‘నేను అత్యాచారం వల్ల పుట్టాను.. కానీ, ఆ ప్రభావం నాపై పడనివ్వను'

వీడియో క్యాప్షన్, తస్నీమ్
    • రచయిత, ఎమ్మా ఎయిల్స్
    • హోదా, బీబీసీ న్యూస్

అత్యాచారాల వల్ల పుట్టే పిల్లలను నేరాలకు బాధితులుగా గుర్తించేందుకు బ్రిటన్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితులైన కొందరు తల్లులకు పుట్టిన పిల్లలతో బీబీసీ మాట్లాడింది.

వారు తమ భవిష్యత్‌పైకి గతాన్ని తొంగిచూడనివ్వబోమని అంటున్నారు.

‘‘ప్రియమైన తస్..

ఇప్పుడు నీకు పది రోజులు. ఇది చదివే నాటికి నీ వయసు పెరుగుతుంది.

నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’’

తన తల్లి లూసీ డైరీలోని ఈ వాక్యాలను మొదటిసారి చదివినప్పుడు తస్నీమ్‌కు కన్నీళ్లు వచ్చాయి. తస్నీమ్ పసి పాపగా ఉన్నప్పుడే వీరి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో లూసీ మరణించారు. కానీ, ఆ ఇంటి నుంచి ఈ డైరీ కూడా భద్రంగా బయటపడిందని తస్నీమ్ అసలు ఊహించలేదు.

తస్నీమ్ బుగ్గపై ఆ రోజు రాత్రి ప్రమాదంనాటి గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది. ఇంటిలో మంటలు చెలరేగుతున్నప్పుడు తస్నీమ్ తండ్రి ఆమెను ఒక దుప్పటిలో చుట్టి తీసుకొచ్చి ఓ యాపిల్ చెట్టు కింద పడుకోబెట్టారు.

తస్నీమ్ ప్రాణాలను ఆయనే కాపాడారు. కానీ, ఆ ఇంటికి పెట్రోలు పోసి నిప్పు పెట్టింది కూడా ఆయనే. ఆ మంటల్లో తన్సీమ్ పిన్ని, అమ్మమ్మ కూడా మరణించారు.

హత్య కేసులో తన తండ్రి దోషిగా నిరూపితమై శిక్ష అనుభవిస్తున్నాడని తస్నీమ్‌కు తెలుసు.

కానీ, 18 ఏళ్లపాటు పోలీసుల దగ్గరే అలానే ఉండిపోయిన ఆ డైరీలో మరో ఊహించని నిజం ఆమెకు తెలిసింది.

తన తల్లిని తండ్రి లైంగికంగా వేధించడంతో ఆమె పుట్టినట్లు ఆ డైరీ చదివినప్పుడు తస్నీమ్‌కు తెలిసింది.

లూసీ ఒడిలో తస్నీమ్
ఫొటో క్యాప్షన్, లూసీ ఒడిలో తస్నీమ్

లూసీ కలలు, లక్ష్యాలతోపాటు ఆమె ఎంత వేదన అనుభవించారో ఆ డైరీలో రాసుంది.

ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే అజార్ అలీ మహమ్మద్, లూసీకి 12 ఏళ్ల వయసున్నప్పుడే లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. వీరిద్దరి మధ్య పదేళ్ల వరకు వయసు తేడా ఉంది.

లూసీ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారనే నిజం తెలిసిన తర్వాత, తస్నీమ్ గుండె బద్దలైంది. తనకే ఎందుకు ఇలా జరుగుతోందని ఆమె చాలా వేదన పడ్డారు.

అయితే, ఇలాంటి వారు చాలా మందే ఉన్నారని డేటా చూస్తే తెలుస్తుంది.

అత్యాచారం, లైంగిక వేధింపుల వల్ల బ్రిటన్‌లో ఎంత మంది పిల్లలు పుట్టారో స్పష్టమైన గణాంకాలు లేవు. కానీ, డర్హమ్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ విమెన్స్ జస్టిస్ లెక్కల ప్రకారం, ఒక్క 2021లోనే ఇంగ్లండ్, వేల్స్‌లలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల వల్ల దాదాపు 3,300 మంది మహిళలు గర్భం దాల్చారు.

తాజాగా తీసుకొస్తున్న బిల్లుతో ఇంగ్లండ్, వేల్స్‌లలో ఇలా అత్యాచారాల వల్ల పుట్టే పిల్లలను ‘‘నేరాలకు బాధితులు’’గా గుర్తిస్తామని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది.

