ఇరాన్‌కు ముందు, అమెరికా జోక్యం చేసుకున్న ఈ 5 దేశాల్లో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పౌలా రోసాస్
- హోదా, బీబీసీ న్యూస్ ముండో
- చదివే సమయం: 7 నిమిషాలు
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా మరో యుద్ధం చేస్తోంది. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక జోక్యానికి సంబంధించి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఏదో ఒక రూపంలో మధ్య ప్రాచ్యంలో వాషింగ్టన్ జోక్యం చేసుకుంటూనే ఉంది. కానీ, అమెరికా సైనిక జోక్యం కోరుకున్న ఫలితాలను సాధించిందా? అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న.
ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న చేసిన దాడులు ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మృతికి దారితీశాయి.
ఇరాన్ అణు కార్యక్రమానికి ముగింపు పలకడంతో పాటు, ఇస్లామిక్ రిపబ్లిక్‌లో పాలన మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యాలలో ఇరాన్ సుప్రీం కూడా ఉన్నారు.
గతంలో కూడా అనేక మంది అమెరికా అధ్యక్షులు మిడిల్ ఈస్ట్‌లో సైనిక చర్యలకు దిగారు.
ట్రంప్‌కు ముందు, అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్‌లు (తండ్రి, కొడుకు), బరాక్ ఒబామా ఈ ప్రాంతంలో సైనిక చర్యలు చేపట్టారు.
ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌కు వ్యతిరేకంగా, లిబియాలో మువమ్మర్ గడాఫీకి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షులు రంగంలోకి దిగి, వారి ప్రభుత్వాలను పడగొట్టారు.
అయితే, వారిని పదవుల్లోంచి దించేయడం ద్వారా ఆ దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కానీ, స్వేచ్ఛను కానీ తీసుకురాలేకపోయారు. అంతేకాక ఆ దేశాల్లో నెలకొన్న అంతర్యుద్ధం, అస్థిరత నేటికీ కొనసాగుతోంది.
సిరియాలో స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్‌ను అంతం చేయడానికి అమెరికా సాయం చేసింది. కానీ, 2024లో అల్ అసద్ పతనం తర్వాత, ఇతర ఇస్లామిస్ట్ గ్రూప్‌లు అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నాయి.
అలాగే, అఫ్గానిస్తాన్‌లో దాదాపు రెండు దశాబ్దాల అమెరికా జోక్యం తర్వాత 2021లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్నారు.

ఒబామా ప్రభుత్వంలో దేశ భద్రతా సలహాదారుగా, దౌత్యవేత్తగా పనిచేసిన ఫిలిప్ గోర్డాన్ 2015లో ఒక ప్రముఖ కథనంలో మిడిల్ ఈస్ట్‌లో అమెరికా జోక్యాలను ఇలా వివరించారు.
''ఇరాక్‌లో అమెరికా జోక్యం చేసుకుని, దేశాన్ని ఆక్రమించుకుంది. భారీ మూల్యం చెల్లించింది. లిబియాలో కూడా అమెరికా జోక్యం చేసుకుంది కానీ, ఆ దేశాన్ని ఆక్రమించుకోలేదు. ఫలితమేంటంటే భారీ మూల్యం. సిరియాలో అమెరికా జోక్యం చేసుకోలేదు, ఆ దేశాన్ని ఆక్రమించుకోలేదు. కానీ, సిరియాలో కూడా ఫలితం అదే.''
అంటే, ఈ నష్టం కేవలం అమెరికాకు మాత్రమే కాదు. మొత్తం ఆ ప్రాంతానికని నిపుణులు చెబుతున్నారు.
