ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు: ఒకప్పటి భారతదేశానికి నేటి ఇండియాకు తేడా ఇదే

1991 నాటి ఆర్ధిక సంస్కరణలు భారతదేశ రూపు రేఖలను మార్చాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1991 నాటి ఆర్థిక సంస్కరణలు భారతదేశ రూపు రేఖలు మార్చాయి.
    • రచయిత, మయూరేష్ కొన్నూర్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

భారతదేశంలో ఉదారవాద ఆర్థిక విధానాలు 1991లో ప్రారంభమయ్యాయి. వీటి కారణంగా దేశంలోని వివిధ రంగాలలో అనూహ్యమైన మార్పులు మొదలయ్యాయి.

1991 తర్వాత జన్మించిన వారు 30 ఏళ్లకు ముందు ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఊహించడమే కాదు, ఇలా ఉండేవని చెబితే నమ్మడం కూడా కష్టమే.

1991కి ముందు భారత దేశం ఎలా ఉండేది?

ఒకే టీవీ ఛానల్, ఒకే రేడియో, ఒకే విమానయాన సంస్థ, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు, టెలిఫోన్ బూత్‌ల ముందు కస్టమర్ల పడిగాపులు...ఇదీ దృశ్యం. కానీ, ఇప్పుడు ఎన్నెన్నో విప్లవాత్మక మార్పులు.

ఇండియాలో ప్రస్తుతం 800 వరకు శాటిలైట్ టీవీ ఛానళ్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియా లో ప్రస్తుతం 800 వరకు శాటిలైట్ టీవీ ఛానళ్లు ఉన్నాయి.

1. అప్పుడు ఒకే టీవీ ఛానల్.. ఇప్పుడు 800 ఛానెళ్లు

ఇది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఫ్లాట్‌ఫామ్‌ల యుగం. ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోయి ఉంది. చాలామంది టీవీని టీవీలో చూడటం లేదు. మొబైళ్లలోనే వీక్షిస్తున్నారు. దేశంలో ఇప్పుడు 800 వరకు టీవీ ఛానెళ్లు అందుబాటులో ఉన్నాయి.

టీవీ ముందు కూర్చుంటే రిమోట్ పట్టుకుని రకరకాల ఛానళ్లు మారుస్తూ ఉంటుంది యువతరం. కానీ 1991 నాటికి టీవీ ఆన్ చేయడమొక్కటే పని. అప్పుడు దూరదర్శన్ ఒకటే ఛానెల్.

ఒక ఛానల్ నుంచి మొదలైన ప్రయాణం 30 ఏళ్లలో 800 ఛానెళ్లకు చేరుకుంది. 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఈ మార్పు జరిగింది. 1982 నాటికే కలర్ టెలివిజన్ వచ్చినా, అప్పట్లో టీవీ ప్రసారాల సాంకేతికతపై అనేక ఆంక్షలుండేవి.

ఆర్ధిక సంస్కరణల నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో నాటి ఆర్ధికమంత్రి మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్

పత్రికలను పెద్ద పెద్ద వ్యాపార సంస్థలే నిర్వహించగలిగేవి. వీడియో కోసం దూరదర్శన్, ఆడియో కోసం ఆలిండియా రేడియో...ఈ రెండే అప్పటి ఆప్షన్.

ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ పెరగడంతో టీవీ ప్రసారాలు విస్తరించాయి. కేబుల్ టీవీ ద్వారా వందలాది ఛానెళ్లు ప్రజల ముంగిట్లోకి వచ్చాయి. లైసెన్స్ రాజ్‌కు కాలం చెల్లి, సంస్కరణల బాట పట్టడంతో భారతదేశం కూడా మిగతా ప్రపంచంతో కలిసి నడిచింది.

ఒకప్పుడు జర్నలిస్టులు, నిర్మాతలు తమ కార్యక్రమాలను ప్రభుత్వ ఛానెల్‌లో మాత్రమే ప్రసారం చేసుకునే అవకాశం ఉండేది. సొంత టీవీ ఛానల్ పెట్టడమనేది ఒక కల. కానీ, 1991 ఆర్థిక సరళీకరణ తర్వాత ఈ ఆంక్షలు తగ్గిపోయాయి. ప్రైవేట్ టీవీ ఛానళ్ల స్వప్నం నిజమైంది.

