అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’

అమరావతి నిరసన

ఫొటో సోర్స్, JaiTDP/twitter

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాల‌న్న డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం మొదలై నెల రోజులు దాటింది. వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి.

రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ కోస‌ం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ఇదివరకు వ్యాఖ్యానించారు.

ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌ధానంగా తుళ్లూరు మండ‌ల కేంద్రంతో పాటుగా వెల‌గ‌పూడి, మంద‌డం గ్రామాల్లో నిర‌స‌న‌లు జోరుగా జరుగుతున్నాయి.

ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా ఈ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, సీపీఐ నేత కె నారాయ‌ణ, కాంగ్రెస్ నాయ‌కురాలు సుంక‌ర ప‌ద్మ‌శ్రీ తదితర నాయకులు కూడా వీటిలో భాగమయ్యారు.

అమరావతి నిరసన

ప్ర‌భుత్వం నుంచి పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త వ‌చ్చి, త‌మ డిమాండ్ నెర‌వేర్చే వ‌ర‌కూ ఆందోళ‌న కొన‌సాగిస్తామ‌ని అమరావతి ఆందోళనకారుల జేఏసీ చెబుతోంది. ప్ర‌భుత్వం మాత్రం రాజధాని అంశంపై హైప‌వ‌ర్ క‌మిటీ ఇచ్చే నివేదిక‌పై క్యాబినెట్‌లో, అసెంబ్లీలో చ‌ర్చించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

అమరావతిలో ఆందోళ‌న‌కారుల ప‌ట్ల‌ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తుళ్లూరుకి సొంత చ‌ట్టం ఉందా అని ప్ర‌శ్నించింది. 144సెక్ష‌న్ విధింపుపై సుప్రీంకోర్ట్ ఆదేశాలు అమ‌లుచేయ‌రా అంటూ నిల‌దీసింది.

ఆందోళ‌న సాగిస్తున్న‌ మ‌హిళ‌ల ప‌ట్ల పోలీసులు విచ‌క్ష‌ణార‌హితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ దాఖ‌లైన ఫిర్యాదుల‌పై విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, JaiTDP/twitter

ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలు...

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ వేదిక పేరుతో సాగుతున్న ఈ ఉద్య‌మంలో మ‌హిళ‌లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. రోజూ ఆందోళన కార్యక్రమాలకు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌వుతున్నారు.

ఆందోళనకారుల్లో మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. గుంటూరు, విజ‌య‌వాడ‌, తెనాలి వంటి ప్రాంతాల్లో కూడా మ‌హిళ‌లు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్ర‌త్యేకంగా ర్యాలీలు నిర్వ‌హించారు.

గ‌తంలో ఎన్న‌డూ నిరసన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనుభ‌వం లేని మ‌హిళ‌లు కూడా పెద్ద సంఖ్యలో త‌ర‌లి వ‌స్తున్నారు.

ఈ ఉద్య‌మ అనుభ‌వం త‌మ‌కు కొత్త పాఠాలు నేర్పుతోందని మంద‌డం గ్రామానికి చెందిన ఎన్ శ్రావ‌ణి అన్నారు.

ఎంబీఏ చ‌దువుకున్న ఆమె.. నెల రోజులుగా అమ‌రావ‌తి కోస‌ం సాగుతున్న ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నారు.

‘‘నాకు ఎప్పుడూ ఉద్య‌మంలో పాల్గొన్న అనుభ‌వం లేదు. క‌నీసం నినాదం ఎలా చేయాలో కూడా తెలియ‌దు. అప్పుడ‌ప్పుడూ టీవీల్లో ఇలాంటి ఆందోళ‌న‌లు చూడ‌డ‌మే త‌ప్ప ప్ర‌త్య‌క్ష అనుభ‌వం లేక‌పోవ‌డంతో మొద‌ట కొంత మొహ‌మాటం అనిపించేది. కానీ మా మొహమాటాన్ని బ‌ల‌హీన‌త‌గా భావిస్తున్న స‌మ‌యంలో మాకు మ‌రో మార్గం లేదనిపించింది’’ అని శ్రావణి చెప్పారు.