థెరపీ, కౌన్సెలింగ్‌తోపాటు కొంత సాయం కూడా అందించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుందని వివరిస్తోంది. వారి కేసులకు సంబంధించిన సమాచారం కూడా వారికి ఇస్తారు. విద్య, గృహ నిర్మాణ విషయంలోనూ వారికి సాయం అందించేందుకు ప్రణాళికలు ఉన్నాయి.

ఇప్పటివరకు అత్యాచారాల ద్వారా పుట్టే పిల్లల కోసం ప్రత్యేక సేవలేమీ లేకపోవడంతో తస్నీమ్ లాంటి వారు సంక్లిష్టమైన భావోద్వేగాలను దాటుకుంటూ జీవితంలో కష్టంమీద ముందుకు వెళ్లాల్సి వచ్చింది.

‘‘ఎవరైనా.. తల్లిదండ్రులు పరస్పరం అమితంగా ప్రేమించుకుంటారనే ఊహించుకుంటారు కదా’’ అని ఆమె అన్నారు.

‘‘కానీ, ఆ నిజం తెలిశాక అంతా మారిపోయింది. మీ కుటుంబం, ఇతర అంశాలను ఇదివరకటి కోణంలో మనం చూడలేం. ఎందుకంటే నేను ఒక హంతకుడు, రేపిస్టుకు జన్మించాను. నాకు చాలా దారుణమైన ఆలోచనలు వచ్చేవి. నేను కూడా పెద్దయ్యాక అలానే అయిపోతానా? అని ఆందోళన పడేదాన్ని’’ అని ఆమె చెప్పారు.

డైరీలో కొన్ని అంశాలు మరింత బాధాకరంగా తస్నీమ్‌కు అనిపించాయి. అయితే, తన తల్లి తనను ఎంత ప్రేమించారో అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు.

డైరీ చదువుతుంటే అది స్పష్టంగా కనిపించేది. కొన్ని పేజీల్లో తన గురించి కవితలు, కథలు కూడా తల్లి రాసుకొచ్చారు.

‘‘నేను బాధపడకూడదు. ఎందుకంటే మా అమ్మ అసలు దాన్ని తట్టుకోలేరు’’ అని తస్నీమ్ అన్నారు.

అజార్ అలీ మహమ్మద్

ఫొటో సోర్స్, West Mercia Police

ఫొటో క్యాప్షన్, అజార్ అలీ మహమ్మద్

చేతిలో కవర్‌ను తెరచేటప్పుడు నీల్ దీర్ఘ శ్వాస తీసుకున్నారు.

వెస్ట్‌యార్క్‌షైర్‌లో తన బాల్యం చాలా సంతోషంగా గడిచింది. అతడిని ఓ జంట దత్తత తీసుకుంది. అయితే, తన సొంత తల్లి ఎవరో తెలుసుకోవాలని నీల్‌కు చాలా ఉత్సాహంగా ఉండేది. ఏదో ఒకరోజు తన తల్లిని కలుస్తానని ఆయన చాలా కలలు కన్నారు.

27 ఏళ్ల నీల్ తన తల్లిని కనిపెట్టేందుకు ఒక ప్రైవేటు డిటెక్టివ్‌ను కూడా నియమించారు. ఇప్పుడు ఆ డిటెక్టివ్ పంపిన కవర్‌ను ఆయన తెరుస్తున్నారు.

అయితే, దాన్ని తెరచిన తర్వాత, తన తల్లిపై ఒక పార్కులో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశారని, దాని ఫలితంగానే తను పుట్టానని నీల్‌కు తెలిసింది.

‘‘అలాంటి నిజం బయటపడుతుందని ఎవరూ అనుకోం’’ అని నీల్ చెప్పారు.

‘‘ఒక్కసారిగా ఎవరో గుండెను కత్తితో గుచ్చి, ముక్కలు ముక్కలు చేసినట్లుగా అనిపించింది’’ అని ఆయన అన్నారు.

‘‘సిగ్గుచేటుగా, బాధగా, గందరగోళంగా.. ఇలో ఎన్నో భావోద్వేగాలు మనల్ని వెంటాడుతుంటాయి. మన గురించి మనకే చాలా చెడ్డ ఆలోచనలు వస్తాయి. మనం చాలా కుంగిపోతాం’’ అని ఆయన అన్నారు.

ఇది నిజం కాకపోతే బావుండేదని నీల్ చాలా అనుకున్నారు. అసలు అద్దంలో ముఖం కూడా చూసుకోవడానికి తను ఇష్టపడేవారు కాదు.

