పోలవరం: ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక స్తోమత లేదు, కేంద్రం జాప్యం చేస్తోంది... మరి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదెలా?

పోలవరం ప్రాజెక్టు ప్రాంతం
ఫొటో క్యాప్షన్, పోలవరం ప్రాజెక్టు ప్రాంతం
    • రచయిత, శంకర్ వి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భిన్నవాదనలెందుకు? జాతీయ ప్రాజెక్టుకి కేంద్రం నిధులు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? పునారవాసం ఖర్చు పెరిగిన తర్వాత అది తమ బాధ్యత కాదని తప్పుకుంటే నిర్మాణం ఎలా సాగుతుంది?

దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టుపై ఇప్పుడు మళ్లీ ఊగిసలాట ఎందుకు? కేంద్రం కనికరించకపోతే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే పోలవరం నిర్మాణం ఎలా పూర్తి కావాలి?

ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసుల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై బీబీసీ అందిస్తున్న కథనమిదీ.

పోలవరం ప్రాజెక్టు
ఫొటో క్యాప్షన్, కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు

అంచనాలు పెంచడం లేదు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునిర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. దాని ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.

అయితే 2016లో చంద్రబాబు ప్రభుత్వం ఈ బాధ్యతను భుజానికెత్తుకుంది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో దానికి సిద్ధపడింది.

అదే సమయంలో ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం ఏపీకి పలు వరాలు ప్రకటించినట్టు నాటి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వాటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలు 2013-14 లెక్కల ప్రకారమే చెల్లిస్తామని కేంద్ర క్యాబినెట్ తీర్మానంలో పేర్కొన్నారు.

2019 నాటికే పోలవరం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది.

ఆ తర్వాత నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. దానిమూలంగా నిర్మాణ వ్యయం పెరిగింది. సిమెంట్, స్టీల్ సహా అన్ని ధరలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోంది.

ఇప్పటికే దానికి అనుగుణంగా డీపీఆర్-2ని సిద్ధం చేశారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం కూడా దీనికి దక్కింది. అయినప్పటికీ కేంద్ర జలశక్తి శాఖ అంచనాలు సవరించేందుకు సిద్ధంగా లేమని చెబుతోంది.

ఈనెల 25న పార్లమెంట్‌లో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చినప్పటికీ ఖర్చు పెరిగినా అదనపు వ్యయం తమ వల్ల కాదని కేంద్రం తేల్చేసింది. 2013-14 నాటి లెక్కల ప్రకారమే తాము నిధులిస్తామని తేల్చేసింది.

పోలవరం ప్రాజెక్టు పునరావాసం 10 శాతం కూడా పూర్తి కాలేదు.
ఫొటో క్యాప్షన్, పోలవరం ప్రాజెక్టు బోర్డు

అంచనాలు పెంచాలంటే ఏం చేయాలి...

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. 2011-12 నాటి లెక్కలనే 2013 నాటి విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో దానిని మాత్రమే కేంద్రం ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా పెరిగిన వ్యయంతోపాటు డిజైన్లలో పలు మార్పులు, చేర్పులు; ధరల పెరుగుదల; కొత్తగా అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టంలోని నియమ, నిబంధనలను అనుసరించి భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసం; పునఃనిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతోంది.

2017-18 నాటి ధరల ప్రాతిపదికపై రూ.57,297 కోట్లతో సవరించిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి సమర్పించగా టీఏసీ సూచనల మేరకు అంచనా వ్యయాన్ని రెండోసారి సవరించి రూ.55,548 కోట్లతో ప్రతిపాదనలను సమర్పించారు.

టీఏసీ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూనే వాటిని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీఈ) పరిశీలనకు పంపింది. ఆర్‌సీఈ ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అంచనా వ్యయాన్ని రూ.47,725 కోట్లకు కుదించి తుది ఆమోదం కోసం జల శక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది.

ఇప్పుడు అంచనా వ్యయం పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతి కావాలి. దానికి ఆర్థిక శాఖ ధ్రువీకరణ చేయాలి. కేంద్ర క్యాబినెట్ దానికి అనుగుణంగా తీర్మానం చేయాలి. అప్పుడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు వచ్చే అవకాశం ఉంది.

పోలవరం ప్రాజెక్టు

కావాల్సిన నిధులు ఎంత?

పోలవరం ప్రాజెక్టుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మాణం మొదలుపెట్టారు.

అందులో భాగంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు, విశాఖ నగరం సహా అనేక మందికి తాగునీరు అందించడంతో పాటుగా 960 మెగావాట్ల విద్యుతుత్పాదన సామర్థ్యంతో పవర్ ప్లాంట్ నిర్మాణం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.