‘‘రోజూ రోడ్డెక్కుతున్నాం. చివ‌రి వ‌ర‌కూ పోరాడ‌తాం. న్యాయం జ‌ర‌గాలి. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం మేము త్యాగం చేస్తే.. ఇప్పుడు మా త్యాగాల పునాదుల మీద మా ఆశ‌లు స‌మాధి చేస్తామంటే చూస్తూ ఊరుకోలేం క‌దా. నాలాగే చాలా మంది ఎప్పుడూ లేని రీతిలో ధ‌ర్నాలు, దీక్ష‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఆలోచించుకోవాలి. మా క‌న్నీరు చూసిన త‌ర్వాతైనా, మ‌నసు క‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

అమరావతి నిరసన

అరెస్టయిన వారిలోనూ వాళ్లేఎక్కువ

నెల రోజుల ఉద్య‌మంలో ప‌లు సంద‌ర్భాల్లో పోలీసుల‌కు, ఆందోళ‌న‌కారుల‌కు మ‌ధ్య వివాదాలు ఏర్పడ్డాయి.

పోలీసుల ఆంక్ష‌ల‌ను దాటుకుని ఆందోళనకారులు ముందుకెళ్లే ప్ర‌య‌త్నాలు చేయడంతో పలు చోట్ల అరెస్టులు జ‌రిగాయి. ఇలా అరెస్టైనవారిలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు.

ఒక్క విజ‌య‌వాడ‌లో జ‌న‌వ‌రి 10న జరిగిన ర్యాలీలోనే 610 మంది మ‌హిళ‌లు అరెస్ట్ అయ్యారు. ఆ సంద‌ర్భంగా పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

కొంద‌రు మ‌హిళ‌లు హైకోర్టును ఆశ్ర‌యించారు. రాత్రి వేళ కూడా అరెస్టులు చేశార‌న్న విష‌యంపై, అందుకు కారణాలంటో వెల్ల‌డించాల‌ని తాజాగా హైకోర్టు పోలీసుశాఖను ఆదేశించింది.

సూర్యోద‌యానికి ముందు, సూర్యాస్త‌మయం త‌ర్వాత అరెస్ట్ చేయాల్సి వ‌స్తే దానికి కార‌ణాలు వెల్ల‌డిస్తూ నివేదిక‌ను మేజిస్ట్రేట్‌కు అందించాల‌ని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

మ‌హిళ‌ల అరెస్టు విష‌యంలో సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను పాటించాల్సిందేన‌ని, దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ట్ట ప్ర‌కారం పోలీసుల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని సూచించింది.

అమరావతి నిరసన

విజయవాడ ర్యాలీ సమయంలో జరిగిన ఘటనల గురించి కారుమంచి నాగ‌మ‌ణి అనే మ‌హిళ బీబీసీతో మాట్లాడారు.

‘‘మాకు ర్యాలీకి అనుమ‌తి ఉంది. ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా బంద‌రు రోడ్డులో ఒక‌వైపు ప్ర‌ద‌ర్శ‌నగా బ‌య‌లుదేరాం. పోలీసులు మ‌మ్మ‌ల్ని అడ్డుకున్నారు. ఎందుకు ఆపుతార‌ని నిల‌దీశాం. శాంతిభ‌ద్ర‌త‌ల కార‌ణాల‌ని చెప్పి బ‌ల‌వంతంగా మ‌మ్మ‌ల్ని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. చీక‌టి ప‌డిన త‌ర్వాత మ‌హిళ‌ల‌ను అరెస్ట్ చేసే స‌మ‌యంలో పాటించాల్సిన నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేదు’’ అని ఆమె అన్నారు.

