బీబీసీ ఇన్నోవేటర్స్: పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
స్కూలుకు వెళ్లడానికి రాజస్థానీ అమ్మాయిలు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. స్కూలుకు పోవాలంటే ఇంటి పనులన్నిటినీ భుజానికెత్తుకోవాల్సిందే. చాలా మంది అమ్మాయిలకు ఇంటి పనుల్లోనే తెల్లారిపోతుంది. వారి జీవితాల్లో స్కూలుకు వెళ్లడానికి ప్రాధాన్యత ఉండదు.
కానీ ఓ సంస్థ మాత్రం ఆడపిల్లలను స్కూళ్లకు పంపే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంతవరకూ ముప్ఫైలక్షల మంది ఆడపిల్లలను స్కూలుకు పంపడంలో సఫలమైంది. 'చదువు' వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చేసి చూపించింది ఆ సంస్థ.
ఈ అమ్మాయి పేరు భగవంతి లస్సీ రామ్. రొట్టెలు చేయడంతో ఈమె రోజు మొదలవుతుంది. వేడి వేడి పెనం మీద చేతి వేళ్లు కాలకుండా జాగ్రత్తగా రొట్టెలు కాలుస్తుంది.
ఆ తర్వాత కోళ్లకు గింజలు వేయడం, వంట గిన్నెలు కడగడం ఆమె పని.
ఈ పని చేయి.. ఆ పని చేయి.. అంటూ భగవంతి నాన్న ఆమెకు పనులను గుర్తు చేస్తూనే ఉంటాడు.
''భగవంతి మేకలను మేపుకు తీసుకుపోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది.. అవి ఎక్కువ సేపు ఆగలేవు'' అంటూ ఆమె చేయాల్సిన పనులను మనకూ గుర్తు చేస్తాడు ఆ తండ్రి.

ఆ తర్వాత ఆమె స్కూలుకు పోవడానికి సిద్ధమవుతుంది. జడ వేసుకుని, ఒంటిపై ఛున్నీ సర్దుకుని భుజానికి బ్యాగు తగిలించుకుంటుంది. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు మెల్లగా అడుగులు వేస్తుంది.
''బడికి పోవాలంటే 4 కిలోమీటర్లు నడవాలి. ఊరికి దూరం. అందుకే మా ఊళ్లో చాలా మంది ఆడపిల్లలు బడికి వెళ్లరు. స్కూలు మా ఊళ్లోనే ఉంటే చాలా మంది ఆడపిల్లలు చదువుకుంటారు.'' అంటూ చెప్పుకొచ్చింది భగవంతి -
''స్కూలుకు పోవాలంటే మేం హైవేను దాటాలి. చాలా మంది డ్రైవర్లు మద్యం తాగి తిరుగుతుంటారు. అందుకే అమ్మాయిలు స్కూలుకు పోవాలంటే భయపడతారు.''
ఆడపిల్లలను స్కూలుకు పంపే విషయంలో తక్కిన వాళ్లకన్నా భగవంతి తండ్రి చాలా నయం.

బడి మానేస్తున్న ఆడపిల్లలు
'ఎడ్యుకేట్ గర్ల్స్' సంస్థ సభ్యులు అన్ని గ్రామాలూ తిరుగుతూ బడి మానేసిన ఆడపిల్లలను గుర్తిస్తారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో వివరిస్తారు. మళ్లీ బడికి పంపేలా వారిని సిద్ధం చేస్తారు.
ఈ స్వచ్ఛంద కార్యకర్తలు పలు స్కూళ్లతో కలిసి పని చేస్తారు. స్కూళ్లల్లో మరుగుదొడ్లు ఉండేలా చూస్తారు. పిల్లలకు ఇంగ్లీషు, గణితం, హింది కూడా నేర్పుతారు.
కొన్ని లక్షల మంది పిల్లలకు ఈ సంస్థ కార్యకర్తలు సహాయం చేశారు. 1,50,000 మంది ఆడపిల్లలు స్కూళ్లకు పోవడానికి కారణమయ్యారు.
'ఎడ్యుకేట్ గర్ల్స్' సభ్యురాలు మీనా భాటి మమ్మల్ని ఓ ఇంటికి తీసుకు వెళ్లారు. ఆ ఇంట్లో నలుగురు ఆడపిల్లలకు చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేశారు. ఐదో అమ్మాయిని కూడా పెళ్లి చేయాలని స్కూలు మాన్పించారు. ఈ అమ్మాయి వయసు 14.
మీనా మాట్లాడుతూ -
''అసలు ఆడపిల్లలకు చదువెందుకని ఆలోచిస్తారు ఈ తల్లిదండ్రులు. అమ్మాయిలు ఇంటి పనులు చేయాలి. తల్లిదండ్రులు పొలానికో, కూలి పనులకో పోతే.. పశువులను, ఇంట్లోని చంటి బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలి. చదువుకోవడం శుద్ధ దండగ అనుకుంటారు.'
'ఎడ్యుకేట్ గర్ల్స్' ను స్థాపించిన సఫీనా హుస్సేన్ మాత్రం.. జీవితంలో తాను అనుకున్నవి సాధిస్తానని విశ్వసిస్తోంది. అందుకు కారణం ఆమె చదువే!
భారతదేశంలో స్కూళ్లకు వెళ్లని 10 - 14 సంవత్సరాల ఆడపిల్లలు 30,00,000 ఉంటారని ఓ అంచనా.


