‘మన శంకర వరప్రసాద్ గారు’ పై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు నిజమయ్యాయా..

ఫొటో సోర్స్, @AnilRavipudi
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
"మన శంకర వరప్రసాద్ గారు" పై ఎక్కువ అంచనాలున్నాయి. కారణం చిరంజీవి, నయనతార కాంబినేషన్.
సంక్రాంతి హిట్ చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ టైం చిరంజీవితో తీశారు. ఆల్రెడీ పాటలు హిట్. వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. అన్నిటికి మించి పండుగ మూడ్. మరి వరప్రసాద్ ఎలా వున్నాడు?
కథ ఏమంటే ... శంకరవరప్రసాద్ నేషనల్ సెక్యూరిటీ అధికారి. కేంద్ర మంత్రికి (శరత్ సక్సెనా) రక్షణగా వుంటాడు. అతనికో టీం. హర్షవర్ధన్ , అభినవ్ గోమఠం, కేథరిన్. తమ బాస్ గురించి వాళ్లు గొప్పగా వర్ణిస్తూ వుంటే హీరో కామెడీగా రివీల్ అవుతాడు.
ఒక యాక్షన్ సీన్‌లో కేంద్ర మంత్రిని కాపాడిన తర్వాత హీరో ప్లాష్‌బ్యాక్ ఓపెన్ చేస్తాడు.
పెద్ద వ్యాపారవేత్త జీవీఆర్ (సచిన్ ఖేద్కర్) కుమార్తె శశిరేఖ (నయనతార)ని ప్రసాద్ పెళ్లి చేసుకుని వుంటాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మామ చేసిన పన్నాగం వల్ల ఇద్దరూ విడిపోతారు.
కొన్నేళ్ల తర్వాత హిల్ స్టేషన్‌లో చదువుతున్న పిల్లల్ని కలుసుకోడానికి హీరో చేసిన ప్రయత్నాలు, తపన ఫలించాయా? దంపతులు ఎలా కలుసుకున్నారు? మామ కుటుంబానికి వున్న ముప్పు నుంచి హీరో ఎలా తప్పించాడు? చివర్లో వచ్చే వెంకీగౌడ్ (వెంకటేశ్) ఎవరు? ఇది మిగతా సినిమా.


ఫొటో సోర్స్, @AnilRavipudi
అనిల్ రావిపూడి స్టైల్ ఏంటంటే , కథని కాకుండా కామెడీని నమ్ముకుంటాడు. ఎపిసోడ్ కామెడీ ఆయన స్పెషల్. అనేక క్యారెక్టర్లు వింతవింతగా ప్రవర్తించి నవ్వించి వెళుతుంటాయి.
ఎఫ్ 1, ఎఫ్ 2, సంక్రాంతికి వస్తున్నాం లలో అనేక పాత్రలు ఇప్పటికీ మనకి గుర్తుంటాయి. ఆ క్యారెక్టర్లు కూడా వింత మానరిజమ్స్‌తో వుంటాయి. "అంతేగా, హనీ ఈజ్ ది బెస్ట్" ఉదాహరణలు.
గత సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్‌లో వెంకటేశ్ కంటే ఐశ్వర్య రాజేశ్ ఎక్కువగా నవ్వించింది.
అయితే మన శంకర వరప్రసాద్ గారు లో అనిల్ రావిపూడి కథ, కామెడీ కంటే చిరంజీవినే ఎక్కువ నమ్ముకున్నాడు. ఇది చిరంజీవి వన్ మ్యాన్ షో. బలం, బలహీనత రెండూ ఆయనే.
చిరంజీవి అద్భుతమైన కామెడీ చేయగలడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చంటబ్బాయి. జంధ్యాల డైరెక్షన్‌లో 1986లో వచ్చింది. అయితే అప్పట్లో చిరంజీవికి వున్న యాక్షన్ ఇమేజ్ హోరులో అభిమానులకి పెద్దగా నచ్చలేదు.
తర్వాత కొన్ని సినిమాల్లో చిరంజీవి కామెడీ చేసినా అవేవీ ఫుల్ లెంగ్త్ కాదు.
చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి కొత్తగా , ఫ్రెష్‌గా కనిపించాడు. ఈ వయసులో కూడా ఎనర్జీ, కామెడీ టైమింగ్ ముచ్చట కలిగిస్తాయి.