వాటిని పూర్తి చేసేందుకు తొలుత పునరావాసం అందించాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ధారణ చేసిన లెక్కల ప్రకారం 1.05లక్షల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. దాని కోసం 2013 భూసేకరణ చట్ట ప్రకారం రూ.27 వేల కోట్లు వెచ్చించాలి. అందులో ఇప్పటి వరకూ కేవలం రూ. 7కోట్ల వరకు మాత్రమే నిర్వాసితులకు చేరిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాంతో కేవలం పునరావాసం కోసమే ఇంకా రూ. 20వేల కోట్లు సుమారుగా కావాలి.

ఇటీవల పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నిర్మాణం పూర్తికావడంతో ప్రస్తుతం నదీ ప్రవాహం మళ్లించి, వరద నీటిని స్పిల్ వే గుండా వదులుతున్నారు.

ఇక మిగిలిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగాల్సి ఉంది. దానికోసం కొత్త డిజైన్‌ల ప్రకారం రూ.7192 కోట్లు అవసరం అవుతాయి. దాంతో పాటుగా పవర్ ప్లాంట్ నిర్మాణం జరగాలి.

అదే సమయంలో కుడి, ఎడుమ కాలువల పనులు కూడా కొంత పెండింగులో ఉన్నాయి. వాటికి కూడా కనీసంగా రెండు మూడు వేల కోట్లు ఖర్చవుతాయని అంచనాగా ఉంది. దాంతో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి రావాలంటే కనీసంగా మరో రూ.35వేల కోట్లు అవసరం అవుతాయనే ప్రాథమిక అంచనాలు ఇరిగేషన్ అధికారులు వేస్తున్నారు.

పోలవరం నిర్మాణానికి అంచనా వ్యయం విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య అంతరం కనిపిస్తోంది. వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ఫొటో క్యాప్షన్, పోలవరం ప్రాజెక్టు మ్యాప్

కేంద్రం ఎంత ఇస్తామంటోంది...

2011-12 నాటి సవరించిన అంచనాల మేరకు మాత్రమే కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది. 2013లో జాతీయ హోదా కేటాయిచిన నాటి లెక్కలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటిస్తోంది.

పైగా 2013-14 నాటి అంచనాల్లో తాగునీటి అంశాన్ని , పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తాము పరిగణలోకి తీసుకోబోమని చెబుతోంది.

కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే తాము పూర్తిచేస్తామని అంటుంది. దానికి తగ్గట్టుగా మొత్తం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను కేవలం రూ.20,418 కోట్లకు పరిమితం చేస్తోంది. అందులో కూడా ఇప్పటి వరకూ రూ. 11,182 కోట్లు కేంద్రం చెల్లించిందని పార్లమెంటులో ప్రకటించింది.

ఇక జాతీయ హోదా దక్కేనాటికి చేసిన ఖర్చు రూ.4730 కోట్లను కూడా పరిగణించడం లేదని చెబుతోంది. దాంతో ఇక కేంద్రం నుంచి మరో రూ. 5వేల కోట్లు మాత్రమే వస్తాయనే సంకేతాలు పంపుతోంది.

ఇప్పటికే పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 2300 కోట్లను కేంద్రం రీయంబర్స్ చేయాల్సి ఉందని ఈనెల 19న పోలవరం వద్ద సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు.

కానీ తీరా 25వ తేదీన పార్లమెంటులో కేంద్ర జలశక్తి మంత్రి మాత్రం ఇంకా రూ. 1,900 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని తెలిపారు. కాలువలు సహా వివిధ ఖర్చుల బిల్లులను కేంద్రం చెల్లించడానికి సిద్దంగా లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఫొటో క్యాప్షన్, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

హామీలు ఇచ్చారంటున్న వైసీపీ

అంచనాలు సవరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చిందని వైసీపీ పార్లమెంటరీ నాయకుడు వి విజయసాయిరెడ్డి చెబుతున్నారు.

ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నుంచి పోలవరం విషయంలో ఆశించిన స్పందన రాకపోవడంతో ఏపీలో పాలకపక్ష నేతలు నిరాశలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ని కలిశారు. పోలవరం విషయంలో సానుకూలంగా స్పందించాలని విన్నవించారు.

ఈ సందర్భంగా తమకు హామీ వచ్చిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘ప్రాజెక్ట్‌లోని ప్రధాన అంశాలైన నీటి పారుదల, తాగు నీటి అంశాలకు సంబంధించిన వ్యయాన్ని 2013-14 నాటి ధరలకే జల శక్తి మంత్రిత్వ శాఖ పరిమితం చేసింది.

