తెల్ల జుట్టు: మానసిక ఒత్తిడితో తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు

జుట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాధారణంగా 40 ఏళ్లు పైబడిన తర్వాత జట్టు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు 40 ఏళ్ల కంటే ముందే జట్టు రంగు మారుతోంది.

ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్స్‌ను పాలించిన చివరి రాణి పేరు మారీ ఆంటోనెట్. 1793లో ఆమెకు శిరచ్ఛేదం చేశారు. దానికి ముందు రోజు రాత్రి రాణి ఆంటోనెట్ జుట్టంతా పండిపోయి ముగ్గుబుట్టలా మారిపోయిందనే కథ ప్రచారంలో ఉంది.

అది నిజమో కాదో తెలీదుగానీ ఒత్తిడి వల్ల జుట్టు త్వరగా తెల్లబడిపోతుందన్నది మాత్రం నిజమే అంటోంది సైన్స్.

అంతేకాదు ఒత్తిడిని అదుపులో పెట్టుకోగలిగితే జుట్టు మళ్లీ నల్లబడుతుందని 'ఈలైఫ్' జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమైన కొలంబియా యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది.

వయసు అవ్వక ముందే జుట్టు పండిపోతుంటే, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా దాన్ని నిరోధించవచ్చని అధ్యయనంలో తేలింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా జట్టు తెల్లబడటం ఆపొచ్చని అధ్యయనంలో తేలింది.

ఒత్తిడికి తెల్లజుట్టుకు సంబంధం

"ఒత్తిడికి, తెల్లజుట్టుకు ఉన్న సంబంధం గురించి చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తూ ఉన్నాం. మానసిక ఒత్తిడికి, జుట్టు పండిపోవడానికి కచ్చితమైన సంబంధం ఉంది అని తెలిపే తొలి అధ్యయనం ఇది" అని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ పికార్డ్ తెలిపారు.

ప్రతి వెంట్రుకను అధ్యయనం చేస్తూ, దాన్లో ఉన్న పిగ్మెంటేషన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ పరిశోధక బృందం ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది.

వీడియో క్యాప్షన్, కురులు, గోళ్లకు ఇదే బలమైన ఆహారం

సెలవుల ప్రభావం

ఈ అధ్యయనం కోసం వివిధ వయసులకు చెందిన 14 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుని, ప్రతి వారం వాళ్ల ఒత్తిడి స్థాయిలు ఎలా ఉన్నాయో నమోదు చేయమన్నారు.

ఈ 14 మంది శరీరంలోని వివిధ భాగాల నుంచి వెంట్రుకలు సేకరించి పరిశీలించారు.

ఈ ప్రయోగంలో పాల్గొన్నవారిలో అతి పిన్నవయస్కుల జీవితాల్లో ఒత్తిడి మాయమైపోయినప్పుడు జుట్టు వారి సహజ రంగుకు తిరిగి వచ్చేసిందని గమనించారు.

వీరిలో ఒక వ్యక్తి రెండు వారాలు సెలవులు తీసుకుని, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా గడిపిన తరువాత ఆయన నుంచి సేకరించిన వెంట్రుకల్లో ఐదు వాటి సహజ రంగును తిరిగి పొందాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: పేలు ఎలా వ్యాపిస్తాయి?

అయితే ఒత్తిడి పోగానే తెల్ల జుట్టంతా నల్లగా మారిపోతుందని దీని అర్థం కాదు. కుదుళ్ల నుంచి పెరుగుతున్న వెంట్రుకలు తమ సహజ రంగుకు వచ్చేస్తాయని పికార్డ్ స్పష్టం చేశారు.

అంటే నెత్తి మీద చర్మం కింద ఉన్న వెంట్రుకల రంగు నల్లగా మారుతుందన్నమాట.

బహుశా మైటోకాండ్రియాలో జరిగే మార్పుల వల్ల జుట్టు రంగు కోల్పోతూ ఉండొచ్చునని పరిశోధకులు అంటున్నారు.

ఒక సెల్‌లో బయోకెమికల్ రియాక్షన్లకు కావాల్సిన శక్తిని ఈ మైటోకాండ్రియా సరఫరా చేస్తుందని ఈ సైంటిస్టులు చెబుతున్నారు.

"మానసిక ఒత్తిడి వలన మైటోకాండ్రియా విడుదల చేసే శక్తిలో మార్పులు వస్తాయి. మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోతే కుదుళ్ల కింద ఉండే కణాలు సరిగా పనిచేయక జుట్టు పింగ్మెంట్‌ను కోల్పోతుంది" అని చెప్పారు.

జుట్టు

ఫొటో సోర్స్, Getty Images

అన్నిసార్లూ ఇది రివర్స్ అవ్వదు

ఒత్తిడి తగ్గినప్పుడు జుట్టు తన సహజ రంగును తిరిగి పొందినప్పటికీ ఇది అన్నివేళలా జరగదు. ముఖ్యంగా దీర్ఘకాలంపాటు తెల్లజుట్టు ఉన్నవారికి నల్లరంగు మళ్లీ రాదు.

"ప్రతి ఒక్కరికి ఒక జీవసంబంధమైన పరిమితి ఉంటుంది. అంటే ఒక వయసొచ్చాక జుట్టు పండిపోతుంది. ఆ పరిమితికి దగ్గర్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరిగితే రావలసిన సమయం కన్నా ముందే తెల్లజుట్టు వచ్చేస్తుంది. ఒత్తిడి తగ్గిపోతే మళ్లీ నల్లజుట్టు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ వయసు దాటిపోయి చాలాకాలం అయిపోతే తెల్ల జుట్టు నల్లగా మారడం దాదాపు అసాధ్యం" అని పరిశోధకులు వివరించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: 20 ఏళ్లలోపే తెల్ల జుట్టు వస్తోందా?

అంటే ఒత్తిడి తగ్గిపోయిన ప్రతివారికీ నల్లజుట్టు పెరగడం ప్రారంభమవుతుందని కాదు. కానీ చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి కారణంగా జుట్టు తెల్లబడినవారికి మాత్రం ఒత్తిడి తగ్గితే మళ్లీ నల్లజుట్టు పెరిగే అవకాశం ఉంటుంది.

ఇదే కాకుండా వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న ఇతర అంశాలను మానసిక ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది, ఆ మార్పులను రివర్స్ చేయగలమా లేదా అనే అంశాలపై తమ బృందం పరిశోధన కొనసాగిస్తోందని పికార్డ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)