ఫ్యాటీ లివర్: మద్యం తాగని వారిలోనూ లివర్ చెడిపోతుందా? దీని లక్షణాలేంటి?

వైద్యం, ఫ్యాటీ లివర్, ఎన్ఏఎఫ్ఎల్‌డీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షణ్ముగ ప్రియ సెల్వరాజ్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 5 నిమిషాలు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,000 మందిలో 47 మందికి 'నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' (ఎన్ఏఎఫ్ఎల్‌డీ) ఉందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) చెబుతోంది. ఇది మహిళల కంటే పురుషులలో సాధారణమని తెలిపింది.

కొన్నేళ్ల కిందటి వరకు 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌'గా పిలిచే ఈ వ్యాధిని ఇప్పుడు 'మెటబాలిక్ డిజ్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టెటాటిక్ లివర్ డిసీజ్' (ఎంఐఎస్ఎల్‌డీ)గా పిలుస్తున్నారు. ఇది లివర్‌(కాలేయం)లో అనవసరమైన కొవ్వు పేరుకుపోయే స్థితి.

దీనికి ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులతో సంబంధం ఉంటుంది. దీనివల్ల లివర్ వాపు, మచ్చలు ఏర్పడటం, కొన్నిసార్లు లివర్ క్యాన్సర్‌కు దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది.

మద్యపానం చేయని వారికి కూడా ఈ లివర్ డిసీజ్ వస్తుందని చాలామందికి తెలియదు. లివర్ వ్యాధుల నిపుణులు డాక్టర్ కార్తీక్ మతివానన్ ఈ వ్యాధి గురించి బీబీసీకి వివరించారు.

మన శరీరంలోని ప్రతి అవయవం ఒక నిర్దిష్టమైన పనిని మాత్రమే చేస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది, ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. కానీ, లివర్ మాత్రం 500కు పైగా పనులు చేస్తుంది.

"మరే ఇతర అవయవం కూడా ఇంత సంక్లిష్టమైన విధులను నిర్వహించదు. లివర్ లేకపోతే మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాదు. ప్రాణంతో ఉండటం కూడా అసాధ్యం" అని డాక్టర్ కార్తీక్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైద్యం, ఫ్యాటీ లివర్, ఎన్ఏఎఫ్ఎల్‌డీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ వ్యాధి ఎలా వస్తుంది?

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను నేడు "మెటబాలిక్ సిండ్రోమ్"గా పరిగణిస్తున్నారు. ఇది కేవలం ఒకే ఒక్క నిర్దిష్ట కారణం వల్ల రాదని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది.

మద్యపానం, జంక్ ఫుడ్, అధిక క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, నిద్రలేమి వంటివన్నీ కలిసి లివర్‌ను క్రమంగా దెబ్బతీస్తాయి.

"ప్రస్తుతం దీనిని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలుస్తున్నాం. దీని ప్రభావం కేవలం లివర్‌పైనే కాకుండా, గుండె వరకు వ్యాపిస్తుంది. మధుమేహంతో పాటు లివర్‌లో కొవ్వు కూడా చేరితే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది" అని డాక్టర్ కార్తీక్ తెలిపారు.

వైద్యం, లివర్ వ్యాధి, ఎన్ఏఎఫ్ఎల్‌డీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లివర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కార్తీక్

వ్యాధి లక్షణాలు ఏమిటి?

ఫ్యాటీ లివర్ సమస్యలో ఉన్న అతిపెద్ద చిక్కు ఏమిటంటే.. ఇది ఎలాంటి స్పష్టమైన లక్షణాలనూ బయటకు చూపించదు.

అలసట, ఉత్సాహం లేకపోవడం వంటివి కనిపించవచ్చు. అయితే, ఇవి థైరాయిడ్ సహా ఇతర అనేక వ్యాధులలో కూడా కనిపిస్తాయి కాబట్టి, వీటిని బట్టి మాత్రమే ఫ్యాటీ లివర్ సమస్య అని నిర్ధరించలేం.

"కేవలం లక్షణాలను బట్టి ఫ్యాటీ లివర్ వ్యాధి ఉందని గుర్తించడం సాధ్యం కాదు. అందుకే ఈ వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తులు కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి" అని డాక్టర్ కార్తీక్ సూచిస్తున్నారు.

