అండర్-19 ప్రపంచ కప్: క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జానైన్ ఆంథోనీ
- హోదా, లాగోస్ నుంచి బీబీసీ ప్రతినిధి
తొలిసారిగా అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఆడుతున్న నైజీరియా జట్టు క్రికెట్ ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఆశ్చర్యపరిచింది కూడా.
జనాభా పరంగా నైజీరియా ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం. పశ్చిమ ఆఫ్రికాలో ఉండే ఈ దేశ జనాభా 20 కోట్లు.
నైజీరియాలో క్రికెట్‌కు శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన చరిత్ర ఉన్నప్పటికీ, ఫుట్‌బాల్‌తో పోలిస్తే ఈ ఆటకు ఇక్కడ ఆదరణ చాలా తక్కువ.
భారత్‌లో మాదిరే నైజీరియాలోనూ క్రికెట్‌ను బ్రిటిష్ వలస పాలకులే ప్రవేశపెట్టారు. అయితే భారత్‌తో పోలిస్తే నైజీరియాలో క్రికెట్ ఎన్నడూ అంత ఆదరణ పొందలేదు.
నైజీరియాలో అండర్-19 జట్టును 'జూనియర్ యెల్లో గ్రీన్స్' అని ముద్దుగా పిలుచుకుంటారు.
ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన మధుర క్షణంలో ఆటగాళ్లు మోకాళ్ల మీద నిలబడి దైవాన్ని ప్రార్థించారు. లక్ష్య ఛేదనలో విజయానికి అవసరమైన పరుగులు కొట్టిన తర్వాత కొందరు ఆటగాళ్లు ఏడ్చేశారు కూడా.



ఫొటో సోర్స్, Getty Images
నిరుడు నమీబియాలో జరిగిన ప్రపంచకప్ అర్హత పోటీల్లో మరో పశ్చిమాఫ్రికా దేశం సియెర్రాలియోన్‌తో హోరాహోరీగా సాగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో నైజీరియా బౌలర్ పీటర్ అహో జట్టు విజయానికి కీలకమైన పరుగులను సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌ను నైజీరియా ప్రజలు అంత ఉత్కంఠగా ఏమీ చూడలేదు. నైజీరియన్లలో అత్యధికులు క్రికెట్‌ను పట్టించుకోరు.
తమ జట్టు చరిత్ర సృష్టించడానికి కేవలం అడుగు దూరంలోనే ఉందనేది ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా అతి కొద్ది మందికే తెలుసు. అయినప్పటికీ నిరుడు సియెర్రాలియోన్‌తో సమరం తుది దశలో ఆటగాళ్లు, అభిమానుల ఉద్వేగం తారస్థాయికి చేరింది.
ఆ సమయంలో మైదానంలో మేఘాలు కమ్ముకొంటున్నాయి. పీటర్ అహో సహచరులు బౌండరీ దగ్గర నిలబడి ఉన్నారు. వర్షం పడకూడదని, మ్యాచ్‌కు అంతరాయం కలగకూడదని, నైజీరియా విజయానికి అడ్డంకి రాకూడదని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠను తట్టుకోలేక జట్టు అధికారి ఒకరు అప్పుడు మ్యాచ్ చూడలేదు.
వాస్తవానికి బలహీనమైన జట్టుగా భావించే సియెర్రాలియోన్‌పై నైజీరియా విజయం సాధించే అవకాశాలే ఎక్కువ. అయితే నైజీరియా మిడిల్ ఆర్డర్‌ను సియెర్రాలియోన్ కుప్ప కూల్చడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
విజయం సాధించి ప్రపంచ కప్ టోర్నీలో ఆడే అర్హత సాధించడానికి నైజీరియాకు 52 పరుగులు అవసరమైన దశలో బౌలర్ పీటర్ అహో బ్యాటింగ్‌కు వచ్చాడు.
45వ ఓవర్ రెండో బంతికి గెలుపుకు అవసరమైన చివరి పరుగును పీటర్ సాధించాక నైజీరియా శిబిరంలో ఉద్వేగం పెల్లుబికింది.
పీటర్ సహచరులు బౌండరీ దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చారు. ఉత్కంఠ తట్టుకోలేక మ్యాచ్ చివరి క్షణాలను చూడకుండా ఉన్న అధికారి కూడా అప్పుడు మిగతా వారితో కలసి పరుగెత్తుకొని వచ్చారు.
అందరూ పీటర్‌ను ఆలింగనం చేసుకున్నారు. వారంతా పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న క్షణమది. నైజీరియా ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించిన అరుదైన క్షణమది.
నాటి మ్యాచ్‌ను కెప్టెన్ సిల్వెస్టర్ ఓక్పే గుర్తు చేసుకొంటూ- తమ జట్టు ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించడాన్ని తానే కొన్నిసార్లు నమ్మలేనన్నాడు.
"ఇది గుర్తొచ్చినప్పుడు కలా, నిజమా అని సందేహం కలిగి నన్ను నేను గిల్లి చూసుకుంటాను. ఇది కల కాదని నిర్ధరించుకొనేందుకు నాటి క్షణాల గురించి నేటికీ అప్పుడప్పుడు మేం గూగుల్లో వెతుకుతుంటాం కూడా" అని అతడు చెప్పాడు.
2015లో ఆఫ్రికన్ క్రికెట్లో రెండో డివిజన్‌కు పరిమితమైన నైజీరియా 2018లో తిరిగి టాప్ డివిజన్‌కు చేరుకుంది. అలాంటి జట్టు తర్వాత ఏడాది ఏకంగా ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించింది. ఈ జట్టు విజయ ప్రస్థానం చాలా మంది ఊహకు అందనిది.

