల్ భద్రతా అధికారులకు ఈ విషయం తెలిసి, అతని కార్యకలాపాలపై అనుమానంతో 1985లో ఉద్యోగం నుంచి తొలగించారు.

వనును వెళ్లి పోయేముందు డిమోనా అటామిక్ ప్లాంట్‌, హైడ్రోజన్, న్యూట్రాన్ బాంబుల ఫొటోలు ఒక 60 దాకా రహస్యంగా తీసుకున్నాడు. ఈ ఫొటోలతో సహా అతను దేశాన్ని వదిలి ఆస్ట్రేలియా వెళ్లి పోయి, క్రైస్తవాన్ని స్వీకరించి సిడ్నీలో జీవనం సాగించాడు.

తరువాత లండన్ నుంచి ప్రచురితమయ్యే 'సండే టైమ్స్' జర్నలిస్ట్ పీటర్ హూనమ్‌ను పరిచయం చేసుకుని, అతనికి తన వద్దనున్న రహస్య ఫొటోలను అందజేశాడు.

సండే టైమ్స్ స్టోరీ

ప్రపంచాన్ని విస్తుపరచిన వ్యాసం

వనును ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి 1986, అక్టోబరు 5వ తేదీన 'సండే టైమ్స్'‌లో "రివీల్డ్: ది సీక్రెట్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ న్యూక్లియర్ ఆర్సనల్" అనే వ్యాసం ప్రచురితమయ్యింది. ఆ వ్యాసాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది.

అంతకు ముందు, "న్యూక్లియర్ వెపన్స్ అండ్ నాన్‌-ప్రొలిఫరేషన్: ఎ రిఫరన్స్ హాండ్‌బుక్" ప్రకారం, ఇజ్రాయెల్ దగ్గర 10-15 అణ్వాయుధాలే ఉన్నట్టుగా అమెరికన్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ సీఐఏ అంచనా వేసింది.

కానీ, వనును చెప్పినదాని ప్రకారం ఇజ్రాయెల్‌కు భూగర్భ ప్లుటోనియంను వేరే చేసే రహస్య ఏర్పాట్లు ఉన్నాయి, ఇంచుమించు 150-200 అణ్వాయుధాలు ఉన్నాయి. వనును బయటపెట్టిన ఈ రహస్యం ఫలితంగా అప్పటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి షిమోన్ పెరస్ తమ వద్ద అణ్వాయుధాలున్నాయన్న నిజాన్ని అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌తో ఒప్పుకోక తప్పలేదు.

ద సండే టైమ్స్

ఫొటో సోర్స్, The Sunday Times

ఫొటో క్యాప్షన్, 1986 అక్టోబర్ 5న ప్రచురించిన వ్యాసాన్ని 'ద సండే టైమ్స్' 2008లో మరోసారి ప్రచురించింది.

'సండే టైమ్స్'కు మొత్తం సమాచారం స్వయంగా అందించడం కోసం వనును లండన్ చేరుకున్నాడు.

అయితే, 1986లో ఈ వ్యాసం ప్రచురించడానికి ముందే అతణ్ని బ్రిటన్ నుంచి బయటకు రప్పించాలని, అది కూడా ఎలాంటి గొడవ జరగకుండా తనంతట తనే వచ్చేలా చేయాలని ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ "మొసాద్" వ్యూహం రచించింది.

పథకం ప్రకారం ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక మహిళా గూఢచారిని పంపించింది.

వనును

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2004 నాటి ఈ ఫొటోలో వనునుతో పాటు పీటర్ హునమ్ కనిపిస్తారు.

మొసాద్ పంపిన 'సిండీ' వలలో చిక్కిన వనును…

పీటర్ హూనమ్ పుస్తకంలో రాసిన దాని ప్రకారం, 1986 సెప్టెంబర్ 24 నాడు, వనును రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయిని చూశాడు.

ఆ అమ్మాయి దేనికో ఆందోళన పడుతున్నట్టు గమనించి, ఆమెకు సహాయం చెయ్యాలన్న ఆరాటంతో దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆమెను కాఫీకి ఆహ్వానించాడు.