ఫలితంగా ప్రాజెక్ట్‌లోని ఇతర అనేక కీలకమైన అంశాలకు చేసిన ఖర్చును తిరిగి రాష్ట్రానికి చెల్లించడానికి పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ నిరాకరించింది. గతంలో ఆమోదం పొందిన పనులకు సంబంధించి పెరిగిన వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి అథారిటీ నిరాకరించడంతో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి విడుదలయ్యే నిధులపై తీవ్ర ప్రభావం పడుతోంది. రెండవ సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు బదులుగా రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సు చేసిన 47,725 కోట్ల అంచనా వ్యయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అలాగే ప్రాజెక్ట్ నిర్మాణంలోని అంశాల వారీగా జరిగే పనులకు చెల్లింపులకు బదులుగా మొత్తం పనులను పరిగణలోనికి తీసుకుని చెల్లింపులు చేయాలన్న విజ్ఞప్తికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించడానికి కూడా మంత్రి అంగీకరించారు’’ అంటూ వివరించారు.

పోలవరం నిర్మాణంలో జాప్యం కారణంగా అంచనా వ్యయం పెరిగిపోతోంది. దాన్ని సవరించడానికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.

హోదా పోయింది.. జోన్ రాలేదు. పోలవరమూ అంతేనా?

‘‘ఏపీకి వస్తుందని చెప్పిన ప్రత్యేక హోదా పోయింది. అది సాధ్యం కాదని చెప్పేశారు. రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత కూడా అమలులోకి రాలేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు పోలవరం నిధుల్లో కూడా ఇంతటి నిర్లక్ష్యం సమంజసం కాదు’’అని రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అంటున్నారు.

కేంద్రం తీరు మార్చుకోవాలి. ఏపీ పట్ల సవతి ప్రేమ చూపకూడదు. జాతీయ ప్రాజెక్టు విషయంలోనూ పాత అంచనాల ప్రకారం పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం. రైతాంగం ఆశలపై నీళ్లు జల్లుతారా? రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నాలు చేయలేకపోతోంది. ఇది ఏపీకి శాపంగా మారింది. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరం అనుకుంటే ఇప్పుడు భారం కాబోతోంది. ఇంకా రూ. 35వేల కోట్లు రాష్ట్రం భరించాల్సి వస్తే ఇక ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి రానట్టే’’అని ఆయన అన్నారు.

‘‘రాష్ట్రంలోని ప్రాజెక్టుల మీద పెత్తనం కోసం ఆతృత పడుతున్న కేంద్రానికి వాటిని పూర్తి చేయాలనే ఆలోచన రాకపోవడం శోచనీయం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చి, రివర్స్ టెండరింగ్ పద్ధతిలో మిగలిన పనులు పూర్తి చేసేందుకు మేఘ కంపెనీని రంగంలోకి తెచ్చింది.

ఆర్ అండ్ ఆర్ కూడా కేంద్రానిదే బాధ్యత

కేంద్రం నిధుల విషయం నాన్చుతుంది. జాతీయ ప్రాజెక్టులో భాగంగా ఆర్ అండ్ ఆర్ బాధ్యత కేంద్రం భాద్యతే. నిర్వాసితుల సమస్య తీర్చికుండా నీటిని నిలబెట్టలేము. ఈసీఆర్ఎఫ్ పనులు కూడా వేగంగా చేయలేరు. 2014లో ముంపు గ్రామాలను విలీనం చేస్తేనే ప్రమాణస్వీకారం చేస్తనని పట్టుబట్టిన ఆనాటి సీఎం అదేరోజు భూసమీకరణకు నిధుల విషయం మీద కూడా స్పష్టత తీసుకుని ఉండాల్సింది. పోలవరం కోసమే ప్రత్యేక హోదాకి బదులుగా ప్యాకేజీకి ఒప్పుకున్నట్టు ప్రకటించారు. అయినా అప్పట్లో ప్రభుత్వం అడగలేదు కాబట్టి ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ కి నిధులు కేటాయించడానికి తాత్సార్యం చేయడం తగదు. పోలవరానికి విభజన చట్టం ఇచ్చిన గ్యారెంటీని గౌరవించటం కేంద్రం బాధ్యత అని ఇరిగేషన్ నిపుణుడు శివ రాచర్ల అంటున్నారు.

ఏపీ ప్రజలు ఆశిస్తున్నట్టుగా కేంద్రం కనికరిస్తుందనా, పోలవరం పూర్తి చేసే విషయంలో స్పష్టత వస్తుందా అనేది ఎప్పటికి కొలిక్కి వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)