ఫొటో సోర్స్, Getty Images
మాది లీసెస్టర్ సిటీ ఆఫ్ క్రికెట్: కెప్టెన్
"మా జట్టు 'లీసెస్టర్ సిటీ' ఆఫ్ క్రికెట్. మేం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాం" అని కెప్టెన్ సిల్వెస్టర్ వ్యాఖ్యానించాడు.
2015లో నిరాశాజనక స్థితిలో ఉన్న లీసెస్టర్ సిటీ ఫుట్‌బాల్ జట్టు తర్వాత అసాధారణ రీతిలో రాణించి అనేక ప్రతికూలతల మధ్య 2016లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలవడాన్ని దృష్టిలో ఉంచుకొని అతడు ఈ వ్యాఖ్య చేశాడు.
నైజీరియాలో ఆటల్లో ఫుట్‌బాలే రారాజు.
నైజీరియా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను 1904లో మరో బ్రిటిష్ కాలనీ అయిన ద గోల్డ్ కోస్ట్(నేటి ఘనా)తో ఆడింది. నాటి జట్టులో అందరూ బ్రిటిష్ వలస పాలనాధికారులే.

నైజీరియా క్రికెట్ చరిత్రలో ముఖ్య ఘట్టాలు
1800ల్లో బ్రిటిష్ వలస పాలకులు నైజీరియాలో క్రికెట్‌ను ప్రవేశపెట్టారు.
1904లో తొలి అంతర్జాతీయ మ్యాచ్

ఫొటో సోర్స్, Nigeria Cricket Federation
1930ల్లో స్థానికులు, స్థానికేతరుల కోసం విడివిడిగా క్రికెట్ అసోసియేషన్ల ఏర్పాటు
1957లో క్రికెట్ అసోసియేషన్ల విలీనం
2002 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో నైజీరియా చేరిక
2019 అండర్-19 ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించిన నైజీరియా
ఆధారం: నైజీరియా క్రికెట్ అసోసియేషన్

