ఇరాన్ బేషరతుగా లొంగిపోవాంటున్న ట్రంప్.. అది సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డేనియల్ బుష్, ఒలీవియా ఐర్లాండ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇరాన్ 'బేషరతుగా లొంగిపోవాలి' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు.
ఇరాన్ "ఆమోదయోగ్యమైన" నాయకత్వాన్ని ఎంచుకుంటే అమెరికా, తన మిత్రదేశాలు కలిసి ఇరాన్‌ను ఆర్థికంగా, గతంలో కంటే శక్తివంతమైన, మెరుగైన దేశంగా మారుస్తాయని ట్రంప్ అన్నారు.
యుద్ధం మొదలై వారం రోజులు దాటింది. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నాయకుడు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు.
యుద్ధం ముగించాలంటే తెహ్రాన్ ఏం చేయాలనే దానిపైనా అమెరికా ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు.
వైట్హౌస్ అధికార ప్రతినిధి కరోలిన్ లెవిట్ శుక్రవారం మాట్లాడుతూ 'ఇరాన్‌పై యుద్ధం నాలుగు నుంచి ఆరు వారాలు కొనసాగుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది' అని చెప్పారు.


ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ 'మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్' నినాదం
"ఇరాన్ బేషరతుగా లొంగిపోవడం మినహా మరెలాంటి ఒప్పందం ఉండదు" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
"ఆ తర్వాత.. గొప్ప, ఆమోదయోగ్యమైన నాయకుడిని, లేదా నాయకులను ఎంచుకున్న అనంతరం మేము, మాతో పాటు మా అద్భుతమైన, ధైర్యవంతమైన మిత్రదేశాలు ఇరాన్‌ను విధ్వంసపు అంచుల నుంచి బయటపడేసి, ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు మెరుగైన ప్రదేశంగా, గతంలో కంటే శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు విరామం లేకుండా శ్రమిస్తాం" అని రాశారు.
"ఇరాన్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది. మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్(MIGA)" అని ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ట్రంప్ తాజా స్పందన చూస్తుంటే, చర్చల ద్వారా పరిష్కారం అనే దానిపై ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. అయితే, ఇరాన్‌లో నాయకత్వ మార్పుకు ఆయన నేరుగా పిలుపివ్వలేదు.
యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన "అధికార మార్పిడి" అనే పదాన్ని పక్కనపెట్టారు. రాజకీయాల్లోకి రాకముందు మిడిల్ ఈస్ట్‌లో అమెరికా చేసిన యుద్ధాలపై విమర్శలు చేశారు. ఆ యుద్ధాలతో ఇప్పుడు ఇరాన్‌పై దాడిని కూడా పోల్చేలా ఉండకూడదని ఆయన భావిస్తున్నట్లు ఇది సూచిస్తుంది.
ఇటీవలి కొద్దిరోజులుగా సీనియర్ అధికారులు కూడా ట్రంప్ తరఫున ఇదే తరహా వాదన ముందుకు తెచ్చారు. ఇరాన్, అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా అమెరికాను దీర్ఘకాల యుద్ధంలో పడనివ్వకూడదని అధ్యక్షుడు నిర్ణయించుకున్నారని వారు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, X/@Vahid
ఇరాన్‌లోనూ వెనెజ్వెలా ఫార్ములా?
అయితే, ఈ దాడులు ఎంతకాలం కొనసాగవచ్చన్న రిపోర్టర్ల ప్రశ్నకు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కరోలిన్ లెవిట్ బదులిస్తూ " బహుశా 4 నుంచి 6 వారాలు కొనసాగవచ్చని అనుకుంటున్నాం. ఇరాన్ నేవీని నాశనం చేయడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించే దిశలో ఉన్నాం" అని చెప్పారు.
"అమెరికాను నాశనాన్ని నినదించే పాలకులు లేదా రాడికల్ టెర్రరిస్టు పాలకులు" ఇరాన్‌ను పాలించకూడదని ట్రంప్ అనుకుంటున్నారని ఆమె తెలిపారు.
"ఇరాన్ నాయకుడు ఎవరవుతారు, ఎవరిని చేయాలనే దానిపై ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదింకా తేలాల్సి ఉంది. దీని గురించి ఆయన (ట్రంప్) చర్చిస్తున్నారు" అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ రిపోర్టర్లతో చెప్పారు.