బీబీసీ ఇన్నొవేటర్స్ సిరీస్ దక్షిణాసియాలోని చాలా సమస్యలకు సరికొత్త సమాధానాలు ఆవిష్కరిస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోవాలంటే BBC Innovators. క్లిక్ చేయండి.

చిన్నారి పెళ్లికూతుళ్లు
ముఖ్యంగా బాల్య వివాహాలు ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నాయి.
''రాజస్థాన్‌లో 50-60 శాతం మంది అమ్మాయిలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇక ఆడపిల్లల విషయంలో 10-15 శాతం మందికి 10 సంవత్సరాల్లోపు పెళ్లి చేస్తున్నారు.'' అని చెబుతోంది సఫీనా.
యునిసెఫ్ గణాంకాల ప్రకారం ఇతర దేశాలకంటే భారతదేశంలోనే బాల్యవివాహాలు ఎక్కువ. దేశంలో జీవిస్తోన్న మహిళల్లో దాదాపు సగం మందికి 18 సంవత్సరాల్లోపే పెళ్లయ్యింది.
నీలమ్ వైష్ణవ్‌కు 14 ఏళ్లకే ఆమె తన బావతో పెళ్లయ్యింది. పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించే ఒప్పందం మేరకు మెట్టినింట్లో అడుగు పెట్టింది. కానీ అత్తమామలు, భర్త తమ మాటకు కట్టుబడలేదు. ఈమెను స్కూలుకు పంపలేదు. దీంతో ఆమె తన భర్తతో విడిపోవాలని అనుకుంది.
''నా భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్నాక చాలా కష్టాలు పడ్డాను. మా ఊళ్లో అందరూ నన్ను ఎగతాళి చేశారు. నానామాటలన్నారు. ఇప్పటికీ అంటున్నారనుకోండీ.. మా అత్తమామలు నా గుణం మంచిది కాదన్నారు. నేను సిగ్గులేనిదాన్నని అన్నారు.''

బంగారుకొండలు..
భగవంతి తన భవిష్యత్తు గురించి కలలు కంటోంది -
''నేను పెద్దయ్యాక టీచర్ అవుతా. ఆడపిల్లలకు చదువు చెబుతాను. ఎందుకంటే.. చదువుకుంటే ధైర్యం వస్తుంది. నా కాళ్లపై నేను నిలబడి, ఉద్యోగం సంపాదిస్తే నా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడొచ్చు.''
కుటుంబ సభ్యుల ఆరోగ్యం, వారికి పౌష్టికాహారం అందించడంలో మహిళది కీలక పాత్ర. అదే ఆడపిల్లలు చదువుకుంటే దేశంలోని చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సఫీనా విశ్వాసం.
అమ్మాయిలు చదువుకోవడం వల్ల శిశు మరణాలు కూడా 5-10 శాతం తగ్గుతాయని యునెస్కో అంటోంది.
''స్త్రీ విద్య దేశాభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది. మనకు ఆడపిల్లలే విలువైన ఆస్తులు'' అని సఫీనా అంటోంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)













