ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...

- రచయిత, శంకర్ వడిసెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఏప్రిల్ 13 - విశాఖలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి పగ్గన్ సింగ్ ప్రకటన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేసిన మంత్రి. పైగా ఆర్ఐఎన్ఎల్(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-విశాఖ ఉక్కు కర్మాగారం) బలోపేతం చేస్తామని హామీ.
ఏప్రిల్ 14 - కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటన. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని తేల్చేసిన ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వానికే చెందిన మంత్రి ఒక ప్రకటన చేస్తే, అదే శాఖ నుంచి మరుసటి రోజే పూర్తి భిన్నంగా ప్రకటన వస్తుంది.
కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనే కాదు, ఏపీకి చెందిన అనేక అంశాల్లో ఇది పదే పదే జరుగుతోంది.
పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ, రాజధానుల నుంచి రాష్ట్రానికి సంబంధించిన నిధుల వరకూ అన్నింటా ఇదే తంతు.

కోర్టులో చెప్పిన దానికి భిన్నంగా..
రాష్ట్ర రాజధాని అంశం దాదాపు నాలుగేళ్లుగా వివాదంగా మారింది. అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి, చట్టం చేసిన నాటి నుంచి ఇదో చిక్కుముడిగా మారింది. మూడేళ్ల నుంచి న్యాయస్థానాల్లో నానుతోంది.
అమరావతి నిర్మాణానికి స్వయంగా ప్రధానమంత్రి హాజరయి శంకుస్థాపన చేశారు. కానీ, పాలనా వికేంద్రీకరణ చట్టం చేసి, మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిన తర్వాత కేంద్రం తన వైఖరి మార్చుకుంది. నేరుగా ఏపీ హైకోర్టుకి అఫిడవిట్ సమర్పించింది.
రాష్ట్రాల రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోమని పేర్కొంది. విభజన చట్టం మేరకు తాము రాజధాని నిర్ణయానికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది.
కానీ ఆ తర్వాత 2023 పిబ్రవరి 8న, సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కొత్తగా రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ ప్రభుత్వం తమతో సంప్రదించలేదని మాత్రమే సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
మొదట రాష్ట్రాల రాజధానుల విషయంలో తాము నిర్ణయం తీసుకోబోమని ఏపీ హైకోర్టుకి చెప్పిన కేంద్రం, ఆ తర్వాత మాత్రం రాజధానుల విభజన అంశంపై ప్రతిపాదనల గురించి తమతో మాట్లాడలేదని, తమకు సమాచారం లేదని చెప్పింది.

పోలవరం విషయంలోనూ...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ కేంద్రం వైఖరి ఇదే రీతిలో ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే పార్లమెంట్ ముందు భిన్నమైన ప్రకటనలు చేసింది. ప్రజల్లో అపోహలు పెంచేలా వ్యవహరించింది.
పోలవరం ప్రాజెక్టు నిధుల అంశం గురించి లోక్ సభలో వైఎస్సార్సీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి అడిగిన ప్రశ్నకు ఒక సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ, ఆ మరుసటి రోజే రాజ్యసభలో మరో విధంగా స్పందించింది.
టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు సమాధానమిస్తూ ముందురోజు ఇచ్చిన సమాధానానికి విరుద్ధంగా వ్యాఖ్యానించింది.
పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల వద్ద నీటి నిల్వ ఉంచబోతున్నట్టు లోక్ సభలో తెలిపింది. దానికి అనుగుణంగా పరిహారం చెల్లింపు ప్రక్రియ జరుగుతోందని తెలిపింది.
కానీ రాజ్యసభలో మాత్రం పోలవరం ఎత్తు తగ్గించే ప్రతిపాదనలు ఏమీ లేవని స్పష్టం చేసింది. పూర్తి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు అని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
మార్చి నెలలోనే పార్లమెంట్ వేదికగా ఒకే శాఖకి చెందిన ఇద్దరు మంత్రులు రెండు భిన్నమైన ప్రకటనలు చేయడం గమనించాల్సిన అంశం.