కైరోలోని అమెరికన్ యూనివర్సిటీలో గ్లోబల్ అఫైర్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఇబ్రహీం అవద్‌తో బీబీసీ మాట్లాడింది. ''ఈ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం విదేశీ జోక్యాలే'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరాక్, అఫ్గానిస్తాన్, లిబియా, సిరియా లేదా యెమెన్ వంటి దేశాల్లో తీవ్రమైన పాలనా సమస్యలు, నిరంకుశ పాలకులు ఉన్నట్లు అవద్ చెప్పారు. అయితే, ఇవి విదేశీ జోక్యాల ద్వారా పరిష్కరించగల సమస్యలు కావనేది అవద్ అభిప్రాయం.
అసలు, అమెరికా ఇటీవల దశాబ్దాల్లో ఏయే దేశాలలో సైనిక జోక్యానికి పాల్పడిందో ఒకసారి చూద్దాం..

ఫొటో సోర్స్, Scott Nelson/Getty Images
ఇరాక్ (1991, 2003-2011)
గత కొన్ని దశాబ్దాల్లో ఇరాక్‌కు వ్యతిరేకంగా పలుమార్లు అమెరిక సైనిక చర్యలకు దిగింది.
1990లో సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాక్.. చమురు వనరులను స్వాధీనం చేసుకుని, ప్రాంతీయంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కువైట్‌ను ఆక్రమించినప్పుడు.. అమెరికాలో నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి మద్దతు కలిగిన సంకీర్ణ సేనలను మోహరించారు. దీనినే "ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్"గా వ్యవహరిస్తారు.
భారీ వైమానిక దాడులు, పదాతి దళాలతో ఈ సంకీర్ణ బలగాలు ఇరాక్ నుంచి కువైట్‌ను కొద్దివారాల్లోనే విడిపించి, ఇరాకీలను తిప్పికొట్టాయి. సద్దాం హుస్సేస్ పాలనలో ఉన్నంత కాలం ఇరాక్ అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలతో పాటు వేర్పాటువాదుల సంఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది మతపరమైన ఉద్రిక్తతలకు కూడా దారితీసింది.
ఇది విజయవంతమైన మిలిటరీ ఆపరేషన్‌గా నిలిచి, అంతర్జాతీయ చట్టాన్ని పునరుద్ధరించింది.
బెర్లిన్ గోడ పతనం, కోల్డ్ వార్ ముగిసిన తర్వాత మొదటిసారిగా, గల్ఫ్ యుద్ధం అమెరికా సైనిక జోక్యానికి సంబంధించి సరికొత్త శకానికి నాంది పలికింది. అమెరికాకు ప్రత్యర్థి లేని ప్రపంచ క్రమానికి కారణమైంది.
2003లో అమెరికా, బ్రిటన్ నేతృత్వంలోని కూటమి ఇరాక్‌ను ఆక్రమించుకున్నాయి. అక్కడి సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోశాయి. పాలనలో విధ్వంసకర ఆయుధాల నిల్వలు భారీగా పెరిగాయని.. టెర్రరిజంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించాయి.
కొన్ని వారాల్లోనే సైనిక కూటమి బాగ్దాద్ చేరుకుని, సద్దాం హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం ఆయనకు మరణ శిక్షను అమలు చేశారు.
అయితే, మొత్తానికి ఇరాక్ దగ్గర ఎలాంటి విధ్వంసకర ఆయుధాలు బయటపడలేదు.
కానీ.. సున్నీలు, షియాలు, ఖుద్స్ మధ్య మత ఘర్షణలు, తిరుగుబాట్లు, తీవ్రవాద గ్రూపుల ఆవిర్భావంతో ఆ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
ఫలితంగా స్వయం ప్రకటిత ఇస్లామిక్ రాజ్యం ఏర్పడింది. 2014 నుంచి 2015 మధ్య కాలంలో.. ఐఎస్ఐఎస్ సంస్థ ఇరాక్‌లో మూడో వంతు ప్రాంతాన్ని, సిరియాలో సగ భాగాన్ని నియంత్రించింది.