డోనల్డ్ ట్రంప్ ఇటీవల ఏక్సియోస్ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇరాన్ తదుపరి అధ్యక్షుడి ఎంపికలో తాను కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇరాన్‌లో శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌తో సన్నిహితంగా ఉండే ఖమేనీ కుమారుడు మోజ్తాబా తదుపరి నాయకుడు కావొచ్చన్న రిపోర్టులపై స్పందిస్తూ, "అది ఆమోదయోగ్యం కాదు" అని ట్రంప్ అన్నారు.
ఇరాన్‌తో పరిస్థితిని ట్రంప్ వెనెజ్వెలాతో ముడిపెట్టారు. వెనెజ్వెలాపై అమెరికా దాడి చేసి మదురోను అధికారం నుంచి తప్పించి డెల్సీ రోడ్రిగ్స్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టింది. ఇదంతా బహిరంగంగానే జరిగింది.
అమెరికా, వెనెజ్వెలా మధ్య గురువారం నుంచి దౌత్య సంబంధాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌కు రష్యా సమాచారం
రష్యన్ నిఘా వర్గాలు అమెరికన్ స్థావరాల గురించిన సమాచారాన్ని ఇరాన్‌కు అందించాయని ఒక సీనియర్ అమెరికన్ ప్రభుత్వ అధికారితో సహా మూడు విశ్వసనీయవర్గాలు బీబీసీ అమెరికన్ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
అందులో అమెరికన్ యుద్ధ నౌకలు మోహరించిన ప్రదేశాలు, మిడిల్ ఈస్ట్‌లో ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉన్న ప్రదేశాల గురించిన సమాచారం ఉందని వారు తెలిపారు.
దీని గురించి లెవిట్‌ను ప్రశ్నించినప్పుడు "దానివల్ల ఒరిగేదేం లేదు" అని అన్నారు.
రష్యా చాలాకాలంగా ఇరాన్‌కు మిత్రదేశంగా ఉంది. తెహ్రాన్ నాయకత్వం తమ వద్ద ఉన్న షహీద్ డ్రోన్లను మాస్కోకు అందించింది. వీటిని నాలుగేళ్లుగా రష్యన్ సైనికులు యుక్రెయిన్‌లో ఉపయోగిస్తున్నారు.
అదే సమయంలో, అమెరికా యుక్రెయిన్‌కు ఆయుధాలతో పాటు కీలకమైన నిఘా సమాచారాన్ని కూడా అందించడం ద్వారా రష్యన్ల మీద దాడులు చేసేందుకు యుక్రేనియన్లకు సాయమందించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్, ప్రభుత్వ అధికారులు, సామాన్యులకు సంతాపం తెలుపుతూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో మాట్లాడినట్లు పుతిన్ కార్యాలయం తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం విషయంలో శత్రుత్వాన్ని పక్కనపెట్టి దౌత్యపరమైన పరిష్కారం కనుక్కోవాలన్నదే తమ విధానమని రష్యా అధ్యక్ష కార్యాలయం పునరుద్ఘాటించింది.
రష్యా మద్దతుకు పెజెష్కియాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాల గురించి వివరించారని ఇరాన్ ప్రభుత్వ ప్రకటన తెలిపింది. రష్యా, ఇరాన్ పరస్పర సమాచార మార్పిడిని కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటన వెల్లడించింది.

ఫొటో సోర్స్, EPA
ఇరాన్ నాయకత్వంతో రష్యా చర్చలు జరుపుతోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అయితే, రెండు దేశాల మధ్య సైనిక సహకారం కొనసాగింపుపై సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
ఇరాన్‌కు రష్యా సాయం చేస్తోందన్న వాదనలపై అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సేత్ వార్తా సంస్థ 60 మినిట్స్ కార్యక్రమంలో స్పందిస్తూ "ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో ట్రంప్‌కు అన్నీ తెలుసు" అని చెప్పారు.
యుద్ధం మొదలై వారం రోజులు గడచిపోయిన తర్వాత, ఇప్పుడిది మిడిల్ ఈస్ట్ అంతటా విస్తరించింది. ఇరాన్ మద్దతున్న హిజ్బొల్లా ఇజ్రాయెల్ మీద దాడులు ప్రారంభించింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ మీద దాడులు చేస్తోంది.
లెబనాన్ రాజధాని బేరూత్‌లో శుక్రవారం భారీ పేలుళ్లు సంభవించాయి. దాడులకు ముందు నగరంలోని దక్షిణ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది.
లెబనాన్ సరిహద్దుల్లో 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇజ్రాయెలీలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హిజ్బొల్లా హెచ్చరించింది.
ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాల మీద డ్రోన్లతో దాడులు చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
సైప్రస్‌లోని తమ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగినట్లు బ్రిటన్ రక్షణ శాఖ ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