సిగ్గుపడుతూనే ఆమె అందుకు ఒప్పుకుంది. తను ఒక అమెరికన్ బ్యుటీషియన్ అని పరిచయం చేసుకుంది.

ముర్డేఖాయి వనును

ఫొటో సోర్స్, FREE FAMILY

మొదటి పరిచయంలోనే వారిద్దరి మధ్య సఖ్యత కుదిరింది. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. 'సిండీ' తన వివరాలను రహస్యంగా ఉంచింది కానీ వనును, జార్జ్ ఫార్‌స్టే అనే మారు పేరుతో మౌంట్‌బాటెన్ హొటల్‌లోని 105వ నంబరు గదిలో నివాసం ఉంటున్నానని తన వివరాలన్నీ చెప్పేశాడు.

ఒక పక్క 'సండే టైమ్స్'తో చర్చలు జరుపుతూనే, మరోపక్క 'సిండీ'తో ప్రేమ వ్యవహారాల్లో నిండా మునిగిపోయాడు వనును. చివరికి సెప్టెంబరు 30న 'సిండీ'తో కలిసి రోమ్ చేరుకున్నాడు.

మొర్డెఖాయి వనును
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తున్న సమయంలో వనును తన అరచేతిపై ఓ సందేశం రాసి వ్యాన్‌లోంచి మీడియా వారికి చూపించాడు. అందులో తనను రోమ్ నుంచి పట్టుకొచ్చినట్టు ఉంది.

బ్రిటన్ నుంచి మాయమై ఇజ్రాయిల్‌లో తేలిన వనును...

పీటర్ హూనమ్ కథనం ప్రకారం, బ్రిటన్ నుంచి వెళ్ళిన మూడు వారాల తరువాత అతణ్ని ఇజ్రాయెల్‌లో అధికారులు 15 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు.

సముద్రమార్గం ద్వారా ఇటలీ చేరుకునేలా తన ప్రియురాలు వనునును ఒప్పించిందని, ఇటలీ పొలిమేరల్లోకి అడుగుపెట్టగానే మొసాద్‌కు చెందిన అధికారులు వనునును ముట్టడించి ఇజ్రాయెల్‌కు అప్పజెప్పారు.

1986 డిసెంబర్ 30న వనునును అరెస్ట్ చేశారని "ది లాస్ ఏంజిల్స్ టైమ్స్" ప్రచురించింది. అయితే 'సిండీ' మొసాద్‌కు చెందిన వ్యక్తి అని నమ్మడానికి వనును నిరాకరించాడు.

ఒక ఏడాది తరువాత 'సండే టైమ్స్' 1987లో 'సిండీ'పై ప్రచురించిన కథనం తరువాత కూడా వనును ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించాడు.

బార్ రఫేలీ అనే ఇజ్రాయెలీ మోడల్ 'కిడాన్' అనే సినిమాలో మొసాద్ ఏజెంటు పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Instagram/Bar Refaeli

ఫొటో క్యాప్షన్, బార్ రఫేలీ అనే ఇజ్రాయెలీ మోడల్ 'కిడాన్' అనే సినిమాలో మొసాద్ ఏజెంటు పాత్ర పోషించారు.

ఇంతకూ 'సిండీ' వివరాలేంటి?

సిండీ అసలు పేరు షెర్లీ హనిన్ బెంటోవ్. 1978లో ఆమె ఇజ్రాయెల్ ఆర్మీలో చేరింది. వనును పట్టుబడ్డ కొంతకాలం తరువాత, పీటర్ హూనమ్ ఆమెను ఇజ్రాయెల్‌లోని నెటాన్యాలో చూశారు.

అక్కడ ఆమె తన భర్తతో కలిసి నివసిస్తుండేది. పీటర్ ఆమెను 'సిండీ'గా గుర్తించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ, తాను సిండీని కాదని అక్కడి నుంచి తప్పుకుంది.

పీటర్ ఆమె ఫొటోలు సేకరించారు. తరువాత చాలా ఏళ్ల పాటు ఆమె అదృశ్యమైంది.

