వర్జిన్ ఐలాండ్స్: డెన్మార్క్ ఈ దీవులను ఒకప్పుడు అమెరికాకు ఎందుకు అమ్మేసింది, గ్రీన్‌లాండ్‌కు దీనికీ లింక్ ఏంటి?

సెయింట్ థామస్ వద్ద నీలి జలాల్లో పడవలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన యూఎస్ వర్జిన్ దీవులను అమెరికాకు డెన్మార్క్ అమ్మింది.
    • రచయిత, గియోర్నో డి ఓల్మో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పట్టుదల తీవ్రరూపం దాలుస్తోంది.

తన లక్ష్యాన్ని వ్యతిరేకించే యూరోపియన్ మిత్రదేశాలపై 10 శాతం సుంకం విధిస్తామని ఆయన ఇటీవల హెచ్చరించారు.

అమెరికా భద్రత కోసం గ్రీన్‌‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాల్సిందేనని ట్రంప్ వాదిస్తున్నారు. అవసరమైతే సైనిక బలాన్ని కూడా ఉపయోగిస్తామని ఆయన అంటున్నారు.

అయితే, గ్రీన్‌లాండ్ నాయకత్వం, డెన్మార్క్ ఆయన డిమాండ్లను తిరస్కరించాయి. గ్రీన్‌లాండ్‌ అనేది పాక్షిక స్వయంప్రతిపత్తి గల డెన్మార్క్ భూభాగం.

అమెరికా విస్తరణ వాదం ట్రంప్ కాలంలో కాస్త పెరిగినట్లు కనిపిస్తున్నా, ఈ డానిష్ భూభాగంపై నియంత్రణ ఉండాలన్న ఆలోచన అమెరికా అధ్యక్షులలో చాలాకాలం నుంచే ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వందేళ్ల కిందట డెన్మార్క్ నుంచి కరీబియిన్‌లోని కొన్ని దీవులను అమెరికా కొనుక్కున్నది. ఇవి గ్రీన్‌లాండ్‌కు చాలా దూరంగా ఉంటాయి.

మరి డానిష్ వెస్టిండీస్ ఐలాండ్స్‌గా పేరున్న ఆ దీవులు చివరకు యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌గా ఎలా మారాయి?

అప్పటికి బలహీనపడుతున్న యూరప్ శక్తులు తిరుగులేని శక్తిగా అవతరిస్తున్న అమెరికాకు తమ భూభాగాన్ని ఎలా అమ్ముకున్నాయి?

యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ అంటే ఏంటి?

కరేబియన్ సముద్రంలో యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ ఉంటాయి. ఇవి బ్రిటీష్ వర్జిన్ దీవులకు కాస్త సమీపంలోనే ఉంటాయి. ఈ భూభాగం ప్యూర్టో‌రికో కు తూర్పున ఉంటుంది.

సెయింట్ జాన్, సెయింట్ థామస్, సెయింట్ క్రోయిక్స్ లాంటి ప్రధాన దీవులతోపాటు మరో 40 చిన్న దీవులు ఇందులో భాగం. జనాభా 83 వేలు.

ఇందులో నివసించేవారు చాలామంది అమెరికా పౌరులే అయినప్పటికీ, ఈ ప్రాంతం అమెరికా పరిపాలనా, న్యాయవ్యవస్థల్లో పూర్తిగా విలీనం కాలేదు. అందువల్ల వీరు అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయలేరు. అమెరికా రాజ్యాంగంలోని కొన్ని చట్టాలు మాత్రమే ఇక్కడ వర్తిస్తాయి.

ఈ దీవుల్లోని జనాభాలో ఎక్కువభాగం అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ ( బానిస వ్యాపారం)లో భాగంగా బలవంతంగా తీసుకొచ్చిన ఆఫ్రికన్ల వారసులే. అప్పట్లో వారిని చెరకు తోటల్లో పని చేయించడానికి తీసుకువచ్చారు.

అమెరికా, డెన్మార్, గ్రీన్‌లాండ్, వర్జిన్ ఐలాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

డెన్మార్క్‌కు, యూఎస్ వర్జిన్ దీవులకు సంబంధం ఏంటి?

అంతకు ముందు అనేక శతాబ్దాలుగా ఈ దీవులు డానిష్ కాలనీలుగా ఉండేవి. వీటిని అప్పట్లో డానిష్ వెస్టిండీస్ అని పిలిచేవారు.

16, 17 శతాబ్దాలలో ఈ దీవులపై నియంత్రణ కోసం స్పెయిన్, ఇంగ్లండ్ , ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తరచూ ఘర్షణ పడేవి. ఆ కాలంలో ఈ ప్రాంతం కరేబియన్‌లో సముద్రపు దొంగలకు స్థావరంగా కూడా ఉండేది.