1991నాటి గల్ఫ్ యుద్ధాన్ని భారతదేశంలో ప్రజలు ఇళ్లలో కూర్చుని చూడగలిగారంటే దానికి కారణం శాటిలైట్ ఛానళ్లే.

ఆర్థిక సంస్కరణలకు తలుపులు తెరిచిన తర్వాతే స్టార్ నెట్‌వర్క్ భారతదేశంలో ప్రవేశించింది. ఆ తర్వాత సుభాష్ చంద్రకు చెందిన జీ నెట్‌వర్క్ తన కార్యక్రమాలను ప్రారంభించింది.

ఉపగ్రహాల ద్వారా ప్రైవేట్ ఛానళ్లు ప్రసారాలు ప్రారంభించడంతో కేబుల్ టీవీ వైర్లు, డిష్‌లు గ్రామ గ్రామానికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూపొందుతున్న అనేక సినిమాలు, టీవీ సీరియళ్లు, రియాలిటీ షోలు భారతదేశపు పల్లెసీమల్లో కనిపించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత డీటీహెచ్ యుగం మొదలైంది.

ఆర్ధిక సంస్కరణల తర్వాత బ్యాంకింగ్ రంగంలో పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్థిక సంస్కరణల తర్వాత బ్యాంకింగ్ రంగంలో పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలు వచ్చాయి.

2. ప్రైవేట్ బ్యాంకుల పరిచయం

ఈ రోజుల్లో ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా తెరిచినా, కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినా అవి చాలా వరకు ప్రైవేటు బ్యాంకులవే అయ్యుంటాయి.

ఇప్పుడు కనిపిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ సహా అనేక ప్రైవేటు బ్యాంకులు 30 ఏళ్ల కిందట లేనే లేవు. అప్పట్లో చాలా కొద్ది బ్యాంకులు, అందులోనూ ప్రభుత్వ నియంత్రణలోనే బ్యాంకులు ఉండేవి.

సరళీకరణ విధానాలను అమలు చేసిన తర్వాతే దేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్ రంగం ప్రారంభమైంది. భారతదేశంలో 22 ప్రైవేట్ బ్యాంకులు ఉండగా, 27 జాతీయం చేసిన బ్యాంకులు ఉన్నాయి. అయితే తమను తాము విస్తరించుకోలేని చాలా బ్యాంకులు పెద్ద బ్యాంకుల్లో విలీనం అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రజలు లేదా సంస్థలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలలో ప్రైవేట్ బ్యాంకుల వాటా 42 శాతం. అయితే, 1991 జులైలో మన్మోహన్ సింగ్ ఉదారవాద విధానాలు ప్రకటించిన నాటికే బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు జరిగాయి.

వీడియో క్యాప్షన్, నోట్లు ముద్రించటంతో పాటు ఆర్‌బీఐ చేసే పనులేంటి?

1969లో ఇందిరా గాంధీ 14 బ్యాంకులను జాతీయం చేశారు. 1980లో మరో ఆరు బ్యాంకులను ఈ జాబితాలో చేర్చారు.

1991కి ముందు ప్రభుత్వ రంగ బ్యాంకుల యుగంలో లిక్విడిటి, ఆర్థిక అవకాశాల విషయంలో చాలా పరిమితులు ఉండేవి. దీంతో బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం అప్పటి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌ను సలహాలు, సూచనలు అడిగింది.

నరసింహం అధ్యక్షతన ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికను 1991 డిసెంబర్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలోని అన్ని సూచనలు ప్రభుత్వం అంగీకరించకున్నా ప్రైవేట్ బ్యాంకులకు అనుమతులు ఇవ్వాలన్న సూచనను మాత్రం అంగీకరించింది.

అయితే బ్యాంకింగ్ రంగంపై నిర్ణయాలను అప్పటి ప్రభుత్వం హడావుడిగా తీసుకోలేదు. రిజర్వ్ బ్యాంక్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రైవేటు బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మాత్రమే పని చేయాలన్న నిబంధన ఉంది.

బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుసన్నలలో జరుగుతాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ రిజర్వ్ బ్యాంక్ కనుసన్నలలో జరుగుతాయి.

