అంగవైకల్యం ఉన్న ఆమె ఒక సెక్స్ వర్కర్‌ను ఎందుకు బుక్ చేసుకున్నారంటే....

మెలనీ

ఫొటో సోర్స్, MELANIE

ఫొటో క్యాప్షన్, మెలనీ
    • రచయిత, బెత్ రోజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాకు చెందిన మెలనీ కోవిడ్ సమయంలో ఇంట్లో ఒంటరిగా మిగిలి పోయారు. అప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు సడలించాక, తన కోసం ఒక సెక్స్ వర్కర్‌ను నియమించుకోవాలనుకున్నారు.

మెలనీకి అంగ వైకల్యం ఉంది. వీల్‌చైర్ మీద ఉంటారు. అప్పటి వరకు ప్రేమ, సాన్నిహిత్యం వంటివి ఆమెకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. వాటి విషయంలో ఆమెలో ఒక రకమైన ఆందోళన నిండిపోయింది. దాని నుంచి బయటపడేందుకు ఒక వ్యక్తిని నియమించుకున్నారు. ఆయనే చైస్.

మెలనీ ఇంట్లో ఉంటూ, ఆమెకు అన్ని పనులూ చేసిపెట్టేందుకు ట్రేసీ (అసలు పేరు కాదు) అనే మహిళ ఉండేవారు. కోవిడ్ సమయంలో ట్రేసీనే ఆమెకు ఈ సలహా ఇచ్చారు.

43 ఏళ్ల మెలనీకి పురుష స్పర్శలో సుఖం తెలీదు. వైద్య పరీక్షల కోసం తప్ప ఆమెను ఎవరూ తాకలేదు. ఆమెకు అంతకన్నా ఎక్కువ కావాలనిపించింది.

ట్రేసీ ఒకప్పుడు సెక్స్ వర్కర్‌గా ఉండేవారు. అదే విషయాన్ని మెలనీకి చెప్పి, కోర్కెలు తీర్చుకోవడం కోసం వ్యక్తిగతంగా ఒక సెక్స్ వర్కర్‌ను నియమించుకోవచ్చని సూచించారు.

"ఈ అనుభవం నేనెందుకు వదులుకోవాలి అనిపించింది. తన మాటలు నాకు ఒక కనువిప్పులాగ తోచాయి" అని మెలనీ బీబీసీ యాక్సెస్ ఆల్‌కు చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఆమెకు ఇలాంటి వాటిలో సహాయం అందించే ఒక ఎస్కార్ట్ ఏజెన్సీ కనబడింది. అందులో చైస్ అనే వ్యక్తి ప్రొఫైల్ ఆమెను ఆకర్షించింది.

వెంటనే ఆమె చైస్‌ను బుక్ చేసుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లారు.

"నన్ను అక్కడ విడిచిపెట్టి ట్రేసీ వెళ్లిపోయింది. ఆ ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. అక్కడ నేను ఎందుకు ఉన్నానో, ఏం చేయాలనుకున్నానో....ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు." అన్నారామె.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సెక్స్

ఫొటో సోర్స్, MELANIE

మెలనీకి చిన్నప్పటి నుంచే అంగ వైకల్యం ఉంది. వెన్నెముకలో సమస్య కారణంగా ఆమె మూడేళ్ల వయసు నుంచే వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్యను ట్రాన్స్వెర్స్ మైలిటిస్ అంటారు. దీని కారణంగా ఆమె కాళ్లు చచ్చుబడిపోయాయి. చేతులు కూడా కొంతవరకే కదులుతాయి. ఆమెకు పనులు చేయడానికి ఎప్పుడూ మనిషి సహాయం ఉండాలి. అందుకే, ఇంట్లో సపోర్ట్ సిబ్బందిని పెట్టుకున్నారు.

మెలనీ చాలాకాలం జపాన్‌లో ఉన్నారు. అక్కడ ఉద్యోగం చేసారు. ఇప్పుడామె ఒక వీడియో ఎడిటర్. మెలనీ జీవితంలోకి ఎప్పుడూ రొమాన్స్ లేదు.

"అది.. జరిగితే జరుగుతుంది అనుకున్నా." అన్నారు మెలనీ.

వికలాంగులకు కూడా కోర్కెలు ఉంటాయని సమాజం గుర్తించదు. వారికీ రొమాన్స్, సాన్నిహిత్యం కావాలని గ్రహించదు.

2021లో బ్రిటన్‌లో జరిపిన ఒక డిజబిలిటీ సర్వేలో, కేవలం 56 శాతం మాత్రమే వికలాంగులతో సాన్నిహిత్యానికి అభ్యంతరం లేదని చెప్పారు.

