Hiccups: వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?

వెక్కిళ్లు రావడానికి వంద రకాల కారణాలు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
ఫొటో క్యాప్షన్, వెక్కిళ్లు రావడానికి వంద రకాల కారణాలు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
    • రచయిత, క్లాడియా హామండ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

మనకు వెక్కిళ్లు రాగానే అవి తగ్గేందుకు వెంటనే ప్రతీ ఒక్కరూ తమకు తోచిన సలహాలు ఇస్తారు. కొందరైతే భయపెడతారు... లేదా కాసేపు ఊపిరి బిగబట్టాల్సిందిగా సూచిస్తారు. ఈ పద్ధతులు నిజంగా పని చేస్తాయా, చేస్తే ఎలా చేస్తాయి? వీటి గురించి సైకాలజీ ప్రొఫెసర్ క్లాడియా హామండ్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

వెక్కిళ్లకు వివిధ రకాల నివారణ మార్గాలు వాడుకలో ఉన్నాయి. అయితే ఇందులో మనకు వచ్చే సందేహమేంటంటే... వాటిలో శాస్త్రీయంగా రుజువైన మార్గాలెన్ని?

మనకు వెక్కిళ్లు రాగానే శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి గాలి వేగంగా చేరుతుంది. ఫలితంగా స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి 'హిక్' అనే ధ్వనికి కారణమవుతుంది. దీన్నే వెక్కిళ్లు అని పిలుస్తారు.

దాదాపు 100కుపైగా భిన్న శారీరక పరమైన కారణాలు వెక్కిళ్లకు దారితీస్తాయి. అయితే ఇవన్నీ పెద్దగా అపాయాన్ని కలిగించవు.

వెక్కిళ్లు

ఫొటో సోర్స్, Getty Images

మందుల వాడకం వల్ల కూడా వెక్కిళ్లు వస్తాయి. కొన్ని మత్తు మందులు, స్టెరాయిడ్స్, పార్కిన్సన్స్ వ్యాధికి తీసుకునే ఔషధాలు, కీమో థెరపీ విధానాలు కూడా వెక్కిళ్లకు దారితీస్తాయి. కానీ మనకు సాధారణంగా వచ్చే వెక్కిళ్లకు ఇవేవీ కారణాలు కాకపోవచ్చు.

నవ్వడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, వేగంగా తినడం వంటి విధానాల వల్ల, ఒక్కోసారి అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా వెక్కిళ్లు వచ్చే అవకాశముంది.

ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో దాదాపు 10 రోజులపాటు వెక్కిళ్లతో ఇబ్బంది పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. పేగులలో ఏర్పడిన ఇబ్బంది కారణంగా ఆయన వెక్కిళ్లతో ఇబ్బంది పడినట్లు తెలిసింది.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో ఇటీవల ఎక్కిళ్లతో బాధపడుతూ చికిత్స చేయించుకున్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో

కొన్ని తీవ్రంగా

కొన్ని వెక్కిళ్ల కేసులు తీవ్రంగా ఉంటాయి. అమెరికాకు చెందిన చార్లెస్ ఒస్బర్న్ అనే వ్యక్తి సుదీర్ఘ కాలం పాటు వెక్కిళ్ల బారినపడి ప్రపంచ రికార్డును సాధించారు.

1922లో ఆయన తన పెంపుడు పందిని ఎత్తుతుండగా మొదలైన వెక్కిళ్లు 1990 ఫిబ్రవరి వరకు ఉన్నాయి. అంటే 68 ఏళ్ల పాటు ఆయనకు వెక్కిళ్లు ఆగలేదు.

ఈ వెక్కిళ్లను చాలా వరకు సులువైన పద్ధతులతో ఆపవచ్చు. కానీ ఏది సులువైన పద్ధతి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

డయాఫ్రమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డయాఫ్రమ్

ఇవే కొన్ని పద్ధతులు

వెక్కిళ్ల నివారణకు రెండు విధానాలు ఉన్నాయి. మనం వాడే ఇంటి చిట్కాలన్నీ వీటిలో మొదటి విధానం కిందకు వస్తాయి. రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను పెంచడం ద్వారా డయాఫ్రమ్ సంకోచాలను నిరోధించి వెక్కిళ్లకు అడ్డుకోవడం రెండోది. శ్వాసను బిగ పట్టడం, పేపర్ బ్యాగ్‌లో శ్వాసను తీసుకోవడం వంటి విధానాలను కూడా కొందరు అనుసరిస్తుంటారు.

అయితే, ఒక్కోసారి ఈ పద్ధతులు పనిచేయవచ్చుగానీ, అవి ఎలా ఎక్కిళ్లను నిరోధిస్తాయో పరిశోధకులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

కొందరు ఈ పద్ధతిని కార్బన్ డయాక్సైడ్ స్థాయిని పెంచేలా శరీరం పనితీరును మళ్లించేందుకు ఒక విధానంగా అభిప్రాయపడ్డారు. మరికొందరు కార్బన్ డయాక్సైడ్ తగ్గడం వల్లే వెక్కిళ్లు వస్తాయని, దాని స్థాయిని పెంచడం ద్వారా వెక్కిళ్లను నిరోధించవచ్చని ప్రతిపాదించారు.

వెక్కిళ్లు

ఫొటో సోర్స్, Getty Images

నాడులను ఉత్తేజపరచడం

మరో ప్రత్యామ్నాయ మార్గమేంటంటే వేగస్ నాడిని ఉత్తేజపరచడం. వేగస్ నాడి మెదడు నుంచి కడుపులోకి అనుసంధానమై ఉంటుంది. ఇది శ్వాస ప్రక్రియ, ఆహారాన్ని మింగడం వంటి పనులను మెదడుతో సమన్వయపరుస్తుంది.