వైద్యం, ఫ్యాటీ లివర్, ఎన్ఏఎఫ్ఎల్‌డీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మద్యం తాగని వ్యక్తులకు కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది.

ఎవరికి ప్రమాదం ఎక్కువ?

పదేళ్లకు పైగా మధుమేహం ఉన్నవారు, బీఎమ్ఐ 23 కంటే ఎక్కువగా ఉన్నవారు, పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారు, మద్యం సేవించే వారు కచ్చితంగా లివర్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ అరుణ్ కుమార్ సూచిస్తున్నారు.

అల్ట్రాసౌండ్ స్కాన్, ఫైబ్రో స్కాన్ ద్వారా కాలేయ స్థితిని తెలుసుకోవచ్చు కాబట్టి, ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన పరిశోధనా పత్రం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

"మధుమేహం, ఊబకాయం, రక్తపోటు ఉన్న రోగులలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒక సాధారణ సహ-వ్యాధిగా గుర్తించారు" అని ఆ నివేదిక పేర్కొంది.

ప్రమాదకర స్థాయికి చేరుకుంటే ఏమవుతుంది?

ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే, అది ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. దాని తదుపరి దశ అయిన 'సిరోసిస్' స్థితికి చేరుకుంటే, కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని డాక్టర్ కార్తీక్ చెప్పారు.

ప్రస్తుతం శస్త్రచికిత్స సాంకేతికతలో వైఫల్య రేటు 5 శాతం కంటే తక్కువగానే ఉంది. అయితే, శస్త్రచికిత్స తర్వాత ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 15 నుంచి 20 శాతం వరకు ఉంటుంది.

లివర్ మార్పిడి శస్త్రచికిత్స గురించి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూనే, అటువంటి ప్రమాదకర స్థితికి వెళ్లకుండా ఉండాలంటే లివర్‌ను ఆరోగ్యంగా చూసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

వైద్యం, ఫ్యాటీ లివర్, ఎన్ఏఎఫ్ఎల్‌డీ

ఫొటో సోర్స్, Getty Images

ఏం చేయాలి?

లివర్ ఆరోగ్యానికి సరైన ఆహారపు అలవాట్లు అవసరమని డాక్టర్ కార్తీక్ చెప్పారు.

"20 ఏళ్ల వయసులో తిన్న ఆహారాన్ని 50 ఏళ్ల వయసులో తినలేం, వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో జీవక్రియల వేగం గణనీయంగా తగ్గుతుంది" అని ఆయన వివరించారు.

శరీరానికి 1,500 క్యాలరీలు మాత్రమే అవసరమైన సమయంలో మనం 3,000 క్యాలరీలు తీసుకుంటే, ఆ అదనపు క్యాలరీలు కొవ్వుగా మారి కాలేయంలో పేరుకుపోతాయి. అది మాత్రమే కాకుండా, పొట్టచుట్టూ, అంతర్గత అవయవాలపైన కూడా కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది.

"జిమ్‌లో 100 క్యాలరీలను ఖర్చు చేయడానికి మనం ఎంత కష్టపడతామో తెలుసు. కానీ, దారి పక్కన ఒక చిన్న స్వీట్ తిన్నా కూడా 100 క్యాలరీలు మన శరీరంలో చేరిపోతాయి. మనం ఏం తింటున్నామో స్పృహతో గమనిస్తూ తినే అలవాటును పెంచుకోవడం చాలా ముఖ్యం" అన్నారు డాక్టర్ కార్తీక్.

"కూరగాయలను ఎక్కువగా, అన్నం తక్కువగా తినాలి. తెల్ల చక్కెర, మైదా వంటి సాధారణ పిండి పదార్థాలను వదిలేసి దంపుడు బియ్యం, గోధుమల వంటి సంక్లిష్ట పిండి పదార్థాలను ఎంచుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు నిండిన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం కూడా లివర్‌ను రక్షిస్తుంది" అని చెప్పారాయన.

"40 ఏళ్ల వయసు దరిదాపుల్లో ఉన్నప్పుడు, బరువు పెరగకుండా చూసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మనం తినే ఆహారంపై అవగాహనతో ఉండటం మాత్రమే లివర్‌ను దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది" అని డాక్టర్ కార్తీక్ స్పష్టంచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)