మెలనీకి ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియలేదు. సమయం వచ్చినప్పుడు జరుగుతుందిలే అని ఊరుకున్నారు.

ఆన్‌లైన్‌లో చైస్ ప్రొఫైల్ చూశాక, ఆయనకు ఈమెయిల్ చేశారు. చైస్ వెంటనే స్పందించారు. ఆమెతో పలుమార్లు వీడియో చాట్ చేశారు. ఒకరిగురించి ఒకరు తెలుసుకోవడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి వీడియో కాల్స్ సహాయపడ్డాయి.

"నేను ఓ వెయ్యి ప్రశ్నలు అడిగి ఉంటాను. ఎప్పుడైనా హాయిస్ట్ (బరువును ఎత్తడానికి, దించడానికి ఉపయోగించే పరికరం) వాడారా?, మీ అపార్ట్‌మెంట్ వీల్‌చైర్‌కు అనువుగా ఉంటుందా? మీ లిఫ్ట్ సరిగ్గా పనిచేస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగాను" అని చెప్పారు మెలనీ.

చైస్ చెప్పిన జవాబులతో సంతృప్తి చెందాక, చివరికి ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సంబంధంపై ఆమె చాలా ఉత్సాహంగా ముందుకు అడుగు వేశారు.

మెలనీ, చైస్ చట్టబద్ధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో వ్యభిచారం చట్టం 2000 ప్రకారం, వీధుల్లో సెక్స్ వర్క్, వ్యభిచార గృహాలు నడపడం చట్టవిరుద్దం. కానీ, వ్యభిచారం నేరం కాదు. ఎస్కార్ట్ ఏజెన్సీలు చట్టబద్ధమే.

అయితే, ఆస్ట్రేలియాలో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం వర్తించదు. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, నార్తర్న్ టెరిటరీలో సెక్స్ వర్క్‌ను నేరంగా పరిగణించరు.

మెలనీ

ఫొటో సోర్స్, MELANIE

మెలనీ, చైస్ ఇంటికి వెళ్లాక, ఆమెకు ఆ కలయిక వింతగా తోచింది.

"నాకు లైంగిక పరిజ్ఞానం ఏ మాత్రం లేదు. దానిపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నా ఎదుట నిల్చున్నారు. మరోవైపు, నాకు అంగ వైకల్యం గురించి అన్నీ తెలుసు. చైస్‌కు ఏమీ తెలీదు. ఇద్దరం నవ్వుకున్నాం. ఓ రెండు గంటల తరువాత ఇద్దరం మంచి స్నేహితులమైపోయాం" అని మెలనీ చెప్పారు.

చైస్ ఆరేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నారు. కొత్తగా వచ్చే క్లయింట్‌లకు సెక్స్ విషయంలో అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని, పూర్తి సుఖానికి గ్యారంటీ అడుగుతారని ఆయన చెప్పారు.

చైస్‌ను కలవక ముందు, మెలనీకి పురుష స్పర్శకు తన శరీరం ఎలా స్పందిస్తునో తెలీదు. అనుకూలంగా స్పందిస్తుందా లేక అలసట కమ్ముకుంటుందా అన్నది తెలీదు.

"అందుకే చైస్‌ను బుక్ చేసుకున్నా. బార్‌కు వెళ్లి, ఒక అబ్బాయితో ఇంటికొచ్చి ప్రయోగాలు చేయడం నాకిష్టం లేదు. ఇబ్బందికరమైన, హాని కలిగించే పరిస్థితి ఎదురైతే నాకు చాలా కష్టం" అన్నారామె.

చైస్‌తో దగ్గరగా మెలిగాక, ఆమె చాలా ఎంజాయ్ చేశారు. పరిమితులు లేని ఆనందం పొందారు.

అయితే, సెక్స్ తరువాత ఆమె కాళ్లు కదలలేని స్థితికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటప్పుడు ఫిజియోథెరపీ అవసరమయ్యేది.

"నా కాళ్లను మంచానికి కట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని క్రమంగా అర్థమైంది. ఆ తరువాత ఎలాంటి సమస్యా ఉండదు" అని చెప్పారు మెలనీ.

ఓ కొత్త వ్యక్తితో, కొత్త ప్రదేశంలో గడపడం సాధారణ వ్యక్తులకే రిస్క్. అలాంటిది అంగ వైకల్యం ఉన్నవారికి మరింత రిస్క్.

"ఒక పురుషుడి ఎదుట బట్టలు లేకుండా కూర్చోవడం అదే మొదటిసారి."

అయితే, చైస్‌కు గతంలో చాలా వేదన అనుభవించిన వ్యక్తులతో పనిచేసిన అనుభవం ఉంది.