గార్డన్ థామస్ రాసిన "గిడియోన్ స్పైస్: మొసాద్ సీక్రెట్ వారియర్స్" అనే పుస్తకం ప్రకారం 1997లో ఒర్లాంటోలో షెర్లీ మళ్ళీ కనిపించింది. అక్కడ 'సండే టైమ్స్'కి చెందిన ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వనునును పట్టించడంలో తన పాత్ర ఉందని ఆమె ఒప్పుకుంది.

పీటర్ హునమ్

ఫొటో సోర్స్, David Silverman/Getty Images

ఫొటో క్యాప్షన్, పీటర్ హునమ్

వనునుకు విధించిన శిక్ష, స్వేచ్చ కోసం ప్రచారం...

1988లో ముర్డేఖాయి వనునుకు ఇజ్రాయెల్‌లో 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 13 ఏళ్ల శిక్ష పూర్తయ్యాక 2004లో అతన్ని విడుదల చేశారు. కానీ అతనిపై అనేక ఆంక్షలు విధించారు.

అయితే అణ్వాయుధ రహిత ప్రపంచానికి వనును చేసిన ప్రయత్నం అభినందించదగ్గది. అందుకే ఆయనను ఆదుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఓ ఉద్యమం మొదలెట్టారు.

2004 ఏప్రిల్‌లో విడుదల తరువాత సెయింట్ జార్జ్ కేథెడ్రల్ అతనికి ఆశ్రయమిచ్చింది. అయితే ఇజ్రాయెల్ సాయుధ దళాలు ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.

2004 నవంబర్‌లో మళ్ళీ అతన్ని ఒకరోజంతా నిర్బంధించాయి. అతనిపై ఇజ్రాయెల్ ఎన్ని ఆంక్షలు విధించిందంటే, అవి 32 ఏళ్ళ తరువాత కూడా వర్తిస్తాయి.

కిందటి ఏడాది నార్వే వనునుకు ఆశ్రయం ఇస్తానని ప్రతిపాదించింది. అతని భార్య కూడా ఓస్లోలో నివాసం ఉంటోంది.

ముర్డేఖాయి వనును

ఫొటో సోర్స్, GALI TIBBON/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, 2004లో జైలు నుంచి విడుదలై వస్తున్న ముర్డేఖాయి వనును

ఇజ్రాయెల్ అణ్వాయుధ కార్యక్రమాలు...

1950లో ఫ్రాన్స్ సహాయంతో ఇజ్రాయెల్, నెగేవ్‌లో అణ్వాయుధాల కర్మాగారం ప్రారంభించింది.

అయితే ప్రపంచం దృష్టిలో అది బట్టలు లేదా వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసే కేంద్రం లేదా రీసెర్చి సెంటర్.

షిమోన్ పెరేజ్

ఫొటో సోర్స్, MENAHEM KAHANA/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, షిమోన్ పెరేజ్

ఇజ్రాయెల్ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని 1958లో U-2 స్పై గూఢచర్య విమానాల ద్వారా వెల్లడైంది.

1960లో అప్పటి ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియిన్ అది అణు పరిశోధనా కేంద్రమేననీ, అయితే అవి ప్రపంచశాంతిని అభిలషిస్తూ జరుపుతున్న పరిశోధనలని ప్రకటించారు.

1968లో సీఐఏ విడుదల చేసిన ఓ నివేదికలో ఇజ్రాయెల్ అణ్వాయుధాల తయారీని ప్రారంభించిందని పేర్కొన్నారు. చివరకు వనును గుట్టువిప్పిన తర్వాతే అసలు రహస్యం బయటపడింది. దాంతో అమెరికా సహా యావత్ ప్రపంచం నివ్వెరపోయింది.

ఇజ్రాయెల్ ప్రధాని ట్వీట్

ఫొటో సోర్స్, @ISRAELIPM

ఇజ్రాయెల్ అణ్వాయుధ కేంద్రాన్ని మొదలెట్టిన వ్యక్తి పేరు షిమోన్ పెరేజ్.

2016లో బెంజమిన్ నెతన్యాహూ అణు పరిశోధనలో పెరేజ్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఆ న్యూక్లియర్ ప్లాంట్‌కు షిమోన్ పెరేజ్ అని నామకరణం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)