ఫొటో సోర్స్, AP SPECIAL STATUS CAMPAIGN
ప్రత్యేక హోదా విషయంలో ఎన్నో మాటలు..
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని 2013లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై చర్చ జరిగిన సందర్భంగా నాటి ప్రధాన మన్మోహన్ సింగ్ ప్రకటించారు.
అయితే ప్రధానమంత్రి ఐదేళ్లు అంటున్నారని, దానిని పదేళ్లకు పెంచాలని నాడు విపక్షంలో ఉన్న బీజేపీ ఎంపీలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు.
ఆ తర్వాత 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, తిరుపతి సహా వివిధ సభల్లో పాల్గొన్న ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.
పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని, త్వరలోనే ఏపీకి హోదా అని ప్రకటనలు చేశారు.
తరువాత, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, ప్రస్తుతం ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదని చెప్పారు.

'ప్రజల్లో పలుచన అవుతారు'
ప్రభుత్వం తరపున ఏది చెప్పినా ప్రజలు దానిని దృష్టిలోకి తీసుకుంటారు. అలాంటిది తాము చెప్పిన దానికి విరుద్ధంగా తామే ప్రకటనలు చేస్తుండడం వల్ల ప్రజల్లో అపోహలు పెరగడం, ఆ ప్రభుత్వాలు పలుచన కావడం జరుగుతుందని రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ మనోహర్ రావు అన్నారు.
“రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నప్పుడు మాట మార్చుకోవడం సహజం. కానీ పాలనా పరమైన వ్యవహారాల్లో ఏదైనా ప్రకటన చేసినప్పుడు కట్టుబడి ఉండాలి. కానీ పార్లమెంట్‌లోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండడం సమర్థనీయం కాదు. విశాఖ ఉక్కు వంటి అంశాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే భిన్నమైన స్పందన అనూహ్యం. ఈ ధోరణి మేలు చేయదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు గమనించాలి” అని ఆయన బీబీసీతో అన్నారు.
పదే పదే మాట మారుస్తున్నారనే అభిప్రాయం బలపడితే ప్రజల్లో పలుచన అయిపోతారని ఆయన హెచ్చరించారు. నాయకుల మాటలకు ఎలాంటి విలువలు ఉన్నప్పటకీ, ప్రభుత్వ ప్రకటనల మీద గౌరవం కోల్పోకూడదని సూచించారు.

‘మోసం చేయడం కోసమే...’
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అయితే, కేంద్రం వైఖరిని ఖండించలేని స్థితిలో ఏపీలో ప్రధాన పార్టీలు మిగిలిపోవడం వల్ల కేంద్రానికి ఇష్టారాజ్యం అన్నట్టుగా సాగుతోందని సీపీఎం నేత, మాజీ ఎంపీ పి. మధు అన్నారు.
"ప్రభుత్వం తరపున ఓ మాట చెబితే దానికి విలువ ఉంటుంది. ఆ గౌరవం నిలబెట్టుకునేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించాలి. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కూడా ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండడం లేదు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు నెలల తరబడి పోరాడుతున్నారు. విశాఖ వచ్చి ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్టు చెప్పి, దిల్లీ వెళ్లగానే ప్రైవేటీకరణ ప్రక్రియ సాగుతోందని చెప్పడం రాష్ట్రాన్ని అపహాస్యం చేసినట్టు కాదా? అయినా ఏపీలో ప్రధాన పార్టీల నాయకుల నోళ్లు పెగలడం లేదు" అని బీబీసీతో అన్నారాయన.
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేని ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష టీడీపీ, జనసేన అధినేతల కారణంగా ఏపీ ప్రజల ఆశల మీద కేంద్రం పదే పదే నీళ్లు జల్లుతోందని సీపీఎం నాయకుడు విమర్శించారు. అందరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
అయితే, ఏపీ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కానీ ఏపీలో కొన్ని పార్టీల కారణంగా అలాంటి అపోహలు పెరుగుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మాట మారుస్తుందనే విమర్శను ఆయన తోసిపుచ్చారు. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇచ్చి, ఎంతో తోడ్పడుతోందని ఆయన బీబీసీతో అన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా మోదీ హయంలోనే ఏపీ అభివృద్ధికి సహకారం అందుతోందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
- అతీక్ అహ్మద్, అష్రఫ్ హత్య: వారిని కాల్చి చంపిన నిందితుల నేర చరిత్ర ఏమిటి?
- లూసిడ్ డ్రీమింగ్ : మనం కోరుకున్న కలలు కనొచ్చా? ఎలా?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- 'సైన్స్ ఆఫ్ మనీ': డబ్బును అర్థం చేసుకుంటే సగం కష్టాలు తగ్గినట్టే... ఎలాగంటే














