#BBCGujaratOnWheels: అభివృద్ధికి ఆమడ దూరం.. బనాస్‌కాంఠా జిల్లా
ఒక ప్రయత్నం. ఒక ప్రయోగం. గ్రామీణ మహిళల స్థితిగతులు తెలుసుకోవాలనే ఆరాటం. వాటిని పాలకుల దృష్టికి తీసుకెళ్లి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే తాపత్రయం. అందుకే బీబీసీ ఒక వినూత్న ప్రయత్నం చేస్తోంది.
త్వరలో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ నుంచి దీనికి శ్రీకారం చుట్టింది. బీబీసీ మహిళా ప్రతినిధులు బుల్లెట్లపై గుజరాత్‌లో పర్యటించి అక్కడి మహిళల స్థితిగతులు తెలుసుకుంటున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రచారం హోరెత్తుతోంది. హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గుజరాత్ పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంది.? అక్కడ వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? వీటిపై సమగ్ర అధ్యయనం కోసమే ఈ ప్రయత్నం.

#BBCGujaratOnWheels 'గుజరాత్ ఆన్ వీల్స్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. బీబీసీ మహిళా ప్రతినిధులు, ఇతర సాంకేతిక సిబ్బందితో కలిసి బుల్లెట్లపై గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బీబీసీ టీమ్ తొలిరోజు బనాస్‌కాంఠా జిల్లాలో పర్యటించింది. ఈ జిల్లా గుజరాత్‌కు ఉత్తరంగా, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉంది. గుజరాత్ రాజకీయ, ఆర్థిక, సామాజిక, వాణిజ్య రంగాల్లో ఈ జిల్లాకు ఘన చరిత్రే ఉంది.
వజ్రాలు, సెంటు వ్యాపారులు, కవులకు బనస్కాంత జిల్లా పెట్టింది పేరు. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నాయి. అక్షరాస్యతలో రాష్ట్రంలోనే చివరి నుంచి రెండోస్థానంలో ఉంది. మహిళల అక్షరాస్యత 51 శాతానికి మించిలేదు.

బనస్కాంత జిల్లా ఎదుర్కొంటున్న సవాళ్లు
గుజరాత్‌లోని ఇతర జిల్లాలతో పోలిస్తే బనాస్‌కాంఠా జిల్లాలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ. మహిళల అక్షరాస్యత కేవలం 51.75 శాతంగా ఉంది.
పాలన్పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి మినహా ఈ జిల్లాలో మరో పెద్ద ప్రభుత్వాస్పత్రి లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో పేరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి కానీ వైద్యం చేయడానికి డాక్టర్లు మాత్రం లేరు.
86 శాతం జనాభా గ్రామాల్లోనే ఉంది. వీరికి వ్యవసాయమే జీవనాధారం.
గతేడాది వచ్చిన వరదలు తీరని నష్టం కలిగించాయి. చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగింది.
ఈ జిల్లాలో రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందుకే రాజకీయ నాయకులు తమ కులం వాళ్లను మినహా ఇతర కులాల వారి సంక్షేమం గురించి ఆలోచించరనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి?
ఈ జిల్లా వెనకబాటుతనానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాకు చెందిన వాళ్లు రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ నాయకులుగా ఎదిగారు. కొందరు మంత్రులయ్యారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ ఈ జిల్లాలో విద్యను నిర్లక్ష్యం చేశాయి.
ఏదైనా రోగం వస్తే గ్రామీణ ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులే గతి. చివరికి ఉన్న ఒక్క ప్రభుత్వాస్పత్రి నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వారికి అప్పగించాలని భావిస్తున్నారు.

ప్రభుత్వం వరద సహాయ చర్యలు చేపట్టినా.. ఇప్పటికీ కొందరు ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ జిల్లాలో అక్షరాస్యత తక్కువగా ఉండటంతో కుల రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సమర్థుడైన నాయకుడ్ని ఎన్నుకునే బదులు.. తమ కులం వారికే ఓట్లు వేస్తారనే విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి బనాస్‌కాంఠా జిల్లాలో సామాజిక అభివృద్ధి తక్కువగా ఉందని బీబీసీ 'గుజరాత్ ఆన్ వీల్స్' పర్యటనలో తేలింది.
మా ఇతర కథనాలు
- ఈ ఎన్నికల సంఘం మోదీదో కాదో కానీ శేషన్ది మాత్రం కాదు!
- 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ముస్లింలలో మార్పొచ్చిందా?
- నా ఫ్రెండ్ ఎన్నికల అంశాల్లో నిపుణుడు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తే పకపకా నవ్వాడు. ఎందుకంటే..!
- గుజరాత్‌లో వేగంగా మారుతున్న రాజకీయాలు!
- గుజరాత్ ప్రచార బరిలో యూపీ సీఎం యోగి
- మోదీ లేదా రాహుల్... విదేశాల్లో ఎవరు పాపులర్?
- ఆరు రాష్ట్రాల ఎన్నికలపైనే రెండు పార్టీల గురి
- ప్రధాని మోదీ సొంతూరి సంగతులివే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