1993 ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సి.రంగరాజన్ ఉండేవారు. ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఇస్తూనే, కనీసం 100 కోట్ల రూపాయల నిధిని కచ్చితంగా చూపించాలంటూ అర్హత నిబంధనలు పెట్టారు.

మొదట్లో వందకు పైగా ఆర్థిక సంస్థలు బ్యాంకుల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నిబంధనల కారణంగా మిగతా సంస్థలు పక్కకు పోయాయి. యూటీఐ, ఐడీబీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు అనుమతి లభించింది.

ఆ తర్వాత కొద్ది కాలంలోనే హెచ్‌డీఎఫ్‌సీతోపాటు మరో ఆరు బ్యాంకులకు కూడా అనుమతి లభించింది.

అయితే, మొదట్లో ప్రైవేటు బ్యాంకుల రాకను చాలామంది వ్యతిరేకించారు. పెద్ద వ్యాపార సంస్థల బ్యాంకు దరఖాస్తుల తిరస్కరణపై పారిశ్రామికవేత్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలక్రమంలో భారీ ఆర్థిక సంస్థలకు కూడా బ్యాంకింగ్ అనుమతి ఇచ్చే ప్రక్రియ మొదలైంది.

2002-03లో రెండో దశలో, ప్రైవేట్ బ్యాంకులకు లైసెన్సులు ఇచ్చారు. ఈ దశలో కోటక్ మహీంద్రా, యెస్ బ్యాంక్‌లు అనుమతి పొందాయి. మూడో దశ 2014లో ప్రారంభమైంది. అయితే 25 సంస్థలు ముందుకు రాగా కేవలం రెండు సంస్థలే అనుమతి పొందగలిగాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

కొత్త బ్యాంకుల రాక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చింది. జనాభాలో ఎక్కువ భాగం ప్రధాన స్రవంతిలోకి వెళ్లడానికి సహాయ పడింది.

మొదట్లో ప్రభుత్వ బ్యాంకుల కంటే వినియోగదారులకు ప్రైవేట్ బ్యాంకులలో మెరుగైన సౌకర్యాలు లభించాయి. కానీ, ఈ సౌకర్యాల ఖర్చు వినియోగదారుల జేబుల నుంచే తీసుకుంటున్నారు.

ప్రైవేట్ బ్యాంకుల రాకతో, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని వేగం కూడా పెరిగింది. 30 సంవత్సరాల కిందట ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అనే ఊహ కూడా ఉండేది కాదు.

ఈ రోజుల్లో పబ్లిక్ టెలీఫోన్ బూత్‌లు కనిపించడం లేదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ రోజుల్లో పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు కనిపించడం లేదు

3. టెలికమ్యూనికేషన్ విప్లవం

1991కి ముందు ఇంట్లో టెలిఫోన్ ఉండటం ఒక విలాసంగా భావించేవారు. ఫోన్ చేసుకోవాలంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్‌ల దగ్గర జనం క్యూ కట్టాల్సి వచ్చేదంటే ఈ తరం నమ్మడం కష్టం.

ఇప్పుడు ల్యాండ్ ఫోన్‌లు చాలా వరకు తగ్గిపోయాయి. అరచేతిలోని సెల్‌ఫోన్‌తో ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడవచ్చు.

భారతదేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవం 1991లో ప్రారంభం కానప్పటికీ, అప్పటి నుంచి అది వేగాన్ని పుంజుకుంది.

1980ల నుంచే టెలిఫోన్‌లు భారతదేశంలో విస్తరించడం ప్రారంభించాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

1984 తరువాత, టెలిఫోన్ బూత్‌లు మారుమూల ప్రాంతాలలో మొదలయ్యాయి. ఈ రంగంలో ప్రైవేటు ఆపరేటర్లను కూడా అనుమతించారు. ఎంటీఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ ఏర్పడ్డాయి.

కానీ, 1991 ఆర్థిక సంస్కరణలతో టెలికామ్ రంగం రూపురేఖలు మారిపోయాయి.

కొత్త ఆర్థిక విధానాల కారణంగా టెలికాం రంగ పరికరాల ఉత్పత్తి భారతదేశంలో ప్రారంభమైంది. 1992లో అనేక సర్వీసులలో ప్రైవేట్ సంస్థలను కూడా అనుమతించారు.