ప్రేమకు బదులుగా హింస వల్ల జన్మిస్తే ఎలా ఉంటుంది? నీల్ కన్నతల్లి ఎప్పటికైనా ఆయన్ను కలుస్తారా?

నీల్
ఫొటో క్యాప్షన్, నీల్

జైలు గదిలోకి వెళ్తున్నప్పుడు తస్నీమ్ గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. జైలు గార్డు ఆమెను ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక టేబుల్, రెండు కుర్చీలు ఉన్నాయి.

గదికి రెండో వైపు తలుపు నుంచి తస్నీమ్ తండ్రి వచ్చారు. ఆయన్ను చూడటం అదే తొలిసారి. తను ఊహించిన దాని కంటే ఆయన ఎత్తు తక్కువగానే ఉన్నారు.

ఆయన ప్రవర్తన భిన్నంగా కనిపించింది. తస్నీమ్‌ను ఆయన హత్తుకునేందుకు ప్రయత్నించారు. తన కోసం చాక్‌లెట్ కేక్‌ కూడా తెప్పించారు.

కానీ, తస్నీమ్ కోరుకునేది ఇది కాదు. తన తండ్రి ఏం చేశాడో ఆయన అర్థం చేసుకోవాలని ఆమె కోరుకుంటున్నారు.

తన తల్లిని ఎలా కీలు బొమ్మలా ఆయన ఆడించారో, ఆమెను ఎలా నియంత్రించేవారో తస్నీమ్‌కు పదేపదే గుర్తుకువచ్చేది.

వెంటనే అక్కడి నుంచి తస్నీమ్ బయటకు వచ్చేశారు. మళ్లీ ఆమె ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదు. తనకు కావాల్సిన సమాధానాలన్నీ అక్కడ ఆమెకు దొరికాయి.

వీడియో క్యాప్షన్, ‘న్యాయం జరిగితే సరిపోదు, వివక్ష చూపే మగాళ్ల స్వభావం మార్చాలి’

తన కన్న తల్లిని తొలిసారి కలిసేందుకు ఒక రైల్వే స్టేషన్ బయట నీల్ నిలబడ్డారు. దీని గురించి ఆయన ఎన్నో కలలుగన్నారు. ఎలా నడుచుకోవాలో కూడా ముందుగానే అనుకున్నారు.

ఆమె కనిపించగానే, తను ఆమెనే అని ఆయనకు అర్థమైంది.

వారిద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నారు. తల్లి కడుపులోని బాధ ఆయనకు అర్థం అవుతోంది.

‘‘నిన్ను అలా చేసిన వ్యక్తిలానే నేను కనిపిస్తున్నానా? ఒకవేళ అలా కనిపిస్తే చెప్పు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’’ అని ఆయన అన్నారు.

‘‘లేదు, నువ్వు అలా లేవు’’ అని ఆయన తల్లి అన్నారు. దీంతో తన భుజాల పైనుంచి పెద్ద భారం దింపినట్లుగా ఆయనకు అనిపించింది.

వారిద్దరూ అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నారు. తమ జీవితంలో కథలను చెప్పుకొన్నారు. కుటుంబం గురించి, నీల్ తోబుట్టువుల గురించి కూడా మాట్లాడుకున్నారు. వారి నవ్వు, హావభావాలు దాదాపు ఒకేలా కనిపించాయి.

తన తల్లిపై దాడి జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో నీల్ అడగలేదు. మళ్లీ అవన్నీ గుర్తుచేయాలని ఆయన అనుకోవడం లేదు. నీల్‌కు సంబంధించినంత వరకు తనకు తండ్రి లేడు.

తల్లి మాత్రమే ఉన్నారు. నీల్‌కు అది చాలు.

కొడుకుతో శామీ
ఫొటో క్యాప్షన్, కొడుకుతో శామీ

‘‘అమ్మా, నేను అత్యాచారం వల్ల పుట్టానా?’’

వెంటనే కారులో తన పక్కనే కూర్చున్న తన పెద్ద కొడుకు వైపు శామీ చూశారు. ఆ బాధ తన కొడుకు కూడా అనుభవించడం ఆమెకు ఇష్టం లేదు. కానీ, ఈ ప్రశ్నను ఎలా దాటవేయాలో ఆమెకు తెలియదు.

‘‘లేదు నాన్న. నువ్వు నా కొడుకువు’’ అని ఆమె సమాధానం ఇచ్చారు.