దేశంలో వివిధ ప్రాంతాల్లో క్రికెట్ మైదానాలు ఉన్నాయి. అయితే అక్కడ మ్యాచ్‌లను దాదాపు ఎవరూ చూడరు. ఎవరైనా క్రికెట్ ఆడాలనుకున్నా, కిట్, ఇతర ఖర్చులు వారికి అవరోధాలుగా నిలుస్తాయి.
నైజీరియన్లు క్రికెట్‌ను ఒక స్పోర్ట్‌గా పరిగణించరని ఫాస్ట్ బౌలర్ తైవో మొహమ్మద్ చెప్పాడు. "వారికి క్రికెట్ కంటే ఫుట్‌బాల్ అంటేనే ఇష్టం. క్రికెట్ ఆసక్తికరమైనదని మేం లోకానికి చాటి చెప్పాలనుకుంటున్నాం. దీనిపై అందరికీ ఆసక్తి కలిగేలా చేయాలనుకొంటున్నాం" అని అతడు తెలిపాడు.
ఎదురీత
తమను తాము నిరూపించుకొని, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే నైజీరియా కుర్రాళ్లు ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ప్రపంచ కప్‌లో ఎదురీదాల్సి ఉంది.
బలమైన జట్లతో కూడిన గ్రూప్‌లో నైజీరియా ఉంది. ఇందులోని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్- మూడు జట్లూ గతంలో అండర్-19 ప్రపంచ కప్ విజేతలు.
ఈ నెల 20 సోమవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో నైజీరియా, ఆస్ట్రేలియాతో తలపడింది. పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో నైజీరియా ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ ఫలితం సూచిస్తోంది.
ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నప్పటికీ నైజీరియా ఆత్మస్థైర్యంతోనే కనిపిస్తోంది.
తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సిల్వెస్టర్ మాట్లాడుతూ- తమ జట్టు గొప్ప పోరాటపటిమను ప్రదర్శిస్తూ వస్తోందని, సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుకొంటూ వస్తోందని ధీమా వ్యక్తంచేశాడు.
టోర్నీలో తమకు మరింత మంది ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు లభిస్తే తాము ఇంకా బాగా ఆడతామని అతడు చెప్పాడు.

ఫొటో సోర్స్, Nduka Orjinmo
చేయాల్సింది ఇంకా ఉంది: కోచ్
టోర్నీలో విజయాలు సాధించాలంటే చేయాల్సింది ఇంకా ఉందని నైజీరియా కోచ్ క్లైవ్ ఓగ్బిమీ అంగీకరిస్తున్నారు.
"బౌలింగ్, ఫీల్డింగ్‌లో మేం రక్షణాత్మక వైఖరి అనుసరిస్తున్నాం. బ్యాటింగ్ కూడా మేం కోరుకొనే స్థాయిలో లేదు" అని ఆయన తెలిపారు. అర్హత సాధించడానికి ఆడిన మ్యాచుల్లో తమపై అంచనాలు తక్కువగానే ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఓటమి అంచు దాకా వెళ్లి విజయాలు సాధించామని ప్రస్తావించారు.
ఇప్పుడు టోర్నీలో నైజీరియా గ్రూప్ దశను దాటాలంటే అప్పటి స్థాయిలో ఆడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సెమీస్‌కు చేరుకోగలం: పీటర్
తమ అవకాశాలపై బౌలర్ పీటర్ ఆశావహంగా ఉన్నాడు.
గ్రూప్‌లో మూడు ప్రత్యర్థి జట్లనూ కాకపోయినా రెండు జట్లను ఓడించి సెమీఫైనల్లో చేరుకొంటామనే నమ్మకం తనకుందని అతడు చెప్పాడు. తాము సెమీస్‌లో గెలిచి ఫైనల్లో బహుశా భారత్‌తో తలపడొచ్చని ఆశాభావం వ్యక్తంచేశాడు.
తాము బాగా సాధన చేస్తున్నామని, ఆ దశకు చేరుకుంటామనే నమ్మకం ఉందని పీటర్ చెప్పాడు. ఫైనల్ ఫిబ్రవరిలో జరుగనుంది.
టోర్నీలో 'జూనియర్ యెల్లో గ్రీన్స్' అవకాశాలపై నైజీరియా క్రికెట్ నిపుణుడు స్యూన్ అజిడాగ్బా అంచనాల్లో ఎక్కువ వాస్తవిక దృక్పథం కనిపించింది.
గెలుపోటముల గురించి జట్టు అంతగా ఆలోచించకూడదని, ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల వచ్చే అనుభవం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
నైజీరియా ఈ నెల 23న వెస్టిండీస్‌తో, 25న ఇంగ్లండ్‌తో ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
- అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు
- ఈ రాయల్ తాబేలు 344 ఏళ్లు జీవించిందా?
- 'ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