ఈ సమయంలో వేలాది మంది సాయుధ బలగాలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. చాలామంది తిరుగుబాటు గ్రూపుల్లో చేరారు. ఇది నేటికీ ఆ దేశాన్ని కుదిపేస్తోన్న ఆందోళనలకు కారణమైంది.
2003 నుంచి ఇరాక్‌లో మరణాల సంఖ్యను ట్రాక్ చేస్తోన్న ఇరాక్ బాడీ కౌంట్ ప్రాజెక్ట్ ప్రకారం .. ఈ హింస వల్ల ప్రజలు, పోరాటంలో పాల్గొన్నవారిని కలుపుకుని కనీసం 3 లక్షల మంది మరణించారు.
అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఇతర సంస్థలు భావిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Universal History Archive/Universal Images Group via Getty Images
అఫ్గానిస్తాన్
2001లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటో సభ్య దేశాలతో కలిసి ''ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడం'' పేరుతో సైనిక ఆపరేషన్‌ను చేపట్టింది అమెరికా.
1996లో దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఛాందసవాద ఇస్లామిక్ ఉద్యమం, 2001 సెప్టెంబర్ 11లో న్యూయార్క్‌లోని పెంటగాన్, ట్విన్ టవర్స్‌పై దాడులు చేసిన అల్ ఖైదా గ్రూప్ లీడర్ ఒసామా బిన్ లాడెన్‌ను అప్పగించేందుకు నిరాకరించింది. దీంతో అఫ్గానిస్తాన్‌పై దాడి చేయాలని అమెరికా నిర్ణయించుకుంది.
ఈ సైనిక జోక్యంతో వారాల వ్యవధిలోనే తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. అంతర్జాతీయ సమాజం సాయంతో కొత్త ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసింది. కానీ, అక్కడ యుద్ధం మాత్రం ముగియలేదు.
ఈ ఘర్షణ రెండు దశాబ్దాలకు పైగా సాగింది, కానీ తాలిబాన్లను తుదముట్టించలేకపోయారు. వారు తిరిగి సంఘటితమై అమెరికా, నాటో దళాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగించారు.
2020లో అఫ్గానిస్తాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు తాలిబాన్లతో అమెరికా చర్చలు జరిపింది. 2021 ఆగస్టులో కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం వేగవంతం చేసింది.
2003లో మొదలైన ఇరాక్ యుద్ధం అమెరికా దృష్టిని, సైనిక వనరులను అఫ్గానిస్తాన్ నుంచి పక్కకు మళ్లించింది.
అమెరికా ప్రధాన లక్ష్యం అల్-ఖైదాను నిర్మూలించడం నుంచి ''దేశ నిర్మాణ'' కార్యక్రమంగా మారింది. కానీ, ఇరాక్‌లో జరినట్లుగా, ఈ లక్ష్యాన్ని ఎలా సాధించాలన్న దానిపై ఎలాంటి స్పష్టమైన వ్యూహం లేదా ఏకాభిప్రాయం లేదు.
తాలిబాన్లు పడిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త సైన్యం, పోలీసు బలగాలు చాలా బలహీనంగా ఉన్నాయి. వారు పూర్తిగా పశ్చిమ దేశాల మద్దతు, సహకారంపైనే ఆధారపడ్డాయి.
ఫలితంగా, పశ్చిమ దేశాల బలగాలు వైదొలిగిన వెంటనే అవి కుప్పకూలాయి. తాలిబాన్లు ముందుకు వెళ్లకుండా కొత్త సైన్యం అడ్డుకోలేకపోయింది. దీంతో తిరిగి తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. చివరికి ఛాందసవాదులు తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారు.
అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన కాస్ట్స్ ఆఫ్ వార్ డేటా ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల అమెరికా జోక్యం, ఈ సంఘర్షణల వల్ల కలిగిన హింసతో పౌరులు, అఫ్గాన్ సిబ్బంది, తాలిబాన్లు, పశ్చిమ దేశాల దళాలను కలుపుకుని 1,76,000 మందికి పైగా మరణించారు.