ఇది 2013లో జరిగింది. ఇటీవల తన 12 ఏళ్ల కొడుకుకు అసలు ఏం జరిగిందో శామీ నిజం చెప్పారు. తనకు 14 ఏళ్ల వయసున్నప్పుడు అర్షిద్ హుస్సేన్‌గా పిలిచే ఓ వ్యక్తి తనను ఎలా లైంగికంగా వేధించాడో వివరించారు. నిజానికి చాలా మందిని అర్షిద్ అలానే వేధించాడు.

మొత్తానికి అతడి దగ్గర నుంచి శామీ బయటపడ్డారు. నేడు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న చిన్నారులతోపాటు తనకూ సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె అంటున్నారు.

ప్రస్తుతం హుస్సేన్‌పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆయనకు వ్యతిరేకంగా శామీ కొడుకు డీఎన్ఏనే సాక్ష్యం.

అయితే, దీని వల్ల తన కొడుకు ఎంత వేదన అనుభవించాడో శామీ తన కళ్లతో చూశారు. అన్నింటినీ తన కొడుకు ప్రశ్నించడం మొదలుపెట్టాడు.

ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎటు చూసినా తమ వార్తలే కనినించేవి. దీంతో ఒంటరి అయిపోనట్లుగా ఆమెకు అనిపించేది.

అయితే, తన కొడుక్కు మంచి తల్లిగా ఉండేందుకు శామీ ప్రయత్నించేవారు. ఒక్కోసారి తను తప్పు చేసినట్లుగా ఆమెకు అనిపిస్తుండేది.

కొన్నిసార్లు వంటగదిలో ఆమె నేలపై కూర్చొని తీవ్రంగా ఏడ్చేవారు. తన కొడుకు అంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ, తను లేకపోతేనే అతడి భవిష్యత్ బావుంటుందని ఆమెకు అనిపిస్తుండేది.

శామీ
ఫొటో క్యాప్షన్, శామీ

తస్నీమ్, నీల్ తరహాలోనే శామీ కూడా ఏళ్లపాటు ఎంతో వేదన అనుభవించారు.

అయితే, 2021లో మరొక తల్లి మాండీని కలిసిన తర్వాత ఆమెలో భారం చాలా తగ్గింది. వీరిద్దరూ దీనిపై మనసు విప్పి మాట్లాడుకునేవారు.

మాండీ కిచెన్ టేబుల్‌పై శామీ కూర్చొని ఉన్నారు. అప్పుడే మాండీ తన కథను శామీకి చెప్పారు. అది చాలా బాధాకరమైనది.

11 ఏళ్ల వయసున్నప్పుడే తొలిసారి మాండీ వేధింపులను ఎదుర్కొన్నారు. సమాజంలో కానిస్టేబుల్‌గా మంచి గౌరవమున్న, సైన్యంలో పనిచేసిన తన తండ్రే ఆమె దుస్తులను తొలగించారు. స్నానానికి తనతోపాటు ఆమెను తీసుకెళ్లారు.

ఆ తర్వాత ఇది రోజూ కొనసాగింది. ఎవరికీ తెలియకుండా ఆయన ఆమె బెడ్‌రూమ్‌లోకి వచ్చేవాడు. మాండీ కూడా భయంతో ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేకపోయేవారు.

అలా ఒక రోజు తను గర్భంతో ఉన్నానని మాండీకి అర్థమైంది.

‘‘శరీరంలోకి విషం ఎక్కించినట్లే అనిపించింది. అది కూడా సొంత తండ్రే చేశాడు. ఆయన తన జన్యువులను నాలోకి పంపించారు’’ అని శామీకి మాండీ చెప్పారు. అప్పుడు ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.

ఈ విషయం తన తండ్రికి కూడా తెలిసింది. మాండీ ఎదుట మరో మార్గం కూడా లేదు. తనకు పుట్టిన బిడ్డ కూడా తన తండ్రిని తండ్రి అనే పిలవబోతున్నాడు.

తను బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తన తండ్రి అక్కడే ఉన్నాడు. ఆ బిడ్డను ఆయన చేతులకే ఆసుపత్రి సిబ్బంది ఇచ్చారు.

‘‘దీంతో మరింత కుంగుబాటుకు గురయ్యాను. నా బిడ్డను తొలిసారి ఆయనే ఎత్తుకున్నారు. అసలు ముందు బిడ్డపై చేతులు తీయండని గట్టిగా అరవాలని అనుకున్నాను’’ అని ఆమె చెప్పారు.

‘‘తను నా బిడ్డ. నా అమూల్యమైన కొడుకు. అతడిని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను’’ అని గట్టిగా అరిచి చెప్పాలని అనుకున్నానని మాండీ వివరించారు.

