మానసిక ఒత్తిడి వల్ల జుట్టు ఎందుకు తెల్లబడుతుందంటే..

ఫొటో సోర్స్, Getty Images
సాధారణంగా మనుషుల్లో వయసు 35 ఏళ్లకు అటూఇటూ చేరుకున్న తర్వాత ఎప్పుడైనా.. జుట్టు తెల్లబడటం మొదలవ్వొచ్చు.
వయసుపైబడటం, జన్యుపరంగా సంక్రమించిన లక్షణాలు దీనికి కారణాలు.
మానసిక ఒత్తిడి కూడా ఇందులో పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది.
అయితే, ఒత్తిడి వల్ల జుట్టు ఎలా తెల్లబడుతోందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఇదివరకు స్పష్టంగా గుర్తించలేకపోయారు.
బ్రెజిల్‌లోని సావో పాలో, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు మాత్రం మెలానోసైట్‌లు అనే మూల కణాల వల్లే ఇలా జరుగుతుండొచ్చని చెబుతున్నారు.


మెలానోసైట్‌లు మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. చర్మానికి, జుట్టుకు రంగు ఈ మెలనిన్ వల్లే వస్తుంది.
ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్న సమయంలో పరిశోధకులకు ఈ విషయంలో కొన్ని ఆధారాలు దొరికాయి.
ఎలుకలను నొప్పికి గురిచేసినప్పుడు వాటిలో అడ్రినలిన్, కార్టిసోల్ విడుదలవుతోంది. గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతున్నాయి. నాడీకణ వ్యవస్థపై ప్రభావం పడి, వాటిపై ఒత్తిడి పెరుగుతోంది.
వెంట్రుక కుహరాల్లోని మెలనిన్‌ను ఉత్పత్తి చేసే మూల కణాలు తగ్గిపోతున్నాయి.

ఫొటో సోర్స్, WILLIAM A GONCALVES
''ఒత్తిడి శరీరానికి మంచిది కాదని భావించాం. కానీ, ఇందులో మేం ఊహించని విషయాలు బయటపడ్డాయి. ఒత్తిడి వల్ల పిగ్మెంట్‌లను ఉత్పత్తి చేసే మూల కణాలు తగ్గిపోతున్నాయి. అవి ఒక్కసారి పోతే, తిరిగి రావడం కుదరదు. శాశ్వతమైన నష్టం జరుగుతుంది'' అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యా కీ హ్సు చెప్పారు.
మరో ప్రయోగంలో పరిశోధకులు అధిక రక్తపోటును తగ్గించే ఔషధాన్ని ఎలుకలకు ఇచ్చి చూశారు.
ఒత్తిడి వల్ల శరీరంలో వస్తున్న మార్పులను దీంతో అడ్డుకోవచ్చని వాళ్లు గుర్తించారు.
నొప్పికి గురైన ఎలుకల జన్యువులను సాధారణ ఎలుకలతో పరిశోధకులు పోల్చిచూసినప్పుడు.. ఒత్తిడి వల్ల మూల కణాలు నష్టపోయే ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సైక్లిన్-డిపెండెంట్ కినేస్ (సీడీకే) అనే ప్రోటీన్ వెలుగుచూసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రోటీన్ ఉత్పత్తిని అదుపు చేసినప్పుడు, ఎలుకల్లో వెంట్రుకల రంగు మారడం కూడా ఆగిపోయింది.
ఇలా సీడీకేను నియంత్రించే ఔషధంతో జుట్టు తెల్లబడటాన్ని అడ్డుకునే మార్గం ఉందని పరిశోధకులు అంటున్నారు.
''ఈ పరిశోధనలో వచ్చిన ఫలితాలు.. తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారమో, నివారణ మార్గమో కాదు. ఎలుకలపైనే మేం పరిశోధన చేశాం. మనుషుల్లో పనిచేసే మార్గం కనిపెట్టడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి'' అని ప్రొఫెసర్ యా కీ హ్సు అన్నారు.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా? చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా?
- రజినీకాంత్ చెప్పిన దాంట్లో నిజమెంత... సీతారాముల నగ్నవిగ్రహాలకు పెరియార్ చెప్పుల దండలు వేసి ఊరేగించారా..
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
- పీరియడ్స్‌లో ఉన్న మహిళలు బ్యాడ్జీలు ధరించే విధానంపై 'పునరాలోచన' చేస్తున్న జపాన్ సూపర్ బజార్
- క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు
- ఎక్కడివాళ్లు అక్కడే... వైరస్ భయంతో చైనా నగరంలో రైళ్లు, విమానాలు బంద్
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి...
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