భారతదేశంలో కోట్లమంది ప్రజలకు మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది

ప్రైవేటు రంగంలోకి పెట్టుబడులు రావడంతో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వాడే వారి సంఖ్య పెరగడం ప్రారంభమైంది. విదేశీ కంపెనీలు కూడా భారతీయ మార్కెట్లోకి అడుగు పెట్టాయి.

1994లో దేశపు మొట్టమొదటి జాతీయ టెలికమ్యూనికేషన్ పాలసీ ప్రకటించింది ప్రభుత్వం. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరిగింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 1997లో ఏర్పడింది.

సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగి ఇండియాలో మొబైల్ విప్లవం ప్రారంభమైంది. రెండవ జాతీయ టెలికమ్యూనికేషన్ పాలసీ 1999లో వచ్చింది. ఆ తరువాత టెలికాం రంగంలో థర్డ్ జనరేషన్ కనిపించింది.

ఒకప్పుడు విమానయాన రంగంలో ఎయిర్ ఇండియాది ఏకచ్ఛత్రాధిపత్యంగా ఉండేది
ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు విమానయాన రంగంలో ఎయిర్ ఇండియాది ఏకచ్ఛత్రాధిపత్యంగా ఉండేది

4. పౌర విమానయానంలో అనూహ్య మార్పులు

1991నాటి సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల పౌర విమానయాన రంగం బాగా ప్రభావితమైంది. భారత మార్కెట్లో ప్రైవేటు విమానయాన సంస్థలు వరదలా వచ్చి పడ్డాయి. అయితే, ఆ తర్వాత కొన్నేళ్లకే అవి మూతపడే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్-1953 ప్రకారం ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ ఒక దశలో భారత గగనతలంపై గుత్తాధిపత్యాన్ని అనుభవించింది. కానీ 1991 తర్వాత కొత్త ప్లేయర్లు ఈ రంగంలో అడుగుపెట్టారు.

1994లో జరిగిన చట్ట సవరణలతో ప్రైవేటు రంగ విమానయాన సంస్థలు కార్యక్రమాలు ప్రారంభించాయి.

ఓపెన్ స్కై పాలసీ కారణంగా భారతీయ, విదేశీ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఈ రంగంలోకి ప్రవేశించాయి. జెట్ ఎయిర్‌వేస్, సహారా ఎయిర్‌లైన్స్ తొలి భారతీయ ప్రైవేట్ సంస్థలు. అయితే, ఇప్పుడు ఈ రెండు కంపెనీలు భారత విమానయాన రంగంలో లేవు.

ప్రారంభ దశలో ప్రైవేట్ సంస్థల టిక్కెట్లు ఖరీదు ఎక్కువ కావడంతో ఎయిర్ ఇండియా ఆధిపత్యం చెలాయించింది. మొదట్లో దీనికి కొన్ని పోటీ సంస్థలు వచ్చినా తర్వాత అవి నిలబడలేక పోయాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 3
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 3

ఉదార ఆర్థిక విధానాల కారణంగా మధ్య తరగతిలో ఒక కొత్త వర్గం పుట్టుకొచ్చింది. దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ రంగంలో 49శాతం విదేశీ పెట్టుబడులు, విదేశాల్లో నివసించే భారత సంతతి ప్రజలు వంద శాతం పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించారు.

కమర్షియల్ విమానయాన యుగం 2003 నుంచి భారతదేశంలో ప్రారంభమైందని చెబుతారు. ఎయిర్ డెక్కన్ కమర్షియల్ సర్వీసులను అదే సంవత్సరం ప్రారంభించింది.

ఆ తర్వాత స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్, కింగ్ ఫిషర్ వంటి సంస్థలు తక్కువ ధరలకే విమాన ప్రయాణాన్ని అందించడం ప్రారంభించాయి.

1991లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో కోటి ఏడు లక్షల మంది ప్రయాణించగా, 2017 నాటికి ఈ సంఖ్య 14 కోట్లకు చేరుకుంది.

ప్రస్తుతం జెట్, కింగ్‌ఫిషర్, సహారా ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు మూతపడ్డాయి. ఎయిర్ ఇండియా అమ్మకానికి సిద్ధంగా ఉంది. అయితే, ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ రంగంలో భారీ ఎత్తున మార్పులు వచ్చాయన్నది మాత్రం కాదనలేని వాస్తవం.

ఇవి కూడా చదవండి:

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 4
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 4

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)