ఈ మరణాల్లో యుద్ధం వల్ల నెలకొన్న అస్థిరతతో సంభవించిన కరువు లేదా వ్యాధుల మరణాలను పరిగణనలోకి తీసుకోలేదు.

ఫొటో సోర్స్, Mario Tama/Getty Images
లిబియా
2011లో అమెరికా సైనిక జోక్యం తర్వాత పదవి కోల్పోయిన మరొక నియంత లిబియా నేత మువమ్మర్ అల్-గడాఫీ.
1969 నుంచి అత్యంత కఠినమైన పాలనను కొనసాగించిన గడాఫీకి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనలను హింసాత్మకంగా అణచివేయాలని భావించారు.
దీంతో, దేశవ్యాప్తంగా ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటు గ్రూపులకు మధ్య ఘర్షణలు నెలకొన్నాయి.
ఈ ఉద్రిక్తతలతో లిబియా గగనతలాన్ని ''నో-ఫ్లై జోన్''గా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చేందుకు, పౌరులను కాపాడేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ వంటి నాటో మిత్రదేశాలతో కలిసి అమెరికా, ఆ దేశ ప్రభుత్వ దళాలపై దాడులు చేయడం ప్రారంభించాయి.
వాస్తవానికి, ఈ సైనిక ఆపరేషన్‌ను ప్రారంభించింది ఫ్రాన్స్.
తిరుగుబాటుదారులు ట్రిపోలిని స్వాధీనం చేసుకుని, 2011 అక్టోబర్‌లో గడాఫీని బంధించి హతమార్చారు. కానీ, అఫ్గానిస్తాన్, ఇరాక్‌లో జరిగినట్లుగానే.. వివాదం అంతటితో ముగియలేదు.
గడాఫీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం అధికార శూన్యతకు దారితీసింది. ఈ లోటును భర్తీచేసేందుకు సంకీర్ణ దేశాల వద్ద ఎలాంటి పరిష్కారం లేకుండా పోయింది.
దీనివల్ల, ఐఎస్ఐఎస్ వంటి సంస్థలు, పలు సాయుధ గ్రూప్‌ల మధ్య సంఘర్షణలు తలెత్తాయి.
''లిబియాలో అమెరికా జోక్యం ఆ దేశాన్ని పాలించేందుకు ఎటువంటి ప్రణాళిక లేకుండా జరిగింది. దీనివల్ల అంతర్యుద్ధం చెలరేగింది'' అని కైరోలోని అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇబ్రహీం అవద్ తెలిపారు.

ఫొటో సోర్స్, DELIL SOULEIMAN/AFP via Getty Images
సిరియా
అరబ్‌తో ప్రభావితమైన మరో దేశం సిరియా. పలు అరబ్ దేశాల్లో 2011లో మొదలైన నిరసనలు, నిరంకుశ పాలనలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశాయి.
బషర్ అల్-అసద్ ప్రభుత్వం శాంతియుత నిరసనలను అణచివేసింది. దీని ఫలితంగా ప్రారంభమైన అంతర్యుద్ధం 15 సంవత్సరాలకు పైగా కొనసాగింది. నేడు అసద్ పాలన పతనమైనప్పటికీ, యుద్ధం ఇంకా ముగియలేదు.
సిరియాలో యుద్ధం దేశీయ, విదేశీ శక్తుల ప్రభావంతో బహుముఖ ఘర్షణగా మారింది. ప్రభుత్వ అనుకూల వర్గాలు, తిరుగుబాటుదారులు, ఖుర్దిష్ బలగాలు, ఐఎస్ఐఎస్, అల్-ఖైదా వంటి గ్రూపులు ఈ భూభాగం కోసం ఘర్షణ పడుతున్నాయి.