ఫొటో సోర్స్, @AnilRavipudi
కథ, లాజిక్కులు, ఎమోషన్స్ వీటి జోలికి ఎక్కువగా వెళ్లకుండా చిరంజీవి నుంచి ఏం కావాలో అదే అనిల్ రావిపూడి తీసుకున్నాడు. చిరంజీవి కూడా అనవసరమైన బిల్డప్‌లు, యాక్షన్ సీన్స్ అనుకోకుండా దర్శకుడికి అనుగుణంగా తనని తాను ఒదిగిపోయాడు. ఈ మేరకి సక్సెస్ అయిన అనిల్, రైటింగ్‌లో విఫలమయ్యాడు.
అతని సినిమాల్లో ఆర్గానిక్‌గా కనిపించే అనేక పాత్రలు మిస్సయ్యాయి. చిరంజీవి ఒకడే కనిపించడంతో ఏ ఒక్కరికీ ప్రాధాన్యత లేకుండా పోయింది.
సచిన్ ఖేద్కర్, నయనతారలు కూడా పెద్దగా ముద్ర వేయరు. శ్రీనివాసరెడ్డి, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, రఘుబాబు వున్నా నవ్వించిందేమీ లేదు.
కథ డైలాగులతో నడుస్తూ వుంటుంది తప్ప, పెద్దగా సంఘటనలు జరగవు. సెకెండాఫ్‌లో విలన్ ఫోర్స్‌డ్‌గా వచ్చాడు తప్ప, కథలో భాగంగా కాదు. చివర్లో వచ్చే వెంకటేశ్ నవ్వించినా అతను కూడా కథలో భాగం కాదు.
భార్యాభర్తలు విడిపోవడం, పిల్లల కోసం తండ్రి తపన, మామ విడగొట్టడం తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి చూస్తున్న కథలే. చివరి సీన్ వరకూ ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి తెలుసు. అందుకే సినిమా అక్కడక్కడ డ్రాప్ అయి మెల్లిగా లేస్తుంది. ఫస్టాఫ్ ఓకే కానీ, సెకెండాఫ్ కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, @AnilRavipudi
లోపాలు పక్కన పెడితే కొన్ని సన్నివేశాలు గుర్తుండిపోతాయి.
హీరోహీరోయిన్ల మధ్య సోది లవ్ ట్రాక్ లేకుండా, సుందరి పాటతో మూగసైగలతో కనెక్ట్ కావడం చాలా బావుంది. చూడాలని వుందిలో రైల్ సీన్ గుర్తుకి తెచ్చింది.
హీరో తల్లి జరీనా, కోడలితో భార్యాభర్తల రిలేషన్ గురించి చెప్పే డైలాగులు ఈ తరం పిల్లలు గుర్తు పెట్టుకోవాలి. పాటలు వినడానికే కాదు, చూడడానికీ బావున్నాయి. చిరంజీవి స్టెప్స్ అభిమానుల్ని అలరిస్తాయి. బుల్లిరాజు గత సినిమా అంతకాక పోయినా ఒక మోస్తారుగా నవ్వించాడు.
మొత్తం చిరంజీవే చుట్టుముట్టేయడంతో నయనతార నటన గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. సమీర్‌రెడ్డి కెమెరా పనితనం సూపర్. ఒకప్పటి చిరంజీవిని చూపించాడు. భీమ్స్ పాటలు, బీజీఎం రెండూ సినిమాని నిలబెట్టాయి.
పండగ టైమ్‌లో కుటుంబంతో సహా చూడొచ్చు. విపరీతమైన కామెడీని ఆశించకుండా , అక్కడక్కడ బోర్‌ని భరిస్తూ చూస్తే క్లీన్ ఎంటర్‌టైనర్.
చిరంజీవికి ఇది ప్లస్, అనిల్‌కి మైనస్ కాదు కానీ, గత సినిమాలతో పోలిస్తే అంత ప్లస్ కాదు. పాస్ మార్కులు పడ్డాయి. అయితే ఈ నాలుగు రోజుల్లో జనం ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.
ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా వున్నాయి. వరప్రసాద్ అభిమానులకి నచ్చుతాడు. సాధారణ ప్రేక్షకులకి పెద్దగా నిరాశ కలిగించదు.
ప్లస్ పాయింట్స్:
1.చిరంజీవి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్
2.పాటలు
3.ఫోటోగ్రఫీ
4.వెంకటేశ్ ఎంట్రీ
మైనస్ పాయింట్స్:
1.కథనంలో వేగం లోపించడం
2.సెకెండాఫ్
3.చిరంజీవి తప్ప, మిగతా పాత్రలకి ప్రాధాన్యత లేకపోవడం
ఫైనల్‌గా బరిలోకి కోడిపుంజుని గట్టిగానే దింపారు కానీ, కత్తి సరిగా కట్టలేదు.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