కొందరు పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారని, తమను ఇష్టారాజ్యంగా ఈడ్చేశారని నాగమణి చెప్పారు.

‘‘పోలీస్ స్టేష‌న్ల‌లో కూడా మమ్మల్ని వేధించారు. దీనిపై న్యాయ‌పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఎప్పుడూ బ‌య‌ట‌కు రాని మ‌హిళ‌లు కూడా అమ‌రావ‌తి కోసం ముందుకు వ‌స్తే పోలీసుల‌తో అణ‌చివేయాల‌ని చూడ‌డం అమానుషం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

అమరావతి నిరసన

‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే...’

ఒక‌ప్పుడు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ తీరిగ్గా వంట ప‌ని చేసుకునేదాణ్ని, ఇప్పుడు మాత్రం ఉదయం 8 గంటల కల్లా పని ముగించుకుని దీక్షా శిబిరాలకు వస్తున్నానని పి.రమాదేవి చెప్పారు. ఆమెది వెలగపూడి.

‘‘రోజూ వంట చేసుకోవ‌డం, పిల్ల‌ల‌కు తినిపించడం, ఖాళీ స‌మ‌యం ఉంటే క‌బుర్లు, టీవీల‌తో కాల‌క్షేపం జ‌రిగిపోయేది. ఇప్పుడ‌లా కాదు. నెల రోజులుగా రోజూ ధ‌ర్నా శిబిరంలోనే ఉంటున్నాం. వంట ప‌ని పొద్దున్నే పూర్త‌యిపోతుంది’’ అని రమాదేవి బీబీసీతో చెప్పారు.

‘‘పోలీసులు వ‌చ్చినా, నాయ‌కులు వ‌చ్చినా మా గోడు వెళ్ల‌బోసుకుంటున్నాం. ఐదేళ్లుగా మా ప్రాంతంలో రాజ‌ధాని అభివృద్ధిని క‌ళ్లారా చూస్తున్న మేం, ఇప్పుడు ఇదంతా నిలిపివేస్తున్నారంటే త‌ట్టుకోలేక‌పోతున్నాం. ఎన్నో భ‌వ‌నాలు, రోడ్ల కోసం వేల కోట్లు ఖ‌ర్చు చేసి.. ఇప్పుడు మ‌రో చోట మొద‌లెడ‌తారంటే ఎలా స‌హిస్తాం. మేము రాష్ట్ర ప్ర‌జ‌ల కోస‌మే పోరాడుతున్నాం. అమ‌రావ‌తి అంద‌రిదీ’’ అని ఆమె అన్నారు.

ఆందోళనల్లో పాల్గొంటున్నవాళ్లలో గృహిణులతోపాటు విద్యార్థినులు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న యువతులు, మహిళ‌లు కూడా కనిపిస్తున్నారు. సంక్రాంతి సెల‌వులు కావ‌డంతో చాలా మంది మహిళలు దీక్షా శిబిరాలకు పిల్లలనూ వెంట తీసుకువస్తున్నారు.

అమరావతి నిరసన

ఫొటో సోర్స్, JaiTDP/twitter

‘సామ‌ర‌స్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం’

ఆందోళ‌న‌లో పాల్గొంటున్న మ‌హిళ‌ల ప‌ట్ల పోలీస్ యంత్రాంగం సామ‌ర‌స్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని గుంటూరు రూర‌ల్ ఎస్పీ విజ‌య‌రావు తెలిపారు.

ఆందోళ‌న‌కారుల సంఖ్య‌కు అనుగుణంగా, మ‌హిళా పోలీసులు కూడా త‌గ్గ సంఖ్య‌లోనే ఉన్నట్లు ఆయన చెప్పారు.

‘‘శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌క‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నాం. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుకునే హ‌క్కు ఉంది. కానీ, ఆ పేరుతో చ‌ట్ట‌విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు తీసుకుంటాం’’ అని ఆయ‌న తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)