"భాగస్వామికి అనువైన, సురక్షితమైన వాతావరణం కల్పించడానికి, పరిస్థితి ఆమె నియంత్రణలో ఉండేలా చూడ్డానికి ప్రాధాన్యమిస్తాన" ని చైస్ చెప్పారు.

అయితే, సామాన్యులకు మామూలుగా అనిపించే విషయాలు వికలాంగులకు అనుభవంలోకి రాకపోవచ్చు. లేదా ఇబ్బంది పెట్టవచ్చు. దానివల్ల మానసిక ప్రభావాలు ఉండవచ్చు.

కానీ, మెలనీ విషయంలో అలా జరగలేదు. చైస్‌తో సాన్నిహిత్యం ఆమెకు మరింత శక్తినిచ్చింది.

"చైస్‌ను బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను భావించాను. పరిస్థితులు నా కంట్రోల్‌లో ఉంటాయని ఊహించాను. నాకు ఇబ్బందిగా అనిపించే పని చైస్ చేయరని నాకు తెలుసు" అన్నారామె.

కానీ, చైస్‌కు చెల్లించిన మొత్తం చిన్నదేం కాదు. చైస్ గంటకు 400 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20వేల కన్నా ఎక్కువ) చార్జ్ చేస్తారు. అలాంటిది ఒక రోజు లేదా రెండు రోజులు బుక్ చేసుకోవాలంటే వేలకు వేలు సమర్పించుకోవాలి.

"48 గంటలు ఏ పనీ చేయకుండా నాతో గడిపారంటే అది వాళ్లకు ఎంత తృప్తినిస్తోందో అర్థంచేసుకోవాలి" అంటారు చైస్.

తాను చేస్తున్న పని ద్వారా తనకు చాలా సంతృప్తి దొరుకుతుందని ఆయన చెబుతున్నారు.

"కొత్త అనుభవాలు, అనుభూతులు పొందాలనుకునే వారికి సహాయడం చేయడంలో తృప్తి ఉంటుంది. వారికి నేనేందుకు సహాయపడకూడదు అనిపిస్తుంది" అంటారాయన.

"చైస్‌తో ప్రేమలో పడకుండా ఉండలేం. కానీ, ఇది ఒక ప్రొఫెషనల్ సంబంధం అని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ఉంటాను" అన్నారు మెలనీ.

ఈ ఏడాది జనవరి నుంచి మెలనీ, చైస్ శారీరక సంబంధంలో ఉన్నారు. అయితే, అది కేవలం సెక్స్‌కు పరిమితమైపోలేదు.

మెలనీకి భవిష్యత్తులో డేటింగ్, రొమాన్స్ విషయంలో మార్గం సులువు అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చైస్. ఇందుకోసం డేటింగ్ కోచ్‌తో కూడా మాట్లాడుతున్నారు.

"నన్ను ప్రేమిస్తూ, నేను చేసే పనులను ఇష్టపడుతూ, డబ్బులకు కాకుండా నన్ను సంతోషపెట్టే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నాను. డేటింగ్ యాప్స్‌కి వెళ్లి, పురుషులతో చాట్ చేయగలనని కలలో కూడా ఊహించలేదు. కానీ, ఇప్పుడు రోజూ ఆ పని చేస్తున్నా" అన్నారు మెలనీ.

ప్రస్తుతం చైస్‌తో తాను పొందుతున్న ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. శృంగారం విషయంలో తాను స్వేచ్ఛగా ఎగురుతున్నట్టుగా ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం వికలాంగులకు ఆర్థిక పరమైన మద్దతు అందించాలని ఆమె కోరుతున్నారు.

"నా ఆత్మవిశ్వాసం రెండింతలు పెరిగింది. నేనెప్పుడూ ఇంత సంతోషంగా లేను. జీవితాన్ని మార్చేసిన అనుభవమిది. దీన్ని వెలకట్టలేను" అన్నారామె.

ఈ ఆనందాన్ని ఆమె తన స్నేహితులతో, కుటుంబంతో పంచుకున్నారు.

"మొదట కొంచం సిగ్గుపడ్డాను. కానీ, ఈ అనుభవం నా జీవితాన్నే మార్చేసింది. అందుకే, అందరికీ చెప్పకుండా ఉండలేకపోయాను. వాళ్లంతా చాలా సంతోషించారు. నా మొహంలో తొంగిచూస్తున్న ఆనందాన్ని దాచిపెట్టలేకపోయాను" అన్నారు మెలనీ.

వీడియో క్యాప్షన్, వయసు పైబడ్డాక శృంగారం‌ గురించి ఈ సెక్స్ హెల్త్ ఎడ్యుకేటర్ ఏమంటున్నారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)