వెక్కిళ్లు వచ్చే సమయంలో వేగస్ నాడి ప్రభావితమవుతుంది. ఆ సమయంలో వేగస్ నాడిని ఉత్తేజపరచడం ద్వారా వెక్కిళ్లను అడ్డుకోవచ్చు. నీటిని గుటకలుగా తాగడం, నిమ్మకాయను కొరకడం లేదా చిదిమిన మంచును తినడం వంటి చర్యలతో... వీటికి స్పందించాల్సిందిగా మెదడుకు వేగస్ నాడి సంకేతాలు పంపి వెక్కిళ్లను నిరోధిస్తుంది.

నాలుక కొనను లాగడం, చెవుల్లో వేళ్లు పెట్టుకోవడం, కనుగుడ్లపై మృదువుగా నొక్క‌డం వంటివి కూడా వేగస్ నాడిని ఉత్తేజితం చేస్తాయి. ఈ చర్యలన్నీ మన శరీరాన్ని వెక్కిళ్ల నుంచి దృష్టి మరల్చేందుకు చేసే ప్రయోగాలే. భయపెట్టడం కూడా ఈ కోవకే చెందుతుంది.

వెక్కిళ్ల నివారణకు ఇంకో మార్గం కూడా ఉంది. కానీ దాన్ని మీరు ఇంటి వద్ద ప్రయత్నించాలని అనుకోకపోవచ్చు. టెనెస్సీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీకి చెందిన ఫ్రాన్సిస్ ఫెస్మైర్ ఈ పద్ధతిని ప్రతిపాదించారు.

1988లో దీనిపై ఆయన ప్రచురించిన 'మల ద్వారాన్ని మర్ధనా చేయడం ద్వారా ఎక్కిళ్లను నిరోధించడం' వ్యాసం ఈ సాంకేతికతను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

వెక్కిళ్లు

ఫొటో సోర్స్, Getty Images

మూడు రోజులుగా ప్రతీ రెండు సెకన్లకొకసారి వెక్కిళ్లతో బాధపడుతున్నట్లు పేర్కొంటూ ఒక వ్యక్తి అత్యవసర చికిత్స కోసం ఫ్రాన్సిస్ దగ్గరకు వచ్చారు. చికిత్సలో భాగంగా కనుగుడ్లను నెమ్మదిగా నొక్కాలని ఆయనకు ఫ్రాన్సిస్ సూచించారు. ఆ తర్వాత గత ఏడాది ప్రచురితమైన ఒక కేసును ఫ్రాన్సిస్ గుర్తు చేసుకున్నారు.

ఆ కేసులో 71 ఏళ్ల మహిళ హృద‌య స్పంద‌న విపరీతంగా పెరిగి పోతుండటంతో.. డాక్టర్ ఆమె మల ద్వారంలోకి వేళ్లు చొప్పించడం ద్వారా వేగస్ నాడిని ఉత్తేజితం చేసి హృద‌య స్పంద‌న‌ను తగ్గించారు.

వీడియో: ఆరోగ్యానికి ఏ ఆయిల్ మంచిది? ఈ కింది వీడియోలో చూడండి

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇప్పుడు కూడా అదే పద్ధతిని వెక్కిళ్లతో బాధపడుతున్న వ్యక్తిపై ప్రయత్నించగా అది పని చేసింది. ఈ పరిశోధనకు ఫ్రాన్సిస్ ఇగ్‌నోబెల్ బహుమతిని అందుకున్నారు. శాస్త్ర పరిశోధనలో వింతైన, నవ్వు తెప్పించే పరిష్కారాలను కనుగొన్నవారికి సెటైరికల్‌గా ఇచ్చే బహుమతి ఇది. దీన్ని 1991 నుంచి ఇస్తున్నారు.

ఈ రెండు పద్ధతులూ వేగస్ నాడిని ఉత్తేజితం చేయడం ద్వారా వెక్కిళ్లను నిరోధిస్తాయని గుర్తించినట్లు ఫెస్మైర్ తెలిపారు.

చాలా వెక్కిళ్ల నివారణలకు ట్రయల్ ఆధారిత రుజువులు లేవన్నది నిజం. కానీ అవి పని చేసే తీరు మాత్రం వెక్కిళ్లకు ఉండే స్వభావంతో సరితూగుతోంది.

ఇవన్నీ కూడా హానికరం కానీ చిట్కాలే. ఏదీ నిరుపయోగమైనది కాదు. ప్రతిదీ కూడా ఉనికిలో ఉన్న నివారణల గురించి తెలియచెప్పేదే... కాబట్టి మీకు ఎప్పుడైనా వెక్కిళ్లు వచ్చినప్పుడు పైన పేర్కొన్న వాటిలో ఏ పద్ధతినైనా ప్రయత్నించండి.

గమనిక: కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం సాధారణ సమాచారం మాత్రమే. వీటిని మీ సొంత వైద్యుడు లేదా మరే ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. ఈ కంటెంట్ ఆధారంగా వినియోగదారుడు చేసిన ఏదైన ప్రయోగానికి, ప్రయత్నానికి బీబీసీ ఎలాంటి బాధ్యత వహించదు. ఇతర వెబ్ సైట్‌లకు చెందిన విషయాలకు, అంశాలకు బీబీసీ బాధ్యత వహించదు. ఇతర సైట్‌లలో పేర్కొన్న వాణిజ్య ఉత్పత్తులను, సేవలను, సలహాలను బీబీసీ ఆమోదించదు. మీరు మీ ఆరోగ్యం గురించి ఏదైనా ఆందోళన చెందుతుంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)