అసద్ ప్రభుత్వానికి రష్యా, ఇరాన్ మిలటరీ మద్దతు ఇచ్చాయి. అదేవిధంగా ప్రభుత్వ బలగాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న సున్నీ రెబల్ గ్రూప్‌లకు ఆర్థిక సాయం, శిక్షణ, ఆయుధాలను తుర్కియే అందజేసింది.
2014లో అమెరికా కూడా ఈ సంఘర్షణలో చేరింది. దీని ప్రధాన ఉద్దేశం సిరియా సగం భాగాన్ని, ఇరాక్‌లో మూడోవంతును ఆక్రమించుకున్న ఐఎస్ఐఎస్‌ను నిర్మూలించడమే.
తీవ్రవాదులను బలహీనపర్చడంలో అమెరికా వైమానిక దాడులు విజయం సాధించాయి. సిరియాలో వారు తమ ప్రాదేశిక నియంత్రణను కోల్పోయాయి.
అయితే, తీవ్రవాదుల సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గింది. కానీ, వారిని పూర్తిగా ధ్వంసం చేయలేకపోయింది అమెరికా.

ఫొటో సోర్స్, Getty Images
యెమెన్
సెప్టెంబర్ 11 దాడుల (9/11) నుంచి అరేబియన్ ద్వీపకల్పంలో అల్-ఖైదా శాఖను నిర్మూలించేందుకు, టెర్రరిజానికి వ్యతిరేకంగా యెమెన్‌లో పలుసార్లు అమెరికా సైనిక చర్యలకు పాల్పడింది.
ఇరాన్ మద్దతుతో నడిచే హూతీ రెబల్స్ రాజధాని సనాను ఆక్రమించుకున్న తర్వాత, 2014లో యెమెన్ అంతర్యుద్ధంలో కూరుకుపోయింది.
2015లో ఈ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సౌదీ నేతృత్వంలోని అరబ్ కూటమి సైనిక చర్యలకు పాల్పడినప్పుడు అమెరికా వాటికి ఆయుధాలను విక్రయించింది, లాజిస్టిక్స్ సేవలు అందించింది, ఇంటెలిజెన్స్ సేవలు కల్పించింది. కానీ, క్షేత్రస్థాయిలో బలగాలను మాత్రం మోహరించలేదు.
హూతీల తిరుగుబాటు గ్రూప్ అనేది షియా భావజాల ఆధారిత ఉద్యమం. యెమెన్ భూభాగంలో 30 శాతం ప్రస్తుతం వాటి ఆధీనంలోనే ఉంది. యెమెన్‌లో అణచివేత, ఛాందసవాద పాలనను ఏర్పాటు చేసింది. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంది.
గాజా యుద్ధం నేపథ్యంలో ఈ గ్రూప్ ఎర్ర సముద్రంలోని పలు నౌకలపై వరుసగా దాడులు చేసింది. ఆ తర్వాత అమెరికా, దాని మిత్ర దేశం బ్రిటన్‌తో కలిసి మారిటైమ్ సముద్ర రవాణాను రక్షించడానికి హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది.
మధ్య ప్రాచ్యంలో యెమెన్ అత్యంత పేద దేశం. సంవత్సరాల పాటు కొనసాగుతోన్న అస్థిరతతో ఇది మానవతా సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 నాటికి 3,77,000 మందికి పైగా మరణించినట్లు క్యాంపెయిన్ అగైన్స్ట్ ట్రేడ్ పేర్కొంది.
ఈ మరణాల్లో చాలా వరకు ఈ సంక్షోభం వల్ల నెలకొన్న ఆకలి, వ్యాధులు, సరైన నిత్యావసరాలు అందకపోవడం వంటి కారణాలతోనే మరణించినట్లు తెలిసింది.
ఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం.. దేశంలోని 80 శాతం జనాభా బతికేందుకు మానవతా సాయాలపైనే ఆధారపడుతోంది. 40 లక్షల మందికి పైగా పిల్లలు స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