కొంత ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే అక్కడి నుంచి ఆమె బయటకు వచ్చేశారు. మళ్లీ అక్కడకు ఎప్పుడూ వెళ్లలేదు.

మాండీ
ఫొటో క్యాప్షన్, మాండీ

సంతోషంగా ప్రేమతో బిడ్డకు జన్మనివ్వడం, వేధింపుల వల్ల బిడ్డ పుట్టడం భిన్నంగా ఉంటుందా అని మాండీని శామీ ప్రశ్నించారు.

‘‘అవును, తేడా ఉంటుంది. ఆ బిడ్డ నాకు ప్రేమతో పుట్టలేదు. ఒక మృగం వల్ల పుట్టాడు. కానీ, బిడ్డ ఏం తప్పు చేశాడు. నేను అతడిని ప్రేమిస్తాను’’ అని ఆమె అన్నారు.

మాండీ కొడుకుని ఆమె భర్త పీట్ దత్తత తీసుకున్నారు. వీరికి ఆ తర్వాత మరికొందరు పిల్లలు కూడా పుట్టారు.

తండ్రి వేధింపుల నుంచి మాండీ బయటపడినప్పటికీ, ఆ దుష్ప్రభావాల నుంచి ఆమె తప్పించుకోలేకపోయారు. ఆమె బిడ్డకు జన్యుపరమైన వ్యాధులు సోకాయి.

నేటికి దాదాపు 30 ఏళ్లు గడిచాయి. ఇప్పటికీ 24 గంటలూ తన కొడుక్కు తోడుగా మాండీ నిలుస్తున్నారు. తను ఎలా పుట్టాడో అర్థం చేసుకునే శక్తి ఆమె కొడుక్కు లేదు. అందుకే అతడికి వివరించాల్సిన పని కూడా లేదు.

‘‘తను అలా పుట్టాలని కోరుకోలేదు కదా. కానీ, ఆ నేరం వల్ల నాతోపాటు నా బిడ్డకు కూడా అన్యాయం జరిగింది. అందుకే అతడు కూడా బాధితుడే’’ అని శామీకి మాండీ చెప్పారు.

మాండీ కథ తెలిసిన తర్వాత ఆమెకు శామీ మరింత దగ్గరయ్యారు.

వీడియో క్యాప్షన్, భార్యకు ఇష్టంలేకుండా భర్త ఆమెతో సెక్స్‌లో పాల్గొనొచ్చా?

‘‘జీవితంలో ఏం జరిగినా సరే, సంతోషంగా ముందుకు వెళ్లాలని మాండీ కథ నాకు చెబుతోంది’’ అని శామీ చెప్పారు. ‘‘ఇలాంటివి మాట్లాడుకోవడానికి మనకు ఒక తోడు కావాలి’’ అని ఆమె అన్నారు.

మొత్తానికి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ‘‘విక్టిమ్స్ బిల్’’ను తీసుకురావడం సంతోషకరమని సామాజిక ఉద్యమకారులు అంటున్నారు.

నీల్, తస్నీమ్ కూడా ఆ మార్పులతో తమ లాంటి వారి స్వరం బయటకు వినిపించేందుకు ఒక అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.

ఇలా బయటకు వచ్చి మాట్లాడితేనే అత్యాచార బాధితుల పిల్లలకు తాము ఒంటరులం కాదని, వారికి ఒక నమ్మకం వస్తుందని వారు అంటున్నారు.

‘‘ఈ విషయంలో సమాజంలో చాలా అపోహలు, అపార్థాలు ఉన్నాయి’’ అని తస్నీమ్ అన్నారు.

‘‘అసలు నేను ఎవరికి జన్మించాననే విషయాన్ని పక్కన పెట్టండి. నాకంటూ ఒక వ్యక్తిత్వముంది. జరిగిన ఆ తప్పులో నా పాత్ర లేదు. దానికి నేను కూడా బాధితురాలినే’’ అని ఆమె అన్నారు.

ఇలా బయటకు మాట్లాడటం ద్వారా తల్లి జ్ఞాపకాలను నెమరువేసుకున్నట్లు అనిపిస్తుందని తస్నీమ్ అంటున్నారు. ఆమె కథ అలా విషాదంతో ముగిసుండాల్సిందని కాదని చెప్పారు.

‘‘నేను మా అమ్మతో మాట్లాడే అవకాశం వస్తే, తను ఎంత ధైర్యవంతురాలో ఆమెకు చెప్పేదాన్ని’’ అని తస్నీమ్ చెప్పారు.

‘‘అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని భరోసా ఆమెకు ఇచ్చేదాన్ని’’ అని తస్నీమ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)