అమరావతి - సకల జనుల సమ్మె: 'మహిళలను నడిరోడ్లపై ఈడ్చేస్తారా.. నెట్టేసి గాయాల పాలు చేస్తారా' -చంద్రబాబు

అమరావతి ఆందోళనలు

అమరావతి పరిరక్షణ పేరుతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సకల జనుల సమ్మె పేరుతో నిరసనలు చేపట్టారు. సచివాలయానికి వెళ్లే దారిని దిగ్బంధించారు.

పలువురు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట జరిగాయి. కొందరు మహిళలు గాయపడ్డారు. గాయపరిచి, మహిళలను అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ పలుచోట్ల రోడ్డుపై ఆందోళనలు చేశారు.

అమరావతి ఆందోళనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదని తుళ్లూరు ఏఎస్పీ చక్రవర్తి తెలిపారు.

"సకల జనుల సమ్మెకు అనుమతి లేదు. ప్రజాస్వామ్యంలో భావాలను వ్యక్తం చేసుకోవచ్చు. కానీ ఆందోళనలు అదుపు తప్పితే చర్యలు తప్పవు. మహిళల్ని అరెస్ట్ చేయలేదు. పోలీసులు ఏ మహిళల్నీ గాయపరచలేదు. ఎవరికైనా గాయమైతే యాదృచ్ఛికంగానే తప్ప, కావాలని ఎవరినీ గాయపర్చలేదు" అని ఆయన చెప్పారు.

"సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా చూడాలని మహిళల్ని కోరాం. మహిళలు ఒప్పుకోకపోవడంతో వారిని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. ప్రజలందరూ మాకు సహకరించాలి. మేము వారికి సహకరిస్తాం. ప్రస్తుతం ఇక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది" అని ఏఎస్పీ చక్రవర్తి వివరించారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

మరో 4వేల కోట్లు పెడితే రాజధాని పూర్తి: చంద్రబాబు

మహిళల పట్ల జగన్ ప్రభుత్వ తీరు సరికాదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.

"అమరావతి అభివృద్ధికి ఇప్పటికే రూ.10వేల కోట్ల వరకు ఖర్చు చేశాం. మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని సిద్ధమై పోతుంది. ఇప్పటికే హైకోర్టు ఉంది. సచివాలయం, అసెంబ్లీ, డీజీపీ ఆఫీస్, అధికారులకు భవనాలు అన్నీ ఉన్నాయి. 5 వేల నివాస గృహాలు దాదాపు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజధానితో మూడు ముక్కలాట ఆడుతున్నారు" అంటూ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ సమావేశంలో చంద్రబాబు విమర్శించారు.

"ముంపు ప్రమాదం అని, ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అని, ఒకే సామాజిక వర్గమని, ఇన్‌సైడ్‌ ట్రేడింగ్ అని రకరకాల దుష్ప్రచారం అమరావతిపై చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఇన్‌సైడ్ ట్రేడింగ్ కాదా? బినామీలని జగన్మోహన్‌రెడ్డి విమర్శించడం హాస్యాస్పదం. ఆయన ఇల్లు ఎవరి పేరుమీద ఉంది? బినామీల పేరుతో ఉన్న ఇంట్లో ఉంటూ ఇతరులపై గడ్డలేస్తే అవి మీకే తగులుతాయి" అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, facebook/tdp

విశాఖను అంతర్జాతీయ నగరం చేయాలనుకున్నాం

"ఇప్పటి ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం తెలియదు. వికేంద్రీకరణ అసలు తెలియదు. విశాఖలో రూ.70వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టడానికి అదానీ గ్రూపు ముందుకొచ్చింది. పర్యటక రంగం అభివృద్ధికి లులూ కంపెనీని తీసుకొచ్చాం. ఇప్పుడు అవన్నీ వెనక్కి పోయాయి. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. ఆదాయం లేక పిల్లలకు స్కాలర్‌షిప్పులు కూడా అందించలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం సంక్షోభం దిశగా వెళుతోంది" అని విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు అబద్ధాలు నమ్మితే నష్టపోతారు: కొడాలి నాని

చంద్రబాబు విమర్శలను పాలక వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రబాబు తీవ్ర అసహనంతో దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

"రాజధాని విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. అసహనంతో వాస్తవాలను విస్మరించి దుష్ప్రచారం చేస్తున్నారు. బీసీజీ రిపోర్ట్ వచ్చింది. హైపవర్ కమిటీ భేటీ జరగుతుంది. ఈలోగా రైతులను రెచ్చగొట్టి, మీడియా ముందుకొచ్చి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో లేరు" అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)