1684లో, డెన్మార్క్ సెయింట్ జాన్‌ను స్వాధీనం చేసుకుని అక్కడ తన అధికారాన్ని స్థాపించింది. అంతకు కొంతకాలం ముందు, సెయింట్ థామస్‌‌ను కూడా స్వాధీనం చేసుకుంది.

తర్వాత, ఈ దీవులలో పెద్ద ఎత్తున చెరకు సాగును అభివృద్ధి చేసింది డెన్మార్క్. యూరోపియన్ వ్యాపారులు తీసుకువచ్చిన ఆఫ్రికా బానిసలను ఇక్కడ పనిలో పెట్టింది.

యూఎస్ వర్జిన్ ఐలాండ్స్

ఫొటో సోర్స్, Archive Farms/Getty Images

ఫొటో క్యాప్షన్, దీవులను అమెరికాకు అమ్మడం గురించి స్థానిక ప్రజల అభిప్రాయాన్ని డెన్మార్క్ అడగలేదు.

ఈ దీవులపై అమెరికాకు ఆసక్తి ఎందుకు?

19వ శతాబ్దం రెండో భాగంలో పరిస్థితులు మారడం ప్రారంభించాయి. ఒకవైపు, ప్రపంచం మీద డెన్మార్క్ ప్రభావం తగ్గుతుండగా, మరోవైపు, అమెరికా అప్పుడే సివిల్ వార్ నుంచి బయటపడుతోంది.

అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ అమెరికా ఖండంలో యూరప్ ప్రభావాన్ని తగ్గించడానికి, అమెరికా శక్తిని విస్తరించడానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే డానిష్ వెస్టిండీస్‌ను తమ దేశంలో కలుపుకోవాలన్న ఆలోచన పుట్టింది.

కరేబియన్‌ ప్రాంతాన్ని నియంత్రించడానికి ఇది ఒక మంచి స్థావరం కావడంతో అమెరికన్ వ్యూహకర్తలకు సెయింట్ థామస్ నౌకాశ్రయం కీలకంగా మారింది.

అదే సమయంలో, చక్కెర ధరలు తగ్గుతున్నాయి. ఈ దీవులతో లాభం కంటే ఖర్చే ఎక్కువన్న ఆలోచనలు డెన్మార్క్‌లో కూడా మొదలయ్యాయి.

దీంతో రెండు ప్రభుత్వాల మధ్య దీవుల అమ్మకం గురించి చర్చలు జరిగాయి.

1867లో రెండు దేశాలు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం అమెరికా ఈ దీవులను 75 లక్షల డాలర్ల విలువైన బంగారాన్ని ఇచ్చి కొనడానికి సిద్ధపడింది. ఇది నేటి కరెన్సీలో సుమారు 16.4 కోట్ల డాలర్లకు సమానం.

అయితే, ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.

ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత, రష్యా నుంచి అలస్కాను కొనుగోలు చేయడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ తన ప్రభావాన్ని ఇతర చోట్లకు విస్తరించడంలో విజయం సాధించింది. అలస్కా కోసం అమెరికా 70 లక్షల డాలర్లు చెల్లించింది. అయితే అప్పట్లో అది విమర్శలకు గురైంది.

అలాస్కా కొనుగోలు చుట్టూ ఉన్న వివాదం కారణంగా డానిష్ వెస్టిండీస్ కొనుగోలు ఒప్పందాన్ని అమెరికా కాంగ్రెస్ ఆమోదించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత దాదాపు 50 ఏళ్ల వరకు ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎవరూ మళ్లీ ముట్టుకోలేదు.

బీచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రీన్‌లాండ్‌లా కాకుండా, డెన్మార్క్ తన దీవులలో కొన్నింటిని అమెరికాకు విక్రయించడానికి అంగీకరించింది.

మొదటి ప్రపంచ యుద్ధం- యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ కొనుగోలు

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక పరిస్థితులు మారిపోయాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ దీవులను డెన్మార్క్ నుంచి జర్మనీ స్వాధీనం చేసుకునే ప్రమాదం పెరిగింది. ఈ పరిస్థితిని అమెరికా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి.

సుదీర్ఘ యుద్ధాలతో యూరప్ అలసిపోయి ఉంది. జర్మనీతోపాటు ఇతర శక్తులను ఓడించడానికి అమెరికా తమతో చేతులు కలపాలని యూరప్ మిత్రదేశాలు కోరుకున్నాయి.

కానీ, అప్పటి అధ్యక్షుడు యుద్ధానికి ప్రజలను, కాంగ్రెస్‌ను ఒప్పించలేకపోయారు. అదే సమయంలో అమెరికన్ వ్యాపార, ప్రయాణీకుల నౌకలపై జర్మన్ జలాంతర్గాముల దాడులు పెరుగుతున్నాయి.

న్యూయార్క్ వీధుల్లో నడుస్తున్న ప్రజలు.

ఫొటో సోర్స్, Photo12/Universal Images Group via Getty Images

ఫొటో క్యాప్షన్, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వర్జిన్ ఐలాండ్స్‌ను కొనడం అమెరికా కీలకమైంది.

అమెరికా నౌక లూసిటియానాను 1915లో ఐర్లాండ్ సమీపంలో జర్మన్ జలాంతర్గామి ముంచేసింది. ఈ ఘటనలో 1200 మంది మరణించారు. ఈ సంఘటన ఉద్రిక్తతలను మరింత పెంచింది.

యుద్ధ సమయంలో డెన్మార్క్ తటస్థంగా ఉంది కాబట్టి జర్మనీ సెయింట్ థామస్ ఓడరేవుతో సహా దీవులను ఆక్రమించి స్వాధీనం చేసుకోగలదని వాషింగ్టన్ భయపడిందని డానిష్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో సీనియర్ పరిశోధకురాలు ఆస్ట్రిడ్ ఆండర్సన్ వివరించారు.

ఈ దీవులు జర్మనీ వశమైతే, అవి అమెరికన్ నౌకలపై లేదా అమెరికన్ భూభాగంపై దాడులకు అనువైన స్థావరాలుగా మారేవి.

1914లో పనామా కాలువ నిర్మాణం కూడా ఈ ప్రాంతంపై అమెరికా ఆసక్తిని పెంచింది. ఎందుకంటే దీవులపై నియంత్రణ ప్రతి సంవత్సరం దానిగుండా వెళ్ళే వందలాది నౌకల భద్రతలో కీలకం.

ఆర్థిక, జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకుని వాషింగ్టన్, కోపెన్‌హాగన్‌ల మధ్య చర్చలు మొదలయ్యాయి.

ఆ సమయంలో అమెరికా వైఖరి నేటి ట్రంప్‌ వైఖరిలాగే ఉందని ఆండర్సన్ అన్నారు.

‘‘మనం ఇప్పుడు నాటి శబ్దాల ప్రతిధ్వనులను వింటున్నాం. అమెరికా అప్పుడు కూడా స్పష్టంగా చెప్పింది. మాకు అమ్మండి లేదంటే మేమే స్వాధీనం చేసుకుంటామని’’ అంటూ వివరించారు ఆండర్సన్.

ఒక భవనంపై అమెరికన్ జెండాలు మరియు ఎలియనోర్ రూజ్‌వెల్ట్

ఫొటో సోర్స్, UPI/Bettmann Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, వర్జిన్ దీవులు 1917లో అమెరికాలో భాగం అయ్యాయి.

ఈ భూభాగాన్ని అమ్మితే తాము కొంటామని, నిరాకరిస్తే ఆక్రమించుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి విల్సన్ అప్పట్లో డెన్మార్క్‌ను హెచ్చరించారని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఉంది.

ఈ నెల ప్రారంభంలో ట్రంప్ కూడా సరిగ్గా ఇలాగే మాట్లాడారు. రష్యా, చైనాల నుంచి అమెరికాకు పొంచి ఉన్న ముప్పును తొలగించాలంటే గ్రీన్‌లాండ్‌ను నయానో భయానో స్వాధీనం చేసుకోకతప్పదని అన్నారు.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, అప్పట్లో వర్జిన్ ఐలాండ్స్ అమ్మకం గురించి డెన్మార్క్, అమెరికాల మధ్య అంగీకారం కుదిరింది. నాడు అమెరికా 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని డెన్మార్క్‌కు ఆఫర్ చేసింది. ఇప్పటి లెక్కల్లో అది 63 కోట్ల డాలర్లకు సమానం.

ఈ ఒప్పందం గ్రీన్‌లాండ్‌పై డెన్మార్క్ సార్వభౌమత్వాన్ని అమెరికా గుర్తించడానికి కూడా కారణమైంది. దీని ప్రకారం గ్రీన్‌లాండ్‌పై డెన్మార్క్ తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను తీసుకోవడాన్ని అమెరికా అడ్డుకోదు.

రెండు దేశాలు ఒప్పందాన్ని ఆమోదించాయి. డానిష్ ప్రజలు కూడా ప్రజాభిప్రాయ సేకరణలో వర్జిన్ ఐలాండ్స్ అమ్మకానికి అనుకూలంగా ఓటు వేశారు.

అండర్సన్ అభిప్రాయం ప్రకారం చాలామంది డానిష్ ప్రజలు ఈ దీవులను డెన్మార్క్‌లో భాగంగా పరిగణించలేదు.

ఆ ప్రయత్నంలోగానీ, మునుపటి ప్రయత్నాలలోగానీ ద్వీపంలోని స్థానిక ప్రజల అభిప్రాయాలను ఎప్పుడూ తీసుకోలేదని చరిత్రకారులు చెబుతున్నారు.

కానీ, గ్రీన్‌లాండ్‌తో సమస్య ఏమిటంటే ఈసారి డెన్మార్క్ దానిని విక్రయించడానికి సిద్